తిరుమలలో అనేక రకాల ఉత్సవాలు శ్రీవారి కి కైంకర్యాలుగా జరుపుతున్నారు.

P Madhav Kumar


⚜️⚜️⚜️


నిత్య (ఆర్జిత)సేవలు

పక్ష (వారాంతపు) సేవలు

కాలానుగత సేవలు


 ప్రస్తుతం నిత్యసేవలు గురించి తెలుసుకుందాం.


వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు  పూజలు జరుగుతాయి. 


అవి:    


ప్రత్యూష, ప్రభాత, 

మధ్యాహ్న, అపరాహ్ణ, 

సాయంకాల, రాత్రి     

పూజలు.


రోజువారీసేవలు


తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ  ప్రత్యూషపూజలకు నాంది.


సుప్రభాతం:-   2:30-3:00 am 


 నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే.  ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు (సన్నిధిగొల్ల) దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట  మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు   తాకించి ఆలయద్వారాలు . తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.


 బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం  ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ, గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేల్కొలుపుతుంటాడు . అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని మేల్కొలుపుతారు.


 పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని  ....*విశ్వరూప దర్శనం*....  అంటారు.


.


శుద్ధి: - 3-3.30am


సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడుగంటల నుండి మూడున్నర నుంచి  నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. 

ఇక్కడే మేలుకొలుపు అన్నమాచార్యుల వంశీకులచే జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో  వేస్తారు. స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనిని నిర్మాల్యశోధన అంటారు.


తోమాలసేవ:   3.30- 4.00am


తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం  జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.


కొలువు:  4 - 4:15am


 తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్‌ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.


అర్చన:- 4 -4:45am


 శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి  పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం  పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు.


......... ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక........


 ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని   దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.


అభిషేకం:శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైంది ప్రతిశుక్రవారం ఉదయం జరిగే అభిషేకం. ఈ సేవ ప్రాశస్త్యం ఏమిటంటే అభిషేక సమయంలో నిత్య కల్యాణశోభితుడైన స్వామివారి నిజరూప దర్శనభాగ్యం భక్తులకు లభిస్తుంది. 


గురువారం రాత్రి పూలంగి సేవ తరువాత దర్శనంలోనూ, శుక్రవారం ఉదయం అభిషేక సమయంలోనూ, అభిషేకానంతర దర్శనకాలంలో తప్ప మిగతా అన్ని రోజులూ స్వామి వెడల్పాటి తెల్లని కర్పూరనామంతో దర్శనమిస్తాడు. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం సాధ్యపడుతుంది. దీన్నే నేత్రదర్శనం, నిజపాద దర్శనం అంటారు.


పశుపాలక శ్రీ గోవిందా || పాపవిమోచన గోవిందా


దుష్టసంహార గోవిందా || దురతనివారణ గోవిందా..


గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా.


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat