#శ్రీ వేంకటేశ్వర లీలలు
🌊 *కుమారధార తీర్థము:*
కుమారధార తీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో పవిత్రస్నానం పరమ పుణ్యప్రథమంటారు. ఆనాడు అక్కడ, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచటం మరో విశేషం.
కుమారస్వామి ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధారా తీర్థమన్న పేరు వచ్చింది.
విష్ణు భక్తుడు కొండలలో దారి తప్పి ధ్యానం చేయడం ప్రారంభించాడని కూడా నమ్ముతారు. విష్ణువు తన ముందు ప్రత్యక్షమై ఈ చెరువులో స్నానం చేయమని కోరాడు. ఈ పవిత్ర తీర్థంలో స్నానంచేసిన మనిషిని పదహారేళ్ళ బాలుడిగా మార్చింది కనుక దీనిని కుమార తీర్థం అని పిలువబడింది.
🟢 *కుమారధార తీర్థ మహిమకి సంబందించిన కథ:*
ఒకప్పుడు బ్రాహ్మణోత్తముడొకడు వేంకటాచలమున తపస్సు చేసుకొనుచుండెను. అతడు శతవృద్దుడు అయ్యెను. అతనికి కౌండిన్యుడను శిష్యుడు కలడు. ఆ బ్రాహ్మణుడు పరమ నిష్ఠతో తపము సాగించేను.
ఒకనాడు బ్రాహ్మణుడు కందమూలములు తెచ్చుటకు బయలుదేరి, అందందు తిరిగి మరలి వచ్చు మార్గము తప్పిపోయి బడలికచే శిష్యుని గూర్చి కేకలు వేయుచూ తిరుగుచుండెను. గాని శిష్యుడు రాలేదు. ఎండవేడిమికి నాలుక ఎండినది. తన ఆశ్రమము దారి తప్పెను.
అప్పుడు దయామయుడగు శ్రీ వేంకటేశ్వరుడు చక్కని కుమార రూపముతో ఆ ముసలి వద్దకు వచ్చి "అయ్యా! ఇక్కడ ఎవ్వరునూ లేరు ఏలా అరచుచున్నావు? నీ శరీరము ముడుతలు పడి చూపులేని వృద్ధుడవైనావే? ఇంకా జీవించి ఏమిచేయవలే?" అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుడు కుమార రూపమున నున్నవానితో "అయ్యా! నేను బ్రతుకు కొరకు ఆశించలేదు. ఇంకా నేను దేవతా ఋణము తీర్చుకోలేదు. ఆ ఋణము తీర్చకుండా చనిపోయిన వ్యర్థమని జీవింపదలచితి" ననెను.
వేంకటేశ్వరుడు నవ్వి తన చేతితో ఆ ముసలివాని చేయి బట్టుకొని కుమార తీర్థమును జూపి స్నానము చేయమనెను. ఆ ముసలి కుమారతీర్థమున మునిగి లేచెను. వెంటనే ముసలి పదునారు సంవత్సరముల యవ్వనవంతుడయ్యేను.
వేంకటేశ్వరుడు ఆ యువకునకు కర్మానుస్టానమునకు కావలసిన సౌకర్యములు ఇచ్చిపోయేను. ముసలి వారిని వయసువారిగా జేయు మహిమ కల్గుటచే ఆ తీర్థమునకు కుమారతీర్థమని పేరు గల్గినది.