శ్రీదేవీభాగవతము - 27

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 06*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 27*


*కిరిచక్రరథారూఢ దండనాధపురస్కృతా!*

*జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 

                

*బ్రహ్మకృత గుణతత్త్వ నిరూపణం* 

*గుణత్రయ సాంగత్యం*   చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*సత్యవ్రత వృత్తాంతము* 

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


*మహారాజా !* జగత్కారణమైన పరమేశ్వరిని ఆరాధించు. దేవీయజ్ఞం నిర్వహించు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ రూపాల్లో జగత్కారణ కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద. శాంత. సుఖ సేవ్య. వయాన్విత. నామాన్ని జపిస్తే చాలు. వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. దేవీ నామ ఓజాక్షరాలను ఆస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది. ఏ పులికో పుట్రకో భయపడి ఐ ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూంటుంది. అతడి వృత్తాంతం సవిస్తరంగస చెబుతాను. విను.


🌈 *సత్యవ్రత వృత్తాంతం* 🌈


వెనకటికి సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడున్నాడు. వట్టి నిరక్షరకుక్షి. పొట్టచించి చూసినా అక్షరం ముక్కలేదు. పైగా పరమ మూర్ఖుడు. అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు. బాణం డెబ్బ తిన్న పంది భీకరంగా *ఐఐ* అని అరుస్తోంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరం అదే ఉచ్చారణ. లక్షలూ కోట్లుగా ఉచ్చారణ సాగింది. ఇది బిందురహితమైన బీజాక్షరం. దయామయి జన్మాత సంతోషించింది. అతణ్ణి కవిరాజును చేసింది. 


*(అధ్యాయం-9, శ్లోకాలు - 48)*


సత్యవ్రతుడి ప్రస్తావనతో జనమేజయుడిలో ఉత్కంఠ రేకెత్తింది. ఈ సత్యవ్రతుడు ఎవరు, ఏ దేశంవాడు, తల్లిదండ్రులెవరు, ఆ శబ్దం ఎలా విన్నాడు, ఎలా ఉచ్చరించాడు, ఎటువంటి సిద్ధి కలిగింది, అమ్మవారు ఎలా సంతోషించింది ? - ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుణ్ణి అభ్యర్థించాడు.


*శౌనకాది మహామునులారా !* ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే, అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. మా గురువుగారు సవిస్తరంగా ఆ రసవద్గాథను అతడికి వివరించారు. మృదువుగా. జనమేజయా - అని ప్రారంభించారు.


ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ, పరమపావనమైన నైమిశారణ్యం చేరుకున్నాను. ఇక్కడున్న మహా మునీశ్వరులను దర్శించాను. వారంతా జీవన్ముక్తులు. తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నవారు. నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. కుశలప్రశ్నాదికం అయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతోంది. మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలిబుచ్చాడు. పెద్దలు మీరంతా ఉన్నారుగా, తీరుస్తారనీ అంటూ ప్రారంభించాడు.


*మహర్షులారా !* త్రిమూర్తులూ అష్టదికాల్పలకులూ అశ్వినీ దేవతలూ సూర్యచంద్రులూ షడానన గజాననులూ - ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు గదా ! వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు ? సుఖంగా సేవించి వాంఛితార్ధాలను పొందాలంటే, తేలికగా సంతోషించి (ఆశు సంతోష) అనుగ్రహించేవారు కావాలి కదా ! అతడెవరా అనేది నా సందేహం. మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చిచెప్పండి - అని కోరాడు. అప్పుడు లోమశుడు కల్పించుకొని సమాధానం చెప్పాడు.


*జమదగ్నీ !* నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. అదేమంత గడ్డు సమస్య కాదు. శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆదిపరాశక్తి మాత్రమే. ఆద్యపరాప్రకృతి. సర్వగ (అంతటా వ్యాపించేది), సర్వద. (అన్నీ ఇచ్చేది). శివ (శుభస్వరూపిణి).


*దేవానాం జననీ సైవ బ్రహ్మాదీనాం మహాత్మనామ్!*

*ఆది ప్రకృతిర్మూలం సా సంసారపాదపస్య వై!!* 


త్రిమూర్తులకే కాదు సకలదేవతలకూ కన్నతల్లి ఆదిపరాశక్తియే. సంసారవృక్షానికి (సంసారం = విశ్వం) ఆది ప్రకృతియే మూలం. ఆవిడ నువ్వన్నట్టు సుఖ సేవ్య. ఆశు సంతోష. తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది. దయార్ధ్రచిత్తంతో, ఎప్పుడూ వరదానానికి సిద్ధమా అన్నట్డు ఉంటుంది. ఇది నేననడం కాదు. దీనికి సాక్ష్యం ఉంది. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన {ఇతిహాసం) ఉంది. నామాక్షరాన్ని (పరాకుగా) ఉచ్చరించినంతమాత్రాననే వాంచితార్ధ సిద్ధిని పొందిన ఒక ద్విజుడి వృత్తాంతం - నాకు తెలిసింది నేను ఎరిగిందీ, ప్రత్యక్షంగా జరిగింది - చెబుతున్నాను, వినండి.


కోసలదేశంలో దేవదత్తుడని ఒక విప్రుడున్నాడు. బహుశ్రుతుడు. వేదవేదాంతవేత్త. అయితే అతడికి సంతానం లేదు. అందుకోసమని విధిపూర్వకంగా ఒక ఇష్టిని (పుత్రకామేష్టి - యాగం) చేశాడు. తమసా నదీతీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి, అగ్నిని స్థాపించి, పుత్రకామేష్టిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు.


సుహోత్రుడు బ్రహ్మగా, యాజ్ఞవల్క్యుడు అధ్వర్యుడుగా, బృహస్పతి అనే మహర్షి హోతగా, పైలుడు ప్రస్తోతగా, గోభిలుడు ఉద్గాతగా తక్కిన మహామునులంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది. అందరికీ భూరి దక్షిణలు అందాయి. ఉద్గాతగా ఉన్న గోభిలుడు సామవేదంలో దిట్ట. యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా రథంతరాన్ని (సామవేదమంత్రం) గానం చేశాడు. ఆ సందర్భాన, మాటిమాటికీ శ్వాస ఎగబీల్చడంలో ఒకచోట పొరపాటున స్వరభంగం అయ్యింది. యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది.


కామ్యకర్మగా పుత్రార్థినై యజ్ఞం చేస్తూంటే, మునిముఖ్యుడవయ్యుండీ స్వరభంగం చేశావు మూర్ఖుడా ! ఆని నిందించాడు.


గోభిలుడికీ కోపం వచ్చింది. మాటలురాని మూర్భుడే పుడతాడు - ఫో - ( *మూర్ఖస్తే భవితా పుత్రః శఠః శబ్ద వివర్జితః* ) అని శపించాడు. శ్వాసను నియంత్రించడం, దీర్ఘంగా గుక్కపట్టడం, అన్నివేళలా అంత తేలికైన పనికాదు. ఈమాత్రం గ్రహించలేకపోయావు. తెలిసీ నిగ్రహించుకోలేకపోయావు. స్వరభంగం అయ్యిందీ అంటే, అది నేను కావాలని చేసిన పొరపాటా? కాదు. అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావు - అంటూ గోభిలుడు మధనపడ్డాడు.


శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు. యజ్ఞమంతా నిష్ఫలమైపోయిందని గోడుగోడున విలపించాడు.  గోభిలుడి కాళ్ళ మీద పడ్డాడు.


*విప్రేంద్రా !* ఇది అన్యాయం. నేను ఏ పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు? నీవంటి పెద్దలకూ ముహర్షులకూ ఇంతటి క్రోధం తగునా ? కోపం పట్టలేక, యజ్ఞం నిష్ఫలమవుతుందేమోనన్న భయంతో మాట తూలానే అనుకో, ఆ చిన్న పొరపాటుకి శపించడం భావ్యమేనా ? కొడుకులు లేరే అని అసలే కుమిలిపోతున్న నాకు, మరింత దుఃఖాన్ని తెచ్చి పెట్టావు. మూర్ఖ పుత్రుడికంటే అపుత్రత్వం నయం అంటారు వేదవిదులు. అదీ కాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నింద్యుడే. వాడి బతుకు పశువుకన్నా హీనం.


*మూర్ఖపుత్రారపుత్రత్వం వరం వేదవిదో విదుః!*

*తథాపి బ్రాహ్మణో మూర్ఖః సర్వేషాం నింద్య ఏవ హి !!* 


*ద్విజోత్తమా !* మూర్ఖ పుత్రుడితో ఏం చేసుకోను ? పూజార్హుడు కాడు. దానార్హుడు కాడు. నిత్య నైమిత్తిక కర్మలు వేటికీ పనికిరాడు. వేదాధ్యయనానికి అసలే పనికిరాడు. మాటకూడా ఉండదన్నావుగా. వేదాధ్యయనానికి అర్హ్పుడుకాని విప్రుడు దేశంలో ఉండటం రాజుకూ క్షేమం కాదు. దేవకార్యాలకూ పనికిరాడు. పితృకార్యాలకూ పనికిరాడు. ఏ కూలిపనో చేసుకోవాలి.


అపండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానమూ చెయ్యకూడదనీ, చేస్తే దాత నరకానికి పోతాడనీ కొందరనగా విన్నాను. అటువంటి కొడుకు పుట్టి ఏమి లాభం? అపండితుల్ని పూజించే దేశం దేశమేనా, రాజు రాజేనా ! అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు, నివసించడు.


*గోభిలా !* మూర్ఖపుత్రవత్వం మరణంకంటే ఘోరం. రవ్వంత దయ చూపించు మహానుభావా! శాపాన్ని మళ్ళించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. ఇదిగో కాళ్ళు పట్టుకుంటున్నాను. మన్నించు. దయచూడు.


దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి  గోభిలుడు పూర్తిగా కరిగిపోయాడు. మహాత్ములు అంతేకదా, క్షణ కోపనులు. పాపాత్ములైతే దీర్ఘకోపనులు. స్వభావతః - నీళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి. నిప్పుని తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి. సహజగుణం పొందుతాయి.


*దేవదత్తా !* నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించినా అటు పైని విద్వాంసుడవుతాడు. భయపడకు. దుఃఖించకు. నీకు ఆనందాన్ని కలిగిస్తాడు.


గోభిలుడు అనుగ్రహించాడు. ఇష్ఠి పరిసమాప్తమయ్యింది. బ్రాహ్మణులందరూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. కొంత కాలానికి దేవదత్తుడి భార్య రోహిణీదేవి గర్భవతి అయ్యింది. గర్భాధాన పుంసవన సీమంతాదుల నన్నింటినీ శాస్త్రీయంగా జరిపించాడు. ఇష్టి సఫలమయ్యిందని సంతోషించి బ్రాహ్మణులకు భూరిదానాలు ఇచ్చాడు.


ఒక మంచిరోజున శుభముహూర్తంలో రోహిణీ నక్షత్రయుక్త శుభలగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది. కుమారుడు జన్మించాడు. జాతకర్మలు నిర్వహించి కొడుకుకి *ఉతథ్యుడు* అని నామకరణం చేశాడు దేవదత్తుడు. ఎనిమిదవ ఏట ఉపనయనం జరిపించాడు. వేదం నేర్పుదామని ఆరంభించాడు. ఉతథ్యుడు అమాయకంగా తింగరముఖంతో కూర్చున్నాడే తప్ప అక్షరంకూడా పలకలేదు. దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. కొడుకునోట పలుకులేదు. తండ్రి బహుథా దుఃఖించాడు. పట్టువదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు. నేర్పుతూనే ఉన్నాడు. అబ్బాయికి పన్నెండవయేడు వచ్చింది. సంధ్యావందనమైనా రాలేదు. ఉతథ్యుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది. అతడు ఎక్కడకు వెడితే అక్కడ పరిహసించింది. కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది. దేవదత్తుడి కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది. రోహిణీ దేవదత్తులు ఉక్రోషం పట్టలేకపోయారు. కొడుకును తిట్టారు. కొట్టారు. కుంటో గ్రుడ్డో అయినా బాగుండును, మూర్ఖుడివి దాపురించావు మా ప్రాణానికి అని అనుక్షణం విసుక్కున్నారు. చీదరించారు.


బంధుమిత్రులు పరిహసించడమైతే ఎలాగో ఓర్చుకున్నాడు గానీ, ఉతథ్యుడు, తల్లిదండ్రులు కూడా ఆడించకపోయే సరికి తట్టుకోలేకపోయాడు. ఒంటరివాణ్ణి అనిపించింది. అతడికే తెలియని ఒక వైకామ్యభావం అలుముకుంది. ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు.


గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించింది. అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు. తమంతతాముగా లభించిన పండూ కాయా తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. మాట లేకపోవడంతో *సత్యవ్రతదీక్ష* స్వీకరించినట్టయ్యింది. సడలని బ్రహ్మచర్యం ఉండనే ఉంది.


*(అధ్యాయం - 10, శ్లోకాలు - 65)*


*శౌనకాది మహామునులారా!* వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. లోమళుడు అనంతర కథ కొనసాగించాడు.


ఉతథ్యుడికి ఒక మంత్రం లేదు, ఒక జపం లేదు, గాయత్రి లేదు, సంధ్యావందనం లేదు, పద్మాసనం లేదు, ప్రాణాయామం లేదు, సమిధలు లేవు, హోమాలు లేవు. ఏమీ లేవు. ఉదయాన్నే లేస్తున్నాడు. దంతధావనం చేస్తున్నాడు. ఆమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నాడు. ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమిరింది తింటున్నాడు. పర్ణశాలలో కూర్చుంటున్నాడు. ఉలకడూ, పలకడు. పేరడిగితే చెప్పడు. (చెప్పలేడు). చూసినవారు ఇదేదో గొప్ప మౌనతపస్సు అనుకున్నారు. *సత్యతపసుడు* అని పేరు పెట్టారు. ఎవరికీ ఏ ఇబ్బందీ కలిగించడం లేదు. నిర్భయంగా సంచరిస్తున్నాడు, సుఖంగా నిద్రపోతున్నాడు. ఎప్పుడూ ఒకటే విచారం -


నాకు చావు ఎప్పుడో కదా ! మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు. దేవుడే నాకు అన్యాయం చేశాడు. మూర్ఖుడిగా పుట్టించాడు. ఇందులో మరింక ఎవరి దోషమూ లేదు. ఉత్తమజన్మమే ఇచ్చాడు. కానీ నిష్ఫలం చేశాడు. గొడ్డుటావులాగా గొడ్రాలులాగా కాయని చెట్టులాగా నా బతుకు నిష్ప్రయోజనం అయిపోయింది. అయినా దేవుణ్ణి అనుకుని ఏం ప్రయోజనం? నా కర్మ ఇలా ఉంది. పూర్వజన్మలో ఎవరికీ ఒక పుస్తకం ఇచ్చి ఉండను. ఒక పాఠం చెప్పి ఉండను. అందుకనే ఈ జన్మలో ద్విజుడిగా పుట్టి మూర్ఖుణ్ణి అయ్యాను. తీర్థాలు దర్శించి ఉండను. తపస్సులు చేసి ఉండను. సాధువుల్ని సేవించి ఉండను. అందుకే నాకు ఈ శఠజన్మ, తెలివితక్కువవాడిగా పుట్టాను. నాతోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగతులయ్యారు. నేను ఇలాగే ఉండిపోయాను. ఎంతపాపం చేసుకున్నానో.


పోనీ తపస్సు చేసుకుందామంటే, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, ఎంత వ్యర్థం. నా బతుకు: ఒక ముక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి. ఇప్పుడు ఏది దారి ! ఏమి చెయ్యాలి! 


ఆఁ అంతా నా భ్రమ గానీ, చదువుంటే మాత్రం అన్నీ సమకూరుతాయా ? దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా ? శ్రమ ఫలిస్తుందా ? అనుకూలిస్తే పురుషకారంతో పని ఉందా ? దైవ బలమే - బలం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే.


బ్రహ్మ విష్ణుమహేశ్వరులూ ఇంద్రాది దేవతలూ అందరూ దైవస్వరూపమైన కాలానికి వశవర్తులే. కాలాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. అది బలీయం, అది దురతిక్రమం.


పగలూ రేయీ, మెలకువగా ఉన్నంత సేపూ ఇలాగే రకరకాలుగా వితర్కించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలం గడుపుతున్నాడు ఉతథ్యుడు - పావనగంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా. పధ్నాలుగు పంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి.


ఒకరోజున ఒక నిషాదుడు క్రూరమృగాలను వేటాడుతూ పర్ణశాలవైపు వచ్చాడు. అతడి ఆకారం క్రూరంగా ఉంది. జంతువులను చంపడంలో మంచి నేర్పరిలాగా ఉన్నాడు. ఎక్కు పెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు. అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు. ఒక్క ఉదుటున బాణం విడిచాడు. అది వెళ్ళి పందికి గాఢంగా గుచ్చుకుంది. దాని ప్రాణాలు విలవిలలాడాయి. భయపడిపోయింది. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో అటూ ఇటూ పరుగులు తీసింది. నెత్తురు ఓడుకుంటూ పర్ణశాలాప్రాంగణంలోకి చొరబడింది. ఉతథ్యుడు చూశాడు ప్రాణాలు కడబట్టిన దాని దయనీయ స్థితి. రక్షణ కోసం దాని ఆరాటం - గమనించాడు. కరిగిపోయాడు. మనస్సు దయార్ధ్రమయ్యింది. కళ్ళలో నీళ్ళు నిండాయి.  రోమకూపాలు తనువంతా పొటమరించాయి. సర్వాంగాలలోనూ ఒక జ్వర తీవ్రత వ్యాపించింది. ఒక ఆవేశంలాగా ఒక ఉన్మాదంలాగా ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులువారింది. సారస్వత బీజాక్షరం ఒకటి (ఐ) అప్రయత్నంగా నోటినుంచి వెలువడింది. ఉతథ్యుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ అవని వినని ధ్వని సంపుటి - మాటలేరాని తననోటినుంచే వెలువడటంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అది ఆనందమో అది దుఃఖమో తెలియలేదు. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దైవఘటన అనుకున్నాడు. అదే అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు. జపించాడు. అది సారస్వత బీజాక్షరమని అతనికి తెలియదు. ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు.


ప్రాంగణంలో చొరబడిన పందికి, బయటకుపోయే దారి కనపడలేదు. దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి దాక్కొంది. ప్రాణభయం. చప్పుడు చెయ్యకుండా ఊపిరి బిగబట్టి పడుకొంది.  మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు. నల్లటి దేహం. ఎర్రటి కళ్ళు. యమకింకరుడిలా ఉన్నారు. పందిని వెతుక్కుంటూ వచ్చాడు. మునికి (ఉతథ్యుడికి) నమస్కరించాడు. పంది ఎటుపోయిందో చెప్పమన్నాడు. నా కుటుంబం ఆకలి తీర్చాలి. పోషించాలి. బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు. నిజం చెబుతున్నాను. నువ్వు కూడా నిజం చెప్పు. నా పంది ఎటుపోయింది ? ఇటే వచ్చింది. నువ్వు చూసే ఉంటావు. దానికి నా బాణం దిగబడింది.


ఉతథ్యుడు వితర్కంలో పడ్డాడు. వీడు ఆకలిమీద ఉన్నాడు. అడుగుతున్నాడు. పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు. చూపించకపోయినా తెలీదన్నా అసత్యమవుతుంది. ధర్మసంకటంలో పడ్డానే ఎలాగ ఆనుకున్నాడు. ఆలోచించాడు. పెద్దలమాటలు ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి. హింసకు దారితీసేటయితే అది సత్యమైనా సత్యం కాదు. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు. సత్యమే అవుతుంది. నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇద్దరికీ హితం అయ్యేట్టు అనృతం కానట్టు ఏమి చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఉతథ్యుడు మధనపడుతున్నాడు.


నిజమంత్ర బీజాక్షరాన్ని ఆప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది. ఉతథ్యుడిపట్ల అనుగ్రహం చూపించింది. అతడికి అఖిల విద్యలూ స్ఫురించేట్టు చేసింది. వాక్ శక్తిని అనుగ్రహించింది. ఉతథ్యుడు వాల్మీకిలా కవి అయ్యాడు. అతడి నోటినుంచి శ్లోకం వెలువడింది.


*యాపశ్యతి వపా బ్రూతే యా బ్రూతే పావ పశ్యతి!* 

*ఆహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పుచ్చపి పునఃపునః!!*


అయ్యో, వ్యాధుడా! ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు. చూసేది (కన్ను) చెప్పదు. చెప్పేది (నోరు) చూడదు. నేనేం చెయ్యను చెప్పు. వెళ్ళు. వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో. ఆకలి తీర్చుకో. ఇంత అరణ్యం ఉంది - అన్నాడు. ఉతథ్యుడు చెప్పిన ఈ సమాధానానికి వ్యాధుడు మారుమాటాడకుండా నిరాశతో నిష్క్రమించాడు.


ఆనాటినుంచీ ఉతథ్యుడు ప్రాచేతసుడిలాగే (వాల్మీకి) మహాకవి అయ్యాడు. సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధిని పొందాడు. సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలమంతటా సన్మానాలు అందుకున్నాడు. తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు.


ప్రతి పర్వదినానా మేమంతా ఇతడి కథను తలచుకుంటూ ఉంటాం. అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాం.


*జనమేజయా !* ఇది ఆనాడు నైమిశంలో లోమశుడు చెప్పగా నేను విన్న ఉతథ్యుడి కథ. కాబట్టి ఆదిపరాశక్తి ఏకైకారాధనీయ. సుఖసేవ్య, ఆశు సంతోష. నామాక్షరాన్ని అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే, ఇక నియమపూర్వకంగా జపించినవారికీ దేవీ యజ్ఞం చేసినవారికీ సకలవాంఛలూ సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమేముంది ! అనృతమేముంది ! అసలు అందుకే కదా అమ్మవారికి *“కామద" (కోరికలను ఇచ్చేది)* అనే ప్రసిద్ధి. 


ఒక్కమాటలో చెప్పాలంటే - ఇవ్వేళ లోకంలో వివిధ భాగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వారంతా దేవిని అర్చించినవారే. కష్టాలపాలై దుఃఖాలు అనుభవిస్తున్నవారంతా అర్చించనివారే. అందుచేత జనమేజయా ! భక్తితో దేవీ యజ్ఞం ఆచరించు.


*(అధ్యాయం-11, శ్లోకాలు - 58)*


*(రేపు దేవీయజ్ఞ భేదాలు)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


 

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat