శ్రీదేవీభాగవతము - 20*

P Madhav Kumar


*ద్వితీయ స్కంధము - 05*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 20*


*శింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజా!*

*మరాళీ మందగమనా మహాలావణ్యశేవధిః!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........*                  

 

*శౌనకాది మహామునులారా!*                    

పాండవుల వృత్తాంతము చదువుకున్నాము.  ఈ రోజు......

*పరీక్షిత్తు వృత్తాంతం*

*పమద్వరారువుల కథ*

*తక్షక-కశ్యప సంవాదం* చదువుకుందాం.... 

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *పరీక్షిత్తు వృత్తాంతం* 


పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధంగా అరవై సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకనాడు మృగయా వినోదం కోసం అడవికి వెళ్ళాడు.


బాణం దెబ్బ తిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోడానికి స్వయంగా వెంబడించి వెంబడించి బాగా అలిసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుణ్ణి చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు. ధ్యానసమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతడిలో చలనం లేదు. ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేశాడు.


ముని బాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృతసర్పంతో ఉన్న మునీంద్రుణ్ణి చూసి, పరుగు పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు. అతడు మహాతపస్వి. క్రుద్దుడై కమండలూదకం చేతిలో పోసుకుని శపించాడు - 

*"నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి ఏడవరాత్రి (సప్తరాత్రేణ) తక్షకుడు కాటువేయుగాక !"*


ఈ శాప వార్త మరొక మునిబాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది.


శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలనూ మంత్రులనూ సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు.


మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంతవరకూ తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మణిమంత్రౌషధాల ప్రభావం అపారం. వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బ్రతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేం. చనిపోతారనుకున్నవారు బతకవచ్చు. అంతమాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులమన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ఏ ప్రయత్నమూ లేకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా, నోటిలో వేసుకునే పాటి ప్రయత్నమన్నా చెయ్యాలిగదా! ఎవరైనా మనకోసం తిని పెడతారా లేక పదార్థం తనంతతానే పొట్టలోకి ప్రవేశిస్తుందా ? అందుచేత కార్యం సిద్ధించేవరకూ ప్రయత్నం చెయ్యవలసిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి.


*ప్రయత్నశ్చోద్యమే కార్యో యదా సిద్ధిం న యాతి తత్ |*

*తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబయేత్ బుధః ||*


ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షిత్తుకు ఉపాయమైతే చెప్పలేదు గానీ, అర్ధాయుర్దాయమిచ్చి భార్యను రక్షించుకొన్న ముని కథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు.


꧁┉┅━❀🔯❀━┅┉꧂


🌈 *ప్రమద్వరారురువుల కథ*


పులోమా భృగుమహర్షుల కొడుకు చ్యవనుడు. ఇతడు శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా -


స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి. ధర్మాత్ముడు. సత్యసంధుడు. 


మేనక అనే అప్పరస విశ్వావసువు (గంధర్వుడు) వల్ల  గర్భవతియై ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలి పెట్టి వెళ్ళిపోయింది. ఆ అనాథ శిశువును పెంచి పెద్దచేశాడు స్థూలకేశుడు. ఆమెకు *ప్రమద్వర.* అని నామకరణం చేశాడు. త్రిలోకసుందరి అన్నారు చూసినవారంతా. రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు.


*(అధ్యాయం - 8, శ్లోకాలు - 49)*


రురుడికి మనస్సు మనస్సులో లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి - ఏమిటిరా అబ్బాయి! కథ - అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. ప్రమద్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుణ్ణి చేసుకుని ప్రమద్వర ను కోడలిగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం, ఈలోగా సంబారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటికోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు.


ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది. అది కాటు వేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమం ఘొల్లుమంది. మునులూ మునిపత్నులూ మునిపుత్రులూ మునికన్యలూ విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది.


రురుడు బోరున విలపిస్తూ పరుగు పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉంది అనుకున్నాడు. మునులనూ స్థూలకేశుణదణీ మార్చి మార్చి చూశాడు. ఆశ్రమం ఇవతలికి వచ్చేశాడు.


ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు పాడు దైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేదు. ఒక్కసారైనా స్పృశించలేదు, ఒక్కసారైనా చుంబించలేదు. మందభాగ్యుణ్ణి, పాణిగ్రహణం చెయ్యలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చెయ్యాలనుకున్నాను. అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ - ఛీ ఛీ, ఎంత దారుణం! చద్దామంటే చావే రాదు. ఇంక సుఖాలా ? ఎలా వస్తాయి ? నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో ఉరిపోసుకోవడమో - ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా బతకలేనుగాక బతకలేను.


ఎంత సేపో విలపించాడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏమి సాధిస్తాను ? ఆత్మహత్య మహాపాతకం తప్ప. నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా! పాపిష్ఠి దేవుడొక్కడు సంతోషించవచ్చు గాక. పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా ? జరుగుతుందంటే మరణిస్తాను.


జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతుకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరమవుతుంది. అందుచేత ఆమెకోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి.


రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోకి ఇన్ని నీళ్ళు తీసుకున్నాడు. దైవాన్ని అర్చించడంలాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏవయినా చేసి ఉంటే, అఖిల వేదాలనూ చదివి ఉంటే,  గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుణ్ణి ఏ పూటనైనా ఉపాసించి ఉంటే - నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్ళను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు.


రురూ! సాహసం చెయ్యకు. మరణించిన వ్యక్తి జీవించడమా ? ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాడటానికి ఈ ప్రమద్వర ముని కన్యకాదు. గంధర్వాప్సరసల (విశ్వావసువు, మేనక) కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్ళి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడిందని, ఇంతగా దుఃఖిస్తున్నావ్ ?


దేవదూతా! మరొకతెను నేను ఛస్తే వరించను. ఈమె బతకాలి. లేదంటే నేను చావాలి. అంతే - ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమనీ ఇది దేవతలకు సమ్మతమనీ ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు - ఇదిగో నా ఆయుషులో సగం ధారపోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక - అన్నాడు. 


అంతలో -


పుత్రికా మరణవార్త తెలిసి విశ్వావసువు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయమంతా చెప్పి, తన ఆయుషులోనే సగం ఇస్తానంటున్నాడు కనక, లేదంటే ఆ యువతపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనక, ప్రమద్వరను బతికించవచ్చునని సిఫారసు చేశాడు. ఇంతగా చెబుతున్నావు కనక, విశ్వావసుడూ వచ్చాడు కనక, నీ యిష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు.


మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు. రురుడికి అప్పగించాడు. అటు పైని ఒక శుభముహూర్తాన ఇద్దరికీ వివాహమయ్యింది.


పరీక్షిత్తు ఈ కథను చెప్పి, 


మంత్రులారా! మృతులను సయితం జీవింపజేసుకోవచ్చు. సరియైన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి - అన్నాడు. ఎవరికీ ఏమీ తోచింది కాదు. మౌనంగా ఉండిపోయారు.


ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకొన్నాడు. ఏడుఅంతస్థుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. 


మణిమంత్రౌషధధారులనూ, మహావీరులనూ తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా. ఏనుగులు కాపలా. భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతిలేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజులపాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడీ పచార్లూ. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే. పరిపాలన అక్కడినుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజూ రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు.


ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చుగదా అని ఆశ కలిగింది. హస్తిపురానికి బయలుదేరాడు 


*(అధ్యాయం - 9, శ్లోకాలు - 51)*


꧁┉┅━❀🔯❀━┅┉꧂


 🌈 *తక్షక కశ్యప సంవాదం*


అది ఏడవరోజు. శాపానికి చివరి రోజు. రాజును కాటువెయ్యడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమా! ఏమిటి హడావిడి ? అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు. తక్షకుడే కాదు వాణ్ణి మించిన కాలనాగు కాటువేసినా విషం విరిచెయ్యగలిగిన మంత్రం నాదగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్లకాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్నా, నువ్వు కాటువేసినా పరీక్షిత్తును కాపాడగలననీ కాపాడి తీరతాననీ కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్ర శక్తిని పరీక్షించవలసిందే, ఇదిగో ఈ మర్రిచెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బతికించు చూద్దాం - అన్నాడు. కాటు వేశాడు. అంతటి మహా వటవృక్షమూ రెప్పపాటులో భగ్గునమండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిద అంతా దగ్గరకు పోగుచేశాడు. చేతిలోకి నీళ్ళు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంత వేగంగానూ న్యగ్రోథం లేచి నిలబడింది. మునుపటిలా శకళలాడింది.


తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామదానోపాయాలతో లోబరుచుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసం అంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపొమ్మన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మసందేహాలు అంకురించాయి.


ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి! పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయాక ఎంత ధనం ఉండి ఏమి లాభం ? రఘు మహారాజు కీర్తి కోసమని తన సర్వస్వమూ కౌత్సుడికి (వరతంతు శిష్యుడు) దానం చెయ్యలేదూ! ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడూ కర్ణుడూ ఏమి నేర్పారు !


*రక్షణీయం యశః కామం ధిగ్ధనం యశసా వినా |*

*సర్వస్వం రఘుణా పూర్వం దత్తం విప్రాయ కీర్తయే* | (10 - 21) 


అదీగాక,


రాజుగారు విషాగ్నికి బలి అయిపోతుంటే, దక్షుడనైయ్యుండీ చూస్తూ ఎలా ఊరుకోను! తప్పుకాదూ. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమేకదా! అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు. పరీక్షిత్తును కాపాడవలసిందే - అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు.


ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్యదృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమయ్యింది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్నమరణం. ఎవ్వడూ చెయ్యగలిగింది ఏమీ లేదింక. విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది. దరిద్రం తీరుతుంది. అంతే, పుష్కలంగా ధనం పుచ్చుకుని ఇంటిముఖం పట్టాడు.


తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చెయ్యగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరత్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణిమంత్రౌషధాల రక్షణలో మేడమీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపోపహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను.


దానికేమిగానీ, అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంతపాపం ఎలా చెయ్యగలిగాడు ఈ మూర్ఖుడు ? పైగా రక్షణవలయం ఏర్పరచుకుని మిద్దెమీద కూర్చుంటాడా ? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా ? మరణం అనివార్యమనీ విప్రశాపానికి తిరుగులేదనీ తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారు గదా అని కులుకుతున్నట్టున్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసి పెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడివల్ల అవుతుంది ? తన వంశంలో వీరాధివీరులెందరో వెళ్ళిపోయారు. ఎరుగును. అయినా తానుమాత్రం మృత్యువును తప్పించుకుని ఉట్టికట్టుకు ఊరేగుదామను కుంటున్నాడన్నమాట. ఎంత మూడుడు.


ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది! వాయిదాలు మానేసి దానధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయనీ ఆయుషు పెరుగుతుందనీ పెద్దలు చెబుతారుగదా! అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతువయ్యేది. ఇప్పుడింక నరకమేగా! చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈపాటి సలహా చెప్పలేకపోయాడా ? దురదృష్టం. విధి బలీయం. సరే. ఒక ఎత్తు వేస్తాను. పరీక్షిత్తును చిత్తుచేస్తాను - ఆలోచన ముగించాడు.


తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళూ ఫలాలూ చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తానొక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు.


ద్వారంలో కావలివారు అటకాయించారు. కురువంశంలో ఇటువంటి దెప్పుడూ లేదే, రాజును కాపాడటానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపసులం, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికిస్తాం. లేదా రాజుకు తెలియపరచండి మా రాక - అన్నారు గంభీరంగా దొంగ తాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు.


తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి, వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి. నా నమస్కారాలు అందించండి - అన్నాడు పరీక్షిత్తు.


ఫలాలు లోపలికి వెళ్ళాయి. తనచుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి తానొకటి తీసుకుని ఒలిచాడు ఔత్తరేయుడు (ఉత్తర కొడుకు). అందులోనుంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి.


మంత్రులారా! ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. ఏడు రోజుల గడువు తీరిపోయింది. నాకింక సర్పభయం లేదు. విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక


అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడమీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పం అయ్యింది. రాజును చుట్టివేసింది. కాటు వేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షితుడు.


అంగరక్షకులూ మహామంత్రులూ కకావికలయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుణ్ణి చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులబడిపోతుందని భావించారు.


*(అధ్యాయం -10, శ్లోకాలు - 68)*


పరీక్షితుడి కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేదమంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తరక్రియలు జరిపారు. దుర్మరణం పాలైన పరీక్షిత్తు దేహాన్ని గంధాగురుతరు కాష్టాలతో గంగాతీరంలో అగ్నికి ఆహుతి చేశారు. అన్న వస్త్ర గోసహస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపించారు. రోజులు గడిచాయి.


ఒక సుముహూర్తాన ఆ పసిబాలుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు. ఆ బాలుడి పేరు *జనమేజయుడు.* ప్రజలంతా అతణ్ణి రాజుగా అంగీకరించారు. అతడు దినదిన ప్రవర్థమానుడై పదకొండేళ్ళ ప్రాయం వచ్చేసరికి కులపురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు. కర్ణార్జునులంతటివాడుగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు.


ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా, జితేంద్రియుడిగా రాజ్యం పాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు. సువర్ణవర్మాక్షుడనే కాశీ నరేశ్వరుడు *వపుషమ* అనే తన కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ సుభద్రార్జునుల్లా, వనవిహారాలు చేస్తూ యౌవనసుఖాల అంచులు ముడుతున్నారు. శచీదేవేంద్రుల్లాగా మహా రాజభోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తున్నారు.


*(రేపు ఉత్తంకోపాఖ్యానము)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



🙏 శ్రీ మాత్రే నమః🙏


🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat