*_భాద్రపద శుద్ధ అష్టమిని "దూర్వాష్టమి" అని అంటారు._*
కష్టాల ఊబిలో కూరుకుపోతు, సమస్యల వలలో చిక్కుకుపోతున్న వారికి మన ఆర్షధర్మమందు కొన్నివిశిష్టమైన తిథుల్లో కొన్ని ప్రత్యేక అర్చన అనుష్ఠానాదులతో కూడిన వ్రతాదులు చెప్పబడ్డాయి. అలాంటివాటిలో ఎంతో విశిష్టమైనది "దూర్వాష్టమి వ్రతం".
భాద్రపద శుద్ధ అష్టమిని "దూర్వాష్టమి" అని అంటారు. ఆర్తితో పిలవగానే పరమశివుడు పరిగెత్తుకు వస్తాడు. తన భక్తులు అడిగినది ఇచ్చేయాలి, వాళ్ల అవసరాలను తీర్చేయాలనే విషయాన్ని గురించే తప్ప ఆదిదేవుడైన మహాదేవుడు ఇంకేమీ ఆలోచించడు అనడానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి.
ఆశుతోషుడైన ఆయనకు అభిషేకాలు నిర్వహించి అనేకమందిభక్తులు ఆనందానుభూతులను పొందుతుంటారు. అలాంటి శీఘ్రఫలప్రదమైన శివానుగ్రహం పొందడానికి దూర్వాష్టమి వ్రతాచరణం ఉత్తమోత్తమైనదిగా ఐతిహ్యంగా కాన వొస్తున్నది.
పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగిన "గరిక" మధ్యలో ఈ రోజున శివలింగాన్ని వుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలని వైదిక గ్రంధాలు చెబుతున్నాయి. సంతాన యోగం లేని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.
నేడు ఇంకో విశేషం కూడా ఉన్నది. "రాధాష్టమి" మహా పర్వదినము కూడా నేడే. ఈరోజు న శ్రీ రాధా,కృష్ణులను పూజించడం వలన విశేష ఫలితాలను ఇస్తుంది.
భాద్రపదమాసంలోని అష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంతరంగ అధిష్ఠాన మహారాజ్ఞి అయిన శ్రీరాధాదేవి జన్మంచిన రోజు కావున ఈ దినానికి "రాధాష్టమి" అని పేరు. శ్రీ రాధా,కృష్ణుల పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార దుఃఖములు నశించి పరమసుఖములు లభించి భార్యా,భర్తల మధ్య అనురాగం పెరుగుతుందని ఆర్షవాగ్మయమందు చెప్పబడుతూ ఉంది.
అలాగే నవావరణ శ్రీచక్రర్చన మొదలగు విశేష అర్చనలు పారాయణాదులు ఆచరించటం వలన శ్రీజగదంబ శీఘ్రఅనుగ్రహ పాత్రులవుతారని దేవిభాగవతాది గ్రంధాల ద్వారా తెలియవొస్తున్నాయి. ఇంతటి విశిష్టమైన ఈ మహాపర్వదినమున కనీసం ఏదో ఒకరకమైన ఆరాధననైనా లేక అనుష్ఠానమునో ఆచరించి ఆనందించి తరించండీ.
*దూర్వాష్టమి మరియు రాధాష్టమి శుభాకాంక్షలు.*