#శ్రీ వెంకటేశ్వర లీలలు
🌸 *రామకృష్ణ తీర్థము:*
ప్రకృతి రమణీయమైన ఈ తీర్థము తిరుమల ఆలయానికి 6 మైళ్ల దూరంలో ఉంది. ఈ తీర్థం మహిమాన్విత ప్రదేశంగా భక్తులు చెబుతారు.
పూర్వం రామకృష్ణుడు అనే ఓ మహర్షి వెంకన్న అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. రామకృష్ణడి భక్తికి మెచ్చి వేంకటేశ్వరుడు ప్రత్యక్షమై కోరిన వరాలను ప్రసాదించాడు. అప్పటి నుండి ఈ తీర్థానికి రామకృష్ణ తీర్ధంగా పేరొందింది.
మకర పుష్యమీ నక్షత్ర యుక్త పౌర్ణమి రోజున ఇక్కడ వేడుక జరుపుతారు.
🟢 *రామకృష్ణ తీర్థ మహిమకు సంబందించిన కథ:*
పూర్వము ఒక గ్రామమున రామకృష్ణుడు అను బ్రాహ్మణుడు ఉండెను. అతడు బాల్యము నుండి వేదాధ్యయన మొనర్చి, పెండ్లి మానుకొని సంసార బాధలు వదలి జన్మరాహిత్యం చేసుకొను మార్గమేమో ? అని యోచించుచుండెను.
ఇట్లుండ ఒకనాడు చిదానందుడను ఒక యోగి రామకృష్ణుని ఇంటికి వచ్చెను. రామకృష్ణుడు యోగిని చాలా భక్తితో పూజించెను.
యోగి రామకృష్ణుని భక్తికి సంతసించి "నాయనా! నీ కేమి కావలయును" అని అడిగెను.
రామకృష్ణుడు "స్వామి! సర్వసంగ పరిత్యాగిని, నాకేమీ కావలయును? ప్రపంచముతో నాకు పనిలేదు. నాకు ఎప్పటికీని జన్మ లేకుండా ఉండు మార్గము బోధించ వలసినది" అని ప్రార్థించెను.
రామకృష్ణుని మాటలు విని యోగి మెచ్చుకొని "నాయనా! నీవు బాలుడవు. పెండ్లి చేసుకొని సంసార సుఖములు అనుభవించి సంతానముగని, పితృదేవతలను తరింపజేసీ తర్వాత మోక్షమార్గం చూడవలెను. కానీ ఇంత చిన్న వయసులోనే నీకీ ప్రపంచ విరక్తి యేలా?" అనెను.
రామకృష్ణుడు "స్వామి! నాకేమో సంసార సుఖములపై బ్రాంతి లేదు. నేను ఆ చిక్కుల్లో బడలేను. దయయుంచి నాకు మార్గము భోధించ వలసినది" అని మిక్కిలి ప్రార్థించెను.
చిదానంద యోగి సంతోషించి "నాయనా! యీ లోకములో పరమ పవిత్రమైన వేంకటాచలమునకు బోయి తపస్సు చేసుకొన్నచో సకల కోరికలు సిద్ధించును" అని చెప్పి దివ్యమైన మంత్రము ఉపదేశించి పోయెను.
రామకృష్ణుడు వెంటనే వేంకటాచలము చేరి స్వామి పుష్కరిణీ యందు స్నానమాచరించి శ్రీ వేంకటేశ్వరుని సేవించి ఒక పవిత్ర తీర్థ సమీపమున కూర్చుండి తపస్సు ప్రారభించెను.
ఈ విధముగా అతని తపస్సు కొన్ని యేండ్లు గడిచిపోయేను. అతను నిద్రాహారాలు మాని మహానిష్టతో తపస్సు చేయుచుండెను. అతని శరీరము చుట్టునూ గొప్ప పుట్ట పెరిగి పోయింది. ఆ మునీశ్వరుడు ఇతరులకు కనబడకుండా పుట్టలోనే నిలిచెను.
అతని తపస్సుకి ఇంద్రుడు భయపడి తపస్సు భంగము చేయవలేనని తలచి రాత్రింబగళ్ళు అంతులేని వర్షము ఆ పుట్టపై కురిపించెను. ఆ ముని కదలలేదు, మెదలలేదు. దేవేంద్రుడు పిడుగులు పడవైచెను. పుట్ట పగిలిపోయేనే గాని ఆ ముని చలించలేదు.
అంతట అతని తపస్సు ఫలించి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యేను. ఆ ముని సంతసించి స్వామికి దండప్రణమాలు చేసి "ఓ జగన్నాధా! దేవదేవా! లక్ష్మీ రమణా! గోవిందా! వాసుదేవా నీ దర్శనము వలన నా జన్మ తరించింది. నా కోరిక నెరవేర్చు" మనెను.
వేంకటేశ్వరుడు సంతోషించి "నాయనా! నీవు నివసించు తీర్థమున స్నాన మొనర్చి యీ దేహము విడిచి వైకుంఠ ధామము చేరి శాశ్వత మోక్షము పొందేదవు" అని చెప్పి పోయెను.
ఆ ముని అట్లే యొనర్చి ముక్తినొందెను. ఆ తీర్థమునకు రామకృష్ణ తీర్థము అని పేరు కలిగెను.