శ్రీదేవీభాగవతము - 17*

P Madhav Kumar


*ద్వితీయ స్కంధము - 02*
                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః*

*లలితా సహస్రనామ శ్లోకం - 17*

*కామేశజ్ఞాతసౌభాగ్య మార్దవోరుద్వాయానితా!*
*మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*నిన్నటి భాగములో.........*          

శౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా - ఇది నైమిశారణ్యం, పరమపవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాసశిష్యుడివి. మహామేధావివి. సందేహాలు తీర్చాల్సిందే అన్నారు, వీరి ధర్మదృష్టికీ పట్టుదలకూ శుశ్రూషకూ (వినాలనే కోరిక) సూతుడు ఉప్పొంగిపోయాడు. దూకుడుగా అందుకున్నాడు.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡

🌈 *గంగా - శంతను వృత్తాంతము* 🌈

ఇక్ష్వాకువంశంలో *మహాభిషుడు* అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మశీలుడు. సత్యసంధుడు. వెయ్యి అశ్వమేధాలూ వంద వాజపేయాలూ చేశాడు. ఇంద్రుణ్ణి సంతోష పెట్టాడు. స్వర్గంలో నివాసం పొందాడు.

ఒకరోజున ఈ *మహాభిషుడు* బ్రహ్మదేవుడి కొలువుకి (సత్యలోకం) వెళ్ళాడు. ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలు అందరూ వచ్చారు. మహానది గంగాదేవి కూడా వచ్చింది. ఆ సంరంభంలో గాలితాకిడికి ఆవిడ పైట జారింది. గమనించినట్టు లేదు. చూడటం తప్పు అని దేవతలంతా (అసలే అనిమిషులు) చూపులు మరల్చుకున్నారు. ముఖాలు దించుకున్నారు. మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేకదీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి. తానూ అనురక్త అయ్యింది. ప్రేమ అంకురించి కామమోహిత అయ్యింది. సిగ్గుకి సిగ్గువచ్చి పారిపోయింది. ఇద్దరూ పరిసరాలు మర్చిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మర్త్యలోకంలో జన్మించండని ఇద్దరినీ శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు.

*మహాభిషుడు* భూలోకంలో ధర్మతత్పరులను వెదికివెదికి పురువంశంలో ప్రతీపమహారాజుకు పుత్రుడుగా జన్మించాడు.

ఆ కాలంలో - *అష్ట వసువులు* తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వసిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అందులో ఒక వసువు పేరు “ద్యు' (ద్యౌః - ద్యువు). అతడి భార్య వసిష్ఠాశ్రమంలో *నందినీ ధేనువు* ను చూసింది. ఇది ఎవరి ఆవు? - అని ప్రశ్నించింది. వసిష్ఠులవారిది అని చెప్పి ఊరుకోకుండా ద్యువు దాని విశిష్టతలుకూడా చెప్పాడు. ఇది దివ్యధేనువు, దీని పాలు త్రాగినవారికి దీర్ఘాయువూ (అయుత సంవత్సరాలు) నిత్యయౌవనమూ సిద్ధిస్తాయన్నాడు. అయితే, ప్రియా! నా ఇష్టసఖి *ఉశీనర (రాజర్షి) పుత్రి* మృత్యులోకంలో ఉంది, ఆమెకోసం దూడతోసహా ఈ గోవును తీసుకుపోదాం, దీనిపాలు త్రాగి, జరారోగపీడలు వదిలించుకుని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకతె అవుతుంది, నిత్యయౌవనంతో క్రీడిస్తుంది, తీసుకుపోదాం పట్టు అంది.

ఆ సమయంలో వసిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫలపుష్పాదుల కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇదే అదను అనుకొని ఆ వసువులు ఎనమండుగురూ కలిసి ఆశ్రమంలో దిగారు. *ద్యువు* ప్రోత్సాహంతో నందినీ ధేనువును అపహరించి తీసుకుపోయారు. కాసేపటికి వసిష్ఠుడు వచ్చాడు. నందిని కనిపించలేదు. అంతటా వెతికాడు. కొండలూ కోనలూ గాలించాడు. ఎక్కడా కనిపించలేదు. కోపం వచ్చింది. ధ్యానంలో కూర్చుని దివ్యదృష్టి సారించి చూశాడు. విషయం తెలిసింది.

ఎనమండుగురు వసువులనీ భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు. ఈ దుర్వార్త వసువులకు చేరింది. ఆగమేఘాల మీద వచ్చి వసిష్ఠులవారి కాళ్ళు పట్టుకున్నారు. పొరపాటు చేశాం క్షమించమని బతిమిలాడుకున్నారు. బ్రహ్మర్షి శాంతించాడు. శాప తీవ్రత తగ్గించాడు. ఏడాదికి ఒకరు చొప్పున శాపవిముక్తి పొందుతారు, అపహరణలో ప్రధానపాత్ర *ద్యువు* ది.  కనక, అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు. పొండి. అన్నాడు.

*అనుసంవత్సరం సర్వే శాపమోక్షమవాప్స్యథ |*
*యేనేయం విహృతా ధేనుర్నందినీ మమ వత్సలా ||*
*తస్మాత్ ద్యౌర్మానుషే దేహే దీర్ఘకాలం వసిష్యతి |*

మానవగర్భంలో జన్మించడమూ సంవత్సరం పాటు నివసించడమూ - ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగివెడుతున్న అష్టవసువులకు, బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న *గంగాదేవి* కనిపించింది. అందరూ ఆవిడను శరణువేడారు. అమృతం తినే దేవతలం, మానవగర్భవాసం ఎలా చెయ్యగలం, అంచేత తల్లీ ! దయచేసి నువ్వు మానవరూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు. రాజర్షి శంతనుడికి భార్యవై పన్నెండు నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టినవాణ్ని పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపెయ్. ఇలాగయితే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించినదానవు అవుతావు. అంగీకరించు నదీమతల్లీ! అని అభ్యర్థించారు. గంగమ్మ సరే అంది. వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు.

*ప్రతీపమహారాజు*:కు సంతానం లేదు. పుత్రార్థియై గంగాతీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు హఠాత్తుగా ఆ నీటినుంచి ఒక సుందరాంగి లేచివచ్చి ప్రతీపుడి కుడితొడ పై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశాడు. రూపయౌవనశాలిని. శుభాంగీ! ఎవరివి నువ్వు? నా అనుమతి లేకుండా వచ్చి నా తొడమీద కూర్చున్నావెందుకని? ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. కామించి వచ్చాను, స్వీకరించు అంది సుందరాంగి.

*వరవర్ణినీ!* నేను పరస్త్రీ పరాఙ్ముఖుణ్ణి, పైగా నువ్వు నా కుడితొడపై కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు.

*స్థితా దక్షిణమూరుం మే సమాశ్లిష్య చ భామిని |*
*అపత్యానాం స్నుషాణాం చ స్థానం విద్ధి శుచిస్మితే ||*

అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదువుగాని. నీ పుణ్యాన అయినా నాకు కొడుకు పుడతాడు. సంశయం లేదు - అన్నాడు ప్రతీపుడు.  సుందరాంగి సరే అంది. వెళ్ళిపోయింది. ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగిని గురించే ఆలోచిస్తున్నాడు.

కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురం కళకళలాడింది. కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే *శంతనుడు.* రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు. నువ్వు ఏ వేటకోసమో ఏ అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది. కామార్తను అంటుంది. తిరస్కరించకు. ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు. ధర్మపత్నిగా స్వీకరించు. సుఖించు. ఇది నా ఆజ్ఞ - అని చెప్పేసి ప్రతీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు.

*(అధ్యాయం - 3, శ్లోకాలు - 60)*

*శౌనకాది మహామునులారా!* శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు.

*శంతనుడు* ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు. అతడికి మృగయావినోదం పట్ల (వేట) ఆసక్తి మెండు. క్రూరమృగాలను వేటాడి చంపడంలో దిట్ట. గంగాతీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది. రూపయౌవనశాలిని. చారుహాసిని. వరవర్ణిని. శంతనుడికి తండ్రిమాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆవిడే ఈవిడ, సందేహం లేదు అనుకొన్నాడు. సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గ్రోలుతున్నాడు. రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు. తనివి తీరడం లేదు. తనువు పులకించింది. అణువణువునా రోమకూపాలు ఉబికి-బిగిసి నిలుచున్నాయి. నిస్సంకోచంగా తదేకదీక్షగా చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగి. అవే కన్నులు. అవే చూపులు. అదే అనురక్తి. మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి. శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు. కానీ మధురంగా సాంత్వనంగా పలకరించాడు.

*సుందరాంగీ!* దేవకాంతవా, మానవకాంతవా? నాగ యక్ష గంధర్వాప్సరసలలో ఏ జాతి నీది? ఎవరైతే నాకేమిలే. ఇదే చిరునవ్వుతో ఇదే అనురాగంతో ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివి కా!

ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి. చెదరని చిరునవ్వుతో బదులు పలికింది. *నృపోత్తమా!* నిన్ను నేను ఎరుగుదును. ప్రతీప మహారాజుగారి పుత్రరత్నానివి. నీవంటివాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు! అలాగే, నీ మాట జవదాటను. అయితే, నాదొక నియమం. నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి. నేను ఏంచేసినా - అది శుభంకానీ, అశుభంకానీ - నువ్వు ప్రశ్నించకూడదు. అడ్డు చెప్పకూడదు. నిందించకూడదు. నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఇది నా నియమం. అంగీకారమేనా?

*యచ్చ కుర్యామహం కార్యం శుభం వా యది వా౬శుభమ్ |*
*న నిషేధ్యా త్వయా రాజన్ న వక్తవ్యం తథా౬ప్రియమ్ ||*

మహాభిషుడి ప్రేమను తలుచుకొని ఒప్పుకొన్నా, అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి. శంతనుడు అంగీకరించాడు. సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు. నిత్యోత్సవంగా నిత్య వసంతంగా నిత్యనూతనంగా రోజులు పరుగిడుతున్నాయి. అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి.

శచీపురందరుల్లా, లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు. సంవత్సరాలు అజలేకుండా దొర్లిపోతున్నాయి.

గంగాదేవికి నెల మసలింది. పుత్రుణ్ణి ప్రసవించింది. నెత్తుటిగుడ్డును పొత్తిగుడ్డలతో తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది. రెండూ మూడూ నాలుగూ -- ఏడుగురినీ అంతే చేసింది. మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు. ఎనిమిదవసారి గర్భవతి అయ్యింది. రాజు ఆలోచనలో పడ్డాడు.

నా వంశం నిలబడదా? ఏడుగురిని గంగపాలు చేసింది. ఇది ఎనిమిదవ గర్భం. వారించకపోతే ఈ పుట్టబోయే బిడ్డనూ - అంతే చేస్తుందేమో! వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యను? తొమ్మిదవ గర్భం వస్తుందో రాదో. వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవనిస్తుందనీ బిడ్డను బతకనిస్తుందనీ హామీ ఏమిటి? ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి. ఇప్పుడే ప్రయత్నించాలి. బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి. గంగలో కలపనివ్వకూడదు - అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

*ఎనిమిదవ శిశువుగా ద్యువు (అష్టమవసువు) జన్మించాడు.* ఇతడు దీర్ఘకాలం మానవుడుగా ఉండిపోవాలని వసిష్ఠుడి శాపం.

యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది. శంతనుడు పరుగుపరుగున వచ్చి కాళ్ళ పై పడ్డాడు. ఈ ఒక్క పుత్రుణ్ణీ ప్రాణాలతో వదిలి పెట్టు, పెంచుకుంటాను. ఏడుగురిని నీళ్ళల్లో వదిలేశావు. నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు. ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను. నా గుండెలు పగిలిపోయేట్టు ఉన్నాయి. దయచూడు. కరుణించు. వీణ్ణి ఒక్కణ్ణి దక్కించు. నా వంశం నిలబడుతుంది. ఈ ఒక్క ఉపకారమూ చెయ్యి. చాలు. *అపుత్రస్య గతిర్నాస్తి* అన్నారు. అందుకని ఇంతగా కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుంటున్నాను. సుందరాంగీ! అనుగ్రహించు. గంగాదేవి వినిపించుకోలేదు. ముందుకే అడుగువేసింది. శంతునుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది. ఉగ్రుడయ్యాడు. నిప్పులు చెరిగాడు.

*కఠినాత్మురాలా!* నరకానికైనా వెరవని పాపాత్మురాలా! ఏ పాపిష్ఠి వంశంలో పుట్టావ్? కన్న బిడ్డల్ని కడతేర్చుకుంటున్నావ్. మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఉండదే! నువ్వసలు ఆడదానివేనా? తల్లి పేగు ఉందా? ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసీ! ఉంటే ఉండు, పోతే ఫో, వంశ వినాశనానికి దాపురించావ్. పిల్లవాణ్ణి మాత్రం తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అయినా గంగాదేవి ఆగలేదు. రుసరుసా చూసింది. ఒక్క నవ్వు అదోలా నవ్వింది. నడుస్తూనే బదులు పలికింది.

*శంతనూ!* ఈ బిడ్డ నాకు కావాలి. నీకు ఇవ్వను. అడవుల్లో పెంచుతాను. నువ్వు మాటతప్పావు. నాకు అడ్డు చెప్పావ్, నిందించావ్. అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు నాదొక మాట. జాగ్రత్తగా విను. నేను గంగాదేవిని. పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి. మన అనురాగబంధం అడవిలో కాదు, అలనాడు సత్యలోకంలో. నువ్వు గుర్తించలేకపోయావ్. సరే ఆ సంగతి అలా ఉంచు.

*అష్టవసువులు* వసిష్ఠ శాపానికి గురియై నన్ను తల్లిగా అభ్యర్థించారు. ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నిని అయ్యాను. ఏడుగుర్నీ శాపవిముక్తుల్ని చేశాను. ఈ బిడ్డడు *అష్టమవసువు.* వీడు దీర్ఘాయువు. తల్లిలేని బిడ్డడు బతకడు. బతికినా ఆరోగ్యంగా ఉండడు. అందుచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను. యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను.

*దాప్యామి యౌవనప్రాప్తం పాలయిత్వా మహీపతే |*
*వ మాతృరహిత: పుత్రో జీవేన్న చ సుఖీ భవేత్ ||*

*ఇతడు అష్టమవసువు. గంగాపుత్రుడు. గాంగేయుడు.* బలాధికుడూ మహావీరుడూ అవుతాడు. అంచేత దు:ఖించకు. మనం, కలుసుకున్న అడవిలోకే ఆ చోటికే తీసుకువెడుతున్నాను.

ఈ మాటలు చెప్పి శంతునుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్య అయ్యింది. భార్యావిరహం పుత్రవిరహం బాధిస్తున్నా నేను నిమిత్తమాత్రుణ్ణి అనుకున్నాడు శంతనుడు. ధైర్యం చెప్పుకున్నాడు. రాజ్యపాలనలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది.

ఒకనాడు - వినోదం కోసం వేటకు బయలుదేరాడు. తిరిగి తిరిగీ గంగాతీరం చేరుకున్నాడు. అదే అడవి. అదే చోటు. ఒక యువకుడు, స్ఫురద్రూపి, ఆజానుబాహువు విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు. శంతనుడు గుర్తించలేకపోయాడు. పాతసంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు. అన్నీ మరిచిపోయాడు. వయసులో ఉన్నప్పటి మన్మథుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు. అతడి ధనుర్విద్యా కౌశలం బాణ ప్రయోగ లాఘవం - మానవ మహావీరులకే కాదు, దేవ ధానుష్కులకు కూడా అసంభవం - శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేకదీక్షగా చూస్తున్నాడు. ఆనందిస్తున్నాడు. చాలా సేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు. శంతనుడు స్పృహలోకి వచ్చి, యువకుణ్ణి సమీపించి, ఆర్ధంగా ఆప్యాయంగా పలకరించాడు.

*నాయనా!* ఎవరి అబ్బాయివి అని అడిగాడు. ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటూ ఇటూ బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు. శంతనుడికి దిగులు పట్టుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. గంగాదేవిని స్మరించాడు. స్తుతించాడు. ప్రత్యక్షమయ్యింది. మితంగా శుచిస్మితంగా పలికింది.

*రాజేంద్రా!* వీడు నీ కుమారుడే. అష్టమవసువు. గాంగేయుడు. వసిష్ఠులవారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్వేదంలో మరీ ప్రవీణుడు అయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికీ అంతా వచ్చు. ఇప్పుడింక నీ పుత్రుణ్ణి నీవు తీసుకువెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారకుడు అవుతాడు. మంచి బాలుడు అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపజేస్తాడు. అని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి తండ్రికి", అప్పగించి గంగమ్మ అదృశ్య అయ్యింది.

శంతనుడు మురిసిపోతూ కొడుకుని కౌగిలించుకుని శిరస్సు మూర్కొని, రథం ఎక్కించుకుని రాజధానికి తిరిగివచ్చాడు. గజోత్సవం జరిపించాడు. మంచిరోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌర జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యౌవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. పుత్రుడి గుణగణాలనూ శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు. ఇక జాహ్నవిని (గంగాదేవిని) తలవనైనా తలవడం లేదు.

*(అధ్యాయం - 4, శ్లోకాలు - 69)*

*శౌనకాది మహామునులారా!* గాంగేయుడి జననం విన్నారుగదా! ఇంక మహారాజు శంతనుడు దాశపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ? ఎలా చేసుకున్నాడు ? ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. చెప్పేస్తాను, వినెయ్యండి. అన్నాడు సూతమహర్షి.

*(రేపు యోజనగంధి-శంతను వృతగత్తాంతము)*

*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏🌹🌹🌹🌹🌹🙏

🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat