*శ్రీదేవీభాగవతము - 11*

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 7*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః*

*లలితా సహస్రనామ శ్లోకం - 11*

*నిజసల్లాపమాధుర్య వినిర్భర్సితకచ్ఛపీ!*
*మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

*తారాశశాంక వృత్తాంతం -  బుధోత్పత్తి కథ*  చదువుకున్నాం.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️

🌈 *ఊర్వశీ పురూరవ వృత్తాంతం* 🌈

శౌనకాది మహామునులారా! ఈ బుధుడికి *ఇళ* అనే స్త్రీతో సంగమం వల్ల, మన ప్రస్తావనకు వచ్చిన *పురూరవుడు* జన్మించాడు. అతడు మహాదాత, యజ్ఞవిధాత. ఆ వృత్తాంతం చెబుతాను. అద్భుతావహంగా ఉంటుంది. వినండి.

అనగా అనగా ఒక రాజు. అతడిపేరు *సుద్యుమ్నుడు.* అతడు ఒక రోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు. మందీమార్చలం వెంటవెళ్ళింది. రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు. బాగా అలిసిపోయాడు. అంతలోకీ - ఆ మేరుపర్వత సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది. మందారతరువులు. అశోకవృక్షాలు. *సాల-తాల-తమాల-చంపక-పనస- ఆమ్ర-నీప-మధూక-భూజాలు.* *మాధవీలతామండపాలు.* *దాడిమ-నారికేళ-కదళీ-ఫలభరిత భూమిజాతాలు.* *యూథికా-మాలతీ-కుందపుష్పవల్లీ పరిమళాలు.* తుమ్మెదల ఝంకారాలు. *హంస-కారండవ-కోకిల- శుక-శారికా కలకూజితాలు.* కీచకధ్వనులు (వెదురు పోదల్లో గాలి సవ్వడి). ఎవరో తీర్చి దిద్దినట్టున్న ఉద్యానవనం. సుద్యుమ్నుడు పరవశించిపోయాడు. సేవకులతోసహా ప్రవేశించాడు. ప్రవేశించడమే తడవుగా అందరూ ఆడవాళ్ళు అయిపోయారు. గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయింది. ఇదేమిటి భగవంతుడా అని లబోదిబోమన్నారు. ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటో ఎవ్వరికీ ఏమీ తెలియలేదు.

సుద్యుమ్నుడికి దుఃఖంతోపాటు సిగ్గు ముంచుకు వచ్చింది. ఏమి చెయ్యను? ఇంటికి ఎలా వెళ్ళేది? రాజ్యం ఎలా పరిపాలించడం? ప్రజలు ఏమనుకుంటారు? ఎవరు నన్ను మోసగించినట్టు? ఇలా అన్నీ ప్రశ్నలే. దేనికీ సమాధానం లేదు. మథనపడిపోయాడు.

సూతుడు చెబుతూంటే వింటున్న శౌానకాదులకూ అబ్బురమయ్యింది. అదేమిటి! పురుషుడు స్త్రీగా మారిపోవడమా? మగగుర్రం ఆడగుర్రం (బడబ) అయిపోవడమా! చాలా వింతగా ఉందే. సూతమహర్షీ ! ఇది ఆ ఉద్యానవన మాహాత్యమంటావా? అందులోకి ప్రవేశించి ఆ మహారాజు అసలు ఏం చేశాడు? వివరంగా చెప్పు మహానుభావా! - అన్నారు.

మునిపుంగవులారా ! మీ ఊహ నిజమే. అదంతా ఆ ఉద్యానవన మాహాత్మమే. అది చెబుతున్నాను. తెలుసుకోండి.

ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సనకసనందనాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు. వారి దివ్యతేజన్సుతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి. ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతం అనుభవిస్తున్నాడు. కామక్రీడా పరాయణులై ఉన్నారు. పార్వతి వంటిమీద నూలుపోగు లేదు. శివుడి ఒడిలో కూర్చుని పరవశిస్తోంది. సనకాదులను చూసి సిగ్గుతో వొణికిపోయింది. దిగ్గునలేచి చీర చుట్టుకుంది. వొణుకు తగ్గలేదు. స్థాణువై నిలబడిపోయింది.

బుషులు పొరపాటు గ్రహించారు. వెంటనే నిష్క్రమించారు. నరనారాయణాశ్రమానికి పరుగుతీశారు. శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు. ఈరోజునుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శాపం పెట్టాడు. అప్పటినుంచీ, తెలిసినవాళ్ళెవరూ ఆ వనంలోకి వెళ్ళరు. సుద్యుమ్నుడు ఇది తెలియక వెళ్ళాడు. స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతీ అంతే అయ్యింది.

స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం విడిచి ఇవతలికి వచ్చి అరణ్యంలోనే ఉండిపోయాడు, రాజ్యానికి వెళ్ళేందుకు మనసు ఒప్పలేదు. *ఇళ* అనేపేరుతో అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు. పరివారం చెలికత్తెలై సేవలు చేస్తున్నారు.

ఇలా ఉండగా ఒకరోజున - సోముడి కొడుకు బుధుడు యౌవనవంతుడై ఆ అడవికి వేటకు వచ్చాడు. *ఇళ* ను చూశాడు. కన్ను చెదిరింది. మోహితుడయ్యాడు. హావభావాలు ఆకర్షించాయి. *ఇళ* కూడా అలాగే స్పందించింది. బుధుణ్ణి పతిగా వరించింది. గాంధర్వరీతిని వివాహం చేసుకున్నారు. పుత్రుడు కలిగాడు. *పురూరవసుడని* నామకరణం చేశారు.

*ఇళ* కు ( *సుద్యుమ్నుడికి* ) మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చింది. ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది అనిపించింది. తమ కులగురువు వసిష్టుణ్ణి స్మరించింది. ఆయన వచ్చాడు. దుర్దశకు జాలిపడ్డాడు. శంకరుణ్ణి ప్రార్థించాడు. సుద్యుమ్నుడి స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు.

పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్యేమార్గంగా శివుడు వరం ప్రసాదించాడు. ఈ సుద్యుమ్నుడు ఇకనుంచి ఒకనెల పురుషుడుగా, ఒకనెల స్త్రీగా ఉంటాడన్నాడు.

ఈ మాత్రానికే సంబరపడ్డ సుద్యుమ్నుడు పురుషుడిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వసిష్టుడి అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు. స్రీరూపాన్ని పొందిన నెలనాళ్ళూ రాజమందిరం విడిచి బయటికి రావడంలేదు. పురుషరూపం నెల్లాళ్ళూ పరిపాలన చేస్తున్నాడు. నెలపాటు దర్శనం, నెలపాటు అదర్శనం ప్రజలకు ఇది నచ్చలేదు. అయినా, కాలం గడుస్తోంది. అది ఆగదుగదా!

పురూరవుడు యౌవనంలోకి అడుగుపెట్టాడు. వెంటనే (ఇళ) సుద్యుమ్నుడు రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు.

నారదుడు ఉపదేశించిన *నవాక్షర - దేవీమహామంత్రాన్ని* జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. భవసాగరతారిణి శివాదేవికి అనుగ్రహం కలిగింది. సగుణాకారంలో సింహారూఢయై ప్రత్యక్షం అయ్యింది. వారుణీపానమదమత్తగా ఝార్ణమాననయనాలతో దివ్యరూపంలో భయద మనోహరంగా ఉంది.

*సింహారూఢా స్థితా చాగ్రే దివ్యరూపా మనోరమా!*
*వారుణీపాన సమ్మత్తా మదాఘూర్ణితలోచనా!!*

*ఇళాకృత దేవీస్తుతి:*

ఇళాదేవి (సుద్యుమ్నుడు) భక్తిప్రపత్తులతో నమస్కరించి జగదంబికను స్తుతించింది.

*దివ్యం చ తే భగవతి ప్రథితం స్వరూపమ్‌*
*దృష్టం మయా సకలలోక హితానురూపమ్‌!*
*వందే త్వదంఘ్రికమలం సురసంఘసేవ్యమ్‌*
*కామప్రదం జనని చాపి విముక్తిదం చ!!*

జగన్మాతా! త్రిమూర్తులూ, దిక్పాలకులూ, దేవతలూ మహర్షులూ మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహవిభ్రాంతిలో పడిపోతూంటే ఇక మానవమాత్రుల మాట చెప్పాలా! సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నువ్వే. లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్త్వికరూపం మాత్రమే తెలుసు. సరస్వతీదేవిగా బ్రహ్మకు నీ రాజసరూపం మాత్రమే తెలుసు. పార్వతీదేవిగా శివుడికి నీ తామసీరూపం మాత్రమే తెలుసు.  కానీ నిర్గుణతత్త్వం ఎవరికీ తెలియదు.

*జానాతి విష్ణురమితద్యుతిరంబ సాక్షాత్‌*
*త్వాం సాత్త్వికీముదధిజాం సకలార్థదాం చ*
*కో రాజసీం, హర ఉమాం కిల తామసీం త్వామ్‌*
*వేదాంబికే! న తు పునః ఖలు నిర్గుణాం తామ్!!*

అమ్మా! ఇంత మందమతిని నేనెక్కడ, నీ అమేయ ప్రభావం ఎక్కడ! కరుణామయివి కనక ఈ సేవకుణ్జి ఇలా అనుగ్రహించావు.

లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాదకమలాలను అర్చిస్తుంటాడు. అశోకవృక్షంలా ఆ పురాణపురుషుడు నీ పాదతాడనంతో పులకించి పుష్పించాలని కోరుకుంటూంటాడు. సకలదేవనుతుడైన నీ భర్త కామార్తుడై నీపాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో త్వంకారం చేస్తుంటావు (తిరస్కరిస్తుంటావు. నువ్వు నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతుంటావని గానీ),

*వాంఛత్యహో హరిరశోక ఇవాతికామం*
*పాదాహతిం ప్రముదిత;ః పురుషః పురాణ:!*
*తం త్వంకరోషి రుషితా ప్రణతం చ పాదే*
*దృష్ట్వా పతిం సకలదేననుతం స్మరార్తమ్‌!!*

నువ్వు ఎప్పుడూ మేఘంలో మెరుపులా ఆ నీలమేఘశ్యాముని వక్షఃస్థలం మీదనే కాపురం ఉంటావు. అది నీకు విశాలమైన పర్యంకం. ఇందులో వింత ఏముంది? జగదీశ్వరుడే నీకు వాహనమాయె! నువ్వు కనక కోపించి మధువైరిని పరిత్యజిస్తే ఆ శక్తిహినుడికి నమస్కారం పెట్టేవాడు ఎవ్వడూ ఉండడు, లక్ష్మి వైదొలగితే ఏ పురుషుడి పనైనా ఇంతేకదా! లోకంలో చూడటంలేదూ! స్వజనమే విడిచిపెట్టేస్తారు. నిజానికి ఈ బ్రహ్మాదులు పురుషులు కారు. నీ పాదాలకు నమస్కరించే యువతులు. నువ్వే వాళ్ళను మగవాళ్ళను చేశావు. నువ్వు అనంతశక్తివి. ఏమని వర్ణించను, ఎలా వర్ణించను? నువ్వు వురుషుడివా, స్త్రీవా? సగుణవా, నిర్గుణవా? ఏమైనా కానీ, నేను మాత్రం నిరంతరం నీపట్ల భక్తినే కోరుకొంటున్నాను, శరణు వేడుకొంటున్నాను.

ఈ స్తోత్రానికి జగదంబిక సంతుష్ట అయ్యింది. సుద్యుమ్నుడికి సాయుజ్యం అనుగ్రహించింది.
మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమపదాన్ని ప్రసాదించింది.

*(అధ్యాయం - 122 శ్లోకాలు - 53)*

శౌనకాది మునీంద్రులారా! సుద్యుమ్నుడు దివంగతుడయ్యాక పురూరవుడు ప్రజానురంజకంగా రాజ్యం చేశాడు. అతడు అందగాడే కాదు మంచి గుణవంతుడు కూడా. సర్వధర్మాలూ తెలిసి, అందరూ మెచ్చుకునేట్టు, *ప్రతిష్టానం* రాజధానిగా పరిపాలన సాగించాడు. అతడి మంత్రశక్తి, ప్రభుశక్తి, ఉత్సాహశక్తి అమోఘం. ఉత్తమోత్తమం. చతురుపాయాలూ అతడికి అధీనాలు. వర్ణాశ్రమధర్మాలను కాపాడుతూ భూరిదక్షిణలతో యజ్ఞాలు చేస్తూ, అర్థులను సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడుగా పరాక్రమశాలిగా ముల్గోకాలలోనూ ప్రఖ్యాతి గడించాడు.

ఇతగాడి విశేషాలు ఆనోటా ఆనోటా ఊర్వశికి తెలిశాయి. మనసు ముచ్చటపడింది. బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురూరవుణ్ణి వరించింది. అతడూ ఆమె రూప యౌవన సౌందర్యాదులకు ముచ్చటపడ్డాడు. పరస్పరం ముచ్చటించుకున్నారు.

ఊర్వశి మూడు నియమాలు పెట్టింది. *ఒకటి - నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను.* అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు.
*రెండు - సంభోగసమయంలో తప్ప నువ్వు నాకెప్పుడూ దిగంబరంగా కనపడకూడదు.*
*మూడు - నాకు రెండు పెంపుడు పొట్టేలు పిల్లలు (ఉరణకాలు) ఉన్నాయి. వాటిని నువ్వు సంరక్షించాలి. అవి నాకు ప్రాణం.*
మాట ఇమ్మంది. తప్పావో నేను వెళ్ళిపోయానన్నమాటే అంది. పురూరవుడు అంగీకరించాడు.

పురారవసుడు తన రాజధర్మ - యజ్ఞ కర్మలను అన్నింటినీ వదిలేశాడు. పూర్తిగా ఊర్వశికి వివశుడైపోయాడు. ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి మరింకేమీ లేదు. ఆమెను విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు. సంవత్సరాలు నెలలుగా, నెలలు రోజులుగా, రోజులు పూటలుగా, పూటలు గంటలుగా, గంటలు నిమిషాలుగా, నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి ఒకరోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది. ఆమె లేనిన్వర్గం బోసిపోయినట్టనిపించింది. గంధర్వులను పిలిచి పురమాయించాడు. వెళ్ళి గొర్రెపిల్లలను అపహరించి తెండి. పురూరవుడు మాట తప్పినవాడు అవుతాడు కనక ఊర్వశి వదిలేసి వస్తుంది - త్వరగా వెళ్ళిరండి అని పంపించాడు.

బాగా చీకటిపడ్డాక గంధర్వులు అలాగే వెళ్ళి గొర్రెలను దొంగిలిస్తూంటే అవి కుయ్యిపెట్టాయి. వాటి అరుపులు ఊర్వశీ పురూరవులకు వినిపించాయి. తన రక్తం పంచుకుపుట్టిన పసికందుల ఆక్రందనంలా వినిపించింది ఊర్వశికి. ఉలిక్కిపడింది.

రాజా! అదిగో నా గొర్రెపిల్లలను ఎవరో అపహరించుకుపోతున్నారు. అవ్వి నాకు ప్రాణాలతో సమానమనీ, కన్న బిడ్డలకంటే ఎక్కువ అనీ చెప్పానా? నువ్వే సంరక్షించాలి అన్నానా? వెళ్ళు వాటిని కాపాడు. ఆడదానిలాగా ఇంకా ఇలా చూస్తూ కూచున్నావేమిటి? మగాడివేనా? అయ్యో నారాత! నపుంసకుడు దొరికాడు నాకు - అంటూ దుయ్యబట్టింది, విలపించింది.

పురూరవుడు ఉన్నపళాన అలా నగ్నంగానే ఆ కారుచీకటిలో బయలుదేరాడు. వెంటనే గంధర్వులు రెండుమెరుపులు మెరిపించారు. అతడు నగ్నంగా కనిపించాడు. ఊర్వశి చూసింది, గంధర్వులు ఆ గొర్రెపిల్లలను అల్లంత దూరాన వదిలి వెళ్ళిపోయారు. పురూరవుడు వాటిని తీసుకుని శయన మందిరానికి తిరిగి వచ్చాడు. ఊర్వశి లేదు. సమయభంగం (ఒడంబడిక తప్పడం) అయ్యింది కనక వెళ్ళిపోయింది.

పురూరవుడు ఎంతగానో విలపించాడు. అంతటా అన్వేషించాడు. కామమోహితుడై దేశదేశాలూ తిరిగాడు. భూగోళం గాలించాడు. ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది. ముఖం విప్పారింది. కన్నులు మెరిశాయి.

ప్రియా, ప్రియా! ఆగు ఆగు. నన్ను విడిచిపోవడం దారుణం. ఏమి అపరాధం చేశానని, తనువూ మనసూ అన్నీ నీకే, నీ ఒక్కతెకే సమర్పించానే. నీకే దాసుడుగా మెలిగానే. ఇంతదూరం తీసుకువచ్చావు. ఇటు చూడు. దయచేసి అనుగ్రహించు. నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను. కాకులూ కుక్కలూ పొడుచుకుతింటే తిననీ.

మతి చలించినవాడిలా పురూరవుడు విలపిస్తున్నాడు. దయనీయంగా రోదిస్తున్నాడు. ఊర్వశి వెనుదిరిగి చూసింది. బాగా అలిసిపోయాడు. నీరసంగా ఉన్నాడు.

నృపశార్జూలా! ఎంత అమాయకుడివయ్యా! లోకజ్ఞానం బొత్తిగా లేదనుకుంటాను! ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ? స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సఖ్యం ఉంటుందా! తోడేళ్ళు. దొంగలు. నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతగా విశ్వసించకూడదు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. హాయిగా రాజ్యం ఏలుకో. సుఖాలు అనుభవించు. నీ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలెయ్‌,

ఊర్వశి చాలా స్పష్టంగా తత్త్వోపదేశం చేసింది. అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదు. మోహం వదలలేదు. ఒక స్వైరిణి (స్వేచ్చగా తిరిగేది) స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొనితెచ్చుకున్నాడు. అలా విలపిస్తూనే ఉన్నాడు.

మహామునులారా! ఇదీ ఊర్వశీ పురూరవులగాథ. వేదంలో మరింత విపులంగా ఉంది. నేను సంక్షేపంగా చెప్పాను.
*(అధ్యాయం - 13, శ్లోకాలు - ౩4)*

తన సమీపానికి వచ్చిన *ఘృతాచి* ని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు.

*ఘృతాచి* కూడా ఇంకొంచెం చనువు తీసుకోడానికి జంకింది. శపిస్తాడేమోనని భయపడింది. చిలకరూపం ధరించింది. అటూ ఇటూ గెంతింది. మరింత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు మరింతగా కలవరపడ్డాడు. తనువంతా మన్మథవివశం అయ్యింది. సర్వాంగాలూ స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపించింది. అయినా గొప్ప ధైర్యంతో మనస్సును చిక్కబట్టుకున్నాడు.
నిలువరించుకోలేకపోతున్నాడు. గుండె జారిపోతోంది. ఘృతాచి ఘృతాచి అంటోంది. అరణిలో అగ్నిమథనం జరుగుతోంది. వేగం పెరిగింది. వీర్య్శస్టలనమయ్యింది. అరణిలో పడింది. చిలకడం కొనసాగింది.

అరణినుంచి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తులా వ్యాసుడే. హవ్యంతో భగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు. వ్యాసుడు నివ్వెరపోయాడు. ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు. శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అరణీగర్భ సంభూతుడు, తేజోరూపి పుత్రుడు జన్మించాడని సంబరపడ్డాడు. మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు. గంగా జలంతో స్నానం చేయించాడు. జాతకర్మలు నిర్వహించాడు. ఆకాశంనుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధర నారద తుంబురులు తండ్రీకొడుకులను స్తుతించారు. అతడి కోసం కృష్ణాజినమూ దండకమండలువులూ ఆకాశం నుంచి ఆవిర్భవించాయి.

*అంతరిక్షాత్పపాతోర్వ్యాం దండః కృష్ణాజినం శుభమ్‌!*
*కమండలుస్తథా దివ్య: శుకస్యార్ధే ద్విజోత్తమాః!!*

వెంటవెంటనే ఆ బాలుడు మహాతేజస్విగా ఎదిగాడు. స్త్రియంగా ఉపనయనం జరిగింది. తండ్రికిలాగానే ఇతడికీ పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్థం అయ్యాయి.

*శుకీరూపం* ధరించిన ఘృతాచిని చూడటంవల్ల జన్మించాడు కనక సుతుడికి *శుకుడు* అని నామకరణం చేశాడు వ్యాసుడు. బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకలవేదాలనూ, వేదాంగాలనూ,  శాస్త్రాలనూ సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్దతిలో అభ్యసించాడు శుకుడు. చదువు పూర్తి అయ్యింది. గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురువెళ్ళి ప్రేమగా కౌగిలించుకుని శిరస్సు మూర్కొన్నాడు. కుశలం అడిగి చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయాడు. అందమైన ఒక ముని కన్యను చూసి శుకుడికి వివాహం చెయ్యాలనుకొన్నాడు.

*( రేపు శుక-వ్యాస సంవాదం)*

*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!


*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat