*గురు వచనములు - 2*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*పరిపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు మాత్రమే నిజమైన గురువు.* సుఖదుఃఖాలను , నిందాస్తుతులను ఏకరూపంగా చూడగలిగే వాడే గురువులు అగుటకు అర్హులు. *"తుల్య నిందాస్తుతిర్మౌనీ"* అని భగవద్గీత బోధిస్తుంది. మరియు *"సమః శత్రేచ మిత్రేచ తథా మానావ మానయోః"* అనగా శత్రువు యెడలను , మిత్రుని యెడలను అటులనే మాన , అవమానములు విషయంలోనూ సమానంగా భావించి యుండేవాడు గురువు అని గీత ప్రభోధిస్తున్నది. భ్రాంతిని తొలగించి , శాంతిని చూపించే మార్గగామి గురుదేవుడు. జ్ఞాన తేజంతో అతడు జాజ్వల్యమానంగా ఉండాలి - అట్ల అన్నారని అందరిని కాల్చరాదు. అతని తేజము సుందరము , శాంతము , ఆనందదాయకమై ఉండాలి. తేజస్విగా , ఆధ్యాత్మిక చైతన్య స్వరూపముగా , ఆత్మ సంయమన రూపంతో గురువు మనకు దర్శనం ఇవ్వాలి. హిందూ సంప్రదాయములో తొలిగురువు దక్షిణామూర్తి. ప్రతి దేవాలయములో దక్షిణాభిముఖంగా ఉండే మూర్తియే దక్షిణామూర్తి యగును. దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు , సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపమే. అతడే ఈ అయ్యప్ప స్వామి వారి తండ్రి. దక్షిణామూర్తి యొక్క కాళ్ళ క్రింద మృత్యు దేవత ఉంటుంది. గురువు నుండి అమృతత్వం పొందాలి అనేది మన సంప్రదాయం *" మృత్యోర్మా అమృతంగమయ"* అన్నది శాంతిమంత్రము. అవతారపురుషుడైన శ్రీరాముడు గురువైన వశిష్టుని దగ్గర వేద శాస్త్రాలను అభ్యసించాడు. శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద వేదాధ్యయనం చేశాడు. కర్ణుడు పరశురాముని సన్నిధిన అస్త్ర శస్త్ర విద్యా రహస్యాలను గ్రహించినాడు. కౌరవ , పాండవులు కృపాచార్య. ద్రోణాచార్యుల నుండి విద్యలను నేర్చుకున్నారు. ఆంజనేయస్వామికి మొదటి గురువు సూర్యభగవానుడు. తర్వాత ఆ మహాభక్తునికి గురువు , దైవము ఆ శ్రీరామచంద్రమూర్తియే. ఈ ప్రకారముగానే గురు , శిష్య ఆ పరంపరలు గూర్చి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక గురువు విద్యకొరకై తనను ఆశ్రయించిన ఒకానొక శిష్యుడికి నూరు ఆవులని ఇచ్చి ఒక సంవత్సరకాలంలో వాటిని వెయ్యి ఆవులుగా చేయమని ఆదేశించాడు. ఆ శిష్యుడు అటులనే చేశాడు. పిమ్మట ఆ గోమాతలే ఆ శిష్యుడికి అనేక ఆధ్యాత్మిక విషయాలను భోదించాయి. చివరలో ఆ గురువు ఆ శిష్యుడికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ శిష్యుడి జన్మను ధన్యము గావించినాడు. ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని ఆరంభించాడు. *"విద్య పూర్తి అయిందా"* అని ఆ శిష్యుణ్ని అడిగారు. గురువు. *"ఇంకా పూర్తి కాలేదు"* అని సమాధానం చెప్పాడు ఆ శిష్యుడు. మరలా కొంతకాలం తర్వాత ఆ గురువుగారు ఆ శిష్యుడిని అదే ప్రశ్న అడిగారు. అదే సమాధానాన్నే అనగా *“ఇంకా పూర్తి కాలేదు"* అనే మాటనే ఆ శిష్యుడు అన్నాడు. అప్పుడు గురువుగారు పిడికెడు మట్టిని చూపించి శిష్యునితో ఇలా అన్నాడు. *"ఇదే నేను నేర్చుకున్నాను" నీవు ఇంతకాలం శ్రమించియు ఇందులో ఏ కొంతయే నేర్చుకున్నావు. నేర్చుకొనవలసినది ఇంకా చాలా ఉంది. ఏకాగ్రతను అలవర్చుకో"* అని ఉపదేశించాడు. ఆ మాటలతో శిష్యుడికి జ్ఞానోదయం అయింది. తీవ్ర సాధన చేశాడు. తరించాడు.
*ధీనిభావము ఇది :-* మన్ను ఒకటియే. అదొక్కటే ముంత , మూకుడు , కుండ , కడవ ఇలా అనేక రూపాలతో ఉంటుంది. ఇవన్నియు మరల మన్నుగానే యగును. *“వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవసత్యం"* || 7 శృతి॥ ఇందు సత్యపదార్థము మన్నే అగును. మట్టి ధర్మము తెలిసినచో పాత్రల ధర్మము అవగతము అగును. దీనికే ఇంకొక ఉదహరణం సైతం ప్రసిద్ధమైనది. చెప్పవచ్చును. సువర్ణము అనగా బంగారము ఒక్కటియే. అదియే కంసాలవాని పనితనమును బట్టి అనేక ఆభరణములగుచున్నది - ప్రస్తుతాంశము ఒక్క *"ఆత్మతత్వం" "పరమాత్మ తత్వం"* తెలిసికొన్నచో అన్నియును తెలియును. దీనినే శృతి *"ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతంభవతి" అనగా "ఆ ఒక్కటి తెలిసినచో అన్నియు తెలియును"* అని ప్రభోదిస్తున్నది. చదువులలో మర్మములెల్ల చదివితి తండ్రి ! " అనే భాగవతంలోని ప్రహ్లాదుని వాక్కునకు భావము సైతము ఇదియే అని తెలియదగును.
శిష్యుడు జ్ఞానాన్వేషణ నిరంతరం చేయాలి. అదొక సాధన. దీనికి ఇంతకాలం అని నియమం లేదు. గమ్యం చేరేవరకు ఈ సాధనను విస్మరించరాదు. జ్ఞానాన్వేషణకు గురువు మార్గదర్శి మాత్రమే. అయిననూ పూర్ణమైన గురుభక్తి ఉన్నచో సాధన తప్పక ఫలిస్తుంది. ఏకలవ్యుడు ద్రోణాచార్యులను పూర్ణంగా మనస్సులో నింపుకున్నాడు. ధనుర్విద్యాభ్యాసానికి ఉపక్రమించాడు. క్రమంగా ధనుర్విద్యలో అగ్రగణ్యుడైనాడు. దీని సారాంశము. గురువుపై అచంచల విశ్వాసము , విద్యపై గాఢమైన ఆసక్తి ఉంటే చాలు. అట్టి సంకల్పమే మనకు జ్ఞానమార్గాన్ని అందిస్తుంది. సాధారణంగా గురువునకు దక్షిణ ఇస్తేనే విద్యకు పరిపూర్ణత అని మన సాంప్రదాయము. సామాన్యంగా గురువులు ఏమీ అడుగరు. *"తేజస్వి నావధీతము"* అనగా *"ఈ విద్యలోకానికి వెలుగు నిచ్చుగాక"* అనియే విద్యాభ్యాసకాలంనాటి శాంతి మంత్రము. తన శిష్యుడు మహోన్నతుడగుటకంటే గురువునకు కావలసినది ఏమీ ఉండదు.
భువిలో జన్మించిన ప్రతిమానవుడు ఎందరో దేవతలను పూజించినను పూజింపబడే ఆ ఆరాధ్యతామూర్తికి శివుడని , శక్తియని , మహావిష్ణువని , మహాలక్ష్మియని తమకు తెలిసిన నామములతో పిలిచి ఆరాధిస్తారు. కాని *శ్రీధర్మశాస్తాను పూజించేటప్పుడు మాత్రము "స్వామి"* యని పిలుస్తారు. ఈశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి మరియు విష్ణువు యొక్క క్రియాశక్తి రెండూ కలిసినదే శ్రీ అయ్యప్పస్వామి అనెడి జ్ఞానశక్తి యగును. కలియుగము నందు జన్మించి అజ్ఞానసాగరములో మునిగి పోతున్న మానవులకు జ్ఞానము ప్రసాదించి మోక్షానికి దారి చూపడమే అయ్యప్ప స్వామివారి జన్మ రహస్యమగును. 'అయ్యప్ప' యను ఈ మూడక్షరములను ఉచ్చరించేటప్పుడు నాభికమలము నుండి ప్రాణవాయువును హృదయ మార్గముగా పయనింపజేసి నాలుకపై శబ్దముగా తాండవింప జేయవలెను. ప్రాణ - అపానములను కట్టుబరచి మన హృదయ కమలమును నిర్మాల్యమును ఏర్పర్చుకుని శ్రీ ధర్మశాస్తాను పూజించ వలెను. శిరస్సుమొదలు పాదము వరకు నేరుగా రెండు పాదములను మోకరించి కూర్చుని , ఎడమ మోకాలుపై నుండి ఎడమహస్తముతో ఆనందముద్రను చూపించి , కుడిహస్తముతో చిన్ముద్ర చూపించి ప్రణవరూపముగా జ్ఞాన పీఠమునందు అమరియున్న రూపమే శ్రీ అయ్యప్పస్వామి వారి స్వరూపమగును. ఈ రీతిగా ఆసీనులైన శ్రీ అయ్యప్పస్వామిని దర్శించుటకు శ్రీ స్వామివారి అనుగ్రహ ఆశీసులు పొందుటకు కొన్ని నియమ నిబంధనలను మన ఆర్యులు ఏర్పరచి యున్నారు. వాటిని అనుసరించి శ్రీ అయ్యప్పస్వామి యాత్ర చేయవలయును.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు💐🙏