శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ - 67*

P Madhav Kumar

 #శ్రీ వేంకటేశ్వర లీలలు


🌸 *"వసుపు" అను నిషాదుని చరిత్ర :


శ్రీ వేంకటాచలమున "వసుపు" అను బోయవాడు కాపురముండెను. వాని భార్య "చిత్రావతి". వారిద్దరూ అనుకూలంగా ఆ కొండపై కాపురం చేయుచుండిరి.


వృత్తిలో కిరాతుడైననూ, భక్తిలో మంచివాడు. అతడు ప్రతిదినము ఆ కొండపైన వెదురుబియ్యము తెచ్చి భార్యకు ఇవ్వగా ఆమె వండును, వాడు అడవిలో పుట్టతేనే తెచ్చి ఆ యన్నమున కలిపి ఆ మధురాన్నమును తాను నివసించు చెట్టుకింద నున్న రాతిబొమ్మను వెంకటేశ్వరునిగా భావించి నైవేద్యము పెట్టీ తాను తినుచుండెను. 


ఇట్లుండగా చిత్రావతికి గర్భము కలిగి కుమారుని గనేను. వానికి 'సువీరుడు' అను పేరు బెట్టె. వాడు పెరిగి పెద్దవాడయి పండ్రెండు యేండ్లకు వచ్చెను.


ఒకనాడు వసుపు అడవికి తేనెకు పోయెను. చిత్రావతి అన్నము వండి సిద్దము చేసినది. సువీరుడు తండ్రి తేనె తెచ్చులోపల ఆ అన్నమును చెట్టుకింద ఉన్న దేవునకు ఆరగింపు చేసి తాను తినెను.


వసుపు వచ్చి ఆ సంగతి విని తేనె లేకుండా స్వామికి అన్నం పెట్టెనని కుమారునిపై కోపించి తన చేతికత్తి ఎత్తి కొడుకును చంపబోయేను. అంతట వేంకటేశ్వరుడు ప్రత్యక్షమై కత్తి బట్టుకొని "నాయనా! శాంతించుము. నీ వలనే నీ కుమారుడు కూడా నాకు పరమ భక్తుడు. తేనె లేనంత మాత్రమున భక్తికి లోటులే"దని వారి ననుగ్రహించి వారి కుటుంబమునకు మొక్షమిచ్చేను. 


🌸 *శ్రీ వేంకటేశ్వర స్వామి కుమ్మరదాసుకు మోక్షమిచ్చుట :


వేంకటాచలమునకు ఆమడ దూరమున ఒక పల్లె కలదు. ఆ పల్లె యందు "భీముడు" అను ఒక కుమ్మరి గలడు. అతని భార్య పేరు "తమాలిని". ఆ దంపతులు పరమ భక్తులు.


భీముడు కుండలు చేయు మన్ను త్రొక్కునప్పుడైననూ, సారె త్రిప్పునప్పుడైనను కుండలు కాల్చునప్పుడైనను ఎల్లప్పుడూ శ్రీనివాసుని నామ భజనము తప్ప మరి వెరులేదు. అతని ఇల్లాలు కూడా తనకున్నదానిలో బీదలను పోషించుచూ భర్తతో కూడా వేంకటేశ్వర నామస్మరణలో పాలుగొని కాలము గడుపుచుండును. 


తన ఇంట మట్టితో సింహాసనం చేసి మట్టితోడనే శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం చేసి దానిని నిరంతరం పూజించుచుండెను. ఒక్కొక్కప్పుడు కుండలు చేయుచూ చేయుచూ హరినామస్మరణలో మునిగి పని మరిచిపోవును. కానీ దైవనుగ్రహమున పని భంగము గాకుండెను. 


వేంకటాచలమున శ్రీ వేంకటేశ్వరుని సేవించు తోండమానునితో స్వామీ కుమ్మరిదాసు భక్తి విషయము చెప్పగా తోండమానుడు అతని చూడవలెనని పరుగు పరుగున ఆ పల్లేకుబోయి అలసటచే కుమ్మరిదాసును పోగడుచూ వాకిట్లో మూర్చిల్లెను. కుమ్మరిదాసు మట్టిపాత్రతో నీరుదెచ్చి తోండమానుని మొగమున జల్లెను. తొండమానుడు లేచెను. అంతలో వేంకటేశ్వరుడు ప్రత్యక్షము కాగా వారందరూ సంతసించిరి.


కుమ్మరిదాసు భార్య స్వామికి మట్టిపీఠం వేసి కూర్చుండబెట్టి మట్టిచెంబుతో మంచినీరిచ్చి మట్టిపాత్రలో భోజనముంచి "స్వామీ ! కడు దరిద్రులము. మాకున్న ఐశ్వర్యము ఇంతే ! క్షమించి విందారగింపు" మనెను.


వేంకటేశ్వర స్వామి ఆనందించి తృప్తిగా విందారగించేను. ఇంతలో దేవుని కరుణ వల్ల దేవ విమానం వచ్చెను. స్వామి కుమ్మరదాసు దంపతులను అందు కూర్చుండజేసి స్వర్గమునకు పంపెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat