*పంచముఖ గణపతి*
🌟త్రిపురాసురులుగా పేరు పొందిన ముగ్గురు రాక్షసులు అన్నదమ్ములు. వారు బ్రహ్మ దేవునిచే వరం పొందుతారు.
🌟"దేవా! మా ముగ్గురు అన్నదమ్ములకు మూడు ఆకాశగమనం కలిగిన మూడు పురాలను ప్రసాదించు. ఆ మూడు పురాలు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు శివుడు ఒక్క బాణంతో ఒకేసారి ఈ మూడు పురాలను కొడితే మేము మరణించేటట్టుగా వరం ప్రసాదించు" అని కోరుకున్నారు భీకరమైన తపస్సు చేసి.
🌟ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటే శివుడు తమను ఏమీ అనడు అనీ వారి అభిప్రాయం. అదీ కాక తమ పురాలు ఒకే సరళ రేఖలోకి రాకుండా చూసుకుంటే సరిపోతుంది అనుకున్నారు.
🌟త్రిపురాసురుల వల్ల పీడితులైన దేవతలందరూ కలిసి కైలాసానికి పరుగెత్తి..
🌟"ప్రభూ! హర హర మహాదేవ శంభో! పాహిమాం పాహి" అంటూ అరిచారు.
🌟పార్వతి సహితుడై పరమేశ్వరుడు వచ్చి.. "ఏమిటి? ఎందుకిలా వచ్చారు" అనగానే
🌟"స్వామీ! మీకు తెలియని విషయం లేదు. ఆ త్రిపురాసురుల ఆగడాలు మేము తట్టుకోలేక పోతున్నాము. లోకాలన్నీ అల్లడిపోతున్నాయి. వాళ్ళను సంహరించి లోకాలను రక్షించు దేవా" అన్నారు.
🌟"వాళ్ళు రాక్షసులైనా నిత్యం శివాభిషేకం చేస్తూ, యజ్ఞ యాగాదులు చేస్తూ వున్నారు కదా! అటువంటప్పుడు పాపాల కంటే పుణ్యఫలం ఎక్కువ ఉంది. ఎలా వధించడం. పూర్తిగా వాళ్ళ పాపం పండేవరకూ సంహారం కుదరదు" అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు.
🌟ఎలా అని తర్జనభర్జనలు పడిన దేవతలు ఇక వెళ్లి ఆ శ్రీమన్నారాయణు ని పాదాలు ఆశ్రయిద్దాం. ఆయనే ఏదో ఒక దారి చూపుతారు" అనుకుని వెళ్లి ఆయన్ని ప్రార్ధించారు.
అప్పుడు ఆ శ్రీపతి కరుణించి...
🌟"దేవతలారా! దిగులు చెందవద్దు. వాళ్ళ పాపం పండే కాలం దగ్గర్లోనే ఉంది. అప్పుడు శంకరుడు వాళ్ళను వధిస్తాడు" అని చెప్పి పంపివేశాడు.
🌟తర్వాత తాను బుద్దుడిగా అవతారం స్వీకరించారు. దశావతారాలలో అసలు బుద్ధుని అవతారం ఇది. చరిత్రలో చదివిన బౌద్ధమతం స్థాపించిన బుద్ధుడు వేరు. అది అవతారం కాదు. ఆయన ఒక యోగి అనుకోవచ్చేమో.
🌟బుద్ధునిగా త్రిపురాసురుల రాజ్యానికి వెళ్లి, ఆ అసురులు పిలిచిన తర్వాత వెళ్లి వాళ్లకు ఇలా అభిషేకం వంటివి చేయక్కర్లేదు అంటూ వేద విరుద్ధమైన పద్ధతులు బోధిస్తాడు. ఆ త్రిపురాసురులు ఆయన మాయలో పడి, అన్ని యజ్ఞ,యాగాలు, అభిషేకాలు మానేస్తారు. జీవితం ఉన్నది ఆనందించడానికి అని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. అప్పుడు వాళ్ళ కాలం మూడుతుంది.
🌟అప్పుడు దేవతలు మళ్ళీ శివుని వద్దకు వెళ్లి వేడుకుంటారు. నాకు అవసరమైన రథం, ఆయుధాలు సిద్ధం చేయమంటాడు శంకరుడు. భూమి రథం కాగా, సూర్యచంద్రులు రథ చక్రాలు అవుతారు. బ్రహ్మ సారథి అవ్వగా విష్ణువు బాణం అవుతాడు. అలా అందరు దేవతలు శివునికి కావాల్సిన విధంగా మారతారు.
🌟రథంలో పార్వతి వెంటరాగా యుద్ధానికి బయలుదేరుతాడు నీలకంఠుడు. ఎంత ప్రయత్నించినా త్రిపురాసురుల పురాలు ఓకే సరళ రేఖపైకి రావట్లేదు. ఏమి చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ..."పార్వతీ! వీళ్ళను ఎలా చంపాలో తెలియట్లేదు. వేగంగా దూరం దూరంగా పెడుతున్నారు వాళ్ళ పురాలను. ఏమిటి చేయడం" అంటూ సందిగ్ధంలో ఉన్న పార్వతిపతితో ఆ గిరిరాజ తనయ..
🌟"ఈశ్వరా! యుద్ధానికి వచ్చేముందు, మన పుత్రుడు గణపతికి ఒకమాట చెప్పారా? లేదా" అని అడిగింది
🌟"అయ్యో! మర్చిపోయాను పార్వతీ! ఈ హడావుడి లో అలాగే వచ్చేసాను"
🌟"అయితే ఇప్పుడన్నా చెప్పి రండి. ఈ విఘ్నం తొలగిపోతుంది" అంది అమ్మ.
🌟సరేనని ఒకచోట కూర్చుని, తన అయిదు ముఖాలతో గణపతిని ధ్యానం చేస్తాడు.
🌟ధ్యాన ఫలితంగా గణపతి అయిదు ముఖాలతో శివుడికి దర్శనం ఇచ్చి, నేను నీ లో నుంచే వచ్చాను. ఇక ఏ విఘ్నం రాదు. ఆ అసురులు నీ చేతిలో మరణిస్తారు అని చెబుతాడు. ఆయనే పంచముఖ గణపతి.
🌟ఈ పంచముఖ గణపతి తన తొండం చాచి ఆ మూడు పురాలను కదలకుండా ఓకే సరళరేఖపై పెడతాడు. అప్పుడు శివుడు తన బాణం వదిలి త్రిపురాసుర సంహారం చేస్తాడు.
🌟అలా ఒకసారి అమ్మకు, మరొకసారి తండ్రికి సహాయం చేసి, వారికి ఆనందం కలిగించాడు గణపతి.