శ్రీదేవీభాగవతము - 19*

P Madhav Kumar


*ద్వితీయ స్కంధము - 04*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 19*


*నఖదీధితిసంఛన్న నమజ్జన తమోగుణా!*

*పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........*                  

 

*శౌనకాది మహామునులారా!*           

కుంతీదేవి కర్ణునికి జన్మనిచ్చిన వృత్తాంతం చదువుకున్నాం కదా!!!


🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *పాండవ వృత్తాంతం* 


అటు పైని కొంత కాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చెట్టపట్టాడు. మాద్రినీ చేసుకున్నాడు.


ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకొని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావు పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు.


ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ, స్త్రీ సుఖానికి నోచుకోక, తపస్సు చేస్తున్నాడు.


పురాణ శ్రవణంలో ఒక సందర్భాన - *అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతప!*

*యేన కేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్ ||* 


అనే శ్లోకం చెవిని పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు.


అంశజుడు (ఔరసుడు, ఆత్మజుడు) దౌహిత్రుడు (కూతురి కొడుకు) క్షేత్రజుడు (నిజభార్యకు పరపురుషుడివల్ల పుట్టినవాడు) గోళకుడు (వితంతు పుత్రుడు) కుండుడు (ఉపభర్తకు పుట్టినవాడు) సహాథుడు (వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు) కానీనుడు (కన్యా పుత్రుడు) క్రీతుడు (కొనుక్కున్న కొడుకు) వనప్రాప్తుడు (దొరికినవాడు) దత్తుడు (దత్తతగా తీసుకున్న కొడుకు) అని పుత్రులు పది రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అథములు.


ఇది విన్నాక పాండురాజుకి మరి నిద్రపట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాం. సౌదాసుడు వసిష్ఠుడివల్ల ఇలా పుత్రుణ్ణి పొందాడుట. కాబట్టి నువ్వూ ప్రయత్నించు. నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు - అన్నాడు.


అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది, అనుమతి పొందింది. 


మొదట యముణ్ణి స్మరించి యుధిషురుణ్ణి ప్రసవించింది. వాయుదేవుడివల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడివల్ల అర్జునుణ్ణి - ఏడాదికి ఒకరు చొప్పున ముగ్గురు మగ పిల్లలను కన్నది. 


మాద్రికి అసంతృప్తి. నాకూ బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికీ ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంటదేవతలు ఆశ్వినులను స్మరించింది. నకులసహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు.


ఒక వసంతంలో ఒక మధురక్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు వద్దు వద్దు వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగలా మాద్రి అతడి పై పడి రోదించింది. కుంతి వచ్చి దుఃఖించింది.


బాలపాండవులు పలవించారు. చుట్టుపక్కల ఆశ్రమాలవారంతా పోగయ్యారు. గగ్గోలు గగ్గోలుగా ఉంది వాతావరణం.


మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు. నకులసహదేవులను కుంతికి అప్పగించి అయిదుగురి సంరక్షణకూ ఆమెను ఆగమని, మాద్రి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరులు కుంతినీ పాండుపుత్రులనూ హస్తినాపురం చేర్చారు.


భీష్ముడూ విదురుడూ ధృతరాష్ట్రుడూ ఇంకా పెద్దలూ పౌరులూ సమావేశం అయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనక ఈ బిడ్డలు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది. లోలోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ అయిదుగురూ దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగ అన్నారు ప్రజలు. యమ వాయు మహేంద్రాశ్వినులను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి - వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లీ బిడ్డలను అంతఃపురంలోకి పంపిచారు.


*(అధ్యాయం - 6, శ్లోకాలు -71)*


పంచపాండవుల ధర్మపత్ని , ద్రౌపది అయిదుగురికీ అయిదుగురు బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది. కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు.


ఈ ఉపపాండవులు ఆరుగురూ కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర (విరాటరాజు కూతురు) గర్భవతి.


బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణంపోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షిణం అయిపోతే, బతికి బట్టకట్టినవాడు కనక ఆ శిశువుకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు.


నూర్గురు కొడుకులు నిహతులుగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేషజీవితం గడుపుతున్నాడు. గాంధారికూడా అలాగే గడుపుతోంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికీ శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు.


భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డి రాజుగారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడి గుండెలు చీల్చి వేడి వేడి నెత్తురు కడుపారా సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడీ పుట్టుగుడ్డి, నేను దయతలచి ఇంత పిండం పడేస్తే సిగ్గులేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం ?


ఇలా భీముడు కుళ్ళబొడుస్తూంటే, మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తున్నాడు. పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను వానప్రస్థం స్వీకరిస్తాను పంపించమని ధర్మజుణ్ణి అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలి పెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు.


ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు.  దుర్యోధనుడి తండ్రికి, ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా ? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా ? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవులపాలు అయ్యాం. మహావీరులమయ్యుండీ విరాటరాజు కొలువులో తలదాచుకున్నాం. దాసదాసీ జనంగా బతుకులు గడిపాం. నువ్వు జూదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిటి తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాణ్ణా?, అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ బృహన్నల అయ్యేవాడా ? గాండీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానమూ దుఃఖమూ ఉంటుందా ? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుణ్ణి బంధిస్తే - నీ మూర్ఖత్వం మండిపోనూ - నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితంకోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకోను. ఇవ్వడానికి వీలులేదు - భీముడు తెగేపి చెప్పాడు. నుడిగాలిలా నిర్గమించాడు.


మిగిలిన ముగ్గురితోనూ కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇచ్చాడు. దానితో ధృతరాష్ట్రుడు దానధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి, గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేనూ వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది. కొడుకులూ కోడళ్ళూ ఎంతగా బతిమాలినా వినలేదు. తెగతెంపులు చేసుకుని బయలుదేరింది. ధర్మజాదులు గంగా తీరంవరకూ సాగనంపి తిరిగి వచ్చారు.


గాంధారీ ధృతరాష్ట్ర కుంతీ విదురులు నలుగురూ జాహ్నవీ తీరంలో శతయూపాశ్రమం చేరుకున్నారు. రెల్లు గడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. ఆరేళ్ళు ఇట్టే గడిచాయి.


యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లినీ పెదతండ్రినీ ఒకసారి చూసిరావాలనిపించింది. మనేదగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా, చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్ళను పిలిచి - మీరు సమ్మతించి నాతో వచ్చేట్టయితే అందరం కలసి వెళ్ళి చూసి వద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర ద్రౌపది ఉత్తర - ఇంకా పౌరులూ బయలుదేరారు. (సంజయుడూ వెళ్ళాడు.) శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడలేదు.


ధర్మజుడు కంగారు పడ్డాడు. పెదతండ్రిని అడిగాడు. విరక్తుడై నిరీహుడై నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగాతీరంలో మరోచోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకల గూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలివేస్తే ఎగిరిపోయేట్టున్నాడు. దగ్గరకు వెళ్ళి *“వందే అహం త్వాం యుధిష్ఠిరః"* అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖంనుంచి చర్రున వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మరాజాంశలే ఇద్దరూ. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు భోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చెయ్యబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు.


సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపొండి - అంది. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి.


వ్యాసుడూ నారదుడూ మరికొందరు మహర్షులూ అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలూ అతిథి మర్యాదలూ అయ్యాయి. కుంతీదేవి వ్యాసుణ్ణి అడిగింది. దివ్యతపోవిభాగా, వ్యాసా! కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహాతపస్వివి. శక్తి సంపన్నుడివి. ఒకసారి చూపించవూ అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకుని దుర్యోధనుణ్ణి చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆవేళ యుద్ధానికి వెళ్ళాడు, మరి తిరిగిరాలేదంటూ కంటతడి పెట్టింది. నూర్గురు కొడుకుల్నీ ఒకసారి చూడాలని ఉంది, చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది. తల్లి పేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి, జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యాసమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాధివాసినిని స్తుతించాడు.


తల్లీ! త్రిమూర్తులూ అష్టదిక్పాలకులూ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలూ ఇంద్రియాలూ బుద్ధీ మనస్సూ వాటి గుణాలూ సూర్యచంద్రులూ ఇవి యేవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రంచేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలివై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్త లేడు. అమ్మా! ఈ దీనురాండ్రు - చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమాలుతున్నారు. నా కంతటి శక్తి లేదు. నువ్వే చూపించు తల్లీ !


శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు వారిని చూశారు. మూర్ఛపోయారు. కర్ణ దుర్యోధనాదులు అంతర్థానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు.


వీడ్కోలు తీసుకుని మహర్షులు శతయూపాశ్రమంనుంచి నిష్క్రమించారు. తరువాత పాండవులు బయలుదేరారు. దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం (హస్తినాపురం) చేరుకున్నారు.


*(అధ్యాయం -7, శ్లోకాలు - 68)*


వీళ్ళు వచ్చిన తరవాత మూడోనాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దవానలం (కార్చిచ్చు) వ్యాపించింది. కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు ముగ్గురూ అగ్నికి ఆహుతి అయ్యారు. సంజయుడు - రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు - ఇంతే సంగతులు. నారదుడివల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు.


కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ముప్పయ్యారేళ్ళకు విప్రశాపం కారణంగా ప్రభాసతీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడూ పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇదీ శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగపద్ధతిలో - శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధిపొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులకందరికీ యథా యోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్ట మహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితి పేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిపి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగివచ్చి అక్కడ మిగిలి ఉన్నవారిని ఖాళీ చేయించాడు.


జలప్లావం సంభవించి ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది.


ద్వారకలో మిగిలిన జనులనూ కృష్ణపత్నులైన గోపికలనూ హస్తినాపురికి తరలిస్తూంటే మార్గ మధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చెయ్యలేని నిస్తేజుడు అయిపోయాడు. వజ్రుడు అనే పేరుగల అనిరుద్ధసుతుణ్ణి యాదవరాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు.


రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు. కన్పించి పార్థుణ్ణి ఓదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మజాదులకు దుఃఖవార్తలు అందించాడు. శ్రీకృష్ణుడి దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది.


హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. ముప్పయ్యారేళ్ళ పరిపాలనకు భరతవాక్యం పలికి, అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుణ్ణి చేసి పాండవులు ద్రౌపదితో ఆరుగురూ హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చాలించారు.


*(రేపు పరీక్షిత్తు వృత్తాంతం)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



🙏🌹🌹🌹🌹🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat