#శ్రీ వేంకటేశ్వర లీలలు
🌸 *కటాహ తీర్థము (తొట్టి తీర్ధం):*
తిరుమలలోని 'కటాహ తీర్థం' మహా మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ తీర్థం సేవించినంతనే పంచమహా పాతకాలు పారిపోతాయని మహర్షులు సైతం చెప్పారు. ఈ తీర్థం ఇంతటి మహిమను కలిగి ఉండటానికి కారణం, ఇది శ్రీవారి పాదాల నుంచి వచ్చే అభిషేక తీర్థం కావడమే. ఈ తీర్థం అన్నమాచార్య భాండారానికి ఎదురుగా ఏర్పాటు చేయబడిన తొట్టిలోకి వస్తుంది. అందువలన దీనిని 'తొట్టి తీర్థం' అని కూడా పిలుస్తుంటారు.
🟢 *కటాహ తీర్థ మహిమకు సంబందించిన కథ:*
పూర్వము కన్యాకుబ్జమునకు సమీపమున వేదపురము అను ఒక అగ్రహారం ఉండెను. ఆ అగ్రహారమున పద్మనాభూడను బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతనికి లేక లేక ఒక కుమారుడు పుట్టెను. ఆ బాలునకు కేశవుడు అని పేరు బెట్టిరి. కేశవుడు పెరిగి పెద్దవాడయ్యెను. కేశవునకు పెండ్లి అయినది. భార్య చాలా వుత్తమురాలు.
కేశవుడు కొన్నాళ్లకు ఒక వేశ్యతో స్నేహము చేసెను. ఆ కారణమున కేశవుడు తల్లిదండ్రులను, భార్యను వదిలి రాత్రింబవళ్ళు వేశ్య ఇంటిలోనే నివసించుచుండెను.
కొన్నాళ్లకు వేశ్యకు ధనము రానందున కేశవుని దూషించి పొమ్మనెను. వేశ్యను విడిచి వుండలేక కేశవుడు ధనము కొరకు దొంగతనము ప్రారంభించి అందువల్ల వచ్చు డబ్బును వేశ్యకు ఇచ్చుచుండును.
ఇట్లుండి కేశవుడు ఒకనాడు గొప్ప భాగ్యవంతుడైన ఒక బ్రాహ్మణుని ఇంటికి కన్నము త్రవ్విలోన ప్రవేశించెను. అర్థరాత్రి యగుటచే ఇంటి వారందరూ నిద్రించుచుండిరి. కేశవుడు ఇంట ఉన్న ధనము తీసుకొని పోవుచుండ ఇంటి యజమాని బ్రాహ్మణునకు మెలుకువ వచ్చి దొంగను అడ్డగించేను. కేశవుడు ఆ ఇంటి యజమానిని చంపి దొంగలించిన ద్రవ్యముతో వచ్చుచుండెను.
అట్లు వచ్చుచున్న కేశవుని బ్రాహ్మహత్యా పాతకం వెంబడించెను. అతను ఎక్కడికి పోయిన అక్కడికి సిద్ధమైనది. కేశవుడు పిచ్చివాని వలె ఆ పాతక బాధ భరించలేక చివరకు ఇంటికి వచ్చి తండ్రి కాళ్లపై బడి తన బాధ చెప్పుకుని ఏడ్చేను.
బిడ్డలు ఎంత దుర్మాగులైననూ, తల్లిదండ్రులకు వారిపై ప్రేమ నశించదు గదా..
కుమారుని బాధ చూచి పద్మనాభుడు జాలిగొని ఏడ్చెను. అంతలో ఆ బ్రహ్మహత్య పిశాచం పద్మనాభునితో ఇట్లనెను "అయ్యా! ఇతడు నీ వంశమున చెడబుట్టినాడు. ఈతడు కల్లు సారాత్రాగి, దొంగతనములు చేసి, ఎన్నో హత్యలు చేసి చివరకు బ్రాహ్మహత్య కూడా చేసినాడు. కనుక వీనిపై దయచూపకు" అనెను.
కేశవుని తల్లిదండ్రులు, భార్య మిక్కిలి దుఃఖములో ఉండిరి. ఇట్లుండ ఒకనాడు భరద్వాజ ముని వారి ఇంటికి వచ్చెను. పద్మనాభుడు ఆ మునిని పూజించి తన కొడుకునకు గల్గిన బ్రాహ్మహత్యా దోషమును జెప్పి విమోచన మార్గమును తెలుపవలసినదని ప్రార్థించెను.
భరద్వాజముని ఆ బ్రాహ్మణునితో "అయ్యా! శ్రీ వేంకటాచలమున స్వామి ఆలయమునకు ఉత్తర భాగమున కటాహ తీర్థము ఉన్నది. ఆ తీర్థము నందు స్నానమాడి స్వామిని సేవించిన బ్రాహ్మహత్య మొదలైన పాపములు నశించి మోక్షము గల్గును" అని చెప్పిపోయెను.
పద్మనాభుడు తన కుమారుడైన కేశవుని వెంటబెట్టుకుని వెంకటాచలం జేరి, కటాహ తీర్థమున తానును, కేశవుడునూ స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని సేవించిరి. భగవానుడు ప్రత్యక్షమై వారిని పాప విముక్తులనుజేసీ అనుగ్రహించేను.