శ్రీదేవీభాగవతము - 15*

P Madhav Kumar


*ప్రథమ స్కంధము - 11*
                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః*

*లలితా సహస్రనామ శ్లోకం - 15*

*లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా!*
*స్తనభారదలన్మధ్య పట్టబన్ధవళిత్రయా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

👉 *నిన్నటి భాగములో....*

పుత్రశోకంతో.... (శుకుడి మరణంతో) విలవిలలాడుతున్న వ్యాసుడిని చూచి,  శివుడికి మరింత దయ కలిగింది. అయితే సరే, సత్యవతీ పుత్రా! నీ పుత్రుడి నీడ నీ ప్రక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెందు. శోకం విడిచిపెట్టు - అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు. వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది. చూసి సంతృప్తి చెందాడు. ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.  తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏమి చేశాడు, ఎలా కాలం గడిపాడు అని శౌనకాది మహామునులు సూతుణ్జి అడిగారు. అనంతర కథను అతడు క్లుప్తంగా చెప్పాడు.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡

🌈 *ధృతరాష్ట్రాది జననం*

వ్యాసుడు తన దగ్గర వేద శాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు - *అసిత-దేవల-వైశంపాయన-జైమిని -సుమంతు* లను అయిదుగురినీ అంతకు ముందే లోకసంచారం కోసం పంపించి ఉన్నాడు వ్యాసుడు.

ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే. ఇది మరింత దిగులయ్యింది. తానూ వెళ్ళిపోవాలి అనుకున్నాడు. పుట్టినచోటూ కన్న తల్లి గుర్తుకు వచ్చాయి.

గంగ ఒడ్డున కృష్ణద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడు దుఃఖంతో వెళ్ళిన తల్లి, దాశరాజు కూతురు సత్యవతీ దేవి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కృష్ణ ద్వీపం చేరుకున్నాడు. తల్లి కనిపించలేదు. ఏమయ్యిందని పల్లెవారిని అడిగాడు.

దాశరాజు సత్యవతిని శంతనుమహారాజుకు ఇచ్చి వివాహం చేశాడని చెప్పారు. దాశరాజును కలుసుకున్నాడు. కుశల వార్తలు అడిగి బయలు దేరాడు. సరస్వతీ నదీతీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సుకు ఉపక్రమించాడు.

సత్యవతీ శంతనులకు ఇద్దరు కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసింది. సోదరులు జన్మించారని సంతోషించాడు. *చిత్రాంగదుడు* మొదటివారు. *విచిత్రవీర్యుడు* రెండవవాడు. ఇద్దరూ గుణవంతులు, రూపవంతులు, పరాక్రమవంతులూను.

శంతను మహారాజుకి మరో పెద్ద కొడుకు ఉన్నాడు. గంగాదేవి వల్ల జన్మించారు. అతడే *గాంగేయుడు.* మహావీరుడు. ఈ ముగ్గురినీ చూసుకుని శంతనుడు గర్వపడేవారు. దేవతలకు కూడా ఆజేయుణ్ణి అని మురిసిపోయేవాడు.

కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు. చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచి పెట్టేశాడు. ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించాడు. చింత్రాంగదుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.

*సమర్థుడయ్యుండీ తాను రాజ్యం వదిలేశాడు కనక అప్పటి నుంచీ గాంగేయుడు "దేవవ్రతుడు" అయ్యాడు.*

కాలం గడుస్తోంది. ఒకరోజున చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు. ఆ గాఢారణ్యంలో అతణ్ణి మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు. బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు. వీరోచితంగా ద్వంద్వయుద్ధం జరిగింది. కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరింపబడే ఆ అరణ్య ప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం మూడేళ్ళు సాగింది. గంధర్వుడు జయించాడు. చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు అంత్యక్రియలు జరిపించారు. చిట్టి తమ్ముడు విచిత్రవీర్యుడికి పట్టం కట్టారు. తాను సంరక్షకుడుగా నిలిచారు.

సత్యవతిదేవి మంత్రి గురుప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది. వ్యాసుడు కూడా చిత్రాంగదమృతికి విచారించినా విచిత్రవీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు.

క్రమక్రమంగా విచిత్రవీర్యుడు యౌవనంలో అడుగు పెట్టాడు. అతడికి వివాహం చెయ్యాలని గాంగేయుడు భావించాడు. సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్ళు ముగ్గురికీ స్వయంవరం ప్రకటించాడు. దేశదేశాల నుంచి మహారాజులెంతమందో వచ్చారు. గాంగేయుడు (భీష్ముడు) ఒంటరిగా వెళ్ళి వారందరినీ చీల్చిచెండాడి రాచకన్నెలను ముగ్గురినీ అపహరించి తెచ్చాడు. ముగ్గురినీ తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు. సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు. బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు.

అంతలో, ఒకరోజున, ఆ ముగ్గురిలోనూ పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది. తాను అంతకుముందే శాలమహారాజును వరించాననీ, మా ఇద్దరికీ మానసికంగా వివాహం అయ్యిందనీ, అటు పైని నీ ఇష్టం అనీ తెలియపరిచింది. భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు. పెద్దలనూ మంత్రులనూ తల్లిని సంప్రదించాడు. వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించేశాడు.

ఆ కన్యక సరాసరి శాల్వపతి ఇంటికి వెళ్ళింది. జరిగింది జరిగినట్టు చెప్పింది. పరస్పరం ప్రేమించుకున్నాం కనక ధర్మపత్నిగా స్వీకరించమంది. శాల్వుడు అంగీకరించలేదు. నా కళ్ళ ముందే భీష్ముడు నీ చెయ్యి పట్టుకుని రథం ఎక్కించుకున్నారు. ఇక నేను నీ పాణిగ్రహణం చెయ్యను. అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచ్ఛిష్టానివి. వెళ్ళిపొమ్మన్నాడు.

ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది. జరిగింది చెప్పింది, అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయతః నువ్వే నన్ను పెళ్ళాడాలి అంది. లేకపోతే మరణిస్తానంది. భీష్ముడు ఒప్పుకోలేదు. మరొకరికి మనసిచ్చినదానవు. నిన్నెలా మనువాడతాను, పుట్టింటికి పామ్మన్నాడు. ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు పోయింది. తపస్సుకి ఉపక్రమించింది.

తక్కిన ఇద్దరు కన్యకలు అంబికా అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహమాడాడు. తొమ్మిది సంవత్సరాలు రేయింబవళ్ళు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించారు. రాజయక్ష్మ వచ్చి (క్షయ) హఠాత్తుగా మరణించాడు. సత్యవతీదేవి దారుణంగా విలపించింది. ప్రేతకార్యాలు మంత్రులతో జరిపించింది.

ఒకరోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది. శంతనుమహారాజుకి పెద్దకొడుకువు కాబట్టి రాజ్యం పాలించమంది. సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది. ఈ యయాతివంశం అంతరించిపోకుండా చూడమంది.

*భీష్మ మాహ తదైకాంతే వచనం చాతిదు:ఖితా*
*రాజ్యం కురు మహాభాగ పితుర్ శంతనోస్సుత!*
*భ్రాతుర్భార్యాం గృహాణ త్వం వంశం చ పరిరక్షయ*
*యథా న నాశమాయాతి యయాతేర్వంశ ఇత్యుత !!*

భీష్ముడు అంగీకరించలేదు. తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనక రాజ్యమూ చెయ్యను, వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు.

వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులుపట్టుకుంది. దానికితోడు అరాజకం వచ్చిపడిందే అని మరొక భయం.

అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు. సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలితో నియోగించమన్నాడు. ఆ పుట్టేవాడు విచిత్రవీర్యుడికి క్షేత్రజుడు అవుతాడు కనక, కులరక్షణ కోసం ఈ పాటిది తప్పుకాదన్నాడు. అప్పుడు ఆ మనుమడికి ఈ రాజ్యం అప్పగిద్దువుగాని, నేను అతడి ఆజ్ఞలు శిరసావహిస్తాను అని కూడా మాట ఇచ్చాడు. సత్యవతి సరేనని సమ్మతించింది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడివల్ల జన్మించిన వ్యాసుణ్ణి *(కానీనుడు = కన్యకు పుట్టినవాడు)* స్మరించింది.

తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు ఆప్తవాక్యంగా స్వీకరించాడు. అంగీకరించాడు (ఓమ్ అన్నాడు).

ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు. గర్భవతి అయ్యింది. గుడ్డివాడు పుట్టాడు. సత్యవతి దుఃఖించింది.

రెండవ కోడలు అంబాలికను నియోగించింది. ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు. వాడూ రాజ్యానికి పనికిరాడే ఎలాగా అని సత్యవతి బాధపడింది.

ఏడాది గడిచాక మరొక్కసారి వ్యాసుణ్ణి స్మరించి రప్పించింది. కోడలిని పిలిచి (అంబాలికనే) మరొక్కసారి ప్రయత్నించమంది. ఈసారి అంబాలిక తనబదులు దాసిని నియమించింది. వ్యాసుడు కలిశాడు. ధర్మాంశంతో *విదురుడు* జన్మించాడు.

ఇలా వ్యాసుడు *ధృతరాష్ట్ర-పాండు-విదురులకు* జన్మకారకుడై యయాతివంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు.

*(అధ్యాయం - 20, శ్లోకాలు -74)*

*ప్రథమ స్కంధం - 1184 శ్లోకాలు - తెలుగుసేత :  శ్రీ బేతవోలు రామబ్రహ్మం*

[ *రేపటినుండి ద్వితీయస్కంధం ప్రారంభం*]

*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*

               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*

♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾

*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*

*భావము:* 💐

ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat