శ్రీదేవీభాగవతము - 23*

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 02*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 23*


*మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ!*

*సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........*                  

నిన్నటి భాగములో *త్రిమూర్తులు సర్వలోక దర్శనం* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*దేవీదర్శనం* చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


 🙏 *దేవీ దర్శనం* 🙏


ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది. అది శివాకారంలో ఉంది. అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి. విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్లు అనిపించింది.


కానీ కాదు. ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది.


దాని మీద ఒక వరాంగన కూర్చుని ఉంది. ఆ స్త్రీమూర్తి ఎర్రనివస్త్రాలు ధరించింది. ఎర్రని పూలమాలలు వేసుకొంది. ఎర్రచందనం పులుముకొంది. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు ఎరుపు.


కోటి మెరుపులు ఒకచోట గుమికూడి నిలిచినట్లు భాసిస్తోంది. మా కన్నులు మిరుమిట్లు గొలిపాయి. సూర్యబింబంలా ఉంది. వరదాభయహస్తాలు కాక తక్కిన రెండింటా పాశాంకుశాలు ధరించింది. ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరగం ఆ దివ్యసుందరమూర్తిని, చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షిబృందాలు సేవిస్తున్నాయి. కరుణామూర్తి. నితాంతారుణ. నవయౌవన. కుమారి. శృంగారోచితమైన సింగారాలు. తామర మొగ్గలవంటి వక్షోజాలు. శ్రీచక్రతాటంకాలూ. తామరపువ్వులూ. మణిమయ భూషణాలు. కనకాంగదకేయూర కిరీట పరిశోభిత. హృల్లేఖా! భువనేశీ ! అని నామజపం చేస్తూ సఖీబృందం స్తుతిస్తోంది. అనంగకుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. షట్కోణ యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది.  మేము ముగ్గురమూ నివ్వెరపోయాం. బొమ్మల్లా నిలబడ్డాం. కన్నులప్పగించి చూస్తున్నాం.


అప్సరసా ? కాదు. గంధర్వాంగనా ? కాదు. దేవతా వనితా ? కాదు. కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు ? పేరు ఏమిటి ? ఇక్కడ ఎందుకు ఉంది ? - ఇవి అన్నీ మాలో రేగుతున్న సందేహాలు. *సహస్రనయన. సహస్రకర. సహస్రవదన.*


*సహస్రనయనా రామా సహస్రకరసంయుతా |*

*సహస్రవదనా రమ్యా భాతి దూరాదసంశయమ్ ||*


విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు. విమానంలో మాతో పాటున్న అంబతో అన్నాడు.


*ఏషా భగవతీ దేవీ సర్వేషాం కారణం హి నః |*

*మహావిద్యా మహామాయా పూర్ణా ప్రకృతి రవ్యయా ||* 


*ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి. మహావిద్య. మహామాయ. పూర్ణ. ప్రకృతి. అవ్యయ (నాశం లేనిది, తరగనిది, మార్పులేనిది). యోగగమ్య. అల్పబుద్ధులకు దుర్ జ్ఞేయ ఇచ్ఛారూపిణి  నిత్యానిత్యస్వరూపిణి. అల్పభాగ్యులకు దురారాధ్య. దేవి. విశ్వేశ్వరి. శివ. వేదగర్భ. విశాలాక్షి. ఆదిమహేశ్వరి. ప్రళయకాలంలో సకల విశ్వాన్నీ - ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది. సర్వజీవకోటి చిహ్నాలనూ తన శరీరంలో విలీనం చేసుకుంటుంది. తానై క్రీడిస్తుంది.*


*ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే!* 

*లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్య చ!!*


సర్వబీజమయి. ఇరువైపులా కోటానుకోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి. సఖీ బృందరూపంలో పరిచర్యలు చేస్తున్నాయి. బ్రహ్మా! శంకరా ! దర్శించండి. మనం ధన్యులం. మనం కృతకృత్యులం. సాక్షాత్తూ దర్శించగలుగుతున్నాం. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలం ఇది. లేకపోతే మనకు ఈ దేవీ దివ్యదర్శనం ఎలా సమకూరుతుంది ! అసంభవం. మహాదాతలకూ మహాతపస్వులకూ మహాయోగులకూ మహా విరక్తులకే తప్ప, సంసారానురక్తులకు దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల పురుషసంగత. పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది. బ్రహ్మాండమూ దేవతలు సమస్తమూ దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. నేనుగానీ లక్ష్మిగానీ దేవతలుగానీ దేవతావనితలుగానీ ఈమెలో లక్షాంశానికి కూడా సాటిరాము.


విరించీ! ఆ వేళ ప్రళయసముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాలలూపిన మహాదేవి - ఈమెయే. వటపత్రంలో శయనించి, కాలిబొటనవేలిని చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాలలూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే. దర్శనంతో జ్ఞానం కలిగింది. పూర్వానుభవంతో గుర్తు వచ్చింది. మన కన్నతల్లి ఈమెయే. *(అధ్యాయం-3, శ్లోకాలు - 67)*


నారదా! మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి వెడదాం, సాష్టాంగ పడదాం, పదాల చెంత నిలిచి స్తుతిద్దాం. పరిచారికలు కనక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్దాం - నడవండి అన్నాడు. సరేనన్నాం. సంబరపడ్డాం. విమానం దిగి త్వరత్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది. చిరునవ్వు విసిరింది. మేము ముగ్గురమూ స్త్రీలుగా మారిపోయాం. దివ్యసుందర రూపాలతో దివ్యాభరణ భూషితలమైపోయాం. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం. పాదాలచెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులను మా పై ప్రసరింపజేసింది. వినయంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం.


నానారత్న విభూషితమై కోటిసూర్య ప్రతీకాశమైన దేవీ పాదపీఠాన్ని తదేకదీక్షగా తిలకిస్తున్నాం.


అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారిణులు. మరికొందరివి నీలాంబరాలు. ఇంకొందరివి పీతాంబరాలు. అందరూ సౌందర్యరాశులే. వారి వస్త్రాలూ విభూషణాలూ కట్టూ బొట్టూ అంతా విచిత్రంగా ఉంది. వినూతనంగా ఉంది. కొందరు పాడుతున్నారు. కొందరు ఆడుతున్నారు. కొందరు నాదస్వరం (వాయు వాద్యాలు) ఊదుతున్నారు. మరి కొందరు వీణలు పలికిస్తున్నారు. గాన మాధుర్యంలో పరవశిస్తున్నారు.


నారదా ! అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది. చెబుతున్నా, మనసు పెట్టి ఆలకించు. దేవీ పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా! మా చూపులు దేవీ పాదపద్మాల పైకి ప్రసరించాయి. బొటనవేలి గోరు ఒక అద్దంలా తళతళలాడింది. చూద్దుముగదా - స్థావరజంగమాత్మకమైన బ్రహ్మాండం అంతా ఆ నఖదర్పణంలో కనిపించింది.


*నఖదర్పణమధ్యే వై దేవ్యాశ్చరణపంకజే |* 

*బ్రహ్మాండమఖీలం సర్వం తత్ర స్థావరజంగమమ్ ||*


మేమూ అష్టదిక్పాలకులూ సూర్యచంద్రులూ నదులూ సముద్రాలూ పర్వతాలూ గంధర్వులు అప్సరసలూ విశ్వావసు చిత్రకేతు శ్వేతకేతు చిత్రాంగదులూ నారదతుంబురులూ, హాహాహూహూవూ (గంధర్వ గాయకుడు), అశ్వినీ దేవతలూ అష్టవసువులూ సిద్ధులూ సాధ్యులూ పితృదేవతలూ నాగకిన్నర కింపురుషయక్షరాక్షసులు ఆదిశేషుడూ, వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలూ - ఒకటేమిటి సమస్తమూ ఆ కాలిగోటిలో ప్రత్యక్షం అయ్యింది.


నా పుట్టిల్లు పద్మమూ దానిలో నేనూ, శేషశాయి, మధుకైటభులూ - అందరూ కనిపించారు. ముగ్గురం ఆశ్చర్యపోయాం. ఏమిటి ఈ వింత అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తుండగానే ఒక వంద సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్టసఖులుగా పరిగణించారు. మా రూపం మా సౌందర్యం మాకే విమోహకంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనస్సులలో చిగురించాయి. యువతీ రూపంలో ఉన్న నిష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు.


*(రేపు "త్రిమూర్తికృత దేవీస్తుతి" )*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat