శ్రీదేవీభాగవతము - 12*

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 8*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః*

*లలితా సహస్రనామ శ్లోకం - 12*

*అనాకలితసాదృశ్య చుబుక శ్రీవిరాజితా!*
*కామేశబద్ధమాంగల్య సూత్రశోభితకంధరా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

చదువు పూర్తిచేసుకున్న శుకుడు గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురువెళ్ళి ప్రేమగా కౌగిలించుకుని శిరస్సు మూర్కొన్నాడు. కుశలం అడిగి చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయాడు. అందమైన ఒక ముని కన్యను చూసి శుకుడికి వివాహం చెయ్యాలనుకొన్నాడు.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️

🙏 *శుక-వ్యాస సంవాదం* 🌈

నాయనా! చదువులన్నీ పూర్తి చేశావు. చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు. దేవతలనూ పితృదేవతలనూ అర్చించు. మనుమణ్ణి బహూకరించి నన్ను బుణ విముక్తుణి చెయ్యి. *"అపుత్రస్య గతిర్నాస్తి"* అన్నారు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించావు.

వ్యాసుడు ఇలా తనలోతానుగా మాట్లాడేస్తున్నాడు. శుకుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు.

తండ్రీ! మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు ధర్మజ్ఞులు. తత్త్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుణి. ఆజ్ఞాపించండి. చేస్తాను - అన్నాడు.

తనయా! నీకోసమని నూరేళ్ళు తపన్సు చేశాను. ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యౌవనంలో ఉన్నావు. సుఖాలు అనుభవించు.

తండ్రీ! అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదయినా ఉన్నదా? ప్రతి సుఖంలోనూ దుఃఖస్పర్శ తప్పదు గదా! మరి నీవంటి ప్రాజ్జులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరుగా !

*కిం సుఖం మానుషే లోకే బ్రూహి తాత నిరామయమ్‌!*
*దుఃఖవిద్దం సుఖం ప్రాజ్ఞ న వధంతి సుఖం కిల!*

పోనీ, నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడకి వశవర్తిని కావలసిందేగా! పరతంత్రుడికి అందునా స్రీవిజితుడికి సుఖం ఏమిటి? *ఇనుప సంకెళ్ళలోనో, కొయ్య బోనుల్లోనో తగుల్కొన్నవాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో గానీ దారపుత్రరూపమైన సంసారబంధంలో ఇరుక్కొన్నవాడు ఎప్పటికీ బయటపడలేడు.* మలమూత్ర సంభూతమై మలమూత్ర భరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ధి. (గర్భవాసం, మలమూత్రస్పర్శ లేకుండా అరణి నుంచి పుట్టినవాడు). నాకు యోని విషయకమైన కోరికలు ఎలా ఉంటాయి? ఎందుకు ఉంటాయి? అంతే కాదు తండ్రీ! నాకు మరో జన్మ అంటూ ఉంటే, అప్పుడు కూడా అయోనిజుడుగానే పుట్టాలనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు!

వ్యాసమహర్షీ ! వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి - బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసారసముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని అవిద్య (మాయ) ఆవరించింది. నన్నెలా తరింపజేస్తాడు చెప్పు. రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు, మోక్షార్ధినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వట్టి విడంబన. నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికే వచ్చాను.

సంసారసర్పమంటే నాకు చచ్చే భయం. తత్త్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలుపెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు. కానీ మూఢులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్తాలు చదివినవారు సంసారలంపటులు అయ్యారంటే వారికన్నా మూర్భులుండరు. వాళ్ళకన్నా కుక్కలూ, గుర్రాలూ, పందులూ నయం. దుర్లభమైన మానవజన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన వేదశాస్తాలను అధ్యయనం చేసి, వచ్చివచ్చీ సంసారంలో పడ్డాడంటే వాణ్ణి ఎవడు రక్షిస్తాడు? వాడికింక ముక్తి ఉంటుందా? అటువంటి వాణ్ణి పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయమూ ఆశ్చర్యమూ ఉందా ? నా దృష్టిలో, ఈ సంసారబంధంలో ఇరుక్కోనివాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్రపారంగతుడు. భవబంధాలను విడిపించుకోడానికి పనికిరాని చదువు చదువేకాదు. దానికోసం శ్రమపడటం వృథా.

గృహస్థాశ్రమం గృహస్థాశ్రమం అంటున్నారే ఈ *గృహ* శబ్దానికి అర్ధం ఏమిటి? *"గృహ్ణాతి ఇతి గృహమ్‌.* పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనక గృహం. అదొక చెరసాల. అందులో సుఖం ఏమిటి? తండ్రీ! అదంటేనే నాకు భయం.

*గృహ్ణాతి పురుషం యస్మాత్‌ గృహం తేన ప్రక్తీర్తితమ్‌!*
*క్వ సుఖం బంధనాగారే తేన భీతో౬స్మ్యహం పితః!!*

పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవజన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తెలిసి తగుల్కొంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా! ఎంత మందమతులోకదా!

శుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వెయ్యడం వ్యాసుడి వంతు అయ్యింది. గంభీరంగా బదులు పలికాడు.

పుత్రకా! గృహం బంధనాగారం కాదయ్యా. అది బంధన కారణం కూడా కాదు. మనస్సు అన్నింటికీ కారణం. అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండీ మోక్షాన్ని పొందవచ్చు.

*న గృహం బంధనాగారం బంధనే న చ కారణమ్‌!*
*మనసా యో వినిర్ముక్తో గృహస్తో౬పి విముచ్యతే!*

న్యాయబద్ధంగా ధనం ఆర్టించి, వేదోక్తవిధులను ఆచరిస్తూ సత్యవాగ్నియమం పాటిస్తూ శుచిగా జీవించేట్టయితే గృహస్టుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి - మూడు ఆశ్రమాలవారూ మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుణ్ణే ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాదికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాలవారికి
మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకీ ఉత్తమోత్తమం. అంతకుమించిన ధర్మంలేదు. అందుకే వసిష్టుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేదమార్గంలో పయనించే గృహస్థులకు న్వర్గమూ మోక్షమూ ఉత్తమజన్మ - ఏది కోరుకొంటే అది లభిస్తుంది.

బిడ్డా! ధర్మవేత్తలు ఒకమాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైని వానప్రస్థ సన్యాసాదులు. అంతేగానీ దుముకుళ్ళు చెల్లవు. అందుచేత గార్హపత్యాగ్నిని సముపాసించు. దేవతలనూ పితృదేవతలనూ మనుష్యులనూ ఆరాధనలతో సంతృప్తిపరచు. పుత్రుణ్గి పొంది అతణ్గి గృహస్థుని చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తిచేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు.

ఇంద్రియాలున్నాయే ఇవ్వి అవ్వడానికి అయిదేకానీ గొప్ప మాదకద్రవ్యాలు. అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బందిపెడతాయి.

*ఇంద్రియాణి మహాభాగ మాదకాని సునిశ్చితమ్‌!*
*అదారస్య దురంతాని పంచైవ మనసా సహ!!*

అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియజయంకోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు, మూడువేల సంవత్సరాలపాటు నిరాహారుడై తపస్సుచేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావమీద నదిని దాటుతూ దాశరాజు కూతుర్ని చేపలకంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదన బాణ పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సాంత కూతురునే చూసి మోహపడ్డాడు, రుద్రుడు వారించాడనుకో. కాబట్టి నువ్వుకూడా వివాహం చేసుకో. కులమూ రూపమూ ఉన్న కన్యను పెళ్ళాడు. వేదమార్గంలో పయనించు.
*(అధ్యాయం - 14, శ్లోకాలు - 70)*

వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసినా శుకుడిలో మార్పురాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు -

తండ్రీ! నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు. నేనుమాత్రం గృహాస్థాశ్రమం స్వీకరించను గాక స్వీకరించను. అది దుఃఖకరం. వలలాంటిది. నిత్యబంధనం. అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చెయ్యకపోతే (నిర్ధనుడుగా ఉండిపోతే) తనవాళ్ళే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే. త్రిలోకాధిపతి. ఆ పీఠాన్నీ ఆ సంపదనూ కాపాడుకోడానికి అతడు పడే పాట్లు ఇన్నీ అన్నీనా! ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో.

సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడూ దానవులతో జగడాలూ యుద్దాలూను. బ్రహ్మదేవుడి పరిస్థితీ ఇంతేనాయె. తపస్వులైన రాక్షసులకి వరాలు ఇస్తే ఒకతంటా, ఇవ్వకపోతే ఒక తంటా. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు. అందుకే ఈ ముగ్గురూ ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా?

*కదాచిన్న సుఖీ శేతే ధనవానపి లోలుపః!*
*నిర్ధనస్తు కథం తాత సుఖం ప్రాప్నోతి మానవః!!*

అన్నీ తెలిసీ ఓ మహర్షీ ! నన్ను - నీ కుమారుణ్ణి - ఈ సంసారకూపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకిది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్నీ దుఃఖాలేనాయె. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం. మలమూత్రాలు నిండిన గర్భవాసం చెయ్యడం పునర్దుఃఖం.

వీటన్నిటికన్నామించిన దుఃఖం మరొకటి ఉంది. అది తృష్టాలోభదుఃఖం. సంసార పోషణ కోసం ధనసహాయం కోరి పరులదగ్గర చెయ్యిచాచడం మరణాన్ని మించిన దుఃఖం. ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బొత్తిగా లేనివారు. వారి బతుకు దినదిన మరణం- రోజూ చావే. ఇన్ని శాస్త్రాలూ చదివి మహావిద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించడం. ఇది ఎంత చావు! ఇదంతా ఎందుకుట? సంసార పోషణకోసం. సంసారమే లేకపోతే ఒక్క పొట్ట నింపుకోడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు గదా! హాయిగా అడవుల్లో పళ్ళూ నీళ్ళతో పొట్ట నింపుకోవచ్చుగా. అందుచేత మరొకసారి మనవిచేస్తున్నాను. సంసారానికి నేను సర్వాత్మనా విముఖుణ్ధి.

యోగశాస్త్రం నేర్పు.  జ్ఞానశాస్తం సుఖప్రదం. కర్మకాండ అంటేమాత్రం నాకు సుతరామూ గిట్టదు. జన్మదాతా! దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్తమాన ప్రారబ్ధ సంచితకర్మలు మూడూ నశించే మార్గం తెలియజెయ్యి. అంతేగానీ నారీబాహుబంధాల్లోకి నన్ను నెట్టకు. *జలజాక్షి అంటే అచ్చం జలగే.* తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. హావభావ చేష్టలకు మూర్చితుడై మగాడు కానుకోలేడు. భోగాలపేర ధనాన్నీ శక్తినీ, కుటిల సంభాషణలతో మనస్సునీ, క్రమంగా సర్వస్వమూ హరిస్తుంది కాంతామణి.

అంతకు మించిన దొంగను సృష్టిలో మరిచూడలేం. నిద్రాసుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు.

*భోగైర్వీర్యం ధనం పూర్ణం మనః కుటిలభాషణైః!*
*కాంతా హరతి సర్వస్వం కః స్తేనస్తాదృశో౬పరః!!*

శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతూంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఎలా ఒప్పించాలో అర్ధం కాలేదు. కళ్ళవెంట నీళ్ళు బొటబొటా కారాయి. మనస్సు బడలిపోయింది. శరీరంలో వొణుకు.

శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విపార్చి చూశాడు. ఆలోచనలో పడ్డాడు.

అహో! మాయాబలం ఎంతటిది! విష్ణ్వంశసంభూతుడై వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుణ్ణి కూడా మోహపరుస్తోందంటే దాని శక్తి అమేయం, అజేయం. 

ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావడం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావపగిలిన బేహారిలా ఉన్నాడు. పామరుడిలా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు? నేనెవరు? ఎలా ఇక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్రవాసన (బంధం) ఏమిటి? మాయావులను కూడా మాయచేసే మహామాయ ఇది. వ్యాసుడే ఇలా రోదిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాటే.

ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనస్సులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు.

దీనుడై శోకార్ణవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు.

పరాశరాత్మజా! మహానుభావా! అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడవై శోకిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. సరే ఇవ్వేళ నీకు నేను పుత్రుణ్శి. పూర్వజన్మల్లో నేనెవడిని? నువ్వు ఎవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో. బుద్ధిని మేల్కొల్పు, మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తనంతతానే తొలగిపోతుంది.

ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే కానీ పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చెయ్యాలి. అందగాడు గదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రాణసుఖం కావాలంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. స్రీసుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలూ పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమకాదూ! నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం ఏమీలేదు. *అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సాంత కొడుకునే సమర్పించాడు. తెలుసుగా!*

సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వసుఖాలకూ సాధనం ధనమే. కొడుకు చేసేది ఏమీలేదు. నువ్వు దైవజ్ఞుడివి. మహామతివి. నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాసభయం తొలగించు. సంసార వాసనాజాలంలో బద్ధుడనయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగామిని. నీవంటివారు చెబితే వింటుంది.

వ్యాసుడు రవ్వంత తేరుకున్నాడు. సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూశాడు. మెల్లగా బదులుపలికాడు,.

అరణీగర్భసంభవా! నేను దేవీభాగవతం రచించాను. అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథమేమీ కాదు. కేవలం పన్నెండు స్కంధాలు. కానీ అన్ని పురాణాలకూ అది తలమానికం. దాన్ని వింటే చాలు సదసద్వివేకం కలుగుతుంది.

వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుండగా జగజ్జనని - ఆది పరాశక్తి శోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే. నాకన్నా సనాతనం లేదు - అంది.

*శ్లోకార్జేన తయా ప్రోక్తం భగవత్యాఖిలార్థదం!*
*సర్వం ఖల్విదమేవాహం నాన్యదస్తి సనాతనమ్!!*

ఈ మాట ఇంతకు ముందు విన్నదే. విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు? గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు? స్రీయా, పురుషుడా, నపుంనకుడా? అని ఆలోచనలోపడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తున్నాడు వటపత్రశాయి.

అప్పుడు  మహాదేవి శాంతస్వరూపంతో ప్రత్యక్షమయ్యింది. నాల్గు చేతులలో శంఖ-చక్ర-గదా-పద్మాలు వహించి, దివ్యాంబరాలూ దివ్యభూషణాలూ ధరించి, మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తెలు ఉన్నారు. రతి-భూతి-బుద్ధి-
మతి-కీర్తి-స్మృతి-ధృతి-శ్రద్ధా-మేధా-స్వధా-స్వాహా-క్షుధా-నిద్రా-దయా-గతి-తుప్టి- పుష్టి-క్షమా- లజ్జా-జృంభా- తంద్రా శక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణభూషణాలు ధగధగలాడుతున్నాయి. మెడలలో ముత్యాల దండలూ మందారమాలికలూ ప్రకాశిస్తున్నాయి.

బాలముకుందుడు అందరినీ చూశాడు. ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎవరు? ఎక్కడినుంచి వచ్చారు? నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? శిశువును చేసింది ఎవరు? అసలు ఈ మర్రి ఆకు (వటపత్రం) ఎక్కడనుంచి వచ్చింది? ఈవిడ నా జననియా? లేదా మరేదయినా మాయయా? ఇప్పుడు దర్శనం ఎందుకిచ్చినట్టు? నేనిక్కడ ఉండవచ్చునా, ఎటయినా వైదొలగాలా? ఏమి మాట్టాడాలి? బాలుణ్లి కనక మౌనంగా ఉండిపోనా? సందేహాలు ముసురుకున్నాయి

*(అధ్యాయం - 75, శ్లోకాలు - 67)*

మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణూ! ఏమిటలా విస్తుపోతున్నావు!

ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమవల్ల నన్ను మరిచిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ (నిరాకార). నువ్వూ నేనూ సాకారులం. నేను సాత్త్వికశక్తిని. గుర్తు తెచ్చుకో, నీ నాభికమలం నుంచి ప్రజాపతి (బ్రహ్మ) జన్మిస్తాడు. తపస్సుచేసి రాజసశక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్గోకాలనూ సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీశక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. గుర్తించు. నీ సాత్త్విక శక్తిని లక్ష్మిని. నీ వక్షస్థలం మీద నిత్యానపాయినిగా నివసిస్తాను. మధుసూదనా! స్వీకరించు - అంది.

శౌరి సంతోషించాడు. కానీ, దేవీ! ఒక సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్ధభాగం వినిపించింది. అది రహస్యం, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు - అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది.

పుండరీకాక్షా! అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి, నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు, నిరాకారయైన పరాశక్తిని ఎరగవు. అందుకని పరమగుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీమీద ప్రేమతో నీకోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం. *సూక్ష్మరూపంలో దేవీభాగవతం.* సకల శుభావహం. సర్వశాస్త్రసారం. మహావిద్యాప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్గోకాలలోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనక నీకు ఉపదేశించింది. మరిచిపోక ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండు.

సుపుత్రా! శుకా! అప్పటినుంచీ చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభికమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షసభయం వచ్చిపడింది. హరిని శరణువేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటభులను ఇద్దరినీ సంహరించి, మళ్ళీ మునుపటిలాగానే ఆ శ్లోకార్థభాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏమిటి జపిస్తున్నావు- నువ్వే అందరికంటే అధికుడివిగదా అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి – త్రిమూర్తులకూ మూలకారణమైన పరాశక్తి తత్త్వాన్ని తెలియజెప్పి, ఆవిడ శ్లోకార్ధభాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానన్నాడు.

*ఈ మంత్రమే దేవీభాగవతం.* ద్వాపరయుగంలో దీనికి విపులీకరణ గ్రంథరూపంలో జరుగుతుంది. నువ్వుకూడా జపించమని ఉపదేశించాడు. అటుతర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశించాడు. నేను దాన్ని పన్నెండు స్కంధాల గ్రంథంగా విపులీకరించాను.

పుత్రకా! వేదసమ్మితమైన ఈ భాగవతపురాణ మంతా దేవీ చరిత్ర, ఇది తత్త్వశాస్త్రం. ఇది ధర్మశాస్త్రం. బ్రహ్మవిద్యానిధానం. సంసారార్ణవతారకం. అజ్ఞాన నాశకం. జ్ఞానప్రకాశకం. శాంతి సుఖదాయకం. దీర్ఘాయుష్యకరం. చదివేవారికీ వినేవారికీ శుభప్రదం. ఇదిగో స్వీకరించు. ఒకసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నీతోపాటు నా శిష్యుడు సూతుడు కూడా (రోమహర్షణ సుతుడు) దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. పద్ధెనిమిదివేల శ్లోకాల గ్రంథం - అని చెప్పి వ్యాసుడు తన దేవీభాగవతాన్ని శుకుడికి అందించాడు.

శౌనకాది మహామునులారా! ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీభాగవతం చదివాను. సరే అది అలా ఉంచండి.

శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు. మరింత వికలమనస్కుడు అయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావమూ లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలూ కాదు ఇటు ఉపవాసాలూ కాదు. దేనిమీదా అతడికి ఆసక్తి నిలవడంలేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు.

ఒకరోజున పిలిచి విషయం కనుక్కున్నాడు.

నాయనా! ఏమిటి ఇది? ఇలా అయిపోతున్నావ్‌? ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావ్‌. డబ్బు పోగొట్టుకున్నవాడిలాగా ఏదో ధ్యాసలో ఉంటున్నావ్‌. నీ బాధ ఏమిటో చెప్పు. నేనున్నానుగా, కన్నతండ్రిని. తీరుస్తాను. మనస్సులో ఏదో పెట్టుకున్నట్టున్నావ్‌. తొలగించుకో. సుఖపడు. దుఃఖాన్ని వదిలించుకో. శాస్తోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు.

నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే - బయలుదేరు. మిథిలానగరానికి వెళ్ళు. అక్కడ జనకమహారాజుగారు ఉన్నారు. నీ మోహాన్నీ నీ సందేహాల్నీ తొలగిస్తాడు. సమర్ధుడు. సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని. జీవన్ముక్తుడు. అతి శాంతస్వభావుడు. స్వయంగా మహాయోగి. యోగప్రియుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమధర్మాలూ వగైరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో. అతడు చెబుతాడు,

వ్యాసుడిమాట పూర్తి అయ్యిందోలేదో తరుము కూతలాగా శుకుడు అందుకున్నాడు.

మహాత్మా! నువ్వు చెప్పేది అంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది. మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు. బ్రహ్మజ్ఞాని అంటున్నావు. మళ్ళీ, హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. ఇది ఎలా కుదురుతుంది? అసంభవం. గొడ్రాలికి కొడుకు పుట్టాడు అన్నట్టుంది. అయినా నువ్వు చెబుతున్నావు కనక నమ్ముతున్నాను, ఆ విడ్డూరం ఏదో చూసి రావలసిందే. మిథిలకు వెడతాను.
సంసారంలో తామరాకు మీద నీటిబొట్టులా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను.

*మోక్షం అంటే ఏమిటి,  భుక్తం అభుక్తం ఎలా అవుతుంది.  కృతం అకృతం ఎలా అవుతుంది.  ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి,  తల్లి . తండ్రి, భార్య-సోదరి-వేశ్య ఈ భేదాభేదాలు ఎలా నశిస్తాయి వీటినుంచి విడుమర (విముక్తి) ఎలాగ, రకరకాల రుచులూ, శీతోష్టాలూ,  సుఖదుఃఖాలూ,  వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది, ముక్తత్వలక్షణం ఏమిటి, రాజ్యవ్యవహారాలన్నీ చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు, ఒక దొంగనూ ఒక తాపసినీ సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు, అసమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలాగ – ఇవన్నీ తీర్చుకోవలసిన సందేహాలు. జీవన్ముక్తుణి నేనింతవరకూ కనీవినీ ఎరగను, సంసారంలో ఉండి ముక్తుడుగా గడపడం - ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది. కనీసం ఈ సందేహ నివృత్తికోసమైనా మిథిలకు వెడతాను

*(అధ్యాయం - 6, శ్లోకాలు - 67)*

*(రేపు శుకమహర్షి మిథిలాయాత్ర)*

*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది.

🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat