*గురు వచనములు - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములు వారు శబరిమల శ్రీ శాస్తావారిని దర్శించుకొన్నారు. అప్పుడు వారు శ్రీ స్వామి అయ్యప్పను గూర్చి ఇలా వివరించిరి.
*మారమణ ముమారమణం ఫణధరతల్పం ఫణాధరకల్పం |*
*మురమధనం పురమధనంవందే బాణారి మసమ పాణాం ॥*
*తాత్పర్యము :-* ఆదిశేషునిపై శయనించు వాడును , మురన్ , పాణుడు అను రాక్షసులను హతమార్చిన లక్ష్మీపతియగు హరిని , సర్పమును హారముగా ధరించువాడు , త్రిపురములను , మన్మథుని భస్మముచేసినవాడూ ఉమాపతియు అయిన పరమేశ్వరుని బేధములుగాని , బేధాభిప్రాయములుగాని లేక నమస్కరించు చున్నాను.
*"హరిహరస్య బేధోనాస్తి"* హరియగు శ్రీమహావిష్ణువునకు , హరుడగు పరమేశ్వరునకు బేధాలుకాని , బేధాభి ప్రాయాలుకాని వుండవు. కొందరు విష్ణువే గొప్పవాడనియు , మరి కొందరు పరమేశ్వరుడు మిక్కిలి గొప్పవాడనియు తర్కిస్తుంటారు. ఇది ఎంతటి మహాపచారమో అనేది *"శ్రీహరిహరాబేధదశశ్లోకి"* అను గ్రంథములో చాలా అందముగా వివరింపబడియున్నది. శ్రీమత్ మహాభారతము నందు హరివంశములో గూడా శ్రీహరిహరా బేధము అందముగా వివరింపబడి యున్నది.
*రుద్రస్య ప్రభవోవిష్ణుర్ విష్ణోశ్చప్రభవః శివః ఏకమేవాద్వితో భూత్వా లోకే చరతి నిత్యశః |*
*నవినాశంకరం విష్ణుర్ నవినాకేశవం శివః తస్మాదేకత్వమా పన్నై రుద్రోపేంద్రాస్తుతౌపురా ||*
ఈశ్వరుడు విష్ణువు నుండియు , విష్ణువు ఈశ్వరుని నుండియు ఉద్భవించినారు. ఒకే పరబ్రహ్మతత్వము లోకములో రెండుగా విభజించి కనిపించు చున్నది. శివుడులేనిదే విష్ణువు లేడు. అలాగే విష్ణువులేనిదే శివుడు లేడు. దీని నిదర్శనమే శంకరనారాయణ విగ్రహము (తమిళనాడు) హరిహరబ్రహ్మాదులు ఒకరే అనుసత్యమును మరింత గట్టిగా కాళిదాసు మహాకవిగూడ తన కుమారసంభవ కావ్యములో - *"ఏకైవమూర్తి ర్చిబిదే త్రిదాసా సామాన్య మేషాం ప్రథమావరత్వం"* ఒకే పరబ్రహ్మము బ్రహ్మ , విష్ణు , రుద్రుడు అని మూడు మూర్తులుగా విడిపోయి యున్నది. హెచ్చుతగ్గులు ఆమూర్తులకు సమమైనదే అని చెప్పియున్నారు. శివుడు గొప్ప , విష్ణువు గొప్పఅని పలుకు వారికి *'పరమపదము'* లేదు , అను పెద్దలమాట శివునకు , విష్ణువునకు భేదములు కల్పించువారిని గట్టిగా హెచ్చరించుచున్నది. అలాగే మానవులు భగవంతుని నామములను ఉచ్చరించి మోక్షమును పొందవచ్చునంటే దానికి అడ్డుగాయుండు పది నేరములలో విష్ణుశివుల మధ్యభేదము కల్పించుట మొదటిదవుతుంది. ఈ సత్యమును పామరులు గూడ తెలుసు కొనుటకై వీరిద్దరు తమ అంశములతో హరిహరపుత్రుడైన శ్రీ అయ్యప్పను కలియుగ మందు ప్రత్యక్షింపజేసినారు. సర్వదేవ నమస్కారములను స్వీకరించు వైకుంఠ పతియగు మహావిష్ణువును తల్లిగాను , సర్వేశ్వరుడు , కైలాసవాసుడు అయిన పరమేశ్వరుని తండ్రిగాను పొంది స్త్రీ సంబంధమే లేక ఉద్భవించిన హరిహరపుత్ర మణికంఠ నామధేయుడు. కలియుగమున భారతదేశములో యుండు కేరళ దేశమునందు *"శబరిమలై"* అను అరణ్యములో పర్వతమధ్యములో జాతిమత భాషాభేదము లేకుండ శబరిగిరిపైనున్న జ్ఞాన పీఠమునధీష్టించి , తననుతలచువారికి తలచినవెంటనే అను గ్రహము ప్రసాదించు వారే శ్రీ స్వామి అయ్యప్ప. వీర్ని సద్గురు నాథునిగా దలచి ఆరాధించుట పరిపాటి.
లోకాలకు ధర్మాన్ని శాసించి , నేర్పించి , ఆచరింప చేసే గురునాదప్ప యని వీరిని గూర్చి శాస్త్రములో చెప్పబడియున్నది. గురు శబ్దమునకు చాలా శ్రేష్ఠుడు అని అర్థము. మానవ జాతికి గురువు ఆశీస్సులు చాలా అవసరము. గురువు ఆశీస్సులు పొందిన మానవునిలో నిబీడీకృత చైతన్యము జ్వలితమౌతూ ఉంటుంది. అట్టి మానవులు ప్రపంచానికి ఆదర్శంగా విరాజిల్లుతారు. భౌతిక , ఆధ్యాత్మిక జీవితానికి గురుభోదనా మార్గమే శ్రేయోదాయకమైనది. గురుదేవుని ఆశీస్సులకు , సందేశానికి హిందూ మతము అత్యధిక ప్రాధాన్యత ఇచ్చియున్నది. మానవునికి భగవంతునికి మధ్య యొక వారధియు , మార్గదర్శియు గురువే అగును. భగవంతుని ధ్యానించే విధానాన్ని ఆచరణాత్మకంగా ప్రభోదిస్తారు గురువులు.
ఇతర మతాలలోగూడ గురువుకు ప్రాధాన్యం గలదు. బిషప్ , మౌళి వంటి గురువులు ఆయా మత సంప్రదాయానికి తగినట్లుగా ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉంటున్నారు. సిక్కు సంప్రదాయంలో గురువుకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. సిక్కు సంప్రదాయం వారు గురువుని సాక్షాత్తు పరమేశ్వరునిగానే భావిస్తారు. అలాగే మనముకూడా స్వామి అయ్యప్పను సాక్షత్ గురువుగానే దలచి ఆరాధించే పరిపాటి అలవాటులో గలదు. గురుగోవింద్ సింగ్ మొదలైన సిక్కు గురువులు ఎంతయో త్యాగమయ జీవులు. వారు ఆజ్ఞాపిస్తే శిష్యులు తమ ప్రాణములను గూడా అర్పించడానికిని వెనుదీయరు. ప్రాపంచిక జీవితం నుండి ముక్తిమార్గాన్ని చూపెట్టే మార్గదర్శి గురువు. కొన్ని సందర్భాలలో తండ్రియే గురువు అవుతూ ఉంటాడు. అందుచే తండ్రిని గురువు అనియు అంటుంటాము. *'సరాజ్యం గురుణాదత్తమ్'* అని రఘువంశమున కాళిదాసు చెప్పియున్నాడు.
గురు శబ్దానికి అజ్ఞానమనే చీకటిని తొలగించి తేజోమయ మైన సన్మార్గం చూపేవాడు అని అర్థము. భౌతిక , ఆధ్యాత్మిక జీవితాలలో మనిషికి ఒకానొక సన్మార్గదర్శి యైన వ్యక్తి యొక్క అవసరం ఎంతైనా గలదు. అతడే గురువు. సంసార లంపటంలో పడి అనేకక్లేశాలను అనుభవిస్తూ మనస్సును అల్లకల్లోలం చేసుకుంటాడు మానవుడు. అప్పుడు ఆత్మజ్ఞానియైన గురువు ఆతని మానసిక క్షోభకు కారణాలను వివరిస్తాడు. అవి తొలగిపోయే మార్గాలను బోధిస్తాడు. పరమశాంతి ధామాన్ని ఉపదేశిస్తాడు. జన్మ సాఫల్యం గావిస్తాడు. సాధారణంగా గురువులు *"తమసోమా జ్యోతిర్గమయ"* అన్నట్లుగా శిష్యులను అజ్ఞానం నుండి జ్ఞానానికి తీసికెళుతారు. *నేటికాలంలో అజ్ఞానం నుండి అంతకంటే అజ్ఞానంలోకి పడవేసే కుహనాగురువుల సంఖ్య చాలా వరకు పెరిగిపోయింది* అనియే వినికిడి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌺🙏