#శ్రీ వేంకటేశ్వర లీలలు
**పార్ట్ - 61**
🌸 *కూర్ముడను బ్రాహ్మణుని చరిత్ర* :
తొండమానుడు ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడుచూ, వేంకటేశ్వరుని నామస్మరణము మరువక ధర్మముగా రాజ్యము ఏలుచుండెను.
ఒకప్పుడు కూర్ముడు అను బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలు కాశీ క్షేత్రమున గంగలో కలుపవలేనని నిశ్చయించెను. కాశీ యాత్ర కాలినడకన చేయుటకు నెలల కొలది కాలము పట్టుటచే ఆ బ్రాహ్మణుడు తన భార్యను, ఐదేండ్ల ప్రాయము గల కుమారుని వెంటబెట్టకొని యాత్రకు బయలుదేరాడు. మార్గమధ్యమున అతని భార్య గర్భవతి గావుననూ, కొడుకు చిన్నవాడగుట చేతనూ వాళ్ళిద్దరూ నడవలేకుండిరి. దారిలో వారికి తొండమానుని పట్టణము తగిలెను.
బ్రాహ్మణుడు తోండమానుని కీర్తి విని ఆ మహారాజు ఆస్థానమునకేగి ఇట్లనెను. "మహారాజా! నేను పెద్దల అస్తులు గంగలో కలుపుటకు కాశీయాత్రకు పోవుచున్నాను. మార్గమధ్యమున మీ పట్టణము వచ్చినది. నా భార్య గర్భవతి. నా కొడుకు చిన్నపిల్లవాడు. ఇంకా చాలా దూరము నడవవలసి ఉన్నది. ఇప్పటికే వారు అలిసిపోయి ఉన్నారు. నడుచు స్థితిలో లేరు. నీవు ధర్మప్రభువు అనియూ, దయ కలవాడవనియూ విని నిన్ను ఆశ్రయించు చున్నాను. నేను కాశీ నుండి తిరిగి వచ్చు వరకునూ నా భార్యను, కుమారుని మీకు వొప్పగించుచున్నాను. వారిని చక్కగా పోషించి నేను రాగానే నాకు వప్పగించవలసినది" అని కోరెను.
బ్రాహ్మణుని ప్రార్థన విని తొండమానుడు దయగలిగి "అయ్యా! అట్లేకానిండు. నీ ఆలుబిడ్డలకు నేను ఏ లోటూ రానీయకుండా పోషించి మీకు అప్పగింతును" అని చెప్పెను. బ్రాహ్మణుడు సంతోషించి భార్యను, కొడుకును విడిచి వెళ్ళెను. తొండమానుడు బ్రాహ్మణుని భార్యకు, కుమారునకూ ఒక ప్రత్యేకమైన మందిరము ఏర్పాటు చేసి వారికి కావలసిన సామానులు అందుంచి ఆ మందిరములోనికి ఎవ్వరూ పోరాదని ఆజ్ఞ చేసి భటులను కాపు పెట్టేను.
కొన్నాళ్ళు గడిచెను. బ్రాహ్మణుని భార్య ప్రసవించు సమయం వచ్చెను. తొండమానుడు రాజ్య కార్యాలలో నుండి వారి సంగతియే మరచెను. వానికి తిండికి తీర్తమునకు లేదు. రాజు ఇచ్చిన సామాగ్రి ఎన్నడో అయిపోయింది. బయటకు పోవుటకు వీలు లేకుండా మందిరము తాళము వేసి యుండెను. బ్రాహ్మణుని భార్యయూ, కుమారుడు ఉపవాసములతో కృశించి పోవుచుండిరి. ఎన్నాళ్ళని అన్నము లేకుండా బ్రతకగలరు. ఆమె ప్రసవించెను.
ఆకలి మంటతో కృశించి ఆ బ్రాహ్మణుని భార్య, కుమారుడు, చంటి పాపయూ, ఆ మందిరములోనే మరణించిరి. ఆ సంగతి కూడా తోండమానునకి తెలియదు. కొన్నాళ్లకు కాశీకి పోయిన బ్రాహ్మణుడు వచ్చి, తోండమానుని చూచి "నా భార్య కుమారులు క్షేమమేనా!" అనెను. తొండమానుడు ఆ మాట విని గుండె గుబిల్లుమని వారి సంగతి అప్పుడు జ్ఞాప్తికి వచ్చి బ్రాహ్మణునితో "అయ్యా! మీరు వెళ్లి స్నానసంధ్యలు తీర్చుకొనిరండి" అని పంపి తన కుమారునితో వారల క్షేమమే తెలుసుకొనుమని పంపెను. వాడు పోయి తలుపులు తెరిచి చూచునప్పటికి వారి కళేబరములు మాత్రము కనిపించెను. అతడా మాట తండ్రితో చెప్పెను.
తొండమానుని దుఃఖమునకు అంతులేదు. నిష్కారణముగా బ్రాహ్మణ కుటుంబమును మరణింప జేసీ బ్రహ్మహత్య పొందితినేయని దుఃఖించి బ్రాహ్మణునకు యేమి సమాధానము చెప్పుదునాయని యోచించు చుండ ఇంతలో బ్రాహ్మణుడు వచ్చెను. తొండమానుడు బ్రాహ్మణునితో "అయ్యా! నీ భార్య కుమారులు ఇచ్చటివారందరూ పోవుచుండ వారితో వేంకటాచలం స్వామిని చూచుటకు పోయిరి. త్వరలో వత్తురు కాన మీరు వంట జేసుకుని తినుడు" ఆని ఆయనకు కావలసిన ఏర్పాట్లు చేయించి తన కుమారుని వెంట బెట్టుకుని వెంటనే సింహాచలం చేరి శ్రీ వేంకటేశ్వరుని పాదములపై బడి వెక్కివెక్కి ఏడ్చుచుండెను.
భగవానుడు తోండమానునితో "రాజా! ఎందుకిట్ల పరితపించుచున్నావు?" అని అడిగెను. తొండమానునకు ఆ మహా ఘోరము చెప్పుటకు నోరు రాక మిక్కిలి ఏడ్చుచుండెను. అంత స్వామి దివ్యదృష్టిని జూచి అంతయూ గ్రహించి తోండమానునితో "ఓయీ! ఎంతపని చేసితివి? నిష్కారణంగా బ్రహ్మ హత్యా పాపము గట్టుకొంటివే! కానిమ్ము. నీవు నాకు పరమ భక్తుడవు. భక్తులకు ఆపదలు గల్గిన నేను సహించలేను. కావున ఆ శవములు తెప్పింపుము. సజీవులుగా జేసీ నీకు పాపము రాకుండా కాపాడెదను" అనెను.
తొండమానుడు సంతోషించి వెంటనే తన కుమారుని బంపి వారి కళేబరములు తెప్పించేను. భగవానుడు ఆ శవములపై అస్తి తీర్థమును ప్రొక్షింపగా బ్రాహ్మణునుని భార్యయూ, కుమారుడును, పసిపాపయూ, నిద్దుర నుంచి లేచినట్లు లేచిరి. అందరూ సంతోషించిరి.
తొండమానుడు వారిని బ్రాహ్మణున కొప్పగించెను.
(తరువాయి భాగం రేపు)...