-బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు
🔹🔸🔹🔸🔹🔸🔹
ప్ర: సృష్టిలో శక్తి స్వరూపిణి ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అందులో మహేశ్వరుని కుమారుడు వినాయకుడు. మరి అటువంటప్పుడు విఘ్నేశ్వరుని ముందుగా ఎందుకు పూజిస్తున్నారు?
జ: సృష్టికి కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క శక్తి పరాశక్తి. ఆ పరబ్రహ్మయే తన శక్తి ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరాది రూపాలు ధరించి సృష్టి శక్తులను కొనసాగిస్తున్నాడు. విఘ్నేశ్వరుడు కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపమే. మహేశ్వరుని కుమారునిగా అవతరించాడంటే - ఆతని మరో రూపం అని అర్థం. సృష్టితోపాటు ఉన్న మూలాధారశక్తియే సృష్టి తరువాత జరిగిన ఉమామహాహేశ్వరకల్యాణానంతరం మళ్ళీ ఆవిర్భవించింది.
అంతేకాక ఏ పనికైనా విఘ్నాలు పొంచి ఉంటాయి. కొన్ని పనులకు విఘ్నాలు కలగడం మంచిది. కొన్నిటిని విఘ్నాలు తొలగాలి. ఉదాహరణకు దుష్టశక్తుల పనులకు విఘ్నాలు కలిగితేనే లోకానికి క్షేమం. ఉత్తమ కార్యాలకు, పూజాదులకు విఘ్నాలు వాటిల్లరాదు. 'విఘ్నాలు' అనే దైవీశక్తులకు అధిపతిగా నియమింపబడిన పరబ్రహ్మణే గణపతి 'విఘ్నేశ్వరుడు'. మన పూజాదికాలు, తలపెట్టిన సత్కార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి గాను విఘ్నేశ్వరుని ముందుగా పూజించాలి. అప్పుడు ఏ విఘ్నాలు కలుగకుండా ఆ అధిపతి గమనిస్తాడు.
🔹🔸🔹🔸🔹🔸🔸