శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 26 వ భాగం

P Madhav Kumar


థామస్ మన్రో


శ్రీరాఘవేంద్రస్వామి విరోధి నామసంవత్సర శ్రావణ బహుళ ద్వితీయ (1593 AD)దినమున బృందావన మును ప్రవేశించిరి. నాటినుండి యావద్భారత దేశమందున్న అన్ని ప్రాంత ములనుండి భక్తజనులు తండోపతండములుగ ‘మంచాల’ లో గల శ్రీవారి బృందావనము నారాధిం చుటకు వచ్చు చుండిరి. ఎందఱో పాపులు పునీతులైరి. శ్రీవారొసంగిన పుణ్య ఫలముచే ఎందఱో తమ యభీష్టములను పరిపూర్ణ మొనరించుకొని మనశ్శాంతిని పొందిరి. 'మంచాల' 'మంత్రాలయ' మయ్యెను. భారత దేశము నకే గాక యావత్ప్రపంచ మునకు పవిత్ర తీర్థస్థాన మయ్యెను.


ఇట్ల నూటనలుబది సంవ త్సరములు గడిచెను. దేశమందు రాజకీయముగా నెన్నియో మార్పులు సంభ వించెను. విశాల సామ్రాజ్య ములు ముక్కలై సంస్థానా ధీశుల పరమయ్యెను. వీరు పరస్పరము ఈర్ష్యా ద్వేషములతో కలహించు కొన దొడంగిరి. బలవంతు నిదే ధర్మమయ్యెను. ధనమే మానవునకు సర్వస్వమయ్యెను. అధికారమే మానవుని ధ్యేయమయ్యెను. మత కలహములతో, రాజుల యంతః కలహములతో భారతదేశము అస్తవ్యస్తమై సామాన్యుల జీవనము దుర్భర మయ్యెను. 


ఇట్టి విపత్కర పరిస్థితుల లో ఆంగ్ల దేశమునుండి కొందఱు ఆంగ్లేయవర్తకులు మెల్లగ దేశమునందు ప్రవేశించి ‘ఈస్టిండియా’ కంపెనీ  యను పేరుతో వ్యాపార మొనరించు చుండిరి. వారు భరత దేశము యొక్క యీ అంతః కలహములను గాంచి దేశమునంతటిని కబళింపవలెనని సంక ల్పించి దేశద్రోహులైన సంస్థానాధీశులను చేర దీసిరి.


వారిని దేశభక్తులపై పురి గొల్పి అన్యాయముగా వారిని వధింపజేసి స్వంతరాజ్యము నేర్పరచు కొని దానినే 'కంపెనీ గవర్న   మెంటు' అంటూ వీరు ఆంగ్లదేశమునుండి అపార సైన్యములను రావించి ఐకమత్యము లేని భారతీయ సంస్థానాధీశు లను జయించుచు నిర్దయులై దేశభక్తులను సంహరించి   దక్షిణాపధ మునకు చక్రవర్తులైరి. 'దక్కన్ పేష్వాలు’ ‘నిజాము', మొదలగు రాజులందఱు కంపెనీ గవర్నమెంటుకు బానిస లైరి. 


ఈస్టిండియా కంపెనీ గవర్నమెంటువారు ఆంగ్లేయ మిలటరీ ఆఫీసర్లను దేశమును పాలించు కలక్టర్లుగా నియమించెను. ఆసమయ మున ఆంగ్లసైన్యమందు సేనాధిపతియైన మేజరు 'సర్ థామస్ మన్రో' బళ్ళారి జిల్లాకు పదు నెనిమిది వందల సంవత్స రమున కలక్టరుగ నియమింపబడెను. ఆయనయే 1820  సంవత్సరమున దక్షిణా పధమునకు గవర్నర్ అయ్యెను. ఆయనకు ఈ మహద్భాగ్యము శ్రీరాఘ వేంద్ర గురుదేవుల కరుణా కటాక్ష వీక్షణములచే లభించెను.


ఇదియొక చరిత్ర ప్రసిద్ధ మైన యితిహాసము. శ్రీ రాఘవేంద్ర స్వామి తాను బృందావనము ప్రవేశించిన తరువాత 227 సంవత్సరములకు మరల యీ థామస్ మన్రోకు దర్శన మొసంగెను. ఆ ప్రభావము వలననే ఒక సామాన్యుడైన     కలెక్టరు భక్తుడై గవర్నరుగా సింహాసనమధిష్ఠించి దక్షిణ భారత దేశమును పాలించి 1827 సంవత్సరములో ముక్తిని బొందెను.


1812 సంవత్సరమున యీస్టిండియా కంపెనీ గవర్నమెంటు వారు ఒక కఠోరశాసన మొనరించిరి. దానివలన ప్రజలచే పరి పాలింపబడుచున్న దేవా లయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులన్ని గవర్నమెంటు ప్రభుత్వ మునకు సంక్రమించును.


ఆ ఆస్తులను ఈనాముగ బొందిన వ్యక్తి సజీవుడై యున్న అవి ప్రభుత్వము నకు చెందజాలవు. బళ్ళారి కలెక్టరు మేజర్ థామస్ మన్రో  ప్రభుత్వ ము యొక్క ఆజ్ఞాను సారముగ జాగీరులను ఈనాములను స్వాధీన పరచుకొనుట ప్రారంభిం చెను.  1820వ సంవత్స రములో ఆ కలెక్టరు మంచాల గ్రామమును జేరెను. ప్రభుత్వము యొక్క రికార్డు ప్రకారము ఆ గ్రామములో ఒక బ్రాహ్మణ సన్యాసి సమాధి కలదనియు దానిని కొందఱు పూజారులు పరిపాలించుచున్నారనియు, అహర్నిశములు సమాధిని ఘృతదీపము లచే అలంకరించుచు న్నారనియు తెలిసికొనెను. దీనికొఱకై మంచాల గ్రామమే ఆ మఠమునకు జాగీరుగ లభించెనని దెలిసికొని ఆశ్చర్య చకితు డయ్యెను. వెంటనే కలెక్టరు ఆదోని తాలుకా సిరస్తా దారుని రావించి ఆ మఠమునకు కొంత ధనమును దీపారాధన మొదలగు కార్యక్రమము లు జరుపుటకు యిప్పించి గ్రామమును ప్రభుత్వ పరము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను.  ఆదోని తాలుకా సిరస్తాదారు సద్బ్రాహ్మణుడు. శ్రీరాఘ వేంద్రస్వామి భక్తుడు. కలెక్టరు పల్కిన పల్కుల నాలకించి భయకంపితుడై "దేవా! శ్రీ రాఘవేంద్ర స్వామి భగవదాంశ సంభూతుడు. ఆయన నిగ్రహానుగ్రహ  సమర్ధుడు.  

ఆ మహానుభావుని యను గ్రహముచే ఒక పశువుల కాపరి అసదుల్లాఖాన్ నవాబుగారికి  దివాను కాగలిగెను. అతని పేరే వెంకన్నపంతులు. బ్రాహ్మ ణోత్తముడు. నవాబు యొక్క రాజముద్రికచే ముద్రింపబడిన అధికార పత్ర పరముగ మంచాల గ్రామమును శ్రీవారి కొసంగె ను. నేటికి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాంతర్గత బృందావనమందు సజీవు లై ఆశ్రిత భక్తులనను గ్రహించుచున్నా' రని పల్కెను. కొందఱు బ్రాహ్మణులను రావించి కలెక్టరు ఎదుట యీ చరిత్రను సాక్ష్యముగ నిరూపించెను. 'మేజర్ థామస్ మన్రో ఆంగ్లేయు డైనప్పటికి దుర్మార్గుడు కాడు; భగవద్భక్తుడు. సిరస్తాదారు చెప్పినదంతా  శాంతముగ నాలకించి యిట్లు పలికెను. మంచిది. నీవు చెప్పినదంతయు సత్యమైనచో శ్రీ రాఘవేంద్ర స్వామి సజీవముగ నున్నచో ఈజాగీరు వారికే చెందగలదు. నేను స్వయ ముగ మంచాల కేతెంచి పరిస్థితులను పరిశీలించి నిర్ణయించెదను.


కలెక్టరు గారు మరునాడు స్వయముగ మంచాలకు వచ్చుచున్నారనెడి వార్త గ్రామమంతయు వ్యాపిం చెను.  వేలకొలది ప్రజలు ఈ దృశ్యమును తిలకిం చుటకు బృందావనము నకు విచ్చేసిరి. మేజర్ థామస్ మన్రో, సిరస్తాదారు ఎందఱో ప్రభుత్యోద్యోగులు మఠమును చేరిరి.   నాటి మఠాధిపతులు వీరందరికీ సుహృద్భావ స్వాగతము పలికిరి. కలెక్టరు మన్రో బృందావన సమ్ముఖము నకు రాగానే పాదరక్షలను విసర్జించి తలపై గల టోపీని తీసివైచి బృందావన సమ్ముఖమున వినమ్రుడై నిలువబడెను.


ఇదియేనా శ్రీ రాఘవేంద్రుల జీవసమాధి యని ప్రశ్నింప గా సిరస్తాదారు మొదలగు వారు  అవునని పల్కిరి. ఆక్షణమందే శ్రీరాఘవేంద్ర స్వామి స్వయముగ బృందావనము నుండి బయల్వెడలి కలెక్టరు థామస్ మన్రోతో ఆంగ్ల భాషలో సంభాషించిరి. శ్రీవారిని దర్శింపగనే వారి దివ్యమంగళ విగ్రహము నకు  ముగ్ధుడై మన్రో ఆంగ్లసంప్రదాయ ప్రకార ముగా నమస్కరించెను. కలెక్టరుతో ఈ  మంచాల గ్రామము తనదని పల్కి శ్రీరాఘవేంద్రస్వామి అంతర్థానమొందిరి. శ్రీ వారు ఒక్క మన్రోకే దర్శనమును ప్రసాదిం చెను.


ఆ సమయమున థామస్ మన్రో పలికిన పల్కులను మాత్రము ప్రజలు అలకింప గల్గిరి. శ్రీవారు అంతర్దాన ము కాగానే ఆయన మహాత్మ్యమును గ్రహించిన కలెక్టరు మన్రో సిరస్తాదారు తో నిట్లు బల్కెను.


"ఆహా! ఏమి మీ గురుదేవుల భవ్యవిగ్రహ ము! ఆజానుబాహుడు, కాషాయాంబరధారి, దండ ధరుడు, పాదుకలను ధరించిన ఆ దివ్య  విగ్రహుడు మీగురువేనా?" అనెను. అపుడు  సిరస్తాదారు “అవును ప్రభూ, కానీ ఆయన ఎక్కడ? మాకు గోచరింప లేదని" బల్కెను.


అపుడు  కలెక్టరు “ఏమి? మీరు చూడలేదా? ఈ బృందావనము ముందు నిలుచుండి మేఘగంభీర స్వరముతో నాతో పల్కి నాడు, మీరు వినలేదా దర్శింపలేదా” అని పలికెను. అందులకు వారు ఆశ్చర్యచకితులై మాకు గోచరముకాలేదని చింతా క్రాంతులై పల్కిరి. జరిగిన దంతయు గాంచి శ్రీ  రాఘ వేంద్రస్వామి దైవాంశ సంభూతుడని యెఱింగి కలెక్టరు థామస్ మన్రో శ్రీవారిని స్తుతించి ఆరాధిం చెను.


మంత్రాలయ పీఠాధిపతు లు కలెక్టరునకు శ్రీవారి ఫలమంత్రాక్షతలను, ప్రసా దము నొసంగిరి. వెంటనే 'మన్రో’ తన నివాసము నకు జని మంచాలాధిపతి యైన శ్రీ రాఘవేంద్ర స్వామి సజీవుడు కావున మంత్రాలయజాగీరు వారికే చెందవలెనని గవర్నరునకు తాను గాంచినదంతయు నివేదికగా బంపెను.


ఇచట మంత్రాలయమున జేరిన భక్తులందఱు శ్రీవారొక మ్లేచ్ఛునకు దర్శన మొసంగి ఆరాధకులైన తమకు గోచరింపలేదని దుఃఖితులై నిరసన వ్రతమును ప్రారంభించిరి. ఆభక్తులు శ్రీవారి దర్శనార్ధు లై విలపింపనారంభించిరి. అపుడు వారలకు మేఘ గంభీర స్వరమిట్లు వినిపిం చెను. “భక్తులారా! మీరు  చింతింపవలదు. మీకు గోచరింపక యున్నను సదా మిమ్ములను కటాక్షించు చునే యున్నాను. మ్లేచ్ఛు డైన ఆ యాంగ్లేయునకు దర్శన సౌభాగ్యము గల్గుట వాని పుణ్యము. ఈతడు పూర్వము కృతయుగము లో ఒక      అసురుడు. అతడు శ్రీమన్నారాయ ణుని గూర్చి ఘోర తపము నాచరించెను.  భగవదను గ్రహము లభించినను జన్మ రాహిత్యమును కోరక  స్వర్గాదిలోక సుఖములను గోరెను. ఆతడు ఇంత వరకు స్వర్గాదిలోకము లందు సౌఖ్యముల ననుభ వించి ఐశ్వర్యవంతుడైన ఆంగ్లేయునిగ మానవజన్మ మును బొందెను. అతడు స్వాభావికముగ సకామ భక్తుడు. భగవంతుని యే యిచ్ఛచే ఆరాధించినను ఆయన వాని ననుగ్రహిం చును. వానికోర్కెలను దీర్చి తన భక్తులతో సమాగమమొనరింప జేసి భవబంధ విముక్తునిగ నొనరించును. సకామభక్తు డు ఎట్టకేలకు భగవంతుని జేరును, కాని నిష్కామ భక్తుడు ఆజన్మమునందే పాంచభౌతిక దేహమును పరిత్యజించి దివ్య దేహ ధారియై భగవత్పార్షదులు వెంటరాగా పరంధామము చేరును; ఈ థామస్ మన్రోకు వాని పురాకృత పుణ్యవిశేషముచే భగవద నుగ్రహమువలన నాప్రత్యక్ష దర్శనము లభించెను. మీకు స్వప్నమునసాక్షాత్క రింతునని” పల్కెను.


శ్రీవారి అమృతతుల్యము లైన వాక్కుల నాలకించి ఆ       భక్తులందఱు సంతృప్తులై నిరసన వ్రతమును వీడి శ్రీవారి ప్రసాదమును స్వీకరించి తమతమ నెలవులకు జనిరి. 


కలెక్టరు థామస్ మన్రో మంత్రాలయ విషయమున మద్రాసు గవర్నరు గారికి నివేదిక పంపి సమాధాన ముకొరకై ఎదురుచూచు చుండెను. ఆసమయమున మద్రాసు గవర్నరు భార్య గర్భవతి కాగా గవర్నరు ప్రభుత్వమునకు సెలవు పెట్టి భార్యను తోడ్కొని ఇంగ్లండునకు పోయెను. వెంటనే ఈస్టిండియా కంపెనీ గవర్నమెంటు బళ్ళారి కలెక్టరయిన మేజర్ థామస్ మన్రోను మద్రాసు గవర్నరుగ నియమించెను. తనకు దక్షిణాపథమునకు గవర్న రుగా పదవి లభించుట గాంచి మన్రో విశ్వసింప లేకపోయెను. ఆయన వెంటనే మద్రాసునకు జని గవర్నరుగా బాధ్యతలను స్వీకరించెను. తాను కార్యాలయమునకు జని గవర్నరుగా ప్రమాణ స్వీకార మొనరించిన తత్ క్షణమే కలెక్టరుగా పంపు కొనిన మంత్రాలయ నివేదిక పరిశీలనార్థమై తన ముందుంచబడెను.


ఈ వైచిత్రమును  గాంచి గవర్నరు  థామస్ మన్రో యిది యంతయు శ్రీ రాఘవేంద్రస్వామి దర్శన ప్రభావమే యని గ్రహిం చెను. కానిచో సామాన్యు డగు ఒక కలెక్టరు  సామ్రాజ్యమునకు గవర్నర్ అగుట అసంభవము.


తత్ క్షణమే ఆయన 'తన' మనస్సులో శ్రీ రాఘవేంద్ర స్వామి భవ్యరూపమునకు నమస్కరించుకొని తాను కలెక్టరుగ పంపిన నివేదిక ను తానే గవర్నరుగ ఆమోదముద్ర వైచెను.


తదనంతరము గవర్నరు థామస్ మన్రో పాదరక్షలు  విసర్జించి తలపై గల టోపి తీసివైచి మోకాళ్లపై నిలువ బడి ఆంగ్లేయుల పద్ధతి ప్రకారము శ్రీ రాఘవేంద్ర స్వామిని ప్రార్థించెను.

 

ఫలశ్రుతి: 


సత్యార్థులైన  విజ్ఞులు శ్రీరాఘవేంద్రస్వామి యీ దివ్యచరితమును పఠించి నచో వారిలో భగవంతుని పై అపారమైన భక్తి కలుగును. భగవంతుని యొక్క దివ్యశక్తిపై సుదృఢమైన విశ్వాస ముద్భవించును. సకల ధర్మములను భగవత్పర ముగ నొనరింపగలిగినవారై నిష్కాములై భవబంధ విముక్తులయ్యెదరు. 


శ్రీహరి, శ్రీవాయువు, ఆ భక్తుల సకలాభీష్టములను తీర్ప గలరు.  శ్రీహరిని, వాయుదేవుని ఉపాసించి శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు నిగ్రహానుగ్రహ సమర్థులై అసంఖ్యాక సిద్ధులను బొంది ఆశ్రితులకు కల్పవృక్షమైరి.  ఆర్తులైన భక్తులకు కామధేనువైరి. శ్రీవారి నాశ్రయించిన మానవులు సకలకష్టముల నుండి విముక్తులై జీవన్ముక్తులు కాగలిగిరి.


శ్రీరాఘవేంద్రస్వామి నారాధించిన కామక్రోధ లోభ మద  మాత్సర్యము లు నివారింపబడగలవు. ఆయన పూజల నొనరిం చిన భూత ప్రేత పిశాచాది గ్రహముల పీడ నశింప గలదు. ఆయన పాదార విందములను ధ్యానించిన మానవుని మనస్సు పూర్ణశాంతి నొందగలదు.

శ్రీవారు భక్తులకు అపరోక్ష జ్ఞానమును, ఆధ్యాత్మిక విద్యను, అనన్య భక్తిని, నిస్వార్థత్వమును, కర్మ కౌశలమును, శరీర ఆరోగ్య మును, మనో నిగ్రహము ను,  సమస్త ఐశ్వర్యము లను తృటిలో ప్రసాదింప గలరు. 


స్వామి కృపాకటాక్ష వీక్షణ ములు ప్రసరించిన మూగ వాడు వాచాలుడగును. బధిరుడు  వినగలుగును. కుంటివాడు కొండలను దాటగల్గును. మానవులను ఆడించుచున్న గ్రహాదుల న్నియు శ్రీవారి యనుగ్రహ మువలన శుభప్రదములు కాగలవు.


మంత్రాలయ బృందావన మందు విరాజిల్లియున్న శ్రీరాఘవేంద్రస్వామి తన భక్తులపై అనిష్ట పుణ్యము లను వర్షించు చుండిరి. శ్రీవారు తాపత్రయపీడిత మానవ సమాజోద్ధరణము 

నకై  దివినుండి భువికి యేతెంచెను.


ఓమ్ శ్రీ రాఘవేంద్రాయ నమః' యని నిశ్చల భావముతో  ప్రతినిత్యము  ఒక్క పర్యాయమైనను జపించిన భక్తుని సర్వ బంధములు నశింపగలవు. ఒక్క పర్యాయమైనను మంత్రాలయమున కేతెంచి బృందావనమునకు ప్రదక్షిణమొనరించి నమస్క రించిన వానికి సకలక్షేత్ర దర్శనఫలము సునాయాస ముగ లభించును. శ్రీవారి బృందావన    అభిషేక   జలములను తలపై  సంప్రోక్షించుకొనిన వానికి సకల తీర్థస్నానఫలము లభించును. 


శ్రీరాఘవేంద్ర స్తోత్రము ను నిత్యము పఠించినవానికి యెట్టి వ్యాధులైనను తొలగిపోగలవు. వాని సర్వాభీష్టములు పరిపూర్ణ ములు కాగలవు. ప్రతి నిత్యము స్నానమాచరించి శ్రీరాఘవేంద్ర బృందావన చిత్రమునకు ఎదుట నిలువబడి దీపారాధన యొనరించి, ధూప సమర్పణము చేసి నమస్కార ప్రదక్షిణ మొనరించినచో వానికి సుపుత్రుడుదయించును. శ్రీహరి, వాయువుల దివ్య మహాత్మ్యము పఠించువారి త్రిపాపములు తొలగి పోవును.


శ్రీ రాఘవేంద్రస్వామి భక్తులు నిర్భయులు, శంకా రహితులు, నిత్యానంద  సంతృప్తులు, సత్సీలసంప న్నులు నగుదురు. వారికి శత్రువులవలన, క్రూర మృగములవలన, విష సర్పములవలన, యెట్టి యపకారము సంభవిం పదు. వారీ ఘోర సంసార సాగరమునుండి ఉద్ధరింప బడుదురు. 


మంగళమ్ మహత్ 

జై శ్రీ గురు రాఘవేంద్ర 

****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము 

26 వ భాగముతో  

సంపూర్ణము 

🌸☘️💥🌸☘️💥


🙏 ఓం నమో శ్రీ రాఘవేంద్ర య నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat