ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను.
నవదుర్గలు :
ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.
బ్రహ్మ చారిణి ( గాయత్రి )
నైవేద్యం : పులిహోర
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
!! పులిహోర !
కావలసినవి !!
బియ్యం 150 గాం
చింతపండు 50 గ్రాం
పసుపు1/2 స్పూన్
ఎండుమిర్చి 5
ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగ పప్పు 2 స్పూన్
వేరు శనగ పప్పు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా
అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి
నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గొజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్లో )
వుడికిన గొజ్జు అన్నంలో కలిపండి .
బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము.
దుర్గా ధ్యాన శ్లోకము :
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥
బ్రహ్మచారిణీ దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం.
గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది.
నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండోరోజున పూజిస్తారు.
తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.
బ్రహ్మ, అంటే అన్నీ తెలిసిన, తానే జగత్తుగా కలిగిన, స్వయంగా దైవం, జ్ఞానం కలిగిన అనే అర్ధం వస్తుంది.
చారిణి, అంటే చర్య కదలడానికి స్త్రీ రూపం. కదలడం, ఒక పనిలో నిమగ్నమవడం, ఒక దానిని అనుసరించడం వంటి అర్ధాలు వస్తాయి.
మొత్తంగా బ్రహ్మచారిణీ అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్ధం. ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్ధిని.
పురాణ గాథ
పురాణాల ప్రకారం పార్వతీ దేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనకా, హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా, ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడనీ, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీ దేవిగా జన్మెత్తి, శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి, తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారంలో ఘోరతపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ, తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్యా కాలేరని భావించి శివుడు, తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమే గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు.
నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దుర్గా దేవిని నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వీయుజ శుక్ల విదియ నాడు పూజిస్తారు.
ఓం శ్రీ బ్రహ్మచారిణీ దేవ్యై నమః