*తృతీయ స్కంధము - 05*
✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 26*
*చక్రరాజరథారూఢ సర్వాయుధపరిష్కృతా!*
*గేయచక్రరథారూఢ మంత్రిణీపరిసేవితా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*దేవీకృత తత్త్వోపదేశం - శక్తిప్రదానం* చదువుకున్నాము.
*అమ్మ దయతో......*
ఈ రోజు తృతీయ స్కంధములోని
*బ్రహ్మకృత గుణతత్త్వ నిరూపణం*
*గుణత్రయ సాంగత్యం*
చదువుకుందాం......
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *బ్రహ్మకృత గుణతత్త్వ నిరూపణం* 🌈
*నారదమహర్షి !* నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు. *యద్దృశ్యం తన్నశ్యం* - కనక అది అరూపం. అందుచేత నిర్గుణా - నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు. మహామునీశ్వరులకు భావనీయులు. ప్రకృతి పురుషులు అనాదినిధనులని తెలుసుకో. (ఆదీ అంతమూ లేనివారు). విశ్వాసంతో అభిగమ్యులు. అవిశ్వాసంతో ఎవరికీ ఎప్పుడూ అందరు.
*అనాదినిధనౌ విద్ధి సదా ప్రకృతిపూరుషౌ!*
*విశ్వాసేనాభిగమ్యౌ తౌ నావిశ్వాసేన కర్హిచిత్ !!*
సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి - ఆదిపురుషుల తత్త్వం. అది తేజస్సు. వివిధ రూపాలుగా సర్వత్ర వ్యాపిస్తుంది. అది నిత్యం. ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు. సర్వప్రాణికోటిలోనూ మిశ్రీ భూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు. *పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తి.* ఏమి భేదం లేదు. ఈ సూక్ష్మం ముందు తెలుసుకో.
సర్వశాస్త్రాలనూ అభ్యసించినా సాంగోపాంగంగా సర్వ వేదాలను అధ్యయనం చేసినా వైరాగ్యం (విరతి) లేనిదే ఈ సూక్ష్మం ఎవరికీ తెలీదు. ఈ స్థావరజంగమాత్మకమైన విశ్వమంతా అహంకారకృతమే కదా ! అంటే సగుణమే కదా ! మరి నిరహంకారమైన నిర్గుణ తత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా ! వేల సంవత్సరాలు కాదు కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందా ? పైత్య ప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు. తెలిసేనా ! కళ్ళకలకవాడికి చూపు ఆనేనా ?
సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు. చేతస్సు అహంకారసముద్భూతం. అది తనంతతాను నిరహంకారం కాజాలదు. ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంతవరకూ ఆ దివ్యదర్శనం లభించదు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు.
*పితామహా !* రెండు సందేహాలు తీరాయి ! అయితే ఆ నిరహంకార స్థితిని పొందడం ఎలాగ? అహంకారం త్రిగుణాత్మకమన్నావు. ఆ గుణాలు ఏమిటి ? ఒక్కటొక్కటిగా వాటి తత్త్వం తెలియజెప్పు. వాటిని తెగతెంపులు చేసుకోవడం ఎలాగ ? ఆ మార్గం ఉపదేశించు.
*నారదా !* గడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను. ఆలకించు.
*సత్త్వరజస్తమోగుణాలు మూడింటికీ మూడు శక్తులున్నాయి. సాత్త్వికానిది జ్ఞానశక్తి. రాజసానిది క్రియాశక్తి. తామసానిది ద్రవ్య (అర్థ) శక్తి.*
అవి చేసేపనులు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తినుంచి శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి. వీటిలో శబ్దగుణకం ఆకాశం. స్పర్శ గుణం వాయువుది. రూపం అగ్నిది. జలం రసగుణకం. పృథ్విది గంధగుణం. ద్రవ్యశక్తులు ఈ పదింటికీ తామససర్గమని పేరు.
రాజసమైన క్రియాశక్తి నుంచి శ్రోత్రత్వగ్రసనాచక్షురాఘ్రాణాలు అయిదు ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు మరొక అయిదున్నాయి. వాక్పాణి పాదపాయుగుహ్యాలు. ఇవికాక ప్రాణాపానవ్యానసమానోదాన వాయువులు అయిదున్నాయి. ఈ పదిహేనింటికీ రాజససర్గమని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవ్వి సాధనాలు. చిదనువృత్తి వీటికి ఉపాదానం. (చిత్ - జ్ఞానశక్తి)
సాత్త్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులూ ఆవిర్భవించారు. వీరు
జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, తేత్రజ్ఞుడు అనే నలుగురూ అధిదేవతలు. వీరే కీలాధిష్ఠాతృదేవతలు. మనస్సుతో కలిపి ఇవి మొత్తం పదిహేను. ఇది సాత్త్వికసర్గం.
పరమాత్మకు స్థూలసూక్ష్మభేదాలు రెండు ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రం నిరాకారమే. సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూలరూపం. లేదా ధ్యానాదులకు సాధకం స్థూలరూపం.
పైని పేర్కొన్న తామసరాజస సర్గాల సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచతన్మాత్రలూ దశేంద్రియాలూ (5 + 5) పంచప్రాణాల సంసర్గం. దీనినే పంచీకరణం అంటారు. అది తెలిస్తే భూతసముద్భవ తత్త్వమంతా నీకు బోధపడుతుంది.
శ్లిష్టమైయున్న పంచభూతాలనూ విడదీసి ముందుగా రసతన్మాత్రను స్వీకరించి అది జలం అయ్యేట్టు మనసులో (సం) కల్పించాలి. అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలను కలిపి (మనస్సునూ) చైతన్యాన్ని అమిరిస్తే - “నేను” అవుతాను. స్థూలశరీరం. భూత తన్మాత్రల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది. ఇందులో విశేషాదరం అభిమానం ఉండటం చేత ఆదినారాయణుడు భగవానుడయ్యాడు. భూతాంశలు అన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి.
బిడ్డా! ఇంకా విశేషాలు చెబుతాను విను.
ఆకాశం కేవల శబ్దగుణకం. వాయువుకి శబ్ద స్పర్శలు రెండూ ఉన్నాయి. అగ్నికి శబ్దస్పర్శరూపాలున్నాయి. జలానికి శబ్దస్పర్శరూపరసాలున్నాయి. పృథివికి ఇవి నాలుగూకాక గంధంతో కలిపి అయిదుగుణాలూ ఉన్నాయి.
స్థూలరూపంగా (శరీర) బ్రహ్మాండోత్పత్తి వీటితో (ఈ అంశల కలయికతో) ఇలా జరుగుతుంది. అంశభేదాలు కారణంగా 84 లక్షల జీవ జాతులు ఏర్పడ్డాయి. దీనిని మొత్తం కలిపి 'సర్గము' అంటారు.
*(అధ్యాయం -7, శ్లోకాలు- 52)*
*నారదా!* నీ ప్రశ్నలలో చాలామటుకు సమాధానాలు చెప్పాను. సందేహాలు చాలావరకూ తీరి ఉండాలి. ఇంక గుణాల రూపసంస్థను వివరిస్తున్నాను. తెలుసుకో. సత్త్వమనేది ప్రీత్యాత్మకం. సుఖాలనుంచి ప్రీతి జనిస్తుంది. దీనిని (సత్త్వ) సాత్త్విక ప్రీతి అంటారు. ఋజుత్వం, సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం - వీటివల్ల సత్త్వప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మంపట్ల ప్రీతిని కలిగిస్తూ మంచిపట్ల శ్రద్ధను పెంపొందిస్తూ అశ్రద్ధను నిత్యమూ నివారిస్తూ ఉండటం సాత్త్వికశ్రద్ధ లక్షణం. దీని రంగు తెలుపు.
తత్త్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధనుకూడా మూడు రకాల విభజించారు. రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో (ఎరుపు) ఉంటుంది. ఇది అద్భుతావహం. అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖయోగంవల్ల జనిస్తుంది. ద్వేషం, ద్రోహం, మాత్సర్యం, స్తంభం (అలసత్వం), ఉత్కంఠ-నిద్ర - ఇత్యాదులవల్ల రాజస ప్రతీతి జరుగుతుంది. మానమూ మదమూ గర్వమూ ఇవన్నీ దాని లక్షణాలు.
ఇంక మూడవది తామసిక శ్రద్ధ ఎలా ఉంటుందంటే - దానిరంగు నల్లటి నలుపు. మోహాన్నీ విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదశీలం, కార్పణ్యం, కుటిలత్వం, రోషం, వైషమ్యం, అతినాస్తిక్యం, పరదోషాను దర్శనం - వీటివల్ల తామస ప్రతీతి జరుగుతుంది. పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం.
ఈ మూడింటిలో సత్త్వాన్ని ప్రకాశింపజెయ్యాలి. రజోగుణాన్ని నియంత్రించాలి. తమోగుణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునే వారు తప్పకుండా చెయ్యాలి.
🌈 *గుణత్రయ సాంగత్యం* 🌈
ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తుంటాయి. ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవల సత్త్వం, కేవల రజస్సు, కేవల తమస్సు ఎక్కడా ఉండవు. ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం.
జ్ఞాతమైన పనిపట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంతవరకూ ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది. లేకపోతే నిష్ఫలం. ఏదీ విన్నంత మాత్రాన చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు. అనుభూతం కావాలి. ఎలాగంటే - తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆ యా తీర్థాలను సందర్శించి స్నానాదులుచేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు. కొంతకాలం అక్కడే నివసిస్తాడు. అటు పైని తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ మామూలే. తన రాగద్వేషాలూ కామక్రోధాలూ యథాపూర్వంగా ప్రారంభం అవుతాయి. వట్టి శ్రమ మిగులుతుంది. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి శ్రుతం (విన్నది) అనుభూతం కాలేదన్నమాట.
*తీర్థ సేవనకు ఫలం నిష్కల్మషత్వం. అలాంటి ఫలం అతడికి దక్కలేదు. రాగద్వేషాదులను వదిలించుకోవాలి. అది జరగనంతకాలమూ ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మషత్వం రాదు.*
కర్షకుడు నేలదున్నడం దగ్గరనుంచి పంట పండేవరకూ అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమికీటక మృగ పక్షి జాతులకు స్వాహా అయిపోతుంది. రైతుకి ఫలం దక్కదు. పుట్టెడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్త్వానుభూతి కలగదు.
శాస్త్ర దర్శనాదులవల్ల సత్త్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని (సత్త్వం) కలిగిస్తుంది. ఇది తమోరజోగుణాల సాంగత్యంవల్ల నిత్యమూ పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది. నిరంతరఘర్షణ. సత్త్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది. బుద్ధి ధర్మమార్గాన్ని అనుసరిస్తుంది. తమోరజోగుణాలను జయించగలుగుతుంది. బాహ్యర్థాలను వాంఛించక యజ్ఞయాగాలపట్ల ఆసక్తమవుతుంది. *యథాలాభ సంతుష్టి* (అనాయాసంగా లభించిన దానితో తృప్తి పడటం) ఏర్పడుతుంది. సాత్త్వికభోగాలను మాత్రమే కోరుకొంటుంది. రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది. తామసిక భోగాల సంగతి ఇక చెప్పాలా ?
ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి. తరవాత తమోగుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్త్వం నిలుస్తుంది. అలాకాక రజోగుణం పెరిగితే - అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది. సనాతన దుష్కర్మలతో (అక్రమ పద్ధతులతో) ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్త్వరజోగుణాలు అడుగంటిపోతాయి. కామచోరభావాలు రాజ్యమేలతాయి. ఈ గుణాలు ఒంటరిగా ఉండవనీ అన్యోన్యాశ్రితాలనీ చెప్పానుగా !ఇవి అన్యోన్య ప్రసవధర్ములు. ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమోగుణాలను పుట్టిస్తుంది. ఇంకొకప్పుడు రజోగుణం సత్త్వతమోగుణాలను కలిగిస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో తమోగుణం మిగతా రెండింటికీ జన్మనిస్తుంది. ఇలాగ ఇవి ఒకదానికొకటి కారణాలు అవుతుంటాయి.
మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదీను. లోకంలో స్త్రీ పురుషులు ఎలాగ జంటలు కడుతున్నారో అలాగే బుద్ధిస్థాలైన ఈ గుణాలుకూడా మిథునాలు అవుతుంటాయి. సత్త్వగుణం రజోగుణంతోగానీ తమోగుణంతోగానీ చెయ్యికలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండింటిలో ఒకదానితో జంట కట్టవచ్చు. తమోగుణం కూడా అలాగే జతపడవచ్చు. జతపడినవి రెండూ మూడవదాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి. పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి.
*(అధ్యాయం -8, శ్లోకాలు -51)*
*నారదా !* ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకూ పూర్తిగా తెలియదుగానీ తెలిసినంతవరకూ చెబుతాను, ఆలకించు.
కేవల సత్త్వగుణం తనంతతానుగా ఎక్కడా ఉండదు. రజస్తమో గుణాలకు ఊడిగం చెయ్యదు. పరమపతివ్రత సవతికి సేవ చేస్తుందా ? నిర్మలంగా ఉన్న నైజగుణాన్ని రజస్తమోగుణాలు మురికి చేస్తాయి. వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా (సాధనతో) నైజగుణం కనక వదిలించుకోగలిగితే సత్త్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజస్తమోగుణాలు కుళ్ళుకుంటాయి. (అవకాశం కోసం పొంచి ఉంటాయి) ఇది సహజం. లోకంలో చూడు - భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు. సవతులు దు:ఖిస్తారు. రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే, దుర్జనులు బెంబేలెత్తుతారు. కుండపోతగా వానకురిసిందని రైతు సంబరపడుతుంటే, ఇంటి పైకప్పులేని పూరి గుడిసెవాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైన గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖదు:ఖాలను కలిగిస్తూ ఉంటాయి.
*నారదా !* ఈ యీ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను. గమనించు. లఘుప్రకాశత్వం, నిర్మలత్వం, విశదత్వం - ఇవి సత్త్వగుణ సంకేతాలు. దేనినైనాసరే తేలిగ్గా చూడటం, తేలిగ్గా లేవడం, తేలిగ్గా పోవడం, మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండటం - సత్త్వగుణ సమృద్ధికి నిదర్శనాలు. అలా కాక శరీరంలో జృంభాస్తంభ తంద్రాచంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండగుర్తులు. కలిని వెతుక్కుంటూ వెళ్ళడం, చిత్తచాంచల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగడం, వివాదాలకు కాలుదువ్వడం ఇవి తమోగుణానికి చిహ్నాలు. ఇంద్రియాలూ మనస్సూ శూన్యం అయిపోతాయి. నిద్రను కోరనే కోరడు.
బ్రహ్మదేవుడు ఇంతగా విడమరచి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధిపొందాడు. మరొక సందేహం పొటమరించింది. వినయంగా ప్రశ్నించాడు.
*పితామహా !* విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా !
*పుత్రా !* ఈ గుణాలు దీపాలవంటివి. *వత్తి - నూనె - మంట - ఇవి పరస్పర విరుద్దాలే అయినా దీపం వస్తుదర్శనం చెయ్యడం లేదూ. తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికీ వత్తికీ మిగతా రెండూ శత్రువులే. అయినా కలిసి ఉంటున్నాయి, వెలుగుతున్నాయి. పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి.* ఇలాగే గుణాలూ వాటి కలయికా ప్రకృతి సిద్ధాలు - అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకుని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు.
*జనమేజయా !* ప్రకృతిసిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వప్రాదుర్భావానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది. సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను. కనక గుణలక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం. దీనికంతటికీ కారణమై సర్వవ్యాపకతా లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే. నిరీహుడూ, పూర్ణుడూ, పరముడూ, అవ్యయుడూ అయిన పురుషుడు అకర్త. సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది.
త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్ట వసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్వినీ దేవతలు కానీ, షడానన గజాననులు కానీ - శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చెయ్యగలుగుతున్నారు. లేనప్పుడు కదలడానికి కూడా అశక్తులు.
*సర్వే శక్తియుతా: శక్తాః కర్తుం కార్యాణి స్వాని చ*
*అన్యథా తే౬ప్యశక్తా వై ప్రస్పందితు మనీశ్వరాః !!*
*మహారాజా !* జగత్కారణమైన పరమేశ్వరిని ఆరాధించు. దేవీయజ్ఞం నిర్వహించు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ రూపాల్లో జగత్కారణ కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద. శాంత. సుఖ సేవ్య. వయాన్విత. నామాన్ని జపిస్తే చాలు. వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. దేవీ నామ ఓజాక్షరాలను ఆస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది. ఏ పులికో పుట్రకో భయపడి ఐ ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూంటుంది. అతడి వృత్తాంతం సవిస్తరంగస చెబుతాను. విను.
*(రేపు సత్యవ్రత వృత్తాంతం)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏