*తృతీయ స్కంధము - 03*
✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 24*
*దేవర్షిగణసంఘాత స్తూయమానాత్మ వైభవా!*
*భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్వితా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*త్రిమూర్తులకు కలిగిన దేవీదర్శనం* చదువుకున్నాము.
*అమ్మ దయతో......*
ఈ రోజు తృతీయ స్కంధములోని
*త్రిమూర్తికృత దేవీస్తుతి* చదువుకుందాం......
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🙏 *త్రిమూర్తి కృత దేవీస్తుతి*🌈
*నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్ర్యై సతతం నమః !*
*కల్యాణ్యై కామదాయై చ వృధ్యై సిద్ద్యె నమో నమః !!*
దేవికి నమస్కారం. ప్రకృతికి నమస్కారం. విధాత్రికి నమస్కారం. కల్యాణికి నమస్కారం. కామదకు నమస్కారం. వృద్ధికి నమస్కారం. సిద్ధికి నమస్కారం. సచ్చిదానంద రూపిణికి సంసారారణికి (అరణి) నమస్కారం. పంచకృత్య విధాత్రికి భువనేశికి వందనం. సర్వాధిష్ఠాన రూపకు కూటస్థకు వందనం. అర్ధ మాత్రార్థభూతకు హృల్లేఖకు వందనం.
అమ్మా ! అఖిలమూ నీలోనే సన్నివిష్టమై ఉందనీ నీనుంచే సంభవమూ లయమూ జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తిమంతురాలవనీ, నీ ప్రభావం అనంతమనీ, నువ్వు సకలలోకమయివనీ ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్నీ విస్తరింపజేసి సదసద్వివేకాన్ని (వికారాన్ని) కలిగించి తగిన సమయంలో అవికలస్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు. మమ్మల్ని వినోదింపజెయ్యడం కోసం ఇరవైమూడు తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ (శక్తి) లేనివాడు సర్వాత్మనా అశక్తుడు. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తి పరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవీ! కల్పాంతంలో నీ వైభవాన్ని నీ చరితనూ ఎరిగినవాడు ఎవ్వడూ లేడు. మధుకైటభులనుంచి మమ్మల్ని కాపాడిన జననీ ! నీ దర్శనంవల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం. నీ ప్రభావం రచించిన (సృష్టించిన) భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు! నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు ఈ చతుర్ముఖుడూ ఈ శంకరుడూ కూడా తెలుసుకోలేరు. ఊహించలేరు. ఇంక ఇతరులమాట చెప్పాలా !
హే మహామాయే ! ఈ భువనంలో మరో ముగ్గురు త్రిమూర్తులున్నట్లు ఇప్పుడే చూశాం. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావం అమేయం, అచింత్యం, నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను - ఈ నీ దివ్యరూపం నా హృదయంలో, ఈ నీ దివ్యనామం నా నాలుక పై నిరంతరం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాదపద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారిణివి. మన మధ్యనున్నది తల్లీబిడ్డల అనుబంధం. ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లీ !
ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్నిబట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి స్థితిలయ కారకులు అని మా ముగ్గురికీ లోకంలో ప్రసిద్ధి.
కానీ సత్యమేమిటంటే - నీ ఇచ్ఛవల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం. అంతమాత్రమే.
కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తోంది అనడం అబద్ధం. నిజానికి ఆధారశక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేదికూడా నీ ప్రభతోనే. నువ్వు విరజవు. నీ ప్రభావంతో జన్మించాం కనక మేము నిత్యులం కాదు. ఇక దేవేంద్రాదులమాట చెప్పాలా ? నువ్వు మాత్రమే నిత్యవు. సనాతనవు. పురాణ ప్రకృతివి. ఇంతకాలమూ నేనే *ప్రభుః అనాది: అనీహ: ఈశః విశ్వాత్మకః* అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది.
తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి (విద్య). శక్తిమంతులకు శక్తివి. కీర్తిమంతులకు కీర్తివి. కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి. ప్రథమ వేదకళవు. స్వాహా - స్వధా - భగవతీ శబ్ద వాచ్యవు. సగుణవు. అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడతాయి, నీలోనే భాసిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి ! ఓ మహాదేవీ ! నువ్వే రక్షకురాలివి. ఈ మోహజలధి నుంచి నన్ను ఉద్ధరించు. రాగాదిభావాలను తొలగించి, దుఃఖాలు ఉపశమింపజేసి, సత్యప్రకాశనం కలిగించు. ఓ మహావిద్యా ! ఓ దేవీ ! ఓ శివా ! ఓ సర్వార్థప్రదా ! నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు.
*(అధ్యాయం - 4, శ్లోకాలు-49)*
*నమో దేవి మహావిద్యే నమామి చరణా తవ!*
*సదా జ్ఞానప్రకాశం మే దేహి సర్వార్థదే శివే !!*
నారదా ! విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తరువాత శివుడు భక్త్యావేశంతో స్తుతికి ఉపక్రమించాడు.
ఓ సకలలోక నిర్మాణ చతురా ! బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావంవల్ల జన్మించారంటే నేనూ అంతేకదా! పంచభూతాలు నువ్వే. అవ్వే తిరిగి మరికొన్నింటికి కారణమవుతున్నాయి. బుద్ధి, మనస్సు, అహంకారమూ నువ్వే. త్రిమూర్తులనూ సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు. అసలు సిసలు సృష్టికర్తృత్వం నీది. త్రిమూర్తులూ నీ సృష్టియేకదా ! పంచభూతాలతో సృష్టి జరిగినా దానిలో నీ కళలేనిదే చైతన్యం రాదు. సృష్టిలో జీవకళవు నువ్వు. ప్రాణశక్తివి నువ్వు. అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు. ఆపెయ్యాలనుకున్నప్పుడు ఆపెయ్యగలవు. నీ పాదాంబుజరేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాము.
హే అంబికే ! నువ్వు ఎప్పుడూ దయామయివి కనుక మా ముగ్గురికీ మూడుగుణాలూ మూడు ప్రధాన బాధ్యతలు అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యం ! సచివ - భూపతి - భృత్యభేదాలు. బహుధన - నిర్ధన వైషమ్యాలు. చిత్రవిచిత్రమైన సృష్టి.
అమ్మా ! ఈ శుభవిమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయమయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనం ఇచ్చారు. ఇది కొత్త సృష్టియా ? పాతదేనా? తెలియజెప్పు తల్లీ ! నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో, ఎప్పుడు విరమించాలి అనుకుంటావో, ఎప్పుడు నశింపజెయ్యాలి అనుకుంటావో ఎవ్వరికీ తెలీదు. నీ భర్తృపురుషుణ్ణి మాత్రం ఎప్పుడూ ఆనందపరుస్తుంటావు.
మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితేనేమిలే. నీకు సన్నిహితంగా నిలిచి పాదపద్మాలను అర్చించుకునే అవకాశం లభింపజేశావు. అది చాలు. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం ఈ ఆనందం లభించేదా ? నిజం చెబుతున్నాను తల్లీ! నీ పాదపద్మాలకు దూరమవ్వాల్సి వచ్చేట్టయితే నాకు త్రిభువనాధి పతిత్వమూ వద్దు, పురుషత్వమూ వద్దు. ఈ యువతిత్వం ఇలాగే ఉండనీ.
శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలోనూ నాకు కీర్తి కారణం. నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు. నీ పాదాలను ధ్యానించడం కాక వేరే వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు. అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తపస్సులూ యోగాలూ యాగాలూ వీటివల్ల ముక్తి ఎప్పటికి లభిస్తుందో అసలు లభించదో చెప్పలేను.
కానీ నీ పాదపద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు అదే ముక్తి. అదే మోక్షం. అమ్మా ! నేను నిరంతరం జపించుకుని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్యమంత్రం ఉపదేశించు తల్లీ ! క్రిందటి జన్మలో నవాక్షర తారకమంత్రం ఉపదేశించావు. అది ఇప్పుడు స్ఫురణలో లేదు. దయచేసి మళ్ళీ ప్రబోధించు. ఉపదేశించు.
శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైన ఆ తారకమంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేనూ జగదీశ్వరిని స్తుతించాను.
ఓ సర్వజ్ఞురాలా ! ఇంత సన్నిహితంగా ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు. అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహాస్వరూపిణివి నువ్వే.
ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలమూ భావించాను. ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలగడం ఒక అదృష్టం, ఒక ధన్యత్వం అని ఇప్పుడు తెలుసుకోగలిగాను.
కానీ, తల్లీ ! ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతోంది. నీ పాదపంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం. యథార్థం చెబుతున్నాను. కేవలం నీ దయవల్ల ధన్యుణ్ణి కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహనిగళాలను పటాపంచలు చేసి నాలో నీపట్ల భక్తిని స్థిరపరుచు. సరోజంలో పుట్టాను. దాని నుంచి ఎలా విముక్తుణ్ణి చేస్తావో, అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీ కింకరుణ్ణి. నన్ను దయజూడు.
నిన్నూ నీ ప్రభావాన్నీ ఎరుగనివారు నన్ను ప్రభువు అంటున్నారు. స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం, నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదూ! నువ్వు నన్ను సృష్టించావు. ఆది సృష్టిని చతుర్ధా విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికి తెలుసుకున్నాను. ఇప్పటివరకూ ఉన్న నా అహంకారాన్ని క్షమించు.
అష్టవిధయోగమార్గాలలో అష్టకష్టాలూ పడే మూఢుల్ని చూస్తే జాలివేస్తుంది. ఉచ్చారణ మాత్రంచేతనే పవిత్ర చరితుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామమహిమ వారికి తెలీదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధిపొందరు, అదేమి చిత్రమో గదా !
ఆది సృష్టిని చతుర్ధా విభాగించడమనేది నీకొక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేసివెయ్యగలవు. అయినా విధి అంటూ నన్నొకణ్ణి కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం.
నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడంలాంటిదే. కాకపోతే, మధుకైటభులనుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది ఎందుకనిట ? నా నుదుటినుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నదీ నువ్వే.
నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు గానీ కన్నవాడుగానీ లేడు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు. నువ్వు ఆదిశక్తివి. ఏకైకాద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలూ నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోడానికి మరో మార్గం లేదు. మరో ఉపాయం లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి.
నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలం. లేకపోతే లేదనేది సత్యం. కానీ కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదులు అవుతున్నారు. ఆద్యదేవుడైన ఈశ్వరుడు అకర్త, అనీహుడు, అనుపాధి, అకళశ్రీ. నీ వినోదం నీ వితీర్ణం (శక్తి ప్రదానం) చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు. ఈ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్యదేవేశ్వరుడు నీ విభుడు నీకంటే పూర్వుడు. మరింక మూడవ ప్రమేయం లేదు. (దృష్టం = ప్రకృతి, అదృష్టం = పురుషుడు).
అయితే, అమ్మా ! నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్యకాదు కనక, కానివ్వకూడదు కనక అడుగుతున్నాను. విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు.
*ఏకమేవాద్వితీయం బ్రహ్మ* అనికదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా, లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా ?
*ఏకమేవాద్వితీయం యద్భహ్మ వేదా వదంతి వై !*
*సా కిం త్వం వాప్యసౌ వా కిం సందేహం వినివర్తయ !!*
ఈ ఏకత్వ - ద్విత్వ విచారణంలో మునిగిపోయి నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేకపోతోంది. పుణ్య విశేషంవల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతః వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా ? స్త్రీవా ? అదికూడా తెలియజెప్పు. పరాశక్తిని తెలుసుకుని భవసాగరంనుంచి విముక్తుణ్ణి అవుతాను.
*(అధ్యాయం-5, శ్లోకాలు - 46)*
నారదా ! వినయంగా కేవలజిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది. సందేహం తీర్చింది. ఆ విషయం చెబుతాను, గ్రహించు.
*(రేపు "దేవీకృత తత్త్వోపదేశం - శక్తిప్రదానం)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏