దేవతలకు రకరకాల వాహనాలు ఉంటాయి. వినాయకుడిని చూస్తే భారీ ఆకారం.. ఆయనకు ఎలుక వాహనం. అసలు ఆయనకు ఎలుక వాహనంగా మారడానికి కారణం ఏంటంటే? అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఇంద్రుడు సభ జరుగుతూ ఉంది. ఆ సభలో గంధర్వులు, అప్సరసలు కూడా ఉన్నారట. అనేక అంశాలపై చర్చ జరుగుతూ ఉంటే క్రౌంచుడు అనే గంధర్వుడు అప్సరసలతో పరాచకాలు ఆడుతూ సభకు అంతరాయం కలిగించాడు. గంధర్వుడు తీరు నచ్చక విష్ణువు హెచ్చరించాడు. అయినా పట్టించుకోలేదు. ఇక ఇంద్రుడికి కూడా కోపం తెప్పించాడు. ఇంద్రుడు అతడిని ఎలుకగా మారమని శపించాడు. గంధర్వుడు క్షమించమని ఎంత వేడుకున్నా ఫలితం దక్కలేదు.
ఎలుకగా మారిన క్రౌంచుడు లోకాలన్నీ తిరుగుతూ మళ్లీ అందరికీ విసుగు తెప్పించడం మొదలుపెట్టాడు. విసుగుపుట్టిన ఇంద్రుడు దేవలోకం నుంచి అతడిని తరిమివేయమని ద్వారపాలకులకు చెప్పాడు. అలా తరిమివేయబడ్డ ఎలుక భూమి మీద పడింది. పరాశరుని ఆశ్రమానికి చేరిన ఎలుక తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు. ధాన్యాలు, ఆహారం, వస్త్రాలు అన్నీ కొరికేయడం మొదలుపెట్టింది. ఆశ్రమానికి వచ్చిన వినాయకుడి వస్తువుల్ని కూడా వదలలేదట. ఇక ఎలుక చేష్టలకు విసిగిపోయిన పరాశరుడు దానిని వదిలించుకునే మార్గం చెప్పమని వినాయకుడిని అడగటంతో వినాయకుడు తన ఆయుధాన్ని ప్రయోగించడంతో క్రౌంచుడు వినాయకుడి పాదాల వద్ద పడి క్షమించమని వేడుకుంటాడు.
వినాయకుడు క్రౌంచుడిని చూసి కరిగిపోయి క్షమించి ఇలాంటి పొరపాటు మళ్లీ చేయవద్దని హెచ్చరించాడు. అయితే తనని మరలా గంధర్వుడిగా మార్చమని క్రౌంచుడు వినాయకుడిని వేడుకున్నాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం తీసివేయడానికి వినాయకుడికి అధికారం లేదు. అందువల్ల తనతో పాటు వరాన్ని క్రౌంచుడికి వినాయకుడు ప్రసాదించాడు. ఈ కారణంగా గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. అయితే వినాయకుడి బరువును ఎలుక మోయలేదు కాబట్టి వినాయకుడిని మోయగలిగేలా వరాన్ని కూడా పొందాడు క్రౌంచుడు.
ఇక ఇంకో కథకి వస్తే గజముఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడిని మూషికాసురుడు అని కూడా పిలుస్తారు. ఆ రాక్షసుడు ఎటువంటి ఆయుధం తనని చంపకుండా వరం పొందుతాడు. ఆ సమయంలో వినాయకుడు తన దంతాల్లో ఒక దానిని విరిచి గజముఖాసురుడి మీదకు విసురుతాడు. దంతం తనను సమీపిస్తున్న తరుణంలో రాక్షసుడు ఎలుకగా మారి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. అప్పటికే అది అతని మెడ పట్టి వినాయకుడిని చేరింది. భయం వణికిపోయిన గజముఖాసురుడు క్షమించమని కోరగా వినాయకుడు తన వాహనంగా ఉండేలా వరం ఇచ్చాడని చెబుతారు. ఇంకా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయకచవితి రోజు బొజ్జ గణపయ్యతో పాటు మూషికం కూడా భక్తుల పూజలు అందుకుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 న వినాయకచవితిని భక్తులు జరుపుకుంటున్నారు.