*ప్రథమ స్కంధము - 10*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 14*
*కామేశ్వర ప్రేమరత్నమణిప్రతిపణస్తనీ,*
*నాభ్యాలవాలరోమాళి లతా ఫలకుచద్వయీ!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
👉 *నిన్నటి భాగములో....*
జనకుని రాజ్యంలో తనకు ఏర్పాటు చేయబడిన విడిది భవనంలో....
శుకుడు శుచియై జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకుని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాముసేపు ధ్యానం చేసుకుని అటు పైని రెండుజాములు హాయిగా నిద్రపోయాడు. నాల్గవ జాములో లేచి కాసేపు ధ్యానంచేసి స్నానాదికం ముగించి ప్రాతఃస్సంధ్యను అర్చించి, సమాహితచిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు.
*(అద్యాయం - 77, శ్లోకాలు - 66)*
అప్పుడు మంత్రిపురోహిత సహితుడై జనకమహారాజు గురుపుత్రుణ్ణి దర్శించడంకోసం ఆ భవనానికి వచ్చాడు. అతిథిపూజలు జరిపి, ఒక పాడి అవును కానుకగా సమర్పించాడు. ఉభయకుశల ప్రసంగోపరి -
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡️
*శుక జనకసంవాదం*
*శుకమహర్షీ!* నీవంటి విరాగికి నా పట్ట ఇంతటి అనురాగం కలగడం, ఇలా దయచెయ్యడం - ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ- అన్నాడు జనకుడు.
*మహారాజా!* నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమని అంటున్నాడు. ఆశ్రమాలలోకెల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో - అది తండ్రిమాటయే అయినా – అంగీకరించలేక పోతున్నాను. అది బంధనం అంటాను నేను, కాదంటాడు ఆయన. వాదించుకున్నాం. ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది.
మిథిలానగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు. ఆయన జీవన్ముక్తుడు. విదేహరాజ్యాన్ని అకంటకంగా పరిపాలిస్తున్నాడు. అయినా మాయాపాశాలలో చిక్కుకోలేదు. రాజ్యపాలన బంధనం అనుకోలేదు. నువ్వేమిటో గృహస్థామ్రానికే భయపడుతున్నావు? ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్లి చూసిరా. నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలిసుమా! లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో - అని మా తండ్రిగారు చెప్పినమీదట *మహారాజా!* నేను నీదర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహం తీర్చు. నేను మోక్షకామిని.
👌 *తపస్సులూ తీర్ధాలూ వ్రతాలూ యజ్ఞాలూ స్వాధ్యాయాలూ ఇవ్వి మోక్షాన్ని ఇస్తాయా? లేక జ్ఞానమే మోక్షకారణమా?*
జనకమహారాజు ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పాడు.
*వ్యాసతనయా!* విను. మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే - ఉపనయనం చేసుకుని వెళ్ళి గురుసన్నిధిలో వేదాధ్యయనం చెయ్యాలి. వేదవేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. అగ్నిహోత్రాదికర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియమంతో శుచిగా సంతోషంగా జీవయాత్ర సాగించాలి. దురాశ ఉండకూడదు. దుష్కర్మలు చెయ్యకూడదు. కొడుకునూ మనుమణ్ణీ ఎత్తి (ఏకవచనం) వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చెయ్యాలి. అంతశ్శత్రువులను ఆరుగురినీ జయించాలి. భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి. అన్ని అగ్నులనూ తనలోనే (ఆత్మలో) ఆరోపించుకుని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్యభావంతో తురీయాశ్రమంలో (నాల్గవది-సన్యాసం) ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం. మరెవ్వరికీ లేదు. మరో మార్గమూ లేదు. ఇది వేదవాక్యం. దీనికి తిరుగులేదు.
*శుకర్షీ !* మానవుడికి నలభైయెనిమిది సంస్కారాలను చెబుతోంది వేదం. అందులో నలభై సంస్కారాలు గృహస్థుడికే. శమదమాదులు ఎనిమిది మాత్రమే సన్యాసికి. ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్టుల అనుశాసనం. ఇక్కడ శుకుడు కల్పించుకున్నాడు.
*జనకమహారాజా!* జ్ఞాన విజ్ఞానాలవల్ల హృదయంలో వైరాగ్యభావం వెల్లివిరిస్తే స్థిరపడితే, అప్పుడుకూడా మొదటి మూడు ఆశ్రమాలూ తప్పవా? అని ప్రశ్శించాడు.
*గురుపుత్రా!* ఇంద్రియాలు చాలా బలిష్టాలు. అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు. పరిపక్వ స్థితికి చేరుకోని అపరిణతులను అవ్వి మరీ ఆటపట్టిస్తాయి. రకరకాల వికారాలను పుట్టిస్తాయి. అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే - *భోజనేచ్ఛ, సుఖేచ్ఛ, శయ్యేచ్ఛ, పుత్రేచ్ఛ* వంటివి. యతీశ్వరుడికి ఇవ్వి కలిగితే తీరేదెట్లాగ? తీరకపోతే, ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి. అంతరంగంలో అలజడి. అది అసలు చెలరేగనే కూడదన్నా అణగిపోవాలన్నా క్రమక్రమంగా వదిలించుకోవడం ఒక్కటే మార్గం. పైకెక్కి పడుకున్న వాడికి పతనం తప్పదు. నేలమీద పడుకున్న వాడికి బెంగలేదు. సన్యసించీ భ్రష్టుడైతే మరతడికి దారిలేదు, దిక్కులేదు.
పిపీలిక చూడు చెట్టుమొదలు నుంచి పాకుతూ పై పైకి వెడుతుంది. అలిసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది. అదే పక్షి అయితే, ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నట్టు వేగంగా ఎగురుకుంటూ వెడుతుంది. అలిసిపోతుంది. *"మనస్సు బహు గట్టి పిండం”.* తగినంత అభ్యాసం లేనివారికి (అకృతాత్ములకు) అది బొత్తిగా అజేయం. అందుచేత ఆశ్రమాను క్రమంలో దాన్ని జయించాలి.
గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతీ, శాంతుడూ, ఆత్మజ్ఞానం కలవాడూ అయినట్టయితే లాభాలకు పొంగడు, నష్టాలకు కుంగడు. రెండింటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు. వేదవిహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యథాలాభసంతుష్టుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవుతాడు. నన్ను చూడు. రాజ్యపాలనలో ఉండీ జీవన్ముక్తుణ్ణీ కాగలిగాను. యథేచ్చగా సంచరిస్తున్నాను. అయినా నాకేమీ అవ్వడం లేదు. వివిధ భోగాలను అనుభవిస్తున్నాను. అనేక కార్యాలనూ చేస్తున్నాను. అయినప్పటికీ ముక్తుణ్ణి కాగలుగుతున్నాను. అలాగే నువ్వూ అవ్వాలి. కాగలవు. ప్రయత్నించు.
*విప్రకుమారా!* మరొక రహస్యం విను. కనపడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు. కనపడనిదాన్ని ఎలా బంధిస్తావు? పంచభూతాలూ వాటిగుణాలూ ప్రత్యక్షాలు (అనుభవంలోకి వచ్చేవి). వీటిని జయించవచ్చు (బంధించవచ్చు). ఆత్మ ఏనాడూ ఎవరికీ ప్రత్యక్షవిషయంకాదు. అనుమానగమ్యమే. నిరంజనమూ నిర్వికారమూ అయిన ఆత్మను బంధించడం ఎలాగ?
సుఖదుఃఖాలకు మనస్సే ముఖ్య కారణం. అది నిర్మలంగా ఉంటే సమస్తమూ నిర్మలంగానే ఉంటుంది. అది నిర్మలం (దోషరహితం) కాకపోతే ఎన్ని పుణ్యనదీతీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం. మానవుల బంధమోక్షాలకు దేహమూ ఇంద్రియాలూ జీవాత్మ ఇవేవీ కారణాలు కాదు. కేవలం మనస్సొక్కటే కారణం. పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే. అది బంధింపబడదు. బంధనమూ కాదు. బంధమోక్షాలు మనస్సంస్థితాలు. మనస్సు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి. అంతా ప్రశాంతియే. శత్రువు మిత్రుడు ఉదాసీనుడు - ఈ భేదాలు మనఃకల్పితాలు. కనిపించని ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు.
*బుషితనయా!* జీవుడు ఎప్పుడూ బ్రహ్మమే. అది ఏకైకం. సందేహం లేదు. కానీ లోకంలో అనేకత్వం (భిన్నత్వం) కనిపిస్తుంది. అది అవిద్యా కల్పితం. విద్యతో దాన్ని తొలగించుకోవాలి. ఆలోచనాపరులు నిరంతరం జాగరూకులై విద్యా-అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి. *ఎండలేనిదే నీడ సుఖం తెలియనట్టు ఈ అవిద్యలేనిదే విద్య అవగతం కాదు.*
గుణాలు గుణాలలోనే ఉంటాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థాలలోనే ప్రవర్తిస్తాయి. కనక అక్కడ ఆత్మకు ఏ దోషమూ లేదు. ఇంతకూ వైయాసకీ! (వ్యాసపుత్రుడా) వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద (కట్టుబాటు) అంతా ధర్మరక్షణకోసమే. లేకపోతే సౌగతులకు లాగా (బౌద్ధులు) ధర్మ వినాశనం మనకూ తప్పదు. ధర్మనాశం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి. అందుచేత వేదోక్తమార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్నివేళలా శుభప్రదం.
జనకుడు చెబుతున్నదంతా ఏకాగ్రచిత్తంతో వింటున్నాడు శుకుడు. ఈ చివరిమాట ఎందుకో రుచించలేదు. ప్రశ్నించాడు.
*మహారాజా!* నువ్వు చెప్పినది అంతా విన్నాను. ఒక్క సందేహం మిగిలిపోయింది.
వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసాబహుళాలు కదా! అటువంటప్పుడు వేదధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది? ఉదాహరణకు సురాపానం పశుహింస మాంసభక్షణం ఇత్యాదులు ఆధర్మాలేకదా ! *సౌత్రామణి* వంటి కొన్ని క్రతువులలో సురాపానం చెప్పింది వేదం. అలాగే ద్యూతక్రీడ. ఇలాంటి దోషాలున్న వ్రతాలూ చాలానే ఉన్నాయి. వెనకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబిందుమహారాజు కథ తెలిసిందేకదా ! ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్యపర్వతమంత గుట్ట అయ్యాయిట. రక్తమూ కొవ్వూ ప్రవాహాలు కట్టి ఏకంగా *చర్మణ్వతి* అనే నది ఏర్పడిందిట. అయినా ఆ రాజు స్వర్గాన్ని పొాందాడుట. ఇలాగని అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది. ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాలపట్ల నాకు గురి కుదరడం లేదు.
పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు. అది దొరకకపోతే దుఃఖిస్తాడు. మరి సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? *మహారాజా!* ఇవీ నాకు ఇప్పటికి మిగిలిన సందేహాలు. దయచేసి వివరించమన్నాడు శుకుడు.
జనకుడు ఉపక్రమించాడు.
*విప్రోత్తమా!* యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింసకాదు. అది అహింస. ఉపాధియోగాన్నిబట్టి కదా హింస - అహింసల నిర్ణయం. అగ్నిలో ఇంధనం వేస్తే (పుల్లలు) పొగవస్తుంది. వెయ్యనప్పుడు (కాలిపోయినప్పుడు) ఏమీ ఉండదు. అలాగే ఇదీను. విరాగికి ఇది అహింస, అనురక్తుడికి (రాగి) హింస. రాగం లేకుండా (కర్శృత్వ) అహంకారం లేకుండా (కేవలం విధిగా త్యాగంగా) చేసే ఏ పనినైనా “అకృతం” అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస. గృహస్థులకేమో హింసగానే అనిపిస్తుంది.
*(అధ్యాయం - 18, శ్లోకాలు - 62)*
ఇలా చెప్పి జనకుడు ముగిస్తే, కాబోలనుకున్నాడు శుకుడు. అక్కడితో హింసాహింసల గొడవ వదిలిపెట్టేశాడు. మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు.
*రాజోత్తమా!* మాయావృతుడై మాయామధ్యంలో ఉంటూ మనిషి నిస్పృహుడూ విరాగీ ఎలా కాగలుగుతాడు? శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందినా మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేక పోతోంది. మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగ? అంతర్గతమైన చీకటిని (తమస్సు) పోగొట్టడానికి శాస్త్రబోధకుడు (బోధనం) సరిపోతాడనుకోను. వెలిగించకుండా - దీపం, దీపం అన్నంతమాత్రాన చీకట్లు తొలగిపోతాయా? (శాస్తజ్ఞానం ఆచరణలోకి రావాలి, మోహవిభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్టులెక్క అని
*అంతర్గతం తమశ్ఛేత్తుం శాస్త్రోద్భోధీ హి న క్షమః ।*
*యథా న నశ్యతి తమః కృతయా దీపవార్తయా ॥*
*మహారాజా !* మరొక సంగతి. ఏ ప్రాణికీ హాని చెయ్యకూడదు. ద్రోహబుద్ధి ఉండకూడదు. ఎప్పుడూ పండితులు చెప్పేది ఇదేకదా! గృహస్థుకి ఇది ఆచరణసాధ్యమా? నీ మాటే తీసుకుందాం. *విత్తేషణ, రాజ్యసుఖేషణ, సంగ్రామ జయేషణ (ఈషణ = వాంఛ)* - రాజుగా ఇవన్నీ నీకు ఉన్నాయి. మరి నువ్వు జీవన్ముక్తుడివి ఎలా అవుతావు? చోరుల్ని చోరులుగానే చూస్తున్నావు. సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు. స్వపరత్వం నీకూ ఉంది. “విదేహుడివి” ఎలా అవుతావు? పులుపు చేదు కారం ఉప్పు - రుచులన్నీ ఎరుగుదువు. నచ్చినవి (శుభాలు) ఆస్వాదిస్తోంది నీ చిత్తం. నచ్చనివీ (అశుభాలు) రుచించనివీ అలా ఆస్వాదించలేకపోతోంది. కాలోచితంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి. మరి తురీయాశ్రమంలో (సన్యాసం - జీవన్ముక్తి) ఉన్నానంటే ఎలాగ? రథ-గజ-అశ్వ-పదాతి బలాలు నీ వశంలో ఉంటాయి. వీటన్నింటికీ నేనే ప్రభువును అధిపతిని అని అనుకుంటూ ఉంటావా, ఉండవా? రుచికరమైనదీ నచ్చినదీ తింటున్నావ్, ఆనందిస్తున్నావ్. ఇంక విమనస్కత్వం ఏమిటి? పూలదండ - నాగుబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడు ? ఎక్కడున్నాడు? హేరాజన్! మట్టిచెక్కనూ బంగారుముక్కనూ ఒకేలా పరిగణిస్తూ సర్వత్రా ఏకత్వబుద్ధి కలిగి, సర్వప్రాణికోటికీ హితం చేస్తున్నట్టయితే అతడుగదా విముక్తుడంటేను.
*రాజేంద్రా!* నిజం చెబుతున్నాను. నా మనస్సిప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవడం లేదు. అత్యంత విరాగిని. ఏకాకిగా సంచరించాలని ఉంది. కందమూలఫలాలు తింటూ నిస్సంగంగా నిర్మమంగా శాంతంగా ఒక అడవి జంతువులాగా నిర్ద్వంద్వుణ్ణై నిష్పరిగ్రహుణ్ణై (చేయిచాపనివాడు) కాలం గడపాలని ఉంది. విరాగిని. గుణాతీతుణ్ణి నాకు ఇల్లు ఎందుకు, ఇల్లాలెందుకు, డబ్బు ఎందుకు?
మరి నువ్వో, రాగసమాకులుడివి. నీ వైరాగ్యం వట్టి నటన. దంభం. కాసేపు శత్రు చింతన, కాసేపు కోశ (ధన) చింతన, కాసేపు సైన్య చింతన. నీకింక నిశ్చింతత ఎప్పుడు? నీ వంశీయులకు విదేహులు అనే పేరు పెద్ద అసత్యం, మోసం. మితాహారులైన వైఖానసమునులు కూడా అసత్యమని ఎరిగీ సంసారాల్గో పడిపోతున్నారు. మోహులవుతున్నారు. ఇక మీరనగా యెంత? మిమ్మల్ని “విదేహులు” అనడం - మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనడం, పుట్టుగుడ్డిని దివాకరుడు అనడం, దరిద్రుణ్జి లక్ష్మీధరుడు అనడం. పేరుకే విదేహులు. కర్మాచరణకు కాదు.
అసలు కథ చెప్పనా జనకమహారాజా ! మీ వంశానికి మూలపురుషుడు *నిమి* ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వసిష్టుణ్జి ఆహ్వానించాడు. అతడు వచ్చాడు. దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు, అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను, ఈలోగా నెమ్మదిగా సంబారాలు సమకూర్చుకో - అని చెప్పి వసిష్టుడు వెళ్ళిపోయాడు. మరొకరిని అధ్వర్యుడుగా నియమించి *నిమి* తన యజ్ఞం జరిపించుకున్నాడు. అది తెలిసి వసిష్టుడు అలిగి *నిమి* (శరీరం) దేహం పతనమైపోగాక అని శపించాడు. నిమి అల్లాగే మారుశాపం ఇచ్చాడు - వసిష్టుడి శరీరం పడిపోవుగాక అని. ఇద్దరూ అన్యోన్యశాపాలతో పడిపోయారుట. అప్పటినుంచీ మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందువల్ల మాత్రం కాదు. అదిసరే - విదేహుడు గురువును శపించడం ఏమిటి ? ఇదంతా వినోదంలా అనిపిస్తుంది నాకు. రాజా ! నువ్వేమంటావో ?
శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. అయినా జనకుడు జితేంద్రియుడూ జీవన్ముక్తుడూ కదా! నిండుకుండ. వివరణ ఇచ్చాడు.
*విప్రేంద్రా!* నువ్వన్నది నిజమే. అసత్యం ఏమీలేదు. అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే దానికేమి! వంశ చరిత్ర. కాసేపు అలా ఉంచుదాం.
నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమపూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకుంటున్నావు. వెడతావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది. ఏర్పడదా? సృష్టి అంతటా ప్రాణికోటి ఉంది. మరి నిస్సంగత్వం నీకు (మనిషికి) ఎలా సాధ్యపడుతుంది? ఆహారం కోసం - అది ఆకో అలమో ఏదైనాకాని దానికోసం చింత తప్పదు గదా! మరి నిశ్చింతుడివి ఎలా కాగలుగుతావ్? వనాల్లో ఉన్నా దండాజినాల చింత ఎటూ తప్పదు. అలాగే, ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్యచింత తప్పదు. మోక్షానికి వికల్పాలు (ప్రతిబంధకాలు) వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి వికల్పసందేహం లేదు. సర్వథా నిర్వికల్పుణ్ణి. హాయిగా తింటాను. సుఖంగా నిద్రపోతాను. నేను బద్ధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనక నాకెప్పుడూ సుఖమే.
నీకెప్పుడూ దుఃఖమే - బద్ధుణ్జి బద్ధుణ్ణీ అనుకుంటున్నావు కనక. అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో. సుఖపడతావు.
ఈ దేహం నాదికాదు. ఈ బంధం నాదికాదు (అని గ్రహించడమే) ముక్తత్వం అంటేను. అలాగే ఈ ధనం ఈ గృహం ఈ రాజ్యం ఇవి ఏవీ నావి కానేకావు. అని జనకుడు ముగించాడు.
*శౌనకాది మహామునులారా!* అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగింది. వీడ్కోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు. తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు. కౌగిలించుకుని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు. కుశలప్రశ్నలు అయ్యాయి.
వేదవిదుడూ సర్వశాస్తపారంగతుడూ అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు. రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పరనిర్వృతి కలిగింది. యోగమార్గం ఆశ్రయించాడు.
ఆనక కొంతకాలానికి *పీవరి* అనే సుందరిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కొడుకులూ ఒక కూతురూ కలిగారు. *కృష్ణ - గౌరప్రభ - భూరి- దేవశ్రుతులు* కొడుకులు, కూతురు పేరు *కీర్తి,* ఈమెను విభ్రాజుడి కొడుకు అణుహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు. అతడు పృథివీ పాలకుడయ్యాడు. చాలాకాలం రాజ్యం చేసి, నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి, కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు. యోగ మార్గం అవలంబించాడు.
శుకమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి, పితృబంధం తెగతెంపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. సర్వసంగపరాఙ్ముఖుడై ధ్యానంలో మునిగిపోయాడు. అటుపైని ఒకనాడు యోగబలంతో ఆ గిరిశిఖరం నుంచి పైకెగిరి సిద్ధిపొందాడు. ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు. శరీరం గిరిశిఖరం మీద రాలిపడింది.
వ్యాసుడికి విషయం తెలిసింది. పుత్రశోకం పట్టలేకపోయాడు. కొడుకా! కొడుకా! అని విలపిస్తూ ఆ కైలాస గిరిశిఖరం చేరుకున్నాడు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు. అలిసిపోయాడు. అతడి శోకాలాపాలను కొండగుహలు ప్రతిధ్వనించాయి.
*(ఇప్పటికీ అక్కడ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి! ?).*
"పుత్రా పుత్రా అంటూ విలపిస్తున్న వ్యాసుణ్ణి చూసి శివుడికి జాలి కలిగింది. స్వయంగా వచ్చి ఓదార్బాడు.
*వ్యాసా!* ఏమిటి ఈ వెర్రి? దుఃఖించకు. నీ పుత్రుడు మహాయోగి. అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని పొందాడు. అతడికోసం విలపించకూడదు. తప్పు. పైగా నీకు శోకరహితస్థితి తెలుసునాయె. నువ్వు శోకించడమేమిటి? ఆ కొడుకువల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వసలు? ఊరుకో. ఊరుకో.
శివుడి ప్రబోధం సనిచెయ్యలేదు. మహాదేవా! జగత్పతీ! ఏంచెయ్యను, నా దుఃఖం ఊపశమించడం లేదు. కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు - అన్నాడు వ్యాసుడు.
శివుడికి మరింత దయ కలిగింది. అయితే సరే, సత్యవతీ పుత్రా! నీ పుత్రుడి నీడ నీ ప్రక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెందు. శోకం విడిచిపెట్టు - అని వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు. వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది. చూసి సంతృప్తి చెందాడు. ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
*(అధ్యాయం - 79, శ్లోకాలు - 60)*
తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏమి చేశాడు, ఎలా కాలం గడిపాడు అని శౌనకాది మహామునులు సూతుణ్జి అడిగారు. అనంతర కథను అతడు క్లుప్తంగా చెప్పాడు.
*(రేపు ధృతరాష్ట్రాది జననం)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏