అయ్యప్ప సర్వస్వం - 10

P Madhav Kumar


*సద్గురువు ఎవరు ? వారినెలా సేవించాలి ?*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


శ్రోత్రియుడు బ్రహ్మనిష్టుడైనవాడు సద్గురువుగా సేవింప దగినవారని సంప్రదాయం చెబుతున్నది. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరంబ్రహ్మ - అని చెప్పి మన ఋషి సంప్రదాయం మరల సద్గురువునెందుకు చెప్పవలసి వచ్చింది. సత్ అనే ఉపసర్గకు మంచి అనే అర్థాన్ని చెప్పడంలో ఆంతర్యమేమిటి ? గురువుల్లో చెడ్డవాళ్ళుంటారా ? చెడుబుద్ధి కలవాడు గురువెలా కాగలడు ? అనే సందేహాలు సగటు మనిషికి కలగడం సహజం. మన సంప్రదాయంలో గురువున కున్నంత ఉన్నతమైన స్థానం త్రిమూర్తులకు కూడా లేదు. వారు కూడా గురువులో ఏకాంశమే. గురురాత్మా గురుర్జీవో గురోరన్యన్నవిద్యతే - జీవాత్మ పరతత్వములు రెండును గురుస్వరూపములే. గురువుకన్నా భిన్నమైనది పొందదగినది సేవింపదగిన విషయము వేరొకటి లేనే లేదంటుంది శాస్త్రం.


*భవమూల వినాశాయ అష్టపాశ నివృత్తయే గురుపాదాంభసి స్నానం తత్త్వజ్ఞః కురుతే సదా ॥*


ఇది మంత్రశాస్త్ర రహస్యం. తత్త్వజ్ఞుడైన సాధకుడు గురుపాదుకలు సహస్రారంపై స్మరిస్తూ అచ్చటినుండి జాలువారిన అమృతవర్షణముచే భవ మూలముల నుండి అష్టవిధ పాశబంధముల నుండి విముక్తుడై శివో - హం సో - హం అనే సమాధిని పొంది బ్రహ్మీభూతుడౌతాడని భావం.


*గురుపాదోదకం పీత్వా గురోరుచ్ఛిష్టభోజనం గురుమూర్తేః సదాధ్యానం గురుమంత్రం సదా జపేత్*


*ఈ సాధనకు 'మహేచ్ఛ' అని పేరు.*


1. గురుపాదుకల నభిషేకించి ఆ తీర్థాన్ని సేవించాలి.


2. గురువునకు నివేదించిన తరువాతనే దేనినైనా భుజించాలి.


3. గురుమూర్తిని సదా ధ్యానించాలి. లేదా


4. గురుమంత్రాన్ని (గురూపదిష్టమైన మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించాలి. ఇది గురువ్రతం. ఈ విధమైన మహేచ్ఛలో భాగంగానే స్థానాంగభావాత్మశుశ్రూషలని చతుర్విధ గురుశుశ్రూషా ప్రకారాలను కూడా కైవల్య నవనీతమనే గ్రంథం వివరించింది. వాని వివరణ ప్రస్తుతమప్రస్తుతము. ఇంతటి మహోన్నతమైన ఉపాస్యమైన అనగా ఉపాసింపదగిన గురుమూర్తిని ఎలా గుర్తించాలి ? అతని స్వరూప స్వభావములు ఎలా ఉంటాయి అనే విషయాలను కొద్దిగా వివరించుకుందాం.


*సద్గురువును గుర్తించడమెలా ?* :- ఈ యుగంలో కలిప్రభావం వల్ల అర్హతలున్నా లేకున్నా చాలామంది దండక మండలాలు కాషాయం ధరించో , పెద్ద పెద్ద బొట్లు రుద్రాక్షలు , స్పటికమాలలు , పట్టు బట్టలు ధరించి ఆడంబరపూర్ణమైన వేషధారణతోనో గురుమూర్తులుగా తయారవుతున్నారు. ఆస్తులు సంపాదించి ఆశ్రమాలు , పీఠాలు నెలకొల్పి గొప్ప పీఠాధిపతులుగా , చలామణీ అయిపోతున్నారు. కొందరు భజనపరులు వారిచుట్టూ చేరి , వారిని జగద్గురువులుగా ముద్ర వేయడానిక్కూడా వెనుకాడకుండా వారిని సర్వలోక శరణ్యులుగా జగద్గురువులుగా ప్రచారం చేసేస్తున్నారు. ప్రచారం పెరిగే కొద్దీ శిష్యుల సంఖ్య వేలలో లక్షలలో పెరుగుతున్నది. దానితో పాటుగా ఆదాయం కూడా పెరుగుతున్నది. సద్గురువును సేవించిన ప్రతి శిష్యునకు ఇక్కడే ఈ లోకంలోనే ఆయన అనుగ్రహం వల్ల సిద్ధి లభించి తీరుతుంది. అది శివశాసనం ! దానికి తిరుగులేదు.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat