*ద్వితీయ స్కంధము - 01*
✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 16*
*అరుణారుణకౌస్తుంభ వస్త్రభాస్వత్కటీతటీ!*
*రత్నకింకిణికారమ్య రశనాదామభూషితా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
వ్యాసుడు - *ధృతరాష్ట్ర-పాండు-విదురులకు జన్మకారకుడై యయాతివంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు.*
అని నిన్నటిరోజు వరకు మనం 15 భాగాలుగా.... *శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారి దేవీ భాగవతం - ప్రథమ స్కంధం - 1184 శ్లోకాల తెలుగుసేత ద్వారా తెలుసుకున్నాం.*
*ఈ రోజు నుండి ద్వితీయస్కంధము*
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
*సూతమహర్షీ!* నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అది అలా ఉండనీ. ముందసలు ఈ సంగతి చెప్పు.
సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావుగదా! ఆవిడ శంతనుమహారాజును వివాహం చేసుకుంది అన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి! పోనీ... అంటే, అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడూ, ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు.
*సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక* సవిస్తరంగా వినాలని పరమకుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయనా - అని శౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు.
*మునివర్యులారా!* చతుర్వర్గీ ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణగాథను వివరిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్ శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంచితార్థప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్నివేళలా అన్నివిధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే.
🌈 *వ్యాస జననం* 🙏
💫 పూర్వకాలంలో *ఉపరిచరవసువు* అని ఒక రాజు ఉండేవాడు. పరమధార్మికుడు, సత్యసంగరుడు. చేది దేశాన్ని పాలిస్తూండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహూకరించాడు. ఆ దివ్యవిమానం అధిరోహించి అతడు ఆకాశంలో (ఉపరి) సంచరిస్తూండేవాడు. అందుకని అతడికి ఉపరిచరవసువు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు *గిరిక.* చాలా అందగత్తె. వారికి అయిదుగురు కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు.
💫 ఒకనాడు ఋతుస్నాతయైన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి -
💫 పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాటకన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి, తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్థలనం అయ్యింది. వృథా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చి రమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకొంది. వెంటబడింది. ముక్కుతో పొడిచింది. కాళ్ళతో తన్నింది. గోళ్ళతో రక్కింది. రెండింటికీ పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో పొట్లం కాస్తా జారి యమునా నదిలో పడింది. డేగలు రెండూ ఎటువి అటు వెళ్ళిపోయాయి.
💫 ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునానదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. *అద్రిక* అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా, హార్తెరి, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటిమీద తేలుతున్న ఆకుపొట్లం కంటబడింది. ఒక్క ఉదుటున వెళ్ళి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయ్యింది. నెలలు నిండాయి. పదవ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు. ఇద్దరు బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. ధీవరుడు (పల్లెవాడు) బిత్తరపోయాడు. పరుగుపరుగున వెళ్ళి తమ ప్రభువు దాశరాజుకు విన్నవించాడు. అతడూ అబ్బురపడ్డాడు. ఇద్దరు బిడ్డలనూ బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి *మత్స్యరాజు* అనీ అమ్మాయికి *కాళి* అనీ నామకరణం చేశాడు. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి (కాళి) రంగుకి నలుపే కానీ అందంలో అప్సరస. మత్స్యగర్భం నుంచి పుట్టింది కనక *మత్స్యోదరీ* అనీ, వాళ్ళంతా చేపల కంపు కనక *మత్స్యగంధ* - *మత్స్యగంధి* అనీ ఇరుగుపొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారుముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే ఒక మహాముని ఠక్కున అందుకున్నాడు.
💫 *సూతమహర్షీ !* అడ్డం తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ళ కథ - తరవాత చూద్దాం. *అద్రిక* మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం. అందుకని అడుగుతున్నాను. శాపవిముక్తి అయ్యిందా? అయితే ఎలా అయ్యింది? ఆ సంగతి ముందు చెప్పు - అన్నాడు. సూతుడు అలాగే అని ఉపక్రమించాడు.
💫 *మహర్షీ!* నువ్వన్నమాట నిజమే. మళ్ళీ మర్చిపోతాం. టూకీగా చెప్పేస్తాను. వినెయ్యండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడుగదా ! అద్రిక దీనురాలై కాళ్ళావేళ్ళా పడింది. బతిమాలింది. శాపవిమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు. కరుణించాడు. కల్యాణీ ! నీ కడుపున ఇద్దరు మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాపమోక్షం. మళ్ళీ నీ దివ్యసుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెడతావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి ఇద్దరు బిడ్డలనూ ప్రసవించింది. శాపవిమోచనం అయ్యింది. స్వర్గానికి వెళ్ళిపోయింది.
*(అధ్యాయం - 1, శ్లోకాలు - 48)*
💫 *మహర్షులారా!* మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం.
💫 మత్స్యగంధి దాశరాజుగారి ఇంట ఎదుగుతోంది. రూపయౌవనవతి అయ్యింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునానది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది. అదే సమయానికి వచ్చాడు పరాశరమహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాశరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వర పెట్టాడు. భోజనం చేస్తున్న దాశరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయీ ! ఆవలి ఒడ్డుకు చేర్చిరా. వెళ్ళాలని తొందరపడుతున్నాడు. పైగా తపస్వి - అన్నాడు. సరేనంది మత్స్యగంధి.
💫 పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది. ఆమె నవయౌవనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులూ వాలుచూపులూ గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడిచేతితో ఆమె కుడిచెయ్యిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ ఒయ్యారంగా పలికింది.
💫 *మునీశ్వరా!* ఏమిటి ఇది? నీకు ధర్మమేనా? వసిష్ఠుడి వంశంలో పుట్టావు. చదువుకున్నావు. తపస్సులు చేశావు. నీకు కూడా మన్మథవికారాలా? మానవజన్మ దుర్లభం. అందులోనూ బ్రాహ్మణజన్మ మరీ దుర్లభమంటారు. నీకు ఈ (అనాగరక) అనార్య చేష్టలు తగునా? పైగా నాలో నీవంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనక? మత్స్యగంధిని. ఒళ్ళంతా చేపలకంపు. నీకిది తగదుసుమా! అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేవీ వినిపించడం లేదు. ఇంకా ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారుపడింది. పరిస్థితి గ్రహించింది. ఇతణ్ణి వారించడం అసంభవం అనుకొంది. నా చెయ్యి పట్టుకొని (నావ పల్టీకొట్టి) నదిలో పడిపోతాడు, ఖాయం అనుకొంది. మహామునీ! కొంచెం సేపు మనస్సు చిక్కబట్టుకో. ఆవలి ఒడ్డుకు చేరనీ. దగ్గరకు వచ్చేశాం - అంది. సంబరపడ్డాడు. చెయ్యివదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవలితీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువునా వోణికిపోతోంది.
💫 *పరాశరమహర్షి!* ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు. నీకు అసహ్యం వెయ్యడం లేదూ! సమానరూపులకు కామసంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు. ఇలా ......... అంటూండగానే పరాశరుడు ఆమెను (తన తపశ్శక్తితో) *యోజనగంధి* ని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం. యోజనదూరం ఘుమఘుమలాడింది. కామాతురుడై కుడిచెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గతొడిగాయి. పరిసరాలు పరికించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది.
💫 *పరాశరా!* లోకం చూస్తోంది. ఆపలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం. నాకు ఇష్టం లేదు. చీకటి పడేవరకూ ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అనిగదా ఏర్పాటు.
*పశుధర్మో న మే ప్రీతిం జనయత్యతి దారుణః |*
*ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవతి యామినీ ||*
💫 వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచుతెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయ్యింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు. సన్నని గొంతుతో కువకువలాడింది యోజనగంధి.
💫 *స్వామీ !* నేను కన్యను. కాసేపటి తరవాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను. శరీరంలో మార్పులు వస్తే ?
💫 ఓసి బేలా ! నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు.
💫 *మహాతపస్వీ !* మా తల్లిదండ్రులకు గానీ లోకానికి గానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్నివిధాలా నీవంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యౌవనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి.
💫 *సుందరీ!* తథాస్తు. విష్ణ్వంశతో కొడుకు పుడతాడు. ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల ఒయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనస్సు చలించలేదు. దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసుపడ్డాను. వింతకాదూ! ఇదేదో దైవనియోగం. అది దురతిక్రమం. (దైవం హి దురతిక్రమమ్.) అందుకే ఇంతగా కామవివశుణ్ణి అయ్యాను. సరే. మహాతేజస్వి నీకు బిడ్డడవుతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు.
💫 యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కౌగిట్లో కరిగిపోయింది. ఆనందపారవశ్యంలో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు.
*సద్యోగర్భం. పుత్రజననం.* రంగుకి నలుపే అయినా ముమ్మూర్తులా మునితేజస్సు. విష్ణ్వంశ సంభవుడు కనక పుడుతూనే పెద్దవాడు అయ్యాడు. తల్లికి నమస్కరించాడు.
💫 *అమ్మా!* తపస్సుకి వెడుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పనిపడ్డప్పుడు నన్ను స్మరించు. వచ్చి వాల్తాను. చింతించకు. శుభమ్. అంటూనే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచుతెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలిగట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది.
ద్వీపంలో పుట్టాడు కనక *ద్వైపాయనుడు.* నల్లగా ఉంటాడు కనుక *కృష్ణుడు.* తీర్థాలూ క్షేత్రాలూ సేవించాడు. గాఢారణ్యాలలో తపస్సులు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతోందని గ్రహించి, *వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు. అప్పటినుంచీ వేదవ్యాసుడు* అయ్యాడు. పురాణోపపురాణాలూ మహాభారతం రచించాడు. అయిదుగురు శిష్యులకూ, తనయుడు శుకుడికీ అన్నీ నేర్పాడు. *సుమంతు-జైమిని- పైల-వైశంపాయన-అసిత-దేవలులు* వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మప్రచారం చేశారు.
💫 *శౌనకాది మహామునులారా!* మీరడిగిన సత్యవతీకథ (యోజన గంధి) వ్యాస వృత్తాంతమూ చెప్పాను. విన్నారుగా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు. ధర్మ సందేహాలు కలగవచ్చు. *మహాత్ముల చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి.* *మహతాం చరితే చైవ గుణా గ్రాహ్యాః* - అన్నారు.
💫 సత్యవతిది కారణజన్మ. అందుకే చేపకడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటు పైని శంతనుణ్ణి వివాహమాడటమూ అటువంటివే. అధర్మమూ అనార్యమూ అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణజన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం. వాటితో తూచకూడదు. మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళూ, చదివినవాళ్ళూ సకలశుభాలనూ పొందుతారు.
*(అధ్యాయం - 2, శ్లోకాలు - 52)*
💫 సూతుడు ఇలా హెచ్చరించేసరికి శౌనకాదుల ధర్మసందేహాలు మనస్సుల్లోనే ఉండిపోయాయి. విశేషధర్మాలు వింతగానే ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి, సహజం అనుకొన్నారు కాబోలు. కానీ, కథాపరంగా మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు.
*రౌమహర్షణీ!* శంతనుమహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు ? అతడు క్షత్రియుడు. గొప్ప వంశం - పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదికాక, భీష్ముడు శంతనుడి కుమారుడు అన్నావు. గాంగేయుడన్నావు. అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథా కమామీషూ ఏమిటి? భీష్ముడేమో తాను పెద్దకొడుకు అయ్యుండీ అన్ని అర్హతలూ యోగ్యతలూ ఉండీ రాజ్యం ఏలకండా చిత్రాంగదుణ్ణీ, విచిత్రవీర్యుణ్ణి రాజుల్ని చెయ్యడం ఏమిటి?' సత్యవతీదేవి గౌలకులను (వితంతు పుత్రులు). జన్మింపజెయ్యడం ఏమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు, వంశం నశిస్తుందనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు. భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదుట? భర్తృహీనలకు సంతానం కలిగించడమా? అధర్మం కాదూ ! పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటివాడు పాల్పడటమా! ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలు రచించినవాడు, వేదాలు విభజించినవాడు - అంతటి వ్యాసుడు పరభార్యలతో అందునా సొంతసోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా? ఎలా చెయ్యగలిగాడు?
💫 శౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా - ఇది నైమిశారణ్యం, పరమపవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాసశిష్యుడివి. మహామేధావివి. సందేహాలు తీర్చాల్సిందే అన్నారు, వీరి ధర్మదృష్టికీ పట్టుదలకూ శుశ్రూషకూ (వినాలనే కోరిక) సూతుడు ఉప్పొంగిపోయాడు. దూకుడుగా అందుకున్నాడు.
*(రేపు గంగా-శంతను వృత్తాంతము)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలఅనుగ్రహిస్తున్నది 🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏