_*శబరిగిరి అయ్యప్ప స్తోత్రము*_
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
శ్రీ శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీజగద్గురు మహా సన్నిధానము మరియు శ్రీ జగద్గురు శ్రీ సన్నిధానము వారులు విజయయాత్రగా బయలుదేరి కర్ణాటక , కేరళ , తమిళనాడు మొదలగు ప్రాంతములకు విచ్చేసినారు. 15-3-1980వ దినమున శబరిగిరి యందలి శ్రీ ధర్మశాస్తాను దర్శించు సమయాన శ్రీజగద్గురు శ్రీసన్నిధానము శ్రీశ్రీ భారతీ తీర్థ స్వాములు వారిచే స్తుతించబడిన అయ్యప్ప స్తోత్రము)
*జగత్ప్రతిష్ఠా హేతుర్యః ధర్మః శ్రుత్యంతకీర్తితః | తస్యాపి శాస్తాయోదేవః తంసదా సముపాశ్రయే ||*
*తాత్పర్యము:-* ప్రపంచము నెలకొని యుండుటకు ధర్మము కారణమని వేదములో చెప్పబడియున్నది. అట్టి ధర్మమును కాపాడి శాసించువారు శ్రీ ధర్మశాస్తావారు అంతటి మహిమన్వితులైన శాస్తాను ఎల్లప్పుడు శరణువేడుతాను. (అయ్యప్పకు ధర్మశాస్తాయన్న నామము సుప్రసిద్ధము)
*శ్రీ శంకరార్వైర్ హి శివావతారైః ధర్మ ప్రచారాయ సమస్త కాలే | సుస్తాపితం శృంగ మహీంద్ర వర్యే పీఠం యతీంద్రాః పరిభూష యంతి॥*
*తాత్పర్యము:-* పరమ శివావతారులైన శ్రీశంకర భగవత్పాదా చార్యులు ఈ భువిపై ఎల్లకాలము నందును ధర్మప్రచారము ఎడతెగక జరుగుట కొరకై పవిత్రమైన శృంగేరి పుణ్యక్షేత్రము నందు శ్రీశారదా పీఠమును అందముగా సృష్టించినారు. యతి శ్రేష్ఠులు దీనినధిష్టించి శారదా పీఠాధిపతులుగా వెలసి , ధర్మప్రచారమొనర్చుచునే యున్నారు.
*తేప్వేవ కర్మంది వరేషు విద్యా తపోధనేషు ప్రథి తాను భావః | విద్యాసుతీర్ధోభినవోద్యయోగీ శాస్తార మాలో కయితుం ప్రతస్థే ॥*
*తాత్పర్యము:-* జ్ఞానమును , తపమును ధనముగా కొనిన ఆగొప్ప పరివ్రాజకులలో లోకప్రఖ్యాతి గాంచిన మహిమలు గలిగియున్న శ్రీ అభినవ విద్యాతీర్థయోగి ఇపుడు శబరిగిరి శాస్తాను దర్శించుటకు బయలుదేరును.
*ధర్మస్స గోప్తాయది పుంగవోయం ధర్మస్య శాస్తర మవైక్షత్రేతి | యుక్తం తదేత ద్యుఛయోస్త యోర్షి సంమ్మేళనం లోకహితాయ నూనం ॥*
*తాత్పర్యము:-* ధర్మమును కాపాడుచున్న ఈయతి శ్రేష్ఠులవారు ధర్మములకు అధిపతియైన శ్రీ ధర్మశాస్తా ను దర్శించినారు. అనునది మిక్కిలి సమంజసమే. వారిద్దరి సంగమము లోక శ్రేయస్కరమన్నది నిశ్చయము.
*కాలేస్మిన్ కలిమల దూషితేపిధర్మః శ్రాతోయం నఖలు విలోపమా పతత్ర | హేతఃఖల్వయమిహ నూనమేవనాన్యః శాస్తాస్తేసకలజనైక వంద్యపాదః ॥*
*తాత్పర్యము:-* కలిదోషము వలన కాలుష్యమై ధర్మహాని కలిగియున్న ఈ కాలమునందు కూడ ఇచ్చట (శబరిగిరిపై) వైధీకమైన ధర్మము నశించలేదు. ఇందులకు కారణము సకల జనులచే పూజించుటకు తగిన చరణములను కలిగిన శాస్తావారున్నారన్నదే తప్ప వేరు కారణమేమి లేదు.
*జ్ఞానం షడాస్య వరతాత కృపై కలభ్యం| మోక్షస్తుతార్ క్ష్య వరవాహదయైకలభ్యః || జ్ఞానంచ మోక్షము భయంతు వినాశ్రమేణ ప్రాప్యం జనైః హరిహరాత్మజ సత్ ప్రసాదాత్ ॥*
*తాత్పర్యము:-* షణ్ముఖుని తండ్రియైన మహేశ్వరుని కృపవలన మాత్రమే జ్ఞానమును పొందగలము. గరుత్మంతుని వాహనము కలిగియున్న మహా విష్ణువు యొక్క దయవలన మాత్రమే మోక్షమును పొందుట సాధ్యము కాని హరిహరపుత్రుని అను గ్రహమును పొందినచో మానవులకు శ్రమములేక సులభముగా జ్ఞానము , మోక్షము రెంటిని పొందుట సాధ్యము.
*జ్ఞాన మిచ్చేన్మహే శ్వరాత్ మోక్షమిచ్చే జ్జనార్థనాత్ । జ్ఞానంచ మోక్షంచ వినాశ్రమేణ ప్రాప్ట్వేజనాః హరిహరపుత్రసత్ ప్రసాదాత్॥*
*భావము :-* జ్ఞానమును పొందుటకు ఈశ్వరుని శరణము కోరి వారి కృపాకటాక్షములను పొందవలెను. పిదప మహావిష్ణువుని శరణము కోరి వారి కృప వలన మోక్షమును పొందవలెను. వీరిద్దరి కృపను పొందుటకు శ్రమ పడుటకన్న హరిహరపుత్రుని ఒక్కరిని మాత్రము శరణుకోరి ఆయన కృపను పొందగలిగితే అందుమూలముగ జ్ఞానము , మోక్షము రెంటిని పొందగలము. హరపుత్రుడు కనుక జ్ఞానమును ప్రసాదించు శక్తియును , హరియొక్క పుత్రుడుగనుక మోక్షమును ప్రసాదించు శక్తియు శ్రీధర్మశాస్తావారికి గలదు.
*యమని యమాది సమేతైః యత చిత్తైర్యోగిభిః సదాధ్యేయః | శాస్తారం హృదికలమే దాతారం సర్వలోకస్య ॥*
*తాత్పర్యము:-* యమ నియమములతో కూడి మనస్సును అధీనపరచుకో గల్గిన యోగులచే ఎల్లప్పుడు ధ్యానము చేయ తగిన వారు శాస్తా వారే సకలజనులను , జీవరాశులను పోషించువారు. అట్టి శాస్తాను మనస్సున ధ్యానించు చున్నాను.
*శబరిగిరినివాసః సర్వలోకైకపూజ్యః నతజనసుఖకారీ నమ్రహృత్తాపహారీ త్రిదశదితిచ్చసేవ్యః స్వర్గ మోక్ష ప్రదాతాహరిహర సుతదేవః సంతతం శం తనోతు ॥*
*తాత్పర్యము:-* శబరిగిరిపై వెలసియున్న అయ్యప్పస్వామి సకల జనులచే పూజింపతగ్గవారు. తనను పూజించు జనులకు సుఖము ప్రసాదించువారు. భక్తుల యొక్క మనస్సులో ఉన్న తాపములను పోగొట్టువారు. వారుదేవతల చేతను , అసురుల చేతను సేవలందుకొనువారు. స్వర్గమును , మోక్షమును ప్రసాదించువారు ఇట్టి మహిమలుగల హరిహర పుత్రులవారు ఎల్లప్పుడు ఎల్లరికి మంగళమును కలుగ జేయుదురుగాక !
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖ బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌻🙏