శ్రీ రాఘవేంద్ర కల్ప వృక్షము 7 వ భాగము

P Madhav Kumar


తమ గురుదేవులు పల్కిన అమృత వాక్కులనాలకించి సత్యము నెఱిగినవాడై మనస్సును అంతర్ముఖ మొనరించుకొని శ్రీవెంకన్నా చార్యుడు శ్రీవిద్యాలక్ష్మి యగువిష్ణు మాయ నిటుల స్తుతింప నారంభించెను.


శ్లో॥ త్వందేవీ జగతాం మాతా విష్ణుమాయా సనాతనీ|

కృష్ణప్రాణాధి దేవీ చ కృష్ణప్రాణాధికా శుభా ॥ 1


కృష్ణ ప్రేమమయీ శక్తి: కృష్ణసౌభాగ్యరూపిణీ|

కృష్ణభక్తిప్రదే రాధే నమస్తే మఙ్గలప్రదే     ॥ 2


అద్య మే సఫలం జన్మ 

జీవనం సార్థకం మమ |

పూజితాసి మయా సాచ 

యా శ్రీకృష్ణేన పూజితా ॥ ౩


కృష్ణవక్షసి యా రాధా 

సర్వసౌభాగ్య సంయుతా !

రాసే రాసేశ్వరీరూపా 

బృందా బృందావనే వనే ॥4


వైకుంఠేచ  మహాలక్ష్మీ: 

వాణీ నారాయణోరసి |

క్షీరోదే సిన్ధుకన్యా చ 

మర్త్యే   లక్ష్మీ ర్హరిప్రియా|| 5


స్వస్వర్గే స్వర్గలక్ష్మీ

దేవదుఃఖవినాశినీ !

సనాతనీ విష్ణుమాయా 

దుర్గా శంకరవక్షసి ॥ 6


సావిత్రీ వేదమాతా చ 

కలయా బ్రహ్మవక్షసి ||

కలయా ధర్మపత్నీ త్వం

నరనారాయణప్రసూః ॥ 7


కలయా తులసీ త్వం చ 

గంగా భువనపావనీ |

కృష్ణ భక్తిం కృష్ణదాస్యం

దేహిమే కృష్ణ పూజితే:! 8


భావం: జననీ ! రాధా ! నీవు జగజ్జననివి, సనాతనియైన విష్ణు మాయవు, శ్రీకృష్ణుని ప్రాణములకే అధిష్ఠాత్రివి, ఆయనకు నీవు ప్రాణము కంటే అధిక ప్రియురాలవు, శుభ స్వరూపిణివి. 


నీవు కృష్ణ ప్రేమమయీ   శక్తివి, శ్రీకృష్ణ సౌభాగ్య స్వరూపిణివి. శ్రీకృష్ణభక్తిని ప్రసాదించు శ్రీరాధా ! నీకు నమస్కారము.  నేడు నాజన్మ సఫల మైనది. నాజీవనము సుజీవన మైనది. శ్రీకృష్ణునిచే పూజింపబడిన రాధను నేటికి పూజింపగల్గితిని శ్రీకృష్ణుని వక్షఃస్థలమున విరాజిల్లు సర్వసౌభాగ్య శాలినివి నగు రాధవు నైన నీవే రాసమణ్డలములో రాసేశ్వరివి, బృన్దావనము లో బృందాదేవివి  వైకుంఠ ములో మహాలక్ష్మివి, శ్రీమన్నారాయణుని హృదయములో వాణివి, క్షీరసాగరములో సింధు కన్యవు, మర్త్యలోకములో శ్రీహరికి ప్రియతమవైన లక్ష్మివి.  స్వర్గములో దేవతల దుఃఖములను నశింపజేయగల స్వర్గ లక్ష్మివి. శంకరుని వక్షఃస్థలములో విరాజిల్లు సనాతన విష్ణుమాయా రూపిణివగు దుర్గవు. మాతా! నీవే నీ కళాద్వారమున సావిత్రివై బ్రహ్మ దేవుని వక్షః స్థలములో విరాజిల్లి యున్నావు. భగవతీ! నీవే నీ కళాద్వారమున ధర్మ దేవుని పత్నివై  నరనారాయణ ఋషులకు జననివైతివి.  వేదమాత యగుమాతా! నీవే నీ కళాద్వారమున తులసి      వైతివి, భువనములను పవిత్ర మొనరింప గల గంగాభవాని వైతివి. జగజ్జననీ! శ్రీకృష్ణునిచే పూజింప బడిన పరా దేవతా! నాకు శ్రీకృష్ణుని యెడల అనన్యభక్తిని ఆయన దాస్యసౌభాగ్య మును ప్రసాదింపుము.


శ్రీ వెంకన్నా చార్యునకు దివ్యరత్న సింహాసనము నధిష్ఠించి యున్న జగజ్జననియు, శ్రీ విద్యా లక్ష్మియు నగు రాధా దేవి దర్శన సౌభాగ్యము కల్గెను. సచ్చిదానంద రూపిణి యైన అమ్మ పుత్రప్రేమతో తన దక్షిణహస్తమును వెంకన్నా చార్యుని  శిరముపై నుంచి, 'వత్సా! నీ యనన్య భక్తికి నేను సంతుష్టురాలనైతిని. నీవు మాకు  అత్యంత ఆప్తుడ వైన పార్షద ప్రవరుడవు.


శంఖుకర్ణా! నిన్నావహిం చిన మాయ నా యనుగ్రహముచే తొలగి పోగలదు. మేఘములు తొలగిపోయిన పిమ్మట దర్శనమొసంగు ప్రచండ సూర్యునివలె నిన్నావహిం చిన నా మాయ తొలగి నీకు పరబ్రహ్మము, పరమాత్మయు, సచ్చిదా నంద విగ్రహుడు, భగవంతుడు నైన శ్రీకృష్ణుని దివ్య సందర్శ నము లభించుగాక! కుమారా! నీకు పరమోత్కృష్టమైన జ్ఞానము నుపదేశించెద నవధరింపు” మని పలికెను. శ్రీరాధా దేవి వెంకన్నాచార్యునకిట్లు దివ్యజ్ఞానోపదేశము చేయనారంభించెను.


కృష్ణే భక్తిః కృష్ణదాస్యం 

వరేషు చ వరం పరమ్!

శ్రేష్ఠా పంచవిధా ముక్తే:

హరిభక్తి ర్గరీయసీ!  1


బ్రహ్మత్వాదపి వేదత్వా 

దిన్ద్రత్వాదమరాదపి|

అమృతాత్ సిద్ధిలాభాచ్ఛ

హరిదాస్యం సుదుర్లభమ్ | 2


అనేకజన్మతపసా 

సమ్భూయ భారతే ద్విజ|

హరిభక్తిం యది లభేత్ 

తస్య జన్మ సుదుర్లభమ్ ॥ 3


సఫలం జీవనం తస్య 

కుర్వతః కర్మణః క్షయమ్।

పితౄణాంచ సహస్రాణాం 

స్వస్య మాతుశ్చ నిశ్చితమ్ 4


మాతామహానాం పుంసాంచ 

శతానాం సోదరస్య చ |

బాన్ధవస్యాపి పత్న్యాశ్చ 

గురూణాం శిష్య భృత్యయోః ॥ 5


ఆబ్రహ్మ స్తమ్భపర్యన్తం

సర్వం మాయామయం జగత్|

భజ సత్యం పరంబ్రహ్మ 

మామేశం త్రిగుణాత్పరమ్ | 6


కాయేన మనసా వాచా 

పరం భక్త్యా దివానిశమ్ | 

భజ సత్యం పరబ్రహ్మ 

రాధేశం త్రిగుణాత్పరమ్ ॥7


భావం:  కుమారా !  శ్రీకృష్ణుని యెడలభక్తి, ఆయన దాస్య సౌభాగ్య ము సకలవరములలో ఉత్తమవరములు. శ్రీహరి యెడల అనన్యభక్తి సాలోక్యము సామీప్యము, సారూప్యము, ఏకత్వము అను ముక్తుల కంటెను అత్యంత శ్రేష్ఠము, మహత్వపూర్ణము.   


శ్రీహరి దాస్య సౌభాగ్యము బ్రహ్మత్వము, దేవత్వము, ఇంద్రత్వము, అమర త్వము, అమృతత్వము, సకలసిద్ది లాభము కంటె పరమ దుర్లభము. తనయనేక జన్మల తపఃఫలముగ ఈ భారత వర్షములో జన్మించి శ్రీహరిభక్తిని పొందినవాని జన్మమే పరమదుర్లభ జన్మమనియు, ఇక వానికి పునర్జన్మము లేదనియు తెలిసికొనుము. తన  సకలకర్మలను శ్రీహరి భక్తిద్వారమున క్షయమొన రించుకొన గల్గిన ఆ పరమ భాగవతోత్తముడు, వాని సహోదరులు, పూర్వజులు, బంధువులు, పత్ని, గురుజనులు, శిష్యులు, భృత్యులు మొదలగు వారందరి జీవనములు తప్పక సఫలము కాగలవు


బ్రహ్మమొదలు కీటకము వరకు గల సకలజగములు మాయా మయములు, అశాశ్వతములు. కావున పరబ్రహ్మము, సత్య స్వరూపుడు, త్రిగుణా తీతుడు, నా హృదయే శ్వరుడు నైన శ్రీకృష్ణునే భజింపుము. అనన్యభక్తితో అహర్నిశములు నీ మనో వాక్కాయ కర్మలచే సత్య స్వరూపుడు, పరబ్రహ్మము పరమాత్మ, త్రిగుణాతీ తుడు, రాధేశ్వరుడు నైన శ్రీకృష్ణ భగవానునే భజింపుము. ఇట్లు దివ్య  జ్ఞానమును ప్రసాదించి జ్ఞానలక్ష్మియు, శ్రీ విద్యా లక్ష్మియు నగు శ్రీ రాధాదేవి అంతర్హితురాలయ్యెను.


శ్రీ విద్యాలక్ష్మి యొక్క అనుగ్రహమునకు పాత్రుడై శ్రీ వెంకన్నా చార్యుడు దివ్యతత్వ జ్ఞానోపదేష్టయై   భయమును మోహమును, భ్రాంతిని వదలినవాడై నేత్రములను  ఉన్మీలన మొనరించి తన్ను ఆతృతతో గాంచుచున్న గురుదేవుని గాంచి,  నేను సన్న్యాసాశ్రమ స్వీకారము నకు సంసిద్ధుడ నని తనయంగీకారమును దెల్పెను. ఆసమయమున శ్రీ వెంకన్నా చార్యుడు అరుణ భానునివలె ప్రకాశింప నారంభించెను.


శ్రీ వెంకన్నా చార్యుడు ఆచార్యుని అనుజ్ఞ గైకొని గృహము నకు వెడలి పోయెను. పూజామందిరమున ప్రవేశించి జన్మ జన్మముల నుండి తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుని ఆరాధింప నారంభించెను. ఆమహాభక్తుడు భక్తి పారవశ్యములో నుండగా జగదానంద కారకుడు, సచ్చిదానందవిగ్రహుడు, గోవిందుడు నైన శ్రీ కృష్ణ పరమాత్మ తన దివ్య దర్శనమును ప్రసాదిం చెను. తదనంతరము జగన్నాథుడగు శ్రీరామ చంద్రునిగా గోచరించెను. తదుపరి భగనానుడు ఐదు రూపములుగ సాక్షా త్కరించెను - 1. శ్రీకృష్ణ పరమాత్మ 2. శ్రీరామచంద్ర ప్రభువు. 3. శ్రీహయగ్రీవ స్వరూడైనమహావిష్ణువు. 4. శ్రీలక్ష్మీ నృసింహస్వామి. 5.శ్రీకృష్ణద్వైపాయన వ్యాస భగవానులు. వారు పరమ భాగవతోత్తముడైన శ్రీ వెంకన్నాచార్యు నను  గ్రహించి జీవితలక్ష్యమును, తక్షణ కర్తవ్యమును ప్రబోధించి అంతర్హితులైరి. ఇంతలో సూర్యభగవాను దుదయించి అంధకారము ను పారద్రోలెను. శ్రీవెంకన్నా చార్యులు తన నిత్య కార్యక్రమమును ముగించుకొని శాస్త్రానుసారముగ సన్న్యాసము స్వీకరించుట కొఱకై తన భార్య యొక్క అంగీకారము నర్థించెను. అందులకా పతివ్రత 'నాథా! ఎల్లప్పుడు  మీ యాజ్ఞను పరిపాలించు టయే నేనెఱుగుదును. ఎన్నడును నాయభిప్రాయ ములను విూసమక్షమున బహిర్గత మొనరింప లేదు. ప్రాణనాథా! మీరు నా ప్రాణముల నడిగినను సమర్పింపగలను. కానీ మీ వియోగము నెట్లు భరింప గల"నని విలపింప నారంభించెను. శ్రీవెంకన్నాచార్యులు తనభార్యకు తత్త్వజ్ఞానోప దేశము చేసి క్షుద్రమైన ఆమె హృదయ దౌర్బల్య మును నశింపజేసెను. అపుడాసాధ్వి తనభర్త సన్యసించుట కంగీకరించి తన త్యాగశీలతను సర్వజగత్తునకు చాటెను. శ్రీ వెంకన్నాచార్యుని యాదేశానుసారముగ ఆయన యగ్రజుడగు గురురాజాచార్యులు ఆశ్రమమున కేతెంచి ఆసాధ్విని, కుమారుని వెంటనిడుకొని స్వస్థలము జేరెను. సరస్వతీ దేవి, లక్ష్మీనారాయణుడు బాష్ప పూరితనయనములతో తమకు  ఆరాధ్యుడైన శ్రీ వెంకన్నా చార్యుని దర్శించుచు ఆయనను వీడలేక వీడలేక వెడలి పోయిరి.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

7 వ భాగము  

సమాప్తము. **

💥💥💥💥💥💥


🙏 ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat