*ప్రథమ స్కంధము - 6*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 10*
*శుధ్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా!*
*కర్పూర వీటికామోద సమాకర్షద్దింగంతరా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
👉 *నిన్నటి భాగములో....*
*మహానుభావా!* మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు గానీ నీ వాగమృతాన్ని ఎంతసేవించినా మాకు మాత్రం తనివితీరడం లేదు.
*అమృతాదపి మృుష్టా తే వాణీ సూత! రసాత్మికా |*
*న తృప్యామో నయం సర్వే సుధయా చ యథామరాః ॥*
ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించింది. ఉత్సాహం ఉరకలు వేసింది. రసవత్తరంగా చెబుతాను విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️
🙏 *తారా శశాంక వృత్తాంతం* 🌈
*మునులారా!*
బృహస్పతికి తార అని ఒక ప్రియ భార్య ఉంది. ఆవిడ చాలా ప్రసిద్ధురాలు. వినే ఉంటారు. మంచి రూపవతి. యౌవనవతి. నిరంతరం మదవిహ్వలాంగి. ఆవిడ ఒకనాడు, ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని ఆ చంద్రుడు. చూస్తూనే కామాతురుడయ్యాడు. చంద్రుణ్మి చూసి ఆవిడకూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది. పరస్పరం ప్రేమ అంకురించి కళవళపడ్డారు. తార తన ఇల్లు మరిచిపోయింది. అక్కడే ఉండిపోయింది. ఇద్దరూ మన్మథక్రీడలలో మునిగి తేలుతున్నారు. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.
బృహస్పతి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలాకాలం మథనపడ్డాడు. ఒకరోజున తన శిష్యులలో ఒకణ్ణి చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని. కానీ ఆవిడ రాను పొమ్మంది. మళ్ళీ మరొక శిష్యుణ్ణి పంపాడు. ఇలా వెళ్ళినవాళ్ళల్లా తిరిగివచ్చారు. ఇక వెళ్ళం అన్నారు. బృహస్పతి క్రుద్ధుడయ్యాడు. అయితే నేనే వెడతానంటూ స్వయంగా వెళ్ళాడు. మదమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు. బృహస్పతికి మరీ వళ్ళుమండింది.
*శశీ!* ఏమిటి నువ్వు చేసిన పని ధర్మమేనా? నా భార్యను ఎందుకు అట్టేపెట్టేసుకున్నావ్? నేను దేవతలకు గురువును. నువ్వో యజమానుడవు. మూఢుడా! గురుభార్యను ఇలా ఉంచుకోవచ్చునా, అనుభవించవచ్చునా? బ్రాహ్మణుణ్ణి చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చెయ్యడం, గురువుగారి భార్యను అనుభవించడం ఇవి మహాపాతకాలు. ఇటువంటివి చేసిన వాళ్ళతో స్నేహం చేసేవాడు అయిదవ మహాపాతకి. తెలుసుగదా!
*బ్రహ్మహా హేమహారీ చ సురాపో గురుతల్పగః |*
*మహాపాతకినో హ్యేతే తతృంసర్గీ చ పంచమః ॥*
నువ్వు మహాపాతకివి. దురాచారుడివి. దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు. తారను విడిచిపెట్టు. ఇంటికి తీసుకుపోతాను. లేదంటే, దుష్టుడా! గురుభార్యాపహర్తవని లోకమంతా ప్రచారం చేస్తాను.
భార్యా విరహదుఃఖితుడై బృహస్పతి ఇలా మండిపడుతోంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు.
*గురూత్తమా!* బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు. అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు. అన్యథా, వర్జనీయులు సుమా! క్రోధం విడిచిపెట్టండి. నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి. తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఉంది. తానై కోరి ఉంది. గమనించండి. సుఖపడుతోంది. కొంతకాలం ఉండనివ్వండి. మీకేమిటిట లోటు! తరవాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి, ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారుగదా!
*"న స్త్రీ దుష్యతి చారేణ న విప్రో వేదకర్మణా* విప్రుడు చేసిన పాపం వేదవిహిత ప్రాయశ్చిత్తంతో పోతుందనీ, స్త్రీకి పరపురుషసంగమ దోషం బుతుస్రావంతో (చారేణ = రజస్స్రవేణ) అంతరిస్తుందనీను.
ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగింది. గిరుక్కున వెనుదిరిగాడు. దుఃఖిస్తూ ఇల్లు చేరాడు. కొన్ని రోజులు గడిచాయి. ఊరుకోవడానికి మనసు ఒప్పలేదు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళనివ్వలేదు. బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు. చంద్రుడు బయటకు రాలేదు, (దుష్టుడి గుమ్మం తొక్కకూడదని వాకిటనే నిలిచాడు బృహస్పతి అని కొన్ని ప్రతులలో పాఠం).
బృహస్పతి కోపం వశం తప్పింది. వీడు నాకు శిష్యుడు. నా భార్య వీడికి తల్లితో సమానం. ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీణ్ణి శిక్షించి తీరాలి - అనుకున్నాడు. వాకిట్లోనే నిలబడి అరుపులు లంకించుకున్నాడు.
బుద్ధిహీనుడా! పాపాత్ముడా! సురాధమా ! ఏమీ ఎరగనట్టు కొంపలో పడుకొని హాయిగా నిద్రపోతున్నావా? రా బయటికి రా. మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు. లేదో, నిన్ను శపిస్తాను. భస్మం చేసేస్తాను.
*దేహి మే కామినీం శీఘ్రం నోచేచ్ఛా పం దదామ్యహమ్ ।*
*కరోమి భస్మసాన్నూనం న దదాసి ప్రియాం మమ ॥*
అంటూ పెడబొబ్బలు పెట్టాడు. ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి. గబగబా ఇవతలికి వచ్చాడు. అదే నవ్వు, అదే వరస.
*బృహస్పతీ!* ఏమిటి ఎక్కువగా మాటాడుతున్నావ్? సర్వ లక్షణ సంయుత, అందాల బరిణ - తార నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని ఎవతెనైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండదగదు. ఉండకూడదు. అందగత్తెకు అందగాడిమీద రతి (మోజు, అభిలాష, కోరిక) ఉంటుంది తప్ప నీలాంటి కురూపిమీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతోంది, మూర్ఖుడా! తెలుసుకో. నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఈ కామినీమణిని మాత్రం ఇవ్వనుగాక ఇవ్వను. కామార్తుడివై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చెయ్యలేదు. ఫో! నీ ఇష్టం వచ్చింది చేసుకో.
*యథేష్టం గచ్చ దుర్భుద్ధే నాహం దాస్యామి కామినీమ్ ।*
*యచ్ఛక్యం కురు తత్కామం న దేయా వరవర్ణినీ ॥*
చంద్రుడు ఇలా తిరగబడే సరికి బృహస్పతి అవాక్కు అయ్యాడు. రుసరుసా నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శచీపతి గ్రహించాడు, అర్ధ్యపాద్యాదులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు. కుశలప్రశ్నలు వేశాడు.
*గురూత్తమా!* దుఃఖితులై కనపడుతున్నారు. కారణం ఏమిటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటివాడు ఎవడుంటాడు! దిక్పాలకులతో సహా నా 'సైన్యమంతా, మీ చెప్పుచేతలలో ఉండేదేగదా! త్రిమూర్తులు కూడా మీవెంట ఉండేవారే. మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో. ఇబ్బంది ఏమిటో తెలియజెయ్యండి.
*దేవేంద్రా!* నా భార్య తారను చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు. ఏం చెయ్యను? అవమానమూ దుఃఖమూ భరించలేక నిన్నిలా శరణువేడుతున్నాను. దయచేసి కల్పించుకో. సహాయం చెయ్యి.
*గురువర్యా!* మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు. దుఃఖించకండి. నేను మీ దాసుణ్గి. సహాయం చెయ్యడం నా విధి. మీ భార్యను మీకు అప్పజెప్పిస్తాను. ఇపుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను. అప్పటికీ ఇవ్వనంటే ససైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. నామాట నమ్మండి. కాసింత ఊరడిల్లండి.
బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్ధుడూ విచక్షణుడూ అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరికి పంపించాడు. అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు -
*చంద్రా!* నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పిరమ్మన్నది చెబుతున్నాను. విను.
నువ్వు ధర్మం తెలిసినవాడివి. నీతి నియమాలు ఎరిగినవాడివి. నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు. నువ్వు నింద్యమైన పనులు చెయ్యకూడదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి. కర్తవ్యం. రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో, యత్నపరుడివై ఉంటావో బృహస్పతీ అలాగే. *'ఆత్మవత్ సర్వభూతాని'* అనే మాటను గుర్తుచేసుకో. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్షప్రజాపతి కూతుళ్ళు ఇరవై ఎనిమిదిమంది నీకు భార్యలుగా ఉన్నారు. చాలలేదా? గురుపత్ని కావలసివచ్చిందా? అంతగా కావలసివస్తే అందచందాలకూ శృంగార వీలాసాలకూ పెట్టింది పేరైన మేనకాది అప్సరసలు ఉన్నారు. స్వేచ్చగా అనుభవించు. గురుపత్నిని విడిచిపెట్టు. నీవంటి వివేకవంతులూ అధికారులూ అహంకరించి ఇలా జుగుప్సితమైన పనులు చేస్తే అజ్ఞులకు అది ఆదర్శమై అనుకరించరూ! అప్పుడు సమాజం ఏమైపోవాలి ? ధర్మం మంటగలిసిపోదూ! అందుచేత, చంద్రమా! గురుపల్నిని వెంటనే విడిచిపెట్టు. నీకారణంగా దేవతలలో దేవతలకు కలహం జరక్కుండా చూడు.
దూత చెప్పిన ఇంద్రసందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలకించాడు. కానీ పెడచెవిని పెట్టాడు. కొంచెం కోపావిష్టడయ్యాడు. ప్రతిసందేశం పంపించాడు.
*దేవేంద్రా!* నువ్వు సర్వధర్మజ్ఞుడివి. దేవతలకు స్వయంగా అధిపతివి. నీ పురోహితుడు కూడా అంతటివాడే. మీ ఇద్దరి మతీ ఒక్కలాగానే ఉంది. ఎదుటివారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనపాఠులే, తమదాకా వస్తే మాత్రం అందరికందరే. చెప్పింది చేసేవాడు కలికానికైనా కనపడడు.
*పరోపదేశే కుశలా భవంతి బహవో జనాః: ।*
*దుర్లభస్తు స్వయం కర్తా ప్రాప్తే కర్మణి సర్వదా ॥*
*శతక్రతూ!* బార్హస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించు. నేను చేసినపనిలో తప్పు ఏముంది? నన్ను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను. పైగా, బలవంతులకి ఏదైనా స్వకీయమే. దుర్చలులకి ఏదీ స్వకీయం కాదు, కానేరదు. స్వీయ - పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టిభ్రమలు. తార పూర్తిగా నాపట్ల అనురక్త, అంతేకాదు గురుడిపట్ల అంతగానూ విరక్త. ధర్మం అనూ న్యాయం అనూ, అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావ్? రక్తి ఉన్నచోట కలయిక తప్పదు, విరక్తి ఉన్నచోట విడిపోక తప్పదు. (రక్తురాలితోనే కదా కలయిక. విరక్తురాలితో కుదురుతుందా?) ఈ వరారోహను విడిచిపెట్టను. బృహస్పతికి అప్పగించను. సహస్రాక్షా! నువ్వు అధీశ్వరుడివి. నీ ఇష్టం. ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దూతా! వెళ్ళు. ఇలాగని చెప్పు.
చంద్రుడు పంపిన ప్రతిసందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు. ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు.
ఈ వార్త రాక్షసగురువు శుక్రాచార్యుడికి తెలిసింది. అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం. చంద్రుడి దగ్గరికి పరుగెత్తాడు. ఎట్టి పరిస్థితులలోనూ తారను విడిచిపెట్టవద్దు, ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో (మంత్రాంగం) నీకు సహాయపడతానని మద్దతు ప్రకటించాడు. కట్టకడపటికి అది దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది, యుద్ధం ప్రారంభమయ్యింది. తారకాసుర యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది.
బ్రహ్మదేవుడు పరిస్థితి గమనించాడు. ఇరుపక్షాలవారినీ శాంతింపజెయ్యాలనుకున్నాడు, హంసారూఢుడై ఆకాశమార్గాన వచ్చి రణస్థలిపై నిలిచాడు.
*చంద్రా!* గురుపత్నిని విడిచిపెట్టు. లేదంటే, విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసిచేయిస్తాను. క్షయింపజేస్తాను. శుక్రాచార్యా! ఏమిటి ఈ అన్యాయం. సావాసదోషం సంక్రమించినట్టుందే నీకు?
బ్రహ్మదేవుడి గద్దింపు వినగానే శుక్రుడు పరుగుపరుగున చంద్రుణ్ణి సమీపించాడు.
బాబూ! చంద్రా! తారను బృహస్పతికి అప్పగించేసెయ్యమని మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా. ఇప్పుడే నాకు కబురు పంపించాడు. అప్పగించేసెయ్యి అన్నాడు. సరే అన్నాడు శశి. అప్పటికే గర్భవతిగా ఉన్న తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పగించాడు. అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్ళాడు.
యుద్ధం ముగిసింది. దేవదానవులు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు, (విరించి బ్రహ్మలోకానికీ
శంకరుడు కైలాసానికీ నిష్క్రమించారు).
కాలం గడిచింది. నెలలు నిండాయి. ఒక మంచి రోజున ఒక మంచి ముహూర్తాన తార ప్రసవించింది. చందమామలాంటి మగబిడ్డ జన్మించాడు. బృహస్పతి సంబరపడ్డాడు. నిస్సంకోచంగా - యథావిధిగా జాతకర్మలు జరిపించాడు.
పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది. దూతతో వర్తమానం పంపించాడు. బృహస్పతీ! వీడు నీ కొడుకు కాదు. నాకు పుట్టినవాడు. జాతకర్మలను నువ్వు ఎలా చేస్తావు? శాస్తప్రకారం నేను చెయ్యాలి.
దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కణకణలాడాడు. మతిలేకపోతేసరి, వీడు నా కొడుకు. నా పోలికలే కనపడుతున్నాయి. సందేహం లేదు. పొమ్మన్నాడు. వివాదం చెలరేగింది. గాలివాన అయ్యింది. దేవదానవులు మళ్ళీ మోహరించారు. శాంతికాముకుడై చతుర్వదనుడు స్వయంగా మళ్ళీ వచ్చాడు. ఇరువాగులనూ వారించాడు, తారను పిలిచి అడిగాడు. నిజం నీకు తెలుసుగదా! వీడు ఎవరి కొడుకో చెప్పమన్నాడు. తార సిగ్గుపడింది. తలదించుకుంది. క్రీగంట నేలచూపులు చూస్తూ సన్నగొంతుతో మెల్లగా చెప్పింది. చంద్రుడి కొడుకేనంది. చందమామ ఎగిరి గంతువేశాడు. పుత్రుణ్ణి చంకనబెట్టుకుని వెళ్ళిపోయాడు. *బుధుడు* అని ముద్దుగా పేరుపెట్టుకున్నాడు.
ఇదీ బుధోత్పత్తి కథ. గురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు.
*(అధ్యాయం - 77, శ్లోకాలు - 86)*
*( రేపు ఊర్వశీ పురూరవ వృత్తాంతం)*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏 శ్రీ మాత్రే నమః