శ్రీదేవీభాగవతము - 22*

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 01*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 22*


*సుమేరుశృంగమధ్యస్థా శ్రీమన్నగరనాయికా!*

*చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మసనస్థితా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........*                  

*ద్వితీయ స్కంధము*  పూర్తిచేసుకున్నాము.


సత్యవతీ సుతుడైన వ్యాసమహర్షి  జనమేజయునికి ఆస్తీక వృత్తాంతం తెలిపిన తరువాత కూడా జనమేజయునికి మనశ్శాంతి లేదని తెలుసుకొని, దేవీ ఆలయం నిర్మించి, దేవీయజ్ఞం చేసి దేవీభాగవతం వినమని చెప్తాడు.


*అమ్మ దయతో......*

ఈ రోజునుండి తృతీయ స్కంధము ప్రారంభిద్దాము...... 


🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 జనమేజయుడి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది. దేవీయజ్ఞం ఎలా చెయ్యాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుణ్ణి అడిగాడు -


*వ్యాసమహర్షీ!* దేవీయజ్ఞం (అంబామఖం) అన్నావు. అది ఏమిటి, ఎలా చెయ్యాలి, నియమాలు ఏమిటి, ఫలం ఏమిటి? - ఇవన్నీ సవిస్తరంగా చెప్పు. నువ్వు, సర్వజ్ఞుడివి. కనక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలోపనిగా వాటినికూడా తీర్చు. 


🌈 బ్రహ్మవిష్ణుమహేశ్వరులు త్రిమూర్తులనీ సృష్టిస్థితిలయ కారకులని విన్నాను. వారు సగుణులా నిర్గుణులా ? స్వతంత్రులా అస్వతంత్రులా ? ముసలితనమూ మరణమూ వంటి ప్రాణిధర్మాలూ త్రివిధదుఃఖాలూ వారికి ఉన్నాయా ? లేక సచ్చిదానందరూపులా ? వినాలి అని కుతూహలంగా ఉంది. అలాగే అష్ట దిక్పాలకులు ఇంద్రాదులున్నారని వింటున్నాం. వాళ్ళ కథ ఏమిటి ? పుట్టుక ఏమిటి ? కాలవశులా కాదా ? నిద్ర మెలకువ హర్షమూ శోకమూ వంటి లక్షణాలు వాళ్ళకున్నాయా ? మన శరీరాల్లాగానే వాళ్ళ దేహాలూ సప్త ధాతువులతో ఏర్పడ్డాయా, లేక వేరే ద్రవ్యాలతోనా ? వారి గుణాలూ వారి ఇంద్రియ శక్తులు వారి భోగాలూ వారి ఆయుర్దాయాలూ, నివాస స్థానాలూ, వైభవాలూ (విభూతి = ఐశ్వర్యం) ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు.


*జనమేజయా !* చాలా గడ్డు ప్రశ్నలు వేశావు. వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏమీ కాదు. అయినా నాకు తెలిసినంతమేర చెబుతాను. ఆలకించు.


ఒకప్పుడు గంగాతీరంలో నారదమహర్షి దర్శనం అయ్యింది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుకతిన్నెల పై నన్నూ తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, నేనూ నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను. అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు ? కారణం ఏమిటి ? అనిత్యమా, నిత్యమా ? కర్తలేకుండా కార్యోత్పత్తి జరగదు కనక కర్త ఉండే ఉండాలి. ఆ కర్త ఎవరు, ఒకరా, పలువురా? మహర్షీ ! ఈ సందేహ సందోహాలు తెమలక మునిగి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరిని అడిగినా ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. శివుడని ఒకరూ, విష్ణుమూర్తి అని ఒకరూ, బ్రహ్మదేవుడే అని ఒకరూ అంటున్నారు. వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు. సరే - వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారూ ఉన్నారు. వినాయకుడనే వారున్నారు.  వీరెవరూ కానే కాదు కర్తృత్వమంతా ఆదిశక్తిదే, సర్వభూతాలకూ సకల దేవతలకూ కన్నతల్లి ఆ *ఆదిమాయ* అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులూ (గురువులు) ఉన్నారు.


ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి నామధేయాలతో చెబుతున్నారు. ఇంకొందరు - బ్రహ్మపదార్థానిది కర్తృత్వమంటున్నారు. ఆకాశం నుంచి ఊడిపడింది, ఈ బ్రహ్మాండానికి కర్త లేడు, ఇది అనీశం, అకర్తృకం, స్వభావోత్థం, ప్రకృతిసిద్ధం - అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. సతమతమవుతున్నాను.


ఇదికాక, నారదా! ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలడం లేదు. ఏది ధర్మమో, ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మరతులై సత్త్వగుణోపేతులైన దేవతలను, పాపాత్ములూ తామసులు అయిన దానవులు నిత్యమూ పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు. పాండవులు ధర్మాత్ములు కదా ! సదాచార పరాయణులు గదా ! ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి ?


*బ్రహ్మపుత్రా!* నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను, జ్ఞానం అనే నావతో దాటించు. రక్షించు.


*(అధ్యాయం - 1, శ్లోకాలు 50)*


*జనమేజయా!* నువ్వు నన్ను అడిగినట్టే నేనూ ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనక ఓపికగా సమాధానాలు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను, శ్రద్ధగా విని- గ్రహించు. 


నారదుడు నాతో అన్నాడుగదా - 


*వ్యాసమహర్షీ !* ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రిగారిని వేశాను. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా ఎన్ని సాధనలు చేసినా మనస్సుకు శాంతి లభించడం లేదు. పరతత్త్వం తెలియనిదే శాంతి ఎక్కడిది ! సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది !


*అవిజ్ఞాయ పరం తత్త్వం కుతః శాంతిః పరంతప!*

*వికీర్ణం బహుధా చిత్తం న కుత్ర స్థిరతాం వ్రజేత్ !!*


ఎవరిని స్మరించను, ఎవరిని యజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని అర్చించను? - చెప్పు. సర్వేశ్వరుడెవరు ? - ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు.


*నాయనా !* నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే. కానీ సమాధానాలు దుర్బోధాలు. అవికూడా సంసారంపట్ల అనురక్తులకి తెలియవు. విరక్తులూ నిరీహులూ నిర్మత్సరులూ మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు.


మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి, సృష్టి అంతా ఏకార్ణవమైపోయినప్పుడు - కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. వృక్షాలు లేవు. పర్వతాలు లేవు. తామరపువ్వు దుద్దులో కూర్చుని ఉన్నాను' - ఒంటరిగా. ఆలోచించాను.


అంతా జలమయం అయిపోయిన ఈ సమయంలో నేను ఎలా ఎందుకు జన్మించాను ? నాకు రక్షకుడెవరు ? కర్త ఎవరు ? సంహర్త ఎవరు ? ఈ జలం అంతా దేనిమీద ఆధారపడి ఉంది ? భూమి అందామంటే, అది ఎక్కడా కనిపించడమే లేదు. పోనీ, నేను కూర్చున్న ఈ పంజకం సంగతి ఏమిటి ? యోగరూఢమైన పదంకదా (వ్యుత్పత్తి కుదిరి, ఒక అర్థంలో స్థిరపడిన పదం) మరి (పంకం) బురద ఏది? వెదుకుదాం, దీని మూలం పట్టుకుందాం అనిపించింది. బహుశ అక్కడ భూమికూడా కనిపించవచ్చు ననిపించింది. నీటిలోకి దిగాను. వెదికాను. వెదికాను, వెయ్యి సంవత్సరాలు వెదికాను, భూమి లేదు, మొదలూ లేదు. ఏదీ కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి *“తపః తప”* (తపస్సు చెయ్యి) అంటూ అశరీరవాణి ఒకటి వినిపించింది. అలాగేనని పద్మంలో కూర్చుని వెయ్యేళ్ళు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. *“సృజ”* (సృష్టించు) అంది. ఎవరిని సృష్టించనూ, ఏం చెయ్యనూ! అగమ్యగోచరంగా ఉంది. విమూఢుడనై కూర్చున్నాను.


అంతలోకీ మధుకైటభులనే రాక్షసులు ఇద్దరు వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయ పెట్టారు. అప్పుడు - తామరపువ్వు కాడలోనుంచి కిందికి నీటిలోకి దిగాను.  చాలా లోతుకి దిగాను.  అక్కడొక అద్భుత పురుషుడు కనిపించాడు. నీలమేఘశ్యాముడు. పీతాంబరుడు. చతుర్భుజుడు. వనమాలి. శేషశాయి. జగన్నాథుడు. శంఖచక్రగదాపద్మధారి. మహావిష్ణువును దర్శించాను. ఆదిశేషుడి పడగలమీద పడుకొని ఉన్నాడు. యోగనిద్రలో అవిస్పందుడుగా ఉన్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు.


అప్పుడు నిద్రా స్వరూపిణి అయిన దేవిని స్మరించాను. స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి వెలువడి బయటకు వచ్చి నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది.


జనార్దనుడు మేల్కొన్నాడు. మధుకైటభులతో అయిదువేల సంవత్సరాలు యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాం. జగదంబ - సంతోషించింది. పావనమైన కృపావిలోకనాలను మా పైకి ప్రసరింపజేసింది. అంబ పలికింది -


బ్రహ్మ విష్ణుమహేశ్వరులారా! మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి. మధుకైటభులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి. బ్రహ్మా! నాలుగు విధాల సృష్టినీ నిర్వహించు.


మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. విన్నాను. అప్పుడు అన్నాను గదా - అంబా! అశక్తులం. ప్రజలను ఎలా సృష్టించగలం ? ఎక్కడా నేల కనిపించడం లేదు. అంతటా జలమే. నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగ ? పంచభూతాలు లేవు. ఇంద్రియాలు లేవు. పంచతన్మాత్రలు లేవు. నీరు తప్ప


ఏమీ లేదాయె. ఎలాగ ?- అన్నాం. మా మాటలకు జగదంబిక చిన్నగా నవ్వింది. 


అంతలో ఒక శుభ విమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా! మీకో అద్భుతం చూపిస్తాను. రండి. విమానం ఎక్కండి - అని ఆజ్ఞాపించింది. ఓమ్ అని మేము ముగ్గురమూ అధిరోహించాం. (ఓమ్ అనేది అంగీకార సూచకం. "అలాగే" అనడానికి పర్యాయపదం). అది రత్నాలంకృతమైన దివ్యవిమానం. ముత్యాలదండలు వేలాడుతున్నాయి. దేవమందిరంలాగా ఉంది. చిరుగంటల చప్పుడు ఇంపుగా వినపడుతోంది. ముగ్గురం నిశ్శంకగా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది.


*(అధ్యాయం - 2, శ్లోకాలు - 41)*


🙏 *త్రిమూర్తులు - సర్వలోక సందర్శన* 🌈


 విమానం వేగంగా దూసుకుపోతోంది. ఒక ప్రదేశంలోకి వెళ్ళేసరికి ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్ళు కనిపించలేదు. ఫలభరితాలైన వృక్షాలు. కోకిలకలకూజితాలు, రమణీయమైన ఉద్యానవనాలు. పర్వతాలు. పచ్చికనేల. నదులు. స్త్రీ పురుషులు. రకరకాల మృగాలు. వాపీకూపతటాకపల్వలాలు. సెలయేరులు. అన్నీ అద్భుతంగా కన్నులపండువుగా కనబడుతున్నాయి. విమానం వెడుతోంది. ఎట్టయెదుట సుందరనగరం. దివ్యప్రాకారం. బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు. లోగిళ్ళలో యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని. ఎవరు నిర్మించారోకదా ఇంత అబ్బురంగా అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు చూపు సారించాం. దివ్యతేజస్సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు.


మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది. అక్కడ నందనవనం కనిపించింది. అందులో ఘుమఘుమలాడుతోంది. పారిజాత వృక్షం. దాని నీడలో నాలుగుదంతాల ఐరావతం. వనమంతటా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు. నృత్యసంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంధర్వులు యక్షులు విద్యాధరులు వందలు వందలు. ఆ మందారవనంలో ఆడుతున్నారు పాడుతున్నారు ఆనందిస్తున్నారు. పౌలోమి (శచి) సహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు. యమకుబేరవరుణాగ్ని సూర్య దేవతలు కనిపించారు. సంతోషించాం. త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతగానో అబ్బురపడ్డాం.


విమానం ఇంకా పై పైకి ఎగిరింది. మునుముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరుకుంది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మ సభలో - సకల వేదాలూ సకల శాస్త్రాలూ (వేదాంగాలు) సాకారంగా దర్శనమిచ్చాయి. సాగర - నదీ - పర్వతాధిదేవతలు అక్కడే ఉన్నారు.


ఈ చతుర్ముఖుడు అచ్చం నీలాగే ఉన్నాడు, ఎవరయ్యా ఇతడని శివకేశవులు నన్ను అడిగారు. ఏమో, తెలియదన్నాను. నేనెవరినీ, ఈయన ఎవరూ నాకు ఈ భ్రమ ఏమిటీ - అంతా అగమ్యగోచరం.


మరుక్షణంలో విమానం కైలాస శిఖరంమీద ఉంది. అక్కడ అంతటా ప్రమథులూ, యక్షులు కిటకిటలాడుతున్నారు. మందారవనాల్లో కీరకోకిల మంజునాదాలు మారుమ్రోగుతున్నాయి. వీణా మృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి. అంతలోకీ - వృషభారూఢుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి ఈవలికి వచ్చాడు. అయిదు ముఖాలతో, పది చేతులతో, సిగలో నెలవంకతో, మొలకు పులితోలుతో, కండువాగా భుజాల పై ఏనుగు తోలుతో, గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు. నందీశ్వరుడు మొదలైన ప్రమథులు జయజయధ్వానాలతో వెంటనడుస్తున్నారు.


*నారదా!* ఈ మరో శంకరుణ్ణి చూసి నేనూ మా తండ్రి విస్మితులమయ్యాం. మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది. ఊహకందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది. విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందాడు. ఆ వైకుంఠంలో అతసీకుసుమ సంకాశుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతుని పై కనిపించాడు. లక్ష్మీదేవి వింజామరులు వీస్తోంది. గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి. 

(అతసీకుసుమం = అవిసె పువ్వు) 

శివుడూ నేనూ చకితులమయ్యాం. ముగ్గురం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. విమానం వెడుతూనే ఉంది.


క్షీరసముద్రం వచ్చింది. తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచిపడుతున్నాయి. హోరు చెవులకు సోకుతోంది. ఆ సముద్రమధ్యంలో ఒక ద్వీపం. మందార పారిజాతాది దివ్యవృక్షాలు దట్టంగా అలముకొని ఉన్నాయి. చిత్రవిచిత్రాలైన ఆస్తరణాలు (తివాసీలు) పరిచి ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. పూలదండలకు లెక్కలేదు. అశోక - వకుళ వృక్షాలూ, మొగిలిపొదలూ సంపెంగ పొదలూ పరిమళాలను వెదజల్లుతున్నాయి. కోకిలల కూతలూ తుమ్మెదల ఝంకారాలూ శ్రుతిపక్వంగా వినిపిస్తున్నాయి.


*(రేపటి భాగంలో "దేవీ దర్శనం")*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


🙏🌹🌹🌹🌹🌹🙏



🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat