శ్రీదేవీభాగవతము - 21*

P Madhav Kumar


*ద్వితీయ స్కంధము - 06 (చివరిభాగం)*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 21*


*సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా!*

*శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........*                  

 

*శౌనకాది మహామునులారా!*                          

*పరీక్షిత్తు వృత్తాంతం*

*పమద్వరారువుల కథ*

*తక్షక-కశ్యప సంవాదం* చదువుకున్నాము. 


🙏 *అమ్మ దయతో...... ఈ రోజు.....*


*ఉత్తంకోపాఖ్యానము*

*ఆస్తీక వృత్తాంతము*

 చదువుకుని *ద్వితీయ స్కంధము* ముగిద్దాము.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *ఉత్తంకోపాఖ్యానము*


ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమేజయుడి దర్శనానికి వచ్చాడు. ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు. ప్రతీకారం తీర్చుకోడానికి మార్గం అన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు.


*జనమేజయా!* నిన్ను చూస్తుంటే జాలివేస్తోంది. కార్యాకార్యాలు తెలుసుకోలేని పసిబాలుడిలా కనిపిస్తున్నావు. చెయ్యవలసిందేమో చెయ్యడం లేదు, చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు. కసీ, పౌరుషం లేని నీవంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ఏమి ప్రయోజనం! తంత్రం తెలీదు, మంత్రం తెలీదు, ఎవరు శత్రువులో అంతకన్నా తెలీదు. అన్నీ బాలచేష్టలు, బాల చేష్టలు - అంటూ తలత్రిప్పి చీదరింపుగా గొణుక్కున్నాడు.


*ఉత్తంకర్షి!* నీ మాటలు నాకేమీ అర్ధం కావడం లేదు. నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు, ప్రతీకారం చెయ్యలేదు ? వివరంగా చెప్పు. అప్పుడు, ఏం చెయ్యాలో అది చేస్తాను.


*రాజా!* తెలీదన్నావు కాబట్టి చెబుతున్నాను. విను. మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా ? సహజమరణం కాదు. దుర్మరణం. తక్షకుడనే సర్పదుష్టుడు పొట్టన పెట్టుకున్నాడు. కావలిస్తే - ఉన్నారుగా నీ వృద్ధమంత్రులు - వారిని అడుగు.


జనమేజయుడు వెంటనే మంత్రులను పిలిచి విషయం అడిగాడు. విప్రశాపం కారణంగా తక్షక సర్ప సందష్టుడై పరీక్షిత్తు దివంగతుడైన సంగతిని వారు వివరించి చెప్పారు. అవునుమరి, విప్రశాపం కారణం తప్ప తక్షకుడి తప్పు ఏముంది ? అని జనమేయుడు ఎదురు ప్రశ్న వేశాడు.


ఆఁహాఁ! అలాగా నాయనా! పుష్కలంగా ధనం ఇచ్చి కశ్యపుణ్ణి వారించలేదా ఆ దుష్టుడు ? కాపాడగలిగినవాణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్ళించినవాడు శత్రువుకాక, మిత్రుడవుతాడా ? నీకంటే - మునిబాలకుడైనా రురుడు నయం. వెనకటికి ఒక పాము, తాను వివాహమాడబోయిన ప్రమద్వరను కరిచి చంపిందని, ప్రతిజ్ఞచేసి సర్పసంహారం మొదలు పెట్టాడు. ఎప్పుడూ కర్రపుచ్చుకునే తిరుగుతూ, కనిపించిన పామునల్లా బాది చంపాడు. కొన్నింటిని వెదికి వెదికి మరీ చంపాడు. ద్వితీయ స్కంధము అలా చంపుతూండగా ఒక వనంలో *డుండుభం* అనే ముసలిపాము కంటబడింది. చంపబోయాడు. అది - రురూ! నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావు ? అని ప్రశ్నించింది. రురుడు తన ప్రియురాలి మరణం తన ప్రతిజ్ఞకరణం వివరించి, అందుకని చంపుతానన్నాడు.


*రురూ !* నీ ప్రమద్వరను కరిచింది నేను కాదు. అసలు ఇంతవరకూ నేనెవరినీ కరవలేదు. మిగతా పాములు కరిస్తే కరవచ్చు. రూప సామ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యంకాదు.


హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరివి ? సర్పరూపం ఎందుకు పొందావు ? - అని అడిగాడు.


*రురూ !* చెబుతున్నాను, విను. నేను బ్రాహ్మణుణ్ణి , చిననాట నాకో మిత్రుడున్నాడు. అతడి పేరు ఖగముడు. మహాతపస్వి. వట్టి అమాయకుడు. ఒకరోజున అతడు ఏకాగ్రచిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను. ఎండుగడ్డిని వెంటి చుట్టి (తాళ్లక) పాముగా చేసి అతణ్ణి భయ పెట్టాను. బాల్యచేష్ట. కానీ అతడు నిజంగా భయపడిపోయాడు. గజగజా వణికిపోయాడు. నేను కేరింతలు కొడుతూంటే, పట్టరాని కోపంతో శపించాడు. పామువైపొమ్మన్నాడు. గబగబా వెళ్ళి గడ్డితాడు చూపించాను. ఇది నిజంపాము కాదని వివరించాను. అప్పటికి భయం తీరి ఖగముడు కొంత శాంతించాడు.


మందబుద్ధీ! నన్ను భయ పెట్టావు కాబట్టి శపించాను. నువ్వు పామువు కాక తప్పదు. అయితే, మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాపవిమోచనం చెబుతున్నాను విను. ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాపవిముక్తి కలిగిస్తాడు - అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపోయాడు.


ఇదీ నా కథ. నువ్వు రురుడివి. నేను విప్రుణ్ణి. ఒక మంచిమాట చెబుతాను ఆలకించు. అర్థం చేసుకో. అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం. విప్రులకు మరీను. వాళ్ళు విద్యావివేక సంపన్నులు కనక సకలజీవరాశి పట్లా దయగా ఉండాలి. యజ్ఞాలలో మినహా మరెక్కడా ఏ హింసా చెయ్యకూడదు.


*అహింసా పరమో ధర్మః విప్రాణాం నాత్ర సంశయః I*

*దయా సర్వత్ర కర్తవ్యా బ్రాహ్మణేన విజానతా ||*

*యజ్ఞాదన్యత్ర విప్రేంద్ర న హింసా యాజ్ఞకీ మతా |*


ఈ ఉపదేశం చేసి డుండుభం తన సర్పరూపం విడిచి పెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు. అప్పటినుంచీ రురుడు హింసను విడిచి పెట్టాడు. తరవాత అర్ధాయుర్ధానంతో ప్రమద్వరను బతికించుకుని వివాహం చేసుకున్నాడనుకో, అది వేరే సంగతి.


ఇంతకీ జనమేజయా! బ్రాహ్మణుడైనా నీకన్నా ఆ రురుడే నయం. తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు. నువ్వు క్షత్రియుడివయ్యుండీ పాములను ఉపేక్షిస్తున్నావు. పితృఘాతకులను సుఖంగా బతకనిస్తున్నావు. అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతున్నాడు. స్నానపానాదులు వదిలేసి కూర్చున్నాడు. ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు. సర్పాలను సంహరించు. తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతికి ఉండీ మృతుడితో సమానం. లే. బతికే ఉన్నాననిపించుకో. పాపశంక పెట్టుకోకు. యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు. సర్పయాగం ప్రారంభించు. ఇది అంబామఖం.


*శౌనకాది మహామునులారా!* ఉత్తంకుడి ఉపదేశంతో జనమేజయుడు రెచ్చిపోయాడు. కన్నీళ్ళు తుడుచుకున్నాడు. తండ్రికి ఉత్తమగతులు కలిగించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు. ఈరోజే యాగం ప్రారంభించి పితృఋణం తీర్చుకుంటానన్నాడు. భగభగలాడుతున్న మంటలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్నిని చల్లార్చుకుంటానన్నాడు. మంత్రులను అందరినీ పిలిచాడు. గంగాతీరంలో భూమి కొలిపించి చదును చేయించండి. నూరుస్తంభాలతో అందంగా మండపం కట్టించండి. యజ్ఞవేదిని నిర్మింపించండి. యజ్ఞసంబారాలు సమకూర్చండి. నేను సర్పయాగం చెయ్యాలి. యజ్ఞపశువు - తక్షకుడు. యజ్ఞహోత - ఉత్తంకుడు. వేదపండితులనందరినీ ఆహ్వానించండి. త్వరగా.


రాజాజ్ఞమేరకు అన్ని ఏర్పాటయ్యాయి. సర్పహవనం మొదలయ్యింది. తక్షకుడు భయపడ్డాడు. ఇంద్రుడి సన్నిధికి పరుగెత్తాడు. అతడు ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయం ఇచ్చాడు. ఉత్తంకుడు ఇది గ్రహించాడు. పట్టుదల పెరిగింది. *సహేంద్రతక్షకాయస్వాహా* అంటూ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి నిమంత్రించాడు. ఇద్దరూ వచ్చి యజ్ఞకుండంలో రాలిపడాలి. 


అంతలో తక్షకుడు ఆస్తీకుణ్ణి తలచుకొన్నాడు. అతడు యాయావరకులోద్భవుడు. ధర్మాత్ముడు. జరత్కారుని కొడుకు. ఆ మునిబాలుడు ఆస్తీకుడు జనమేజయుణ్ణి సమీపించి ప్రశంసావాక్యాలు పలికాడు. రాజు సంతోషించి ఆ బాలపండితుణ్ణి బహుధా అర్చించి సత్కరించాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. అతడు వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలి అని కోరుకున్నాడు. మాటకు నిలబడే మహారాజు కవక యజ్ఞాన్ని ఆపేశాడు. సర్పహోమం ఆగిపోయింది. ఆస్తీకుడు సంతోషించాడు. వైశంపాయనుణ్ణి పిలిచి జనమేజయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు. విన్నా రాజుకు మనశ్శాంతి లభించలేదు. సాక్షాత్తుగా వ్యాసుణ్ణే అడిగాడు.


*హే భగవన్, వ్యాస!* నా మనస్సు దహించుకుపోతోంది. అర్జునుడంతటివాడికి పౌత్రుడు మా తండ్రి. సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం. ఇంటిలో మరణించినా కనీసం అది సహజమరణమైతే అదొక పద్ధతి. ఇదేమిటిది - దారుణం. మా తండ్రిగారిది దుర్మరణం. అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతున్నాడు. శాంతి ఉపాయం చెప్పు. వెంటనే మా తండ్రిగారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు -


జనమేజయుడు అభ్యర్థించాడు.


*(అధ్యాయం -11, శ్లోకాలు - 65)*


 సత్యవతీసుతుడు సభామండపంలో కూర్చుని సమాధానం చెప్పాడు. 


*చిరంజీవీ, జనమేజయా!* అతిరహస్యమూ అత్యద్భుతమూ ఒక పురాణం చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించు. *శుభప్రదమైన భాగవతం ఇది.* ఇందులో ఎన్నో కథలూ ఉపకథలూ ఉంటాయి. ఒకప్పుడు నా కుమారుడు శుకుడికి వినిపించాను. ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను. ఇది పరమగుహ్యం సుమా! విన్నంతమాత్రంచేతనే చతుర్విధ పురుషార్థాలూ సిద్ధిస్తాయి. ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి.


ఉపోద్ఘాతం సాగుతుండగానే జనమేజయుడు అడ్డుతగిలాడు. ఈ ఆస్తీకుడు ఎవరు ? నా సర్పయాగం ఎందుకు ఆపాడు ? పాములను కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి ? - ఇదంతా సవిస్తరంగా చెప్పి అటు పైని పురాణం వివరించు- అన్నాడు. అలాగేనన్నాడు వ్యాసుడు.


🌈 *ఆస్తీక వృత్తాంతం*


*జనమేజయా!* జరత్కారుడు అని ఒక మునీశ్వరుడు ఉన్నాడు. శాంత స్వభావుడు. గృహస్థాశ్రమం స్వీకరించలేదు. అతడు ఒకరోజున ఒకానొక అడవిలో పెద్ద గోతిలో వేలాడుతున్న తన పూర్వీకులను చూశాడు. ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పితలు అన్నారుగదా - నాయనా ! నువ్వు త్వరగా వివాహం చేసుకో. అప్పటిదాకా మా పని ఇంతే. ముక్తి లేదు. స్వర్గం లేదు. జరత్కారుడు సమాధానం చెప్పాడు. సనామధేయురాలూ నాకు అతి వివశురాలూ అయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా -


కశ్యప ప్రజాపతి భార్యలు కద్రూ వినతలు ఓ సాయంకాలం వేళ సముద్రతీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాశ్వాన్ని చూశారు. దాని రంగు ఏమిటంటే ఏమిటి అనుకున్నారు. శ్వేతాశ్వమంది వినత. కృష్ణవర్ణమంది కద్రువ. వాదులాడుకున్నారు. పందెం వేసుకున్నారు.  దాసీత్వం పణంగా పెట్టుకున్నారు. రేపు వచ్చి దగ్గరకు వెళ్ళి చూసి తేల్చుకుందాం అనుకున్నారు.


కద్రువ తన పిల్లలకు రహస్యంగా చెప్పింది. పిల్ల పాముల్లారా ! మీరు వెళ్ళి గుర్రానికి చుట్టుకుని నల్లగా కనిపించేట్టు చెయ్యండి అంది. దీనికి కొన్ని పాములు అంగీకరించలేదు. జనమేజయుడి యాగంలో అగ్నికి ఆహుతి కమ్మని వారిని శపించింది.


తక్కిన పాములు వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకుని దాన్ని మాత్రం నల్లగా కనిపించేట్టు చేశాయి. తోడికోడళ్ళు వెళ్ళి చూసేసరికి తోక నల్లగా కనిపించింది. కద్రువనెగ్గింది. వినత ఓడిపోయింది. కనక దాసీత్వం పట్టాలి.


దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు. కారణం అడిగి తెలుసుకున్నాడు. నాయనా! నేను కద్రువకు దాసినయ్యాను. ఆవిడ ఏ పని చెబితే అది చెయ్యాలి. మొయ్యమంటే మొయ్యాలి. ఇంక ఈ బతుకు ఇంతేనంది.  నిజంగా మొయ్యమంటే నేనున్నానుగా. మోస్తానులే. ఎక్కడికి మొయ్యమంటే అక్కడికి మోస్తాను. నువ్వేమి బాధపడకు. నిన్ను దాస్యం నుంచి విముక్తురాలిని చేయిస్తాను. రా - అంటూ కద్రువ దగ్గరికి తీసుకువెళ్ళాడు. పినతల్లిని సోదరులతో సహా బుజాన ఎక్కించుకుని సముద్రం ఆవలి తీరానికి మోసుకు వెళ్ళాడు గరుడుడు. అక్కడ అడిగాడు. పినతల్లీ! నా కన్నతల్లికి ఈ దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పు అని అభ్యర్థించాడు. నువ్వు కనక దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకువచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తను చేస్తాను - అని చెప్పింది కద్రువ.


గరుత్మంతుడు ఒక్క ఉదుటున ఇంద్రలోకానికి ఎగిరాడు. దేవతలతో హోరాహోరీ యుద్ధం చేశాడు. ఎలాగైతేనేం అమృతభాండం చేజిక్కించుకున్నాడు. సరాసరి వచ్చి కద్రువకు అందించి, వినతాదేవికి దాస్యవిముక్తి కలిగించాడు.


పవిత్రంగా దర్భలు పరిచి అమృతభాండాన్ని దానిమీద ఉంచారు. స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్ళారు. ఇంతలోకీ ఇంద్రుడు సుధాభాండాన్ని అపహరించుకుపోయాడు. సుస్నాతులై వచ్చిన సర్పపుత్రులు ఆశగా ఆబగా దర్భలు నాకారు. నాలుకలు చీరుకు పోయాయి. అప్పటినుంచీ సర్పాలు ద్విజిహ్వాలు అయ్యాయి.


అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారులు వాసుకి ప్రముఖులు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఆయన ఒక ఉపాయం చెప్పాడు.


జరత్కారుడనే ఒక మహాముని ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు. అతడికి వాసుకి సోదరి జరత్కారును ఇచ్చి వివాహం చెయ్యండి. అతడు సనామధేయురాలినే వివాహం చేసుకుంటాడు. *జరత్కారూ జరత్కారువులకు ఆస్తీకుడనే కొడుకు పుడతాడు.* అతడు మిమ్మల్ని కాపాడతాడు. వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పి పంపించాడు.


వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్ళి జరత్కారుణ్ణి వెతికి పట్టుకుని స్వయంగా తన చెల్లెలినిచ్చి వినయంగా వివాహం జరిపించాడు. నాకు అప్రియం చేసిందంటే చాలు వదిలేస్తానని నియమం పెట్టి జరత్కారుడు ఆమెను స్వీకరించాడు. పర్ణశాల కట్టుకుని కాపురం పెట్టాడు. సుఖంగా సంసారం సాగుతోంది.


ఒకరోజున సుష్ఠుగా మధ్యాహ్నభోజనం చేసి నడుం వాల్చాడు జరత్కారుడు. ఎట్టి పరిస్థితులలోనూ నన్ను నిద్రలేపకు అని భార్యకు ఆజ్ఞాపించి గుర్రుకొట్టాడు.


సూర్యాస్తమయం అయ్యింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనక వదిలేస్తాడు. లేపకపోతే సంధ్యోపాసన చెయ్యని ధర్మలోపం చుట్టుకుంటుంది. ఏమి చెయ్యాలో తోచలేదు ఆ మునిపత్నికి. ఈ రెండింటిలో నరకానికి తీసుకుపోయే ధర్మహానికన్నా మొదటిదే మేలనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను, అంతేగదా. పరవాలేదు అనుకుని భర్తను నిద్రలేపింది. సాయం సంధ్యకు వేళ అయ్యింది, లేవండి లేవండి - అంది. లేస్తూనే మండిపడ్డాడు జరత్కారుడు. నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా, నిన్ను వదిలేసి నేను పోతున్నాను, నువ్వు నీ సోదరుడి ఇంటికి ఫో - అన్నాడు. భయంతో వణికిపోతూ ఆమె అన్నదిగదా - మా అన్నగారు ఏ ఫలంకోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరెలా నెరవేరుతుంది - అని రవ్వంత సిగ్గుపడుతూ నుంచుంది. చీకూ చింతా లేని జరత్కారుడు గుమ్మందాటబోతూ క్షణం ఆగి ఈ సందేహానికి సమాధానంగా “తదస్తి” అనేసి వెళ్ళిపోయాడు. (తత్ అస్తి = అది ఉంది).


మునికాంత - వాసుకి ఇంటికి వచ్చేసింది. ఏమిటి విషయమని అన్నగారు అడిగితే తదస్తి వరకూ చెప్పింది. వాసుకి సంతోషించాడు. జరత్కారుడు సత్యసంధుడు కనక అతడి మాటను విశ్వసించి సోదరిని లాలనగా చూసుకున్నాడు. తరవాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. అతడే ఆస్తీకుడు.


*జనమేజయా!* తల్లివైపు బంధువులను కాపాడుకోవడం కోసం ఆస్తీకుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపించేశాడు. ఆ యాయావరకులీనుడూ వాసుకి మేనల్లుడూ అయిన ఆ మునిబాలుడి కోరికను మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం. 


సరే - నాయనా ! భారతం అంతా విన్నావు. అయినా మనశ్శాంతి కలగలేదు. నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలేదు. అందుచేత - సువిశాలంగా సర్వాంగసుందరంగా భక్తి ప్రపత్తులతో దేవీ ఆలయం కట్టించు. నీ సకలవాంఛితాలూ సిద్ధిస్తాయి. భక్తితో కనక నిత్యం పూజిస్తే ఆ శివాని నీ వంశాన్ని వృద్ధి పొందిస్తుంది. నీ రాజ్యాన్ని స్థిరపరచి రక్షిస్తుంది. విధివిధానంగా దేవీయజ్ఞం చేసి శ్రద్ధగా దేవీ భాగవతం విను. నవరసాలతో వినసొంపుగా ఉండే ఆ దివ్యపురాణాన్ని నీకు వినిపిస్తాను. తరిద్దువుగాని. ఇంతకన్నా వినదగిన పురాణం మరొకటి లేదు, ఇంతకన్నా ఆరాధించదగిన దేవత లేదు.


*న శ్రోతవ్యం పరం చాస్మాత్పురాణా ద్విద్యతే భువి |*

*నారాధ్యం విద్యతే రాజన్! దేవీ పాదాంబుజాదృతే ||*


*జనమేజయా!* ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం. దేవిని ఆరాధించక పోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు. ఆరాధించని వారంతా దుఃఖభాగులే. బ్రహ్మాదులే భక్తితో అర్చించే దేవీ పాదపద్మాలను ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను. శ్రీమద్దేవీభాగవతం శ్రద్ధగా విను. నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలను పొందుతారు.


*(అధ్యాయం 12, శ్లోకాలు 64)*


*ద్వితీయ స్కంధం - 722 శ్లోకాలు - తెలుగుసేత : బేతవోలు రామబ్రహ్మం*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



🙏🌹🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat