*ద్వితీయ స్కంధము - 03*
✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 18*
*ఇంద్రగోపపరిక్షిప్త స్మర తూణాభజంఘికా!*
*గూఢగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*శౌనకాది మహామునులారా!* *గాంగేయుడి జననం విన్నారుగదా! ఇంక మహారాజు శంతనుడు దాశపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ? ఎలా చేసుకున్నాడు ? ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది. చెప్పేస్తాను, వినెయ్యండి. అన్నాడు సూతమహర్షి.*
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *యోజనగంధి శంతను వృత్తాంతం* 🌈
💫 శంతనుడికి వేట పిచ్చి ఉందిగదా! గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూరమృగాలను వెదికి వెదికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ - నాలుగేళ్ళ పాటు సాగింది వారి వేట. కట్టకడపట కాళిందీ తీరానికి చేరుకున్నారు. ససైన్యంగా విడిది చేశారు. శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
🌈 ఎచట నుండి వీచెనో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముకుపుటాలకు గిలిగింతలు పెట్టింది. తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలకు వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కాదు, చంపక సువాసనకాదు, మాలతీకేతకీ సురభిళ వాయు తరంగం కాదు. ఏమిటి అయ్యుంటుంది చెప్మా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచకా అడుగులు వేశాడు. కనిపించింది. శృంగారవతి కనిపించింది.
🌈 కాళిందీ నదీతీరాన కూర్చుని ఉంది. మలినాంబరాలలో ఉన్నా నల్లగా ఉన్నా చూపులకు ఇంపుగా కనిపిస్తోంది. ఈ పరిమళం ఆవిడ శరీరంనుంచే అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతమనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు జవ్వనం - పెట్టనిసొమ్ముగా ఉంది. ఎవరు ఈ అమ్మాయి? ఇక్కడ ఎందుకు ఉంది? దేవ నాగ మానవ గంధర్వ కన్యలలో ఎవరై ఉంటుంది? ఎవరైనా కానీ ఈ ఘుమఘుమలు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది - అనుకునేసరికి శంతనుడు కామవివశుడయ్యాడు. మాట కలిపాడు.
*ప్రియా!* ఎవరు నువ్వు? ఎవరి అమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావ్? ఇది విజనారణ్యం కదా! చారునేత్రీ! ఒంటరిగా ఇక్కడ ఏమిటి చేస్తున్నావ్? ఎవరికోసం ప్రతీక్షిస్తున్నావ్? వివాహితవా, అవివాహితవా? నీలినీలి గిరజాల ముంగురులదానా! దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం నా మనస్సును పరవశింపజేస్తోంది.
🌈 ఈ పలకరింపులకి యోజనగంధి రవ్వంత తత్తరపడింది. శంతునుణ్ణి చూసి కన్నులు పద్మాల్లా వికసించాయి. నేను దాశరాజు కూతురును. తండ్రి చాటు కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతుంటాను.
💫 ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటూఇటూ చేరుస్తుంటాను. నీకు అబద్ధం చెప్పడమెందుకు ? ఇవ్వేళ మానాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు.
*అంబుజేక్షణా!* నేను కురువంశ మహారాజును. నాకు భార్యలేదు. నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను. అంగీకరించు. యౌవనం ఎందుకు వృధా చేసుకుంటావ్! నిన్ను చూసినప్పటి నుంచీ మన్మథుడు నా పై దాడిచేస్తున్నాడు. నీ రూపయౌవన విలాసాలకూ నీకూ దాసుణ్ణి. అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతెను ఇంతవరకూ చేసుకోలేదు. ప్రస్తుతానికి విధురుణ్ణి (భార్యావిహీనుడు), సర్వాంగసుందరివి నిన్ను చూడగానే మనసయ్యింది.
యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకుని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది.
*మహారాజా!* నీమాటలు నిజమేనని నమ్ముతున్నాను. కానీ నేను స్వతంత్రురాలిని కాదు. తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చెయ్యకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. దాశపుత్రినైనంతమాత్రాన స్వైరిణిని కాదు. (స్వైరిణి = స్వేచ్ఛావిహారశీల). తండ్రి చెప్పుచేతలలో మెలిగే దానిని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినా మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి. అది నాకు సమ్మతమే. మన్మథుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవయౌవనంలో ఉన్న నన్నూ అలాగే హింసిస్తున్నాడు. (నిన్నే హింసించినవాడు వయసులో ఉన్న నన్ను హింసించడా ?). అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలిగదా నేను.
*శౌనకాది మహామునులారా!* యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాశరాజును కలుసుకోడానికి బయలుదేరాడు. అల్లంత దూరాన చూసి దాశరాజు ఆశ్చర్యపోయాడు. వంగి వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు.
*మహారాజా!* నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా ? ధన్యుణ్ణి. పని ఏమిటో ఆజ్ఞాపించండి.
*దాశా!* నువ్వు అంగీకరించి ఇచ్చేట్టయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను.
*భూపాలా!* కన్యారత్నం నాదయితే అడుగుతున్నవాడవు నువ్వయితే - ఇవ్వదగినది ఎప్పుడూ ఇస్తాను. ఇవ్వరానిది ఎప్పుడూ ఇవ్వను. అయితే, మహారాజా! ఇక్కడొక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తరవాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకడెవడూ రాజు కాకూడదు.
శంతనుడు అవుననలేదు, కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు. కనక మారుమాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కానీ మనసు మనసులో లేదు. స్నానం చెయ్యలేదు, భోజనం చెయ్యలేదు. పోనీ అంటే కునుకు తీయ్యలేదు. అదే ఆలోచన. అటు యోజనగంధి - ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు. గాంగేయుడు గమనించాడు.
తండ్రీ ఏమిటి మీ దిగులు ? అజయ్యుడైన శత్రువు ఉన్నాడా ? చెప్పండి. వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం ? ఋణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడి కొడుకు రోహితుడు - తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంటి దాసుడయ్యాడు. అజీగర్తుడి కొడుకు శునశ్శేఫుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతణ్ణి విశ్వామిత్రుడు రక్షించాడనుకో. తండ్రి ఆనతిమీద పరశురాముడు (జామదగ్న్యుడు) తల్లి శిరస్సు ఖండించాడు. అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు.
*మహారాజా!* ఈ శరీరం మీది. ఏమి చెయ్యాలో చెప్పండి. చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను, ధనుస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థమవ్వాలి మీ కోరికైనా తీరాలి. చెప్పండి. చేస్తాను. సమర్థుడయ్యుండీ తండ్రి కోరిక తీర్చలేనివాడు కొడుకే కాడు. వాడి జన్మ వ్యర్థం.
దేవవ్రతుడు (గాంగేయుడు) ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు.
*కుమారా!* నిజమే. దిగులుగానే ఉంది. నువ్వు ఒకడివేగా నాకు పుత్రుడివి. వీరుడివి, శూరుడివి, సంగ్రామ కోవిదుడివీను. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడనిది జరిగితే నేను నిరాశ్రయుణ్ణి అయిపోనూ. ఇదే నా బాధ. మరింకేమీ లేదు. నిజం.
తండ్రి అసలు పంగతి చెప్పడం లేదని గాంగేయుడికి అర్థమయ్యింది. సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్నీ పెద్దల్నీ పిలిచాడు. నిజం కనుక్కుని నాకు చెప్పండి అన్నాడు. వారు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడుకి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాశరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు.
🌈 *భీష్మ ప్రతిజ్ఞ* 🌈
*దాశరాజా!* మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక. నేను దాసుణ్ణి అవుతాను. మా నాన్నగారికోసం అభ్యర్ధిస్తున్నాను.
*గాంగేయా!* శంతను మహారాజుకు పెద్దకొడుకువు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే, పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వే చేసుకో.
*దాశా !* కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావలసిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికే పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు.
*దేవవ్రతా!* నిజమే. నిన్ను విశ్వసిస్తాను. నీ మాట నమ్ముతాను. కానీ, రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై, నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే ? లాక్కుంటే ఏమిటి, లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి గతి ?
అయితే, దాశరాజా! విను. మీరంతా వినండి. నేనసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. *భీష్మవ్రతం.*
ధీవరప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది. ఆ వివాహం. శంతనుడికి తెలీదు సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు (వ్యాసుడు) జన్మనిచ్చినట్టు.
*(అధ్యాయం - 5, శ్లోకాలు - 59)*
*శౌనకాది మహామునులారా ! సత్యవతీ శంతనుల వివాహ కథ చెప్పాను కదా!*
భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో - అన్నీ తెలిశాయి గదా !
🌈 సత్యవతీ శంతనులకు ఇద్దరు కొడుకులు పుట్టి కాలవశాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడివల్ల అంబికకు (చిత్రాంగదుడి వితంతువు) పుట్టిన కొడుకు - పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుషాంధుడయ్యాడు. అంబాలికకు (విచిత్రవీర్యుడి వితంతువు) పుట్టిన కొడుకు - పాలిపోయిన రంగు. ఎందుకంటే - ఆ సమయంలో వ్యాస రూపానికీ కోపానికీ అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలికా తనయుడు పాండురాజు.
🌈 రెండవసారి కోడలు పిల్ల తన బదులు దాసీని నియోగించింది. అది కామకళా చతుర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తి పరిచింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్త్వికుడూ మేధావీ ధర్మాంశతో విదురుడు జన్మించాడు.
🌈 పెద్దవాడైనా గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడి అనుమతి ఉంది. విదురుడు దాసీ పుత్రుడు కనక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనక మంత్రిగా నియుక్తుడయ్యాడు.
ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు. *సౌబల రాజకుమారి గాంధారి,* *వైశ్య.* పాండురాజుకీ ఇద్దరు. *శూరసేన రాజకుమారి - కుంతి,* *మద్రదేశ రాజపుత్రి - మాద్రి.* గాంధారికి నూరుగురు కొడుకులు. వైశ్యకి ఒకడే కొడుకు. అతడి పేరు *యుయుత్సుడు.*
కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే *సూర్యుడివల్ల కర్ణుడికి* జన్మ ఇచ్చింది. తరవాత పాండురాజును ఉద్వాహమాడింది.
సూతుడు ఈ మాట చెప్పేసరికి శౌనకాదులు అదేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేలమీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డడెలా పుట్టాడు? సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు -
🌈 *కర్ణ జననం* 🌈
*మహామునులారా!* శూరశేనుడి కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతిభోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులకు అతిథులకూ ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది.
ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు. నాలుగు నెలలు సేవలు చేసింది ఈ చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికూన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడంకోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడినే పిలుద్దాం అమకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవరూపం కుంతి ముందు ప్రత్యక్షమయ్యింది. కాంతిమంతంగానూ ఉన్నాడు, మృదువుగానూ ఉన్నాడు. చూడటానికి హాయిగానే ఉన్నాడు కుంతికి ఆశ్చర్యమూ ఆందోళనా కలిగాయి. సూర్యుడేమిటి ఇలా వచ్చెయ్యడమేమిటి ? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో (ప్రథమ) రజస్వల అయ్యింది.
తేరుకోడానికి కొన్ని నిముషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వీ! నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇక చాలు. నీ మండలానికి వెళ్ళిపో - అంది.
*కన్యకా !* ఈమాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్నసలు ఎందుకు పిలిచినట్టు ? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగ ? కాటుక కన్నుల చిన్నదానా ? నీపట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామారుణ్ణి అయ్యాను. సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను. సన్నిధిలో నిలిచాను.
*సర్వసాక్షీ !* నేను కన్యకను. నీకు ధర్మాలు తెలుసు. దండం పెడతాను. దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను. అపవాదు తేవద్దు.
*కుంతీ !* నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు, సిగ్గు. సకల దేవతలూ గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు. లేదంటే నిన్నూ, నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి - ఇద్దరినీ శపిస్తాను. భయపడకు. నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్యా జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాటి కొడుకు పుడతాడు.
ఇలా ఒడబరచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివితీరా ఆఘ్రాణించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయ్యింది. దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచకుండలాలతో మహాతేజస్వి - కొడుకు పుట్టాడు. రెండవ సూర్యుడి లాగా మెరిసిపోతున్నాడు.
దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతీకుమారి భోరున విలపించింది. ఏమి చెయ్యనురా నాయనా ! కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను. ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక ! ఆ విశ్వజనని ఆ కాత్యాయని నిన్ను సాకుగాక ! రవి కుమారా ! నిర్లజ్జగా దుష్ట జారిణిగా నిన్ను అడవులపాలు చేస్తున్నాను. కన్నా ! మళ్ళీ ఎప్పటికి చూస్తానో ! తెలిసి తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండెకోతగా ఉంటుందో ! పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో.
జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించ లేదేమో ! అందుకే నాకీ శిక్ష. పండంటి బిడ్డను కనీ, పెంచుకోలేని దుస్థితి. చేజేతులా వదులుకునే దురవస్థ.
ఎవరైనా చూస్తారు, ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాగి దాది - పెట్టె మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకుని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది.
దాదికి ఒక రథచోదకుడు (సూతుడు) ఎదురయ్యాడు. అతడి భార్య రాధ పూర్వ పరిచయంతో దాదిని పలకరించింది. పెట్టె ఏమిటని అడిగింది. ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం ఇచ్చెయ్యమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడింటిలో బిడ్డడు కర్ణుడయ్యాడు.
*(రేపు పాండవ వృత్తాంతము)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
*సేకరణ:* గురు చరణం
🙏🌹🌹🌹🌹🌹🙏
🙏 శ్రీ మాత్రే నమః🙏