శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 4 వ భాగము

P Madhav Kumar


ఆకాలములోనే కుంభకోణ మను నగరమున సుధీంద్రతీర్థులను వైష్ణవ యతివర్యులు పీఠాధిపతిగ నుండిరి. ఈ యతిరాజ వర్యుడు  పరమ విష్ణు భక్తుడు. ద్వైతసిద్ధాంత ములో శ్రీన్యాయసుధ  లోను మధ్వాచార్యులవారి సమస్త గ్రంథములలోను మహావిద్వాంసుడు. ఈ భాగవతోత్తముడు శ్రీమదా నందతీర్థుల వారికి వారసునిగ వైష్ణవపీఠము నధిష్ఠించెను. లక్ష్మీనృసింహా చార్యులు వెంకన్నా చార్యుని అన్న తనకు బావమరిదియు నైన శ్రీగురురాజాచార్యుని సంప్ర దించి ఉన్నత విద్యాభ్యా సార్ధమై శ్రీ వెంకన్నా చార్యుని కుంభకోణములో నున్న సుధీంద్రతీర్థుల చెంతకు తోడ్కొని వెళ్ళెను.


విద్యార్థిగా తనచరణము ల నాశ్రయించిన బాలకుని దివ్య తేజోమయమైన ముఖారవిందమును గాంచి ఈబాలుడు  కారణజన్ము డని, శ్రీహరిభక్తి ప్రచార కుడు కాగలడని శ్రీమూల రాముని ఆరాధించి దివ్య లోకములకు వెడలగల వాడని శ్రీసుధీంద్రతీర్థుల వారు  గ్రహించిరి. తనకు తెలిసిన విద్య నంతటిని బాలునకు బోధించెదనని తీర్థులవారు లక్ష్మీనృసింహా చార్యునకు బాస జేసెను. లక్ష్మీనృసింహా చార్యులు పరమానందభరితుడై బాల  వెంకటేశుని ఆశ్రమమందు వీడి స్వామి యనుజ్ఞ గైకొని మధురకు వెడలి పోయెను.


నేటి విద్యాభ్యాసమునకు నాటి విద్యాభ్యాసమునకు నెంతయో భేదము గలదు. ఆకాలములో విద్యనభ్య సింప గోరువారు సద్గురువు నాశ్రయించి ఆయన గృహములోనే నివసిం చుచు, గురువొసంగినదే ప్రసాదముగ భుజించుచు గురుసేవ నొనరించుచు విద్యనభ్యసించెడివారు. కావున ఆశ్రమములో అనేకురగు బాలకులు విద్యార్థులై యుండిరి. వారిలో పెక్కండ్రు సంపన్న వర్గములకు చెందిన వారు, మిగిలిన వారు మధ్య వర్గీయులు. వారిలో వేంకటేశుడే ఆర్థికముగ కడుపేదవాడు, కాని భక్తి జ్ఞాన వైరాగ్యములలో, విద్యాధనములలో మహా ధనవంతుడు. ఈ బాలకుని  అసాధారణ ప్రజ్ఞకు సుధీంద్రతీర్థుల వారు అత్యంతముగ్ధులై వానిని తనముఖ్య శిష్యునిగ చేసికొని ఆదరింప నారంభించిరి. తోటి బాలకులందఱు ఆటపాటలందు కాలమును వ్యర్ధపుచ్చుచున్నను మన వేంకటేశుడు మాత్రము సదా శ్రీహరి పాదారవింద మకరందం పానమత్తుడై ఎవరితో పలుకక మౌనముగ నుండెడివాడు. శ్రీ వేంకటేశుని తత్వమును అవగతమొనరించు కొనిన వారై  శ్రీ తీర్థులవారు విద్యాదానమున ఆ బాలు నిపై ప్రత్యేక శ్రద్ధ చూపెడివారు. కాని నాడు కూడ గొప్ప పేద యనెడు తారతమ్యములు కలవు. కావున తోటివిద్యార్థులు పేదవాడైన వేంకటేశుని ద్వేషించి తమ నుండి దూరముగ నుంచెడివారు. ప్రతివిషయములోను వేంకటేశుని ఆదరింపక అవమానించెడివారు. రాత్రి సమయములో గూడ విద్యార్థులందఱు ఒకే ప్రదేశములో పరుండగా  వేంకటేశుడు మాత్రము వారినుండి దూరముగ కప్పులేని ఒక పాడుబడిన మండపములో నొంటరిగ విశ్రమించెడివాడు. కాని వేంకటేశునకిది వరముగ మారిపోయెను. తోటిబాల కులందఱు రాత్రి నిదురించు చుండగ వెంకటేశుడు మాత్రము మేల్కొని దీపపు ప్రమిద వెలుగులోనే నాటి పాఠములకు ఆనాడే వ్యాఖ్యానము రచించి పిమ్మట విశ్రమించెడివాడు. ఆ పేద బాలకుడు పైన కప్పు కొనుటకు చినిగిన అంగవస్త్రమైనను లేక ఆరుబయట చలిలో విశ్రమించెడివాడు.


తోటి విద్యార్థులందరు వేంకటేశునిపై లేనిపోని అభాండములను కల్పించి గురుదేవునితో చెప్పెడి వారు. వెంకటేశుని నైజము అవగత మొనరించుకొనిన తీర్థులవారు వారి కొండె ములను పట్టించుకొనక తన ప్రియశిష్యుని యెంతగనో ఆదరించెడి వారు. ఎన్నికష్టము లనుభవించు చున్నను శ్రీహరి పాదాశ్రితుడైన శ్రీవెంకటేశుడు  కష్టసుఖ ములందు, ద్వేషాభిమాన ములందు సమభావము గలిగి  శ్రీహరిపవిత్ర నామములను జపించుచు తన విద్యాభ్యాసమును కొనసాగించెను. ఇట్లు కొంత కాలము గడచెను.


ఒకదినమున సుధీంద్ర తీర్థులవారు శ్రీ న్యాయ సుధను పాఠ్యాంశముగ స్వీకరించి ప్రతిదినము బోధింప నారంభించిరి. ఈ కఠినమైన  శాస్త్రమును బోధించుటకు స్వాముల వారు ప్రత్యేకశ్రద్ధ వహించిరి. ఇట్లు కొంత కాలము గతింపగ ఒకదినము స్వాముల వారు న్యాయసుధలోని ఒక భాగమును బోధించుచు దానికి సరియైన వ్యాఖ్యానము స్ఫురింపక మఱుదినమున చెప్పెదనని నాటి ప్రవచన మును విరమించిరి. ఆరాత్రియే శ్రీస్వాముల వారు తన విద్యార్థులను పరీక్షించుటకు ఆశ్రమము లో తిరుగ నారంభించిరి. ఒక శిష్యుడు దీపమును బట్టుకొని స్వాముల వారికి మార్గము జూపుచుండెను. తీర్థులవారు విద్యార్థులం దఱు విశ్రమించు ప్రదేశమున కేతెంచి చూడగా శ్రీ వేంకటేశుడు దప్ప అన్య విద్యార్థు లందఱు గాఢనిద్రావశులై యుండిరి. అపుడు శ్రీ స్వాములవారు వేంకటే శునికొఱకై ఆశ్రమ ప్రాంగణ ములో అన్వేషింప నారంభించిరి. ఆ ప్రదేశ మునకు కొలదిదూరములో ఒకపాడుబడిన కప్పులేని మంటపములో ఆరుబయట చలిలో నిద్రించు చున్న వేంకటేశుని స్వాములవారు గాంచి ఆశ్చర్యచకితులైరి. 


వేంకటేశుని శిరము చెంత నుండిన వ్రాతప్రతిని గాంచి దానిని గైకొని దీపపు వెలుగులో స్వాములవారు పరీక్షించిరి. ఆ పుస్తక ములో నొక్కొక్కపుట చదువుచు ఆ గ్రంధము తాను ప్రతిదినము బోధించెడి న్యాయసుధకు వ్యాఖ్యానమే యని దెలిసికొని చివరిపుటలో తాను ఏవిషయమునకు వ్యాఖ్యాన మొనరింపలేక మఱుదినము జెప్పెదనని పల్కెనో, ఆవిషయమునకు పరిపూర్ణ వ్యాఖ్యానము సర్వాంగ సుందర ముగ వేంకటేశునిచే లిఖింపబడి యుండెను.


ఆవ్యాఖ్యానమును పరికించి స్వాములవారు పరమానందభరితులై కనులనుండి ఆనంద బాష్పములు ప్రవహింప జేసిరి. అంతటి ప్రతిభా సంపన్నుడు తనకు శిష్యుడైనాడని స్వాముల వారు ఆనంద బాష్పము లను వర్షించుచు తన శిష్యునకు జరుగుచున్న అన్యాయమును గాంచి చింతాక్రాంతులైరి. తత్ క్షణమే  సుధీంద్రతీర్థుల వారు తాను ధరించిన పట్టుశాలువను వేంకటేశు నిపై కప్పి వేంకటేశునిచే రచింపబడిన ఆవ్యాఖ్యాన గ్రంథమును తీసికొని ఆశ్రమములోనికి జనిరి.


మఱునాటి ప్రాతః కాలమున స్వాములవారు పాఠ ప్రవచనము నారంభించుటకు శిష్యుల తో సహా ఆసీనులై వేంకటేశుని కొఱకై నిరీక్షింపసాగిరి.


శ్రీ పరిమళాచార్యులు:


గతరాత్రి  చాలసేపు స్వాములవారు బోధించిన న్యాయసుధ లోని విషయమునకు వ్యాఖ్యాన ము రచించి వేంకటేశుడు ఆలస్యముగ నిదురించెను. బాలార్కుని అరుణ కిరణములు సోకగనే మేల్కాంచి వేంకటేశుడు తనపై కప్పబడియున్న దుశ్శాలువను గాంచి అది గురు దేవులదని గ్రహించి భయభీతుడయ్యెను. ఎవరో తన తోటి విద్యార్థులు తనను కించపఱచి ఆశ్రమము నుండి వెడలగొట్టుట కిట్టి పన్నాగము పన్నినారని భావించెను. తానెంతో కష్టించి వ్రాసిన వ్యాఖ్యాన గ్రంథమును గానక అది గూడ అల్లరివిద్యార్థులు సంగ్రహించిరని చింతిం చెను. కాలకృత్యములను నిర్వర్తింపకయే వేంకటేశు డు గురుదేవుల శాలువను దీసికొని రయమున బోధనా గృహమును జేరి దుఃఖిoచుచు స్వాముల వారి పాదముల చెంత మోకరిల్లి "గురుదేవా! నేనెట్టిదోషము నెఱుగను. తమ శాలువను నేను సంగ్రహింపలేదు. ఎవరో గిట్టని తోటివిద్యార్థులు తమ శాలువను దెచ్చి నాపై గప్పి నన్నపరాధిగ నొనరించుటకు ఈ మోసమునకు  ప్రయత్నిం చిరి. స్వామీ! నేను నిరపరాధిని. ఈ ఘోరము నొనరించిన వ్యక్తియే నా హస్తలిఖత గ్రంథమును గూడ సంగ్రహించెనని” పల్కెను.


ఇట్లు విన్నపము లొనరించి దుఃఖితుడై తనయెదుట దోసిలియొగ్గి నిలువబడి యున్న ప్రియశిష్యుని గాంచి సుధీంద్ర తీర్థులు ప్రసన్న వదనముతో, “వత్సా! నీవు నిరపరాధి వని నాకు తెలియును. ఆ దుశ్శాలువ నిటనుంచి, నీ ప్రాతఃకాలవిధులను నిర్వర్తించుకొని మఱలి రమ్ము. నీగ్రంథము నెవ్వరును తస్కరించ లేదు అది నాచెంతనే యున్న" దని పల్కెను. 


గురుదేవుని అనుగ్రహ వాక్కుల నాలకించి వేంకటేశుడు దుఃఖమును వీడి పరమానందభరితుడై వెడలి క్షణములో కాల కృత్యములను నిర్వర్తించు కొని బోధనా గృహమునకు మఱలి వచ్చెను. గురుదేవుడు తాను గడచిన దినమున వ్యాఖ్యాన మొనరింపలేక వదలి పెట్టిన న్యాయసుధ లోని విషయమునకే వ్యాఖ్యామును బోధింప నారంభించిరి. వేంకటేశుడు రచించిన గ్రంథమును చదువుచు ఆ వ్యాఖ్యాన మును సాంగోపాంగముగ విద్యార్ధులకు బోధించి ఈ మహావ్యాఖ్యానమును రచించిన ఆదర్శవిద్యార్థిని దర్శింపుడని వేంకటేశుని జూపిరి. విద్యార్థులారా! సర్వజ్ఞునివలె వేంకటేశుడు న్యాయసుధకు చేసిన సమగ్ర వ్యాఖ్యానము పుష్పముకు పరిమళ మబ్బినట్లుండెను. వ్యాఖ్యానము  అత్యంత మధురాతి మధురము, పరమ సత్యము. ఈ న్యాయసుధకు  పరిపూర్ణ ముగ వ్యాఖ్యానము రచింపవలెనని నాయీ ప్రియశిష్యుని ఆజ్ఞాపించు చున్నాను. వీని యీ గ్రంథమునకు 'పరిమళ ' మని నామకరణ మొనరించుచున్నాను. వేంకటేశునకు పరిమళా చార్యుడను బిరుదు నొసంగుచున్నానని సుధీంద్రతీర్థులు ఆనంద బాష్ప పూరిత నయనము లతో విద్యార్థి సభామధ్య మున ప్రకటించిరి. ఇట్లు పల్కి తాను ధరించు పట్టుశాలువను గప్పి పరిమళాచార్యుల వారిని పరమానందముతో ఘన ముగ సన్మానించెను.


తోటివిద్యార్థులు వేంకటే శుడు సామాన్యుడుగాదని తెలిసికొని తామొనరించిన అపరాధములను క్షమింపు మని మిత్రుని పాదములపై బడిరి. దూషణ భూషణ తిరస్కారములను సమముగ భావించు పరమ భాగవతాగ్రణి యైన శ్రీ వేంకటేశుడు మనస్ఫూర్తి గ విద్యార్థులను క్షమించి ఆదరించెను.


సుధీంద్రతీర్ణులవారు తనకు తెలిసిన సకలవిద్యలను అత్యంత శ్రద్ధతో వేంకటేశునకు బోధించి ద్వైత సిద్ధాంత ములో అసమాన ప్రజ్ఞావంతునిగ తీర్చి దిద్దెను.


శ్రీపరిమళాచార్యులు యవ్వనుడై తన విద్యా భ్యాసమును ముగించు కొని గురు దేవుని యాశీర్వాదములను పొంది తోటి విద్యార్థులనుండి యనేక బహుమతులను బొంది తన      అగ్రజుడైన గురురాజాచార్యుని చెంతకు భువనగిరికి చేరెను. గురురాజా చార్యులు మహదానంద భరితుడై  తనసోదరునకు స్వాగతము పల్కెను. వెంకన్నాచార్యుడు  తన సోదరుని చెంత వీణావాద నము నభ్యసించి కొలది కాలములోనే మహా

విద్వాంసుడయ్యెను. యౌవనుడైన తన సోదరునకు శీలవతి, సౌందర్యవతి, గుణవతి, సౌభాగ్యవతి యైన సరస్వతీదేవి యను కన్యతో గురురాజా చార్యులు వివాహ మొనరించెను. 1616వ సంవత్సరములో (శాలి వాహన శకము 1537 ఆనందనామ సం. ) వేంకటేశుని వివాహము సరస్వతీదేవితో అత్యంత వైభవముగ జరిగెను.


ఇట్లు వెంకన్నాచార్యులు బ్రహ్మచర్యాశ్రమము విసర్జించి గృహస్థాశ్రమ మును స్వీకరించి కొంత కాలము సద్గుణవతి యైనభార్యతో గలసి హరిసేవలో తరించుచు రామసంకీర్తన  మొనరించు చు సుఖిoచెను.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

4  వ భాగము  

సమాప్తము**

💥💥💥💥💥💥


🙏 ఓం గురు రాఘవేంద్ర య నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat