#శ్రీ వేంకటేశ్వర లీలలు
🌸 *శంఖణుని కథ :
పూర్వము కాంభోజ దేశమును శంఖణుడను రాజు ఏలుచుండెను. ఆ రాజు చాలా ధర్మాత్ముడు. భార్యయు మంచి గుణవంతురాలు.
కొన్నాళ్ళకు శత్రురాజులందరూ ఏకమై శంఖణుని మీదకు యుద్ధమునకు వచ్చిరి. శంఖణుడు యుద్ధమున వారిని డికొని పోరాడుచుండెను. శంఖణుడు ఒక్కడు వారు పదిమంది బలవంతమైన సర్పమైననూ చలిచీమల చేత చిక్కి చావదా? అన్నట్టు ఎంత బలవంతుడైన పదుగురను జయింపలేడు. అందువల్ల శంఖణుడు శత్రువులకు వొడిపోయి తన రాజ్యమును విడిచి భార్యతో కట్టబట్టలతో అరణ్యము పాలైనాడు.
శంఖణుడు రామేశ్వరము మొదలైన యాత్రలు సేవించి పవిత్రమైన అలివేలు మంగాపురం జేరి, పద్మసరోవర తీర్థంలో నిత్యము స్నానము చేయుచూ తనకు గల్గిన ఆపదను గూర్చి విచారించుచుండెను.
ఒకనాడు ఆకాశవాణి "మహారాజా ! దుఃఖము పొందకుము. శ్రీ వేంకటాచలమునకు పోయి అందుగల పుష్కరిణిలో స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని పూజింపుము. నీ దుఃఖము తీరి విజయము కల్గు" నని చెప్పెను.
శంఖణుడు సంతోషంతో భార్యను వెంటబెట్టుకుని వెంకటాచలం జేరి, పుష్కరిణిలో స్నానమాడి శ్రీ వేంకటేశ్వరుని తులసితో పూజించేను. స్వామికి అతనిపై అనుగ్రహము కలిగి "రాజా ! నీకు మరల రాజ్యప్రాప్తి గల్గును" అని సెలవిచ్చెను.
శంఖణుడు భార్యతో తన రాజ్యము జేరి శత్రువులను సంహరించి రాజ్యమును సంపాదించుకొని సుఖపడెను.