🙏🌹ఓం నమో వేంకటేశాయ🌹🙏
శ్రీ తాళ్ళపాక అన్నమయ్య పదార్చన🙏
॥పల్లవి॥ వేదంబెవ్వని వెదకెడినీ
ఆదేవుని కొనియాడుడీ
వెంకటరమణా గోవిందా
సంకటహరణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వెంకటరమణా గోవిందా
॥చ1॥ అలరిన చైతన్యాత్మకుడెవ్వడు
కలడెవ్వడెచట కలడనిన
తలతురెవ్వనిని తనువియోగదశ
యిలనాతని భజియించుడీ
॥చ2॥ కడగి సకలరక్షకుడిందెవ్వడు
వడి నింతయు నెవ్వనిమయ్యము
పిడికిట తృప్తులు పితరులెవ్వనిని
తడవిన ఘనుడాతని కనుడీ
॥చ3॥ కదిసి సకల లోకంబులవారలు
యిదివో కొలిచెదరెవ్వనిని
త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుడీ🙏
భావము :
వేదము భారతీయ తత్వజ్ఞానమునకు ప్రమాణము. ఆ వేదము ఎవరిని కనుగొనుటకు యత్నించుచున్నది? ఆ వేదములు కనుగొనుటకు యత్నించుచున్న పరమాత్మను మీరందరూ కీర్తించండి.
1. జీవులందరిలోనూ చేతన కారకుడైన చేతనాత్మకుడు ఎవ్వరు? ఆయన ఎక్కడున్నారు? ఏమి సమాధానమీయగలము? తాము తుదిశ్వాస విడుచుచున్నప్పుడు ఎవనిని స్మరించుటకు మానవులందరూ యత్నింతురు? ఆ పరమాత్ముని నేను భజియించెదను.
2. సకల లోకములకు ఏకైక రక్షకుడు ఎవ్వరు? సృష్టి అంతా ఎవ్వనిమయమైయున్నది? పితృదేవతలు అందరూ అనురాగముతో తాకబడి ఎవనిచేత తృప్తి పరచబడుతున్నారు? ఘనుడైన ఆ మహానుభావుని దర్శించండి.
3. సమీపించి ఎల్ల లోకములవారు పూజించునదెవ్వరిని? త్రిదశలు మాత్రమే ( బాల్యము, యవ్వనము, కౌమారము అను మూడు దశలు మాత్రమే ) గల దేవతలచే నుతించబడుతున్న శ్రీవేంకటేశ్వరుని!!! వెదకి కనుగొని సేవించండి.
ఓ ప్రజలారా! ఆవిధంగా అందరూ ధన్యులవండి.🙏