శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరి స్తోత్రం మరియు శతకము

P Madhav Kumar

శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరి స్తోత్రం.

శ్రీ సరసీరుహేక్షణను సింధు కుమారిని గూడి వేడ్కతో

దాసుల ప్రోవగా తరు లతా రమణీయ నగమ్ము పై దయన్

వాసము సేయుచున్న నిను భక్తి భజించెద భక్తవత్సలా

నీ సరి లేరు లే రెవరు నిక్కము పల్కెద వేంకటేశ్వరా


2.హే కరుణా0తరంగ విభు హే మునిజనపూజితశోభితాంగ ద

ర్వీ కర శయ్య దైత్యజనభీకర భక్తమనోబ్జభృంగ ర

క్షాకర సుందరాంగ ఘనకల్మషభంగ కృపారసమ్ము నా

సేకము సేయ రావె భవచింతల బాపవె వేంకటేశ్వరా


3. విమల గుణాలవాల శశిబింబవిరాజితఫాల తప్త హే

మ మయమనోజ్ఞచేల మునిమానసలోల కృపావిశాల ది

వ్యముకురశోభమాన రుచిరాద్భుతకాంతి కపోల భక్త పా

ల మధురగానలోల నతులన్ గొను దేవర వేంకటేశ్వరా


4. వనరుహ లోచనానయనపర్వశరీర హిమాద్రిధీర మే

రునగ సమానశూర ఘనరూపధరా కరుణాకరా వరా

మునిజనచిత్తచోర శ్రితముఖ్యవశంకర వీరభాస్కరా

కొను నతులన్ రమారమణ గొల్తు మదిన్ నిను వేంకటేశ్వరా


5. వచ్చితివే రయంబున కృపారస మెంతయొ పొంగువారగా

చెచ్చర వారిజాక్షికిని జెప్పక నా కరిరాజు వేడగా

నిచ్చితివే వరంబు కృప యేర్పడ మెచ్చవ నేను వేడగా

చెచ్చర నీదు సన్నిధిని చేరగ వేచితి వేంకటేశ్వరా

6. గుహుడు సుతుండ నీ ప్రియ సఖు0డు ధృవు0డ విభీషణు0డు నీ

దు హితుడ వాలి తమ్ముడు హితుండ సహోదరు డౌ నటయ్య నీ

కు హనుమ?బాధ బాపి పలు కోర్కెల దీరిచి ప్రోచి నాడవే 

మహిమను జూపి నన్నటుల మన్నన సేయుమ వేంకటేశ్వరా


7.మక్కువ తోడ మెక్కితివి మంచిఫలమ్ములివంచు పల్కుచున్

అక్కట నామె నీ కొసగి నట్టి ఫల0బుల నారగింప నీ

కక్కయ?అమ్మయా?శబరి యార్మిల చెప్పుమ నాకు వేంకటేశ్వరా


8. మ్రొక్కులు నీకె మ్రొక్కి మది పూజలు సేయుచు నుండు వారికిన్

బెక్కు విధంబులన్ వ్యధలు బెట్టుట వేడ్కగ తోచునా దొరా

మ్రొక్కక నీవు లేవనెడి మూర్ఖుల కావగ జూచుచుందువే

యిక్కరిణిన్ జరించుటది యేటికొ తెల్పవె వేంకటేశ్వరా


9. అనయము నిన్ను గొల్వగల హస్తములే గద హస్తముల్ నినున్

గన గల కన్నులే నిజముగా కనులంచు దలంపగా తగున్

నిను గొనియాడు జిహ్వ గద నిక్కముగా తగు జిహ్వ నాగ నిన్

మనమున నిల్పు మానవుడె మానవు డౌ గద వేంకటేశ్వరా


10. పరమ శివు0డ నంటివి పంకజనాభుడ నంటి వౌర నే

మురహరుడ0చు బల్కితివి మోహనరూప మరెన్నొ పేర్ల తో

వరలిన గాని దేవు డనువాడు జగంబుల కెల్ల నొక్కడే

నరయుడు సత్య మంచనగ నచ్చెరు వందితి వేంకటేశ్వరా


11. తల్లియు దండ్రియున్ గురువు దైవము సర్వము వేవె యంటి స

ద్భక్తి మదిన్ భజింతు సతతంబు దయన్ విడనాడకంటి నా

యుల్లము నందు పాతుకొని యున్న ఘనార్తిని నార్ప మంటి వో

నల్లని వాడ నీ దరిసెనంబెపుడ 0టిని వేంకటేశ్వరా


12.నీదు పదమ్ములే సతము నెమ్మది నమ్మిన దాననే మనో

వేదన నోప జాలనుర వేగమె ప్రోచుట మాన భావ్యమే

శోధన జేసి నీ విటుల చోద్యము చూడగ నౌర నే నిలన్

నీ దయ గాంచగా తగన? నిక్కము పల్కుమ వేంకటేశ్వరా.


 శ్రీ వేంకటేశ్వర శతకము

తిరుమల తిరుపతి దేవస్థాన ఆర్థిక సహాయము తో 2003 సం,జనవరి లో ముద్రిత మైనది.


1. శ్రీ రమా హృదయేశ్వర శ్రీనివాస

చిన్మయాకార యోగీశ చిద్విలాస

మంగళ కర నిత్యవిలాస. మధురహాస

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


2.సకల దేవతలు మునులు సన్నుతింప

వేంకటేశ్వరు డను పేర విశ్వమందు

వెలసితివి సప్త గిరుల పై వేడ్క తోడ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


3.నీ సదనమె వైకుంఠ మై నిత్య మలరు

వసుధ తిరుమల0చు నదియె వాసి గాంచె

నిలను తత్సమాన క్షేత్ర మెందు గలదె?

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


4. తల్లి లక్ష్మి యె ప్రియముగ ధరణి వెలసె

దేవి పద్మావతి ఖ్యాతి దివ్యమూర్తి

గాచు దీన జనుల నల్ల కల్ప వల్లి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


5. మత్స్య రూపమును ధరించి మహిమ తోడ

డుష్టు డౌ సోమకాసురుద్రుంచి వేగ

వేదములను గాచితి వయ్య విశ్వనాధ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


6. పాలకడలి చిలుకు వేళ పావనాత్మ మందరాద్రివహింప నమంద లీల

కూర్మ రూపము దాల్చితి వోర్మి మీర

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


7. దానవు0డు హిరణ్యా క్షు0డు దర్ప మెనసి

ధరణి నీరధి ముంపగా దైత్యు ద్రుంచి

నవని గావా వరహమ వైతివి కద

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


8. అవని నరసింహమూర్తి వై నతరించి

దుష్టు డౌ హిరణ్యకశిపు దునిమి వైచి

కరుణ ప్రహ్లాద బాలకు గాచి నావు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


9. పొట్టి వడుగు వై మఖశాల మెట్టి దీక్ష 

దనరు నట్టి బలిని పద త్రయము వేడి

త్రొక్కినా వధో జగతికి తోయజాక్ష

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


10.. పరశురాముడ వై మహీవలయ మెల్ల

దిరిగి భూపతులన్ ద్రుంచితివి గదయ్య

నిర్వదొకమారు పగబూని నిర్వి కల్ప

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


11.రామ నామమును ధరించి రావణాది

రాక్షసుల వధియించి ధర్మ0బు ధరణి

నిల్పిన మహితాత్ముడవును వీవు గాదె

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


12.దుష్టుల దునిమి దయ తోడ శిష్ట జనుల

ప్రోవ కృష్ణుడై వేవేగ పావ నాత్మ

నవతరించితివి గదయ్య యబ్జ నాభ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


13. త్రిపుర దనుజ వనితల జెరుపగ బుద్ధ

రూపము ధరించి నావు రుద్రునకు నీదు

సాయమున జయ మబ్బె నిస్సంశయముగ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


14.జగతి కల్కి వై పుట్టి కుజనుల నణచి

సుజనులను ప్రోతువు గదర.సుజన పోష

దేవ కారుణ్య సింధు హే దీన బంధు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


15.ధర్మ మెందెందు నశియించు ధరణి యందు

మహిమ నందందవతరించి మరల మరల

దాని నుద్ధరించెద వయ్య ధర్మ మూర్తి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


16. బుద్ధి గల్గిన దాదిగ భువన పాల

భక్తి పూజించు చున్నాను భావ.మందు

భక్త కోటిని ప్రోచెడి భవ్య మూర్తి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ



17. అల్ప విద్య నేర్చి యనూహ్య మై వెలుంగు

నీదు మహిమ దెలుపగ బూనితిని నేను

లేదు నరుల కసాధ్య0బు నీదు కరుణ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


18. జపతప0బు లెరుంగని జన్మ మెత్తి

పుడమి నిను వేడు చున్నట్టి మూఢ మతిని

యెన్న డిత్తువో మోక్షమో యన్న నాకు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


19.కొల్వగా నతి ప్రీతి నక్షుద్ర బుద్ధి

తాల్మి కల్మషంబున్ బాపి చెలిమి తోడ

నల్పు నైనను పాలించు వేల్పు వీవు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


20. బలిమి కలిమి యుండిన నేమి పామరుండు

నీదు పాదముల్ గొలువక నీర జాక్ష

పొందగా లేడు నిజమగు ముక్తి పదము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


21. అందుగలడిందు గలడని యందరనగ

విన్నదే గాని గాంచలేదన్న నిన్ను

మది దలంతు నీ వెందున్న మరువ నన్న

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


22 నమ్మ లేదేరిని నిను నే నమ్మి నటుల 

తల్లిదండ్రియు గురుజనం బెల్ల నీవె

యెల్ల వేళల0 దుండుమ యుల్లమందు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


23. బ్రహ్మ సనకసనందన ప్రముఖ మునులు

తెలియ లేరు నీ పొడ యన దివ్య రూప

నల్ప మతిని నే నెటుల నిన్నరయ నేర్తు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


24. క్రూర ఫణికి లూతకు నేనుగునకు నరసి

మహి నెవరు కోరి నేర్పిరి మంత్ర మౌర

భక్తి నిను గొల్చి చేరెను పరమ పదము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


25.మునిగి దేలుచు సంసార వనధి నీదు

చుంటి మది నీ పయిన్ నిల్పి యోర్మి తోడ

ముక్తి తీరమున్ జేర్చు మాసక్తి తోడ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


26. వెతల కుతకుతలో సతమతమగు మతి

శాంతి నొందగ జేయుమ ప్రీతి తోడ

విన్నవించితి శ్రీపతీ సన్నుతించి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


27. కనగ లేను నిను గనక మనగలేను

నిన్ను గని దరి జేరగ నేను తగన

సామి తరలి రావయ్య కైవల్య మొసగ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


28. పుడమి సంసార రణమున బోరి యకట

సృక్కి దిక్కు నీ వంచు నే మొక్కు చుంటి

గ్రక్కున కరుణతో నను కావ మంటి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


29.ఏ యుగంబయినన్ కాల మేదయినను

దేవుడొక్క డై రక్షించు దీన జనుల

భయము లేదు లేదెప్పుడున్ భక్త తతికి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


30. భక్తి నిను వేడ పరుగున వచ్చి కరుణ

భక్తజనుల గాచెడు భక్తవత్సలుడవు

దైవ మన్న నీవె గదర దైవరాయ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


31.ఉర్వి లేడు దేవు డనెడు గర్వితుండు

నిన్నెదుర్కొనగా నతని మద మణచు

వీర విక్రముడవు వీవె వీర్యవంత

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


32. అచ్యుతు డతండనంతుండు నతడె సుమ్ము

నాది దేవుడతండఖిలాత్ముడతడు

భక్తి.మది భజించు మతని పాద యుగళి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


33. తనయు కొరకు తపించెడి తల్లి వోలె

భర్త కొరకు బరితపించు భార్య రీతి

పరితపించ వలయు భగవంతుకొరకు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


34. మేఘ పంక్తులందు మెరయు మెరుపుల వలె

జగతి గన్పించు సుఖము లశాశ్వతములు

భక్తులకు నిత్య సుఖ మిచ్చు ముక్తి పదము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


35. నిక్కముగ సిరుల్ నరులకు పెక్కు లున్న

గాని యేమున్నది ఫలము గాంచగాను

కనుల నిన్గా0చు భాగ్యమ్ము గనని నాడు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


36. పశువులకు లేని విజ్ఞాన బలము గలదు

నుర్వి నవతరించెడు మనుజోత్తములకు

మాన్యు డగు గాదె దానిని మరువ కున్న

వినుత పద్మావతీ నాథ వేంకటేశ


37. మధుర మకరందమున్ గ్రోల మధుకర0బు

వనము లన్ని దిరుగు చున్న వనజనాభ

మరువ గల్గునే.ఝు0కార మధుర గీతి 

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


38.ధరణి సంసార వనిలోన దిరిగు చున్న

ద్రావకుండునే యాశ్రిత భ్రమర మనము

నీదు నామామృత0బును నిర్మ లాత్మ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


39. ధన కనక సౌఖ్యముల నిమ్మని నిను వేడ్క

నడుగు చుంద్రు నరుల్ గాని నరసి జూడ

కొందరే జ్ఞాన ధనము కోరు వారు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


40. మానవ మనః కపి మరల మరల దిరుగు

కోర్కెల వనము లందున కుదురు లేక

పట్టి కట్టుమా దీని నీ పదముల కడ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


41. అంతయును మాయగ నెరింగి యాలు బిడ్డ

లర్థ తనువులు శాశ్వత0బ0చు నమ్మి

మునుగు మోహాభ్ది మనుజుండు మూర్ఖబుద్ధి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


42. అరయ నింద్రి యాశ్వముల దేహరథము గొని

బుద్ధి సారథి సంసార యుద్ధ మందు 

యుక్తి నడుప జీవుడు పొందు ముక్తి పదము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


43. మనుజు లజ్ఞాన రజ్జువు గొని రయమున

ముక్తి దుర్గ మెక్క నగునె భక్త వరద

జ్ఞాన శక్తి నొస0గుమా జ్ఞాన దాత

వినుత పద్మావతీ నాధ వేంక టేశ


44. కుమతి పదవి పొందు ధనము కోరి గాని

సుమతి సర్వ జనాళికి సుఖము గూర్ప

పదవి చేపట్టు ధర్మ ధూర్వ హతమించి

వినుత పద్మావతీ నాధ వే0క టేశ


45. విద్య లెనన్నొ నేరిచి వేడ్క విశ్వ మేల

ధరణి యత్నింతురే గాని విరసజనులు

బ్రహ్మ విద్య గడింపగా పాటు పడరు

వినుత పద్మావతీ నాధ వేంక టేశ


46. మానవుల్ మహా బలవంతు లైన గాని

లోకముల నేలు విభుని గెలువగ లేరు

తలప శక్యము గానిది దైవ బలము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


47. దుష్ట కర్మ జేయ గలుగు దుష్పలంబు

సత్ఫల0బు సత్కర్మముల్ సలుప గలుగు

సత్ఫలము ముక్తి గల్గించు జనుల కెపుడు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


48. బ్రతుకు బుద్భుధ ప్రాయమౌ ప్రాణి కెపుడు

సర్వ సుఖము లస్థిరమను సత్య మెరిగి

పాటు పడవలె సత్యమౌ పదము కొరకు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


49. భామినీ పుత్ర మిత్రాది బంధు జనులు

విత్త మున్న వత్తు రనుభవింప వేడ్క

ఛీదరింత్రు సిరి దరుగ చిత్రము గదర

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


50. నరుని జవ సత్వము లుడిగినన్ మహాత్మ

బతుకు పై నాశ చావదె పామరునకు

జ్ఞానము కలుగు నాడది నాశ మగును

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


51. అందరకు తెలియు దినకరాస్తమయము

అందరకు మింట భానోదయమ్ము తెలియు

మృతి తెలియగ రానిది మహా మతుల కైన

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


52. వెలుగు వచ్చు చీకటి పోవ వెంట నంటి

తొలగు కష్టము వెనువెంట కలుగు సుఖము

వీని సమ దృష్టి జూచు విజ్ఞాన శీలి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


53. ఉత్తమంబగు నర జన్మ ముర్వి యందు

సత్య నిరతులై త్యాగులై సర్వ జనుల

దయను చూడగావలె నరుల్ ధన్యత గన

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


54. తనువు కాషాయ వస్త్ర0బు దాల్చ గానె

కా డతండు యోగీ0 ద్రు0డు కాడు కాడు

యోగియై వరలు జితేంద్రియుండు గదర

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


55. భూషణములు గూర్చును దేహమునకు శోభ

సద్గుణములె నాత్మకగు భూషణములుగను

దేహ శోభ కన్నను మిన్న దేహి శోభ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


56. జలము గర్భమందున దాల్చు జలధి రీతి

జ్ఞానమును దాచు మనమున జ్ఞాన మూర్తి

జ్ఞాని నంచు మిట్టిపడు నజ్ఞాని యవుర

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


57. విద్య లెన్ని నేర్చిన గాని వినయ మున్న

యపుడె రాణి0చు నిత్యమై నవని యందు

వినయ శీలుని పరమాత్మ ప్రేమ జూచు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


58. సూర్య డెల్ల లోకములకు శోభ గూర్చు

జ్ఞాని వలన భాసించు నజ్ఞాని యెపుడు

జ్ఞానమున్న ముక్తిని గాంచు మానవు0డు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


59. చంద్రు డేమి కోరి వెలుగు జగతి కిచ్చు

నేల వృక్ష మే మాశించి నీడ నిచ్చు

జగము గావ మహాత్ముడు జన్మ దాల్చు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


60. తనువు నిలువ లేదు భువి పదములు లేక

ధర్మ నిరతులు లేకున్న ధరణి లేదు

ధర్మ ముద్ధరించు సకల ధరణి జనుల

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


61. కామ, రోష,మోహంబు లిక మద,లోభ

మత్సరములు పో శుద్ధ మౌ మానసంబు

శుద్ధ మతికి వేగమె మోక్ష సిద్ధి కలుగు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


62. హింస చేయ తగదు పాప హేతు వగును

నరుని పాపమె నరునకు నరక మగును

అవని హింస వీడి పరమహంస వగుము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


63.ధరణి మానవ హృదయకుహరము లందు

ఖగ, నగ, మృగముల వెలుగు కాంతి రేఖ

ఈశ్వరుడని యెరుగ వలె విశ్వ వాసి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


64. సర్వము తన దని తలచు స్వార్థ పరుడు

సర్వ మందరి దనును నిస్వార్థపరుడు

ప్రభు కరుణకు పాత్రుడగు నిస్వార్థపరుడు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


65. ధరణి జనుల మానస వనాంతరములందు

వృక్ష కోటి వరలుచు నుండక్షయముగ

నవియె మమకారహంకార వివిధ గతులు

వినుత. పద్మావతీ నాధ వేంకటేశ


66. మానవాళి మెచ్చగ మంచి మాట లాడు

మానవతను పెంచ గలుగు మంచితనము

మంచి వారలన్ కడు మెచ్చు మాధవు0డు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


67.ఈ జగము ధన మూలమై యెసగ మెసగు

ధనము నార్జింప వలయును మనుజు లెల్ల

ధర్మము నతిక్రమింపక తగిన రీతి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


66. దినకరుడు ధర్మ బద్దుడై దివిని వెలుగు

ధర్మ బద్ధమై వర్ధిల్లు దైవ సృష్టి

మనవలయు ధర్మ బద్ధుడై మానవు0డు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


69. వసుద ప్రియముగా పలికి యపకృతి సలుపు

వాని కంటె నప్రియ మైన పలుకు లాడి

మేలు గూర్చు వాడె హితుడు మిత్ర వరుడు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


70. దుష్టుల చెలిమి గల్గించు దుష్ఫల0బు

సజ్జనుల చెలిమి ఘటించు సత్ఫల0బు

సత్ఫలమున సంభవ మగు సద్గతి సుమి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


71. గగనమందుండు మంచు మేఘముల రీతి

విషయవాంఛ లుండు మనము వెంట నంటి

వాని పరిహరి0చు జ్ఞాన భానుమూర్తి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


72. జగతి సంసార సౌఖ్యమే సర్వ మనుచు

మోహ చిత్తుడై మనుజుండు మూర్ఖబుద్ధి

శోక తప్తుడై పరమాత్ము చూడలేక

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


73. ఐహిక సుఖాల కొరకు నాయాస పడుచు

ప్రభుని కొరకు పాటుపడరె పట్టు బట్టి

అంత పట్టని దాగుట్టు నక్కటకట

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


74. మానస సరోవరమున నజ్ఞాన కర్ద

మంబు సంకల్ప భంగముల్ మలగి నంత

రాజిలున్ జ్ఞాన కమలము ప్రభుని కరుణ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


75. నిలువ లేవు ముత్యములుగ జలము లన్ని

స్వాతి జల్లె ముత్యము.లయి పరిఢ విల్లు

మహి మహాత్ములై కొందరె మనుట నిజము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


76. పాలనీళ్ళ నుండి తెలివి పాల నొకటె

స్వీకరించు హంసము రీతి విశ్వ.జనులు

స్వీకరించగ వలయు మంచిని సతతము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


77. విషమయం బైన భక్ష్యము ప్రీతి యైన

కుడువ నిచ్చగింపక దాని విడుచు నటుల

కీడు చేయు నధర్మమున్ వీడ వలయు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


78. అవని సద్గుణ సంపన్ను డైన నరుడు

ధనము లేని వాడైనను ధరణి జనులు

బ్రస్తుతింతురు వానినిన్ వాస్తవముగ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


79. సద్గతి సమకూర్చు వాడె సద్గురు0డు

సర్వ ముర్వి సాధింపగ జాలు నతడు

సతత మాతని సేవించు సజ్జనుండు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


80. దుర్గుణంబులు లేక సద్గుణము లున్న

సద్గుణ పరిపూర్ణు0డగు సద్గురుండు

సద్గతి నొస0గి రక్షించు సంతసించి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.


81.. దుష్టు డంచు దూషింపక శిష్ట జనులు

దునుమగవలయు దుష్టుల దుష్ట బుద్ధి

శిష్టు లై మనగల రిల దుష్టులపుడు

వినుత పద్మావతీ నాధ.వేంకటేశ.


82.తప్ప దెపుడు కాలక నిప్పు తాకి నపుడు

తప్పు చేసి నపుడు ముప్పు తప్ప దెపుడు

ఒప్పు జేయునపుడు మెప్పు తప్ప దెపుడు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


83. కలిమి బలిమికై వలదయ్య కలవరంబు

కావలయు వేంకటేశుని కనికరంబు

కలుగు కైవల్య మప్పుడు కలత దొలగి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


84. జప తప0బు లెరుంగని జడు నయినను

జనకుడై శ్రీనివాసుడు జాడ్య మణచి

జన్మ సాఫల్య మొనరించు జాలి తోడ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


85. తలపగ కాదు గరుడాచలము కాదు

మందిరము మానవ హృదయ మందిర మది

దాని చేరిన మనుజుండు ధన్య జీవి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


86. సంద్రమును జేరి నదులన్ని సంతసించు

నాత్మ యద్వయమగు పరమాత్ము చేరి

శాంతి లే దాత్మ కందాక సత్యముగను

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


87. మరి మరి మదిని మరువక మరపు వీడి

నిరతము పరమాత్ము దలంచు పరమ భక్తి

పుణ్య వశమున ప్రాప్తించు ముక్తి పదము

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


88. ఔర విషయ సుఖంబుల ననుభవింప

వేడ్క మేల్కా0చు నజ్ఞాని విశ్వ మందు

జ్ఞాని మేల్కా0చు లోకజనకుని చూడ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


89. సాంద్ర జలము మేఘుడు గొని జగతి కొసగు

సకల లోక రక్షకునిచే సంగ్రహించి

జ్ఞాన జలము మహాత్ముడు నరుల కొసగు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


9. మూర్తి గానరాదద్దాన మురికి యున్న

మనస్సు నద్దమున విషయ మలిన మున్న

మహిమ గాన రాకు0డును మాధవుండు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


91. జ్ఞాన వైరాగ్య బుద్ధి మానవుడు మహిని

కర్మ చేయ మహర్షి యై క్ష్మా జనంబు

శుద్ధ మతులై మనగ వారి నుద్ధరించు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


92. ధరణి నదులు మలుపు లెన్నొ  తిరిగి తిరిగి

జలధి జేరు నటుల బహు జన్మ లెత్తి

జనులు పొందుదురపవర్గ సత్సుఖ0బు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


93. సుస్థిరము కాని యిహలోక సుఖము కోరి

సుస్థిర0బగు పరలోక సుఖము వీడు

మనుజు డెంతటి మూర్ఖుడౌ మది దలపగ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


94. కర్మ ఫలము పై మనుజుండు కాంక్ష వీడి

కడగి నిష్కామ చిత్తుడై కర్మ చేయ

కర్మ బంధము తొలగెడు మర్మ మెరుగు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


95. విజ్ఞుల పలుకుల్ విన వలె వినదగినవి

మనవలె మహాత్ము లై వాని మర్మ మెరిగి

విడువక వశించు మనమున విశ్వ విభుండు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


96. దీప ముండగనే గృహిణి తెలివి గృహము

చక్క బెట్టును విజ్ఞాని సద్గురు కృప

దేహ ముండగ పరమాత్ము దెలియ నేర్చు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


97. విత్తమును కోరి పడనేల వేయి పాట్లు

చిత్తమందున సద్భాక్తి శివుని గొల్చి

జీవ వేవేగ నాతని చేర రాదె

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


98. దేహ బాధ నణచ నౌషధి గొను రీతి

కోరి భవ రోగ మణచ జేకొన వలయును

ప్రభుని నామౌషధ0బును పరమ ప్రీతి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


99.ఘోర పాతక0బైనను గూలి పోవు

నీ కృపా. చాపము వలనన్ నిప్పు కణము

కాల్చ గల్గును కాదె నగ0బునైన

వినుత. పద్మావతీ నాధ వేంకటేశ.


100. పావనాత్ము డౌ సద్గురు పాద యుగళి

బట్టి కడు భక్తి సేవింప పామరుండు

ప్రాజ్ఞుడగును గురు కృపా ప్రభావ మహిమ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


101. సర్వ కర్మలు సమబుద్ధి జనులు సలుప

తల్లి దండ్రి యై పాలించు ధరణి విభుడు

పక్ష పాతము లేకుండ ఫలము నొసగు

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


102. లక్ష్య సిద్ధి సాధించు సులక్షణ గుణ

లక్షితు0 డౌ నరుండు సలక్షణ మగు

పథమున పయనించ దల0చు భయము వీడి

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


103..జగతి సృజియించి గాచు నీశ్వరు డొక0డె

నవని జీవు లెందరయిన నాత్మ యొకటె

ముక్తి మార్గము లెన్నైన మోక్ష మొకటె

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


104. దురితముల్ బాపు నీ దృష్టి దుష్ట దూర

నీ దయను వ్రాసితిన్ నేను నీదు కృతిని

ధన్యు రాలిని జేయవే దయ ముకుంద

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


105. పద మదే దున్నది పరమ పదము గాక

బలము వేరేది నీ కృపా బలము గాక

విద్య వేరు లేదే బ్రహ్మ విద్య గాక

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


106. సర్వము మరచి నిను భక్తి సతము గొల్చు

సద్గురు కడకు నను జేర్చి సంతసమున

సద్గతి నొసంగి కావుమా సత్య చరిత

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


107. భక్తి శతకమున్ పఠియించు భక్త తతికి

కరుణ నాయురారోగ్య భాగ్యముల నింక

మోక్ష మిచ్చి రక్షింపవే అక్షయముగ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ


108. మంగళము మంగళాకార మధుర గాత్ర

నిత్య జయ మంగళము నీకు నీర జాక్ష

నిత్య శుభ మంగళము నీకు నిర్మ లాత్మ

వినుత పద్మావతీ నాధ వేంకటేశ.




పంపిన వారు:

కమలమ్మ 

మార్కాపురం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat