GANGA Pushkaralu : పరమ పవిత్ర గంగా పుష్కరాలు .. పుష్కర

P Madhav Kumar

 ప్రతి భారతీయడు జీవితంలో ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలని భావిస్తాడు. మహా విష్ణు పాదాల నుంచి పుట్టిన గంగతో భారతీయులకు ఎంతో అనుబంధం. పరమ పవిత్రంగా పూజించే గంగా జలంతోనే జీవం మనుగడ సాధిస్తుందని హిందువుల నమ్మకం.

పన్నెండేళ్లకోసారి వచ్చే పెద్దపండగే పుష్కరాలు. పుష్కరం అంటే పన్నెండు. ఏటా ఏదో నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది గంగమ్మ పుష్కరాలు. పన్నెండు రోజులపాటు జరిగే పుష్కరాలలో గంగా స్నానంతోపాటు గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాలను కూడా దర్శించుకుంటారు భక్తజనం. అసలు పుష్కరాలెందుకు? పుష్కర ప్రాశస్త్యం ఏమిటి? అంటే చాలా పురాణ కథలే ప్రాచుర్యంలో ఉన్నాయి.


విష్ణుమూర్తి పాదపద్మాల నుంచి పుట్టిన గంగానది .. పురాణాల్లో గంగమ్మ ఘట్టాలు, పవిత్ర గంగాజలం ఘన చరిత్ర

పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేయగా, భక్తవ శంకరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. పుష్కరుడు మణులో మాణిక్యాలో అడగలేదు. రాజ్యాలూ సామ్రాజ్యాలూ ఆశించలేదు. జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయని, నదులు పునీతమైతే దేశమూ సుభిక్షంగా ఉంటుందని ఆలోచనతో ‘దేవా… నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు’ అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ‘నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. నదిలో స్నానమాచరించిన వారు పాపవిముక్తులవుతారు. జన్మరాహిత్యాన్ని పొందుతారు’ అని వరమిచ్చాడు. పుష్కరుడు సంతోషించాడు. పుష్కర మహత్యం తెలుసుకున్న బృహస్పతి తనకూ పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డుచెప్పాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాధాన్యత కల్పించాడు బ్రహ్మ. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుక నిర్వహిస్తారు.

గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో, గంగ పుష్కరాలు మొదలవుతాయి. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ నమ్మకంతోనే కోట్లాది మంది భక్తజనం గంగా పుష్కరాలకు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో కూడా రోజుకు పాతిక లక్షల మంది గంగా స్నానం చేసి తన్మయం పొందుతారు. ప్రతిరోజు పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకోవడం హిందువుల ఆచారం. అంతకుమించి నమ్మకం. గంగ జన్మస్థలం గంగోత్రి నుంచి సముద్రంలో కలిసేదాకా ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. ఆ ఒడ్డున ఎన్నో నాగరికతలు పుట్టాయి. ఎన్నో సామ్రాజ్యాలు వెలిశాయి. ఎన్నెన్నో మట్టి కొట్టుకుపోయాయి. మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సజీవ సాక్ష్యం.

హిందువుల మత విశ్వాసాలకు పవిత్రతకు గంగానదితో ముడిపెడతారు. జలాన్నే దైవంగా పూజించే నేల మనది. జలమే మన మనుగడకు ఆధారం. జలం పుట్టాకే నాగరికత పెరిగింది. జలం అంటే గంగ. అందుకే గంగమ్మను దేవతగా ఆరాధిస్తారు భారతీయులు. గంగా నది పుట్టుకకు ప్రాచీన కథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. తాత ముత్తాతలకు పుణ్యలోకాలు ప్రాప్తించేలా చేసేందుకు భగీరథుడి చేసిన తపస్సుకు మెచ్చి గంగానదిని ప్రసాదిస్తాడు బ్రహ్మ. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టంచేస్తాడు. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉండటంతో భగీరథుడి పూజలకు మెచ్చి గంగను నెత్తినెక్కించుకోడానికి ఒప్పుకుంటాడు ముక్కంటి. ఈ విధంగా దివి నుంచి శివుడి జటాఝూటాల్లోకి చేరి భూమికి దిగివస్తుంది గంగమ్మ.


హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. మధ్యలో జాహ్ను మహర్షి ఆశ్రమాన్ని తాకడంతో ఆ మహర్షి ఆగ్రహాంతో ఊగిపోతాడు. గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందిఖానా నుంచి విడుదల చేయమని అంతా వేడుకుంటారు. లోకకల్యాణార్థం మహర్షి సరేనంటాడు. తన చెవిలోంచి బయటికి వదిలేస్తాడు. ఎత్తుపల్లాల్ని దాటుతూ… ఎగుడుదిగుడుల్ని అధిగమిస్తూ… అపుడపుడూ ఉధృతంగా… అక్కడక్కడ మందగమనంతో… ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది గంగ. విష్ణు పాదాల నుంచి మొదలై.. శివుడి శిరుస్సుపై వాలి.. భువికి చేరిన గంగను దేవతలా ఆరాధిస్తారు హిందువులు. అందుకే గంగానది జీవనది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat