🌿🌼🙏బాసర జ్ఞాన సరస్వతీ దేవి - పూర్తి బాసర క్షేత్ర విశేషాలు 🙏🌼🌿

P Madhav Kumar


🌿🌼🙏ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించింది అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన లీలలను, చిత్రాలను, స్తోత్రాలను నేను తెలుసుకున్నవి, సేకరించినవి నలుగురికీ తెలియజేసే ప్రయత్నంలో భాగమే. కేవలం లైక్స్ కోసమో, పేరు కోసమో, పోటీ కోసమో కాదు సుమా ... అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను, అందుకే అందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయాలనే దయచేసి షేర్ చేయమని అభ్యర్ధిస్తుంటాను ...  మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సాయి సంకల్ప్ 🙏🌼🌿


🌿🌼🙏బాసర మహా పుణ్యక్షేత్రం. చదువుల తల్లి సరస్వతీదేవి కొలువున్న పవిత్ర ప్రదేశం. జ్ఞానాన్ని, విజ్ఞతను ప్రసాదించే సరస్వతీదేవి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి చదువు బాగా అబ్బుతుందని, భవిష్యత్తులో గొప్ప ప్రాయోజకులు అవుతారని భక్తులు నమ్ముతారు. తెలుగువాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రీయులు కూడా బాసర జ్ఞాన సరస్వతీదేవిని దర్శించుకుంటారు. వ్యాస మహర్షి ఈ ప్రాంతంలో సంచరించారని స్థలపురాణం చెబుతోంది. ఆ స్థలపురాణం గురించి వివరంగా తెలుసుకుందాం...🙏🌼🌿


🌿🌼🙏సరస్వతీదేవి మహిమ తెలియజేపే ఇతిహాసం🙏🌼🌿


🌿🌼🙏రామాయణ కాలానికి సంబంధించిన కుంభకర్ణుని వృత్తాంతం అందరికీ తెలిసిందే. కుంభకర్ణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని సంతుష్టుని చేసి, తనకు మృత్యువు అనేది లేకుండా ఎప్పటికీ జీవించే వుండాలని వరం కోరదలచాడు. కానీ ఆ వరమివ్వడం బ్రహ్మదేవునికిష్టం లేదు. కుంభకర్ణుడు తన పట్టుదల వీడక వరప్రాప్తి కోసం తపస్సు కొనసాగించాడు. బ్రహ్మదేవుడు యుక్తితో సరస్వతీ దేవిని వేడుకున్నాడు. లోకకంటకుడైన కుంభకర్ణుడు వరం కోరే సమయంలో, అతని వాక్కును తారుమారు చేయమని వాగ్దేవికి సూచించాడు. కుంభకర్ణుడు మృత్యుంజయత్వం వరాన్ని కోరుకోబోయి, వాగ్దేవి ప్రభావం వల్ల, నిద్రను కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ''తథాస్తు'' అన్నాడు. అలా లోకకంటకుడైన కుంభకర్ణుని తామసశక్తిని అణచి, లోకోపకారానికి సరస్వతీదేవియే కారణమని తెలుస్తోంది.🙏🌼🌿


🌿🌼🙏బాసరలో జ్ఞాన సరస్వతీ దేవిని ఎవరు ప్రతిష్ఠించారు?🙏🌼🌿


🌿🌼🙏బాసరలో సరస్వతీదేవిని ప్రతిష్ఠించిన వివరాలు తెలుసుకోవాలని నారదునికి ఆసక్తి కలిగింది. ఒకరోజు బాసరలో సరస్వతీదేవి వెలసిన వృత్తాంతం, అష్టతీర్థ మహిమలు తెలుపవలసిందిగా నారదుడు, బ్రహ్మదేవుని కోరుకున్నాడు. బ్రహ్మ వాటిని వివరించడం ప్రారంభించాడు. “వ్యాసుడు నివసించిన కారణంగా ఈ ప్రాంతాన్ని ‘వ్యాసపురి’ అని పిలిచేవారు. ఇప్పటికీ ‘వాసర’ లేక ‘బాసర’ అని పిలుస్తున్నారు. ఇక్కడి సరస్వతీదేవి విగ్రహాన్ని వ్యాసుడు ప్రతిష్టించాడు'' అని చెప్పాడు. అపుడు నారదుడు “బ్రహ్మదేవా! సరస్వతీ దేవి స్వయంగా ఆవిర్భవించిందని కొందరు, సరస్వతీ దేవిని వ్యాసుడే ప్రతిష్టించాడని కొందరు పరస్పర విరుద్ధంగా చెబుతున్నారు. ఈ సందేహాన్ని తొలగించు స్వామీ'' అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షితో సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్టను వ్యాసుడు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాడు.🙏🌼🌿


🌿🌼🙏“నారదా! ఆదికాలంలో సరస్వతీదేవి తనకు వాసయోగ్యమైన స్థానం ‘వాసర’ (బాసర) అని భావించింది. అందుకే ఇక్కడ సరస్వతి వెలసింది. ఆమెను బ్రహ్మాది దేవతలు ప్రతిరోజూ వచ్చి సేవించేవారు. ఒకనాడు సరస్వతీ దేవి తన మహిమను ప్రకటించేందుకు, ఆలయం నుండి అంతర్థానమైంది. అప్పుడు మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుని వద్దకు వచ్చి శారదాదేవి అంతర్థానం గురించి వివరించారు. ‘బ్రహ్మదేవా! మరోసారి సరస్వతీ దేవి అనుగ్రహం పొందేందుకు మార్గం సూచించు'' అని వేడుకున్నారు. వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వేదవ్యాసుని వలన సరస్వతీ దేవి తిరిగి వస్తుందని చెప్పి, వారిని వ్యాసమహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు.🙏🌼🌿


🌿🌼🙏దేవతలు, మహర్షులు, వేదవ్యాసుని వద్దకు వెళ్ళారు. వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో వాణిని ధ్యానించాడు. సరస్వతీదేవి అనుగ్రహించి, వ్యాసునితో ‘ఓ వ్యాసమహామునీ! నీవు చేసిన స్తోత్రంతో ప్రసన్నురాలినయ్యాను. నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేరగలవు. నీవు ‘వాసర’ నగరంలో నా సైకత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించు. నన్ను ప్రతిష్టించగల శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను’ అని పలికింది. వ్యాసమహాముని, సమస్త ఋషి గణంతో, దేవతా సమూహంతో, గౌతమీ తీరం చేరాడు. గౌతమీనదిలో స్నానమాచరించి, జ్ఞాన సరస్వతీ దేవి రూపాన్ని నిశ్చల మనస్కుడై ధ్యానించి, విగ్రహాన్ని ప్రతిష్టించాడు. వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి ‘వ్యాసపురి’ అనే పేరు స్థిరపడింది.🙏🌼🌿


🌿🌼🙏చారిత్రకంగా సరస్వతీ దేవి మహిమ🙏🌼🌿


🌿🌼🙏ఆంధ్రులే కాదు, జైన, బౌద్ధ మతాలవారు, టిబెట్, జావా, జపాన్ దేశవాసులు కూడా సకల విద్యలకు అధిష్టాన దేవతగా సరస్వతీదేవి అనాదిగా పూజిస్తున్నట్లు చారిత్రక ఆధారాలువల్ల తెలుస్తోంది. చైనాలో ''నీలసరస్వతి'' అనే పేరుతో దేవిని ఆరాధిస్తున్నారు. బౌద్ధమతంలో విద్యాదేవత అయిన మంజుశ్రీతో బాటు, మహాసరస్వతీ, వజ్రసరస్వతి, ఆర్యవజ్ర సరస్వతి, వజ్రవీణా సరస్వతి, వజ్ర శారద మొదలగు పేర్లతో సరస్వతీదేవిని కొలుస్తున్నారు.🙏🌼🌿


🌿🌼🙏 రెండవ శతాబ్ద కాలంలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహం ఉత్తర హిందూ స్థానమందలి మధురకు సమీపంలోని “ఖజ్ఞాలీటీలా’’లో లభించింది. గుప్తరాజైన సముద్రగుప్తుడు తన సువర్ణ నాణాలపై ఒక వైపు సరస్వతీ దేవి రూపం, మరోవైపు వీణ ముద్రించాడు. క్రీ.శ. 550-575 ప్రాంతంలో గౌడ వంశ ప్రభువు నాణాలపై సరస్వతీదేవి రూపాన్ని చిత్రీకరించాడు. క్రీ.శ. పదవ శతాబ్దంలో ఖచ్చింగ్ (ఒరిస్సా)లో వీణ వాయిస్తున్నట్లున్న సరస్వతీదేవి విగ్రహం చెక్కారు. పాలవంశపు రాజుల కాలానికి చెందిన సరస్వతీదేవి విగ్రహాలు పాట్నా, కలకత్తాలోని “హశ్ తోష్’’ మ్యూజియంలో ఉన్నాయి.🙏🌼🌿


🌿🌼🙏బౌద్ధక్షేత్రమైన సారనాథ్ లో లభ్యమైన వీణాపాణి అయిన సరస్వతీ విగ్రహం హిందూ శిల్పసంప్రదాయాన్ని అనుసరించి ఉంది. క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన సరస్వతీ విగ్రహం ఢాకా మ్యూజియంలో ఉంది. బ్రిటీష్ మ్యూజియంలోను, అలహాబాద్, లక్నో, గ్వాలియర్ లలో వివిధ భంగిమలలో ఉన్న క్రీ.శ. 11, 12 శతాబ్దాల కాలంనాటి సరస్వతీ విగ్రహాలు ఉన్నాయి.🙏🌼🌿


🌿🌼🙏“ఖజురహో’’లో ఉన్న పార్శ్వనాథాలయంలో, ఖందరీయ మహా దేవాలయం, విశ్వనాథ ఆలయాల్లో వాగ్దేవి విగ్రహాలున్నాయి. దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ ఘంటసాలలో క్రీ.పూ. 2వ శతాబ్దకాలం నాటి సరస్వతీ విగ్రహం ఇటీవల లభించింది. క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలంనాటి (చాళుక్య భీమవరం), సామర్లకోట (తూ.గో.జిల్లా)లోని భీమేశ్వరాలయంలో సరస్వతీ విగ్రహం ఉంది. కారంపూడి ఆలయంలో, తంజావూరులోని బృహదీశ్వరాలయంలో, హళిబీడు, మధుర, శ్రీరంగంలో కూడా సరస్వతీదేవి విగ్రహాలున్నాయి.🙏🌼🌿


🌿🌼🙏భారతదేశంలో గల సరస్వతీ దేవాలయంలన్నిటి కంటే కాశ్మీర్ లోని సరస్వతీ దేవాలయం, బాసరలోని (జ్ఞాన) సరస్వతీ దేవాలయం సుప్రసిద్ధమైనవి. ఇంకా శ్రీ శంకర భగవత్పాదులు ప్రతిష్టించిన “శృంగేరి’’ ''శారద దేవాలయం'', శారదా పీఠం జగత్ ప్రసిద్ధి చెందాయి.🙏🌼🌿


🌿🌼🙏బాసర క్షేత్ర విశేషాలు🙏🌼🌿


🌿🌼🙏వేద వ్యాసుడు, సరస్వతీదేవిని ప్రతిష్టించినందువల్ల వ్యాసుడు ఈ క్షేత్రంలో నివాసం ఉన్నందువల్ల ‘వ్యాసర’ అయింది. మహారాష్ట్ర భాషా ప్రభావం వల్ల ‘బాసర’ అని వ్యవహరిస్తున్నారు.... పూర్వం ఇమామ్ షాహి, కుతుబ్ షాహీ సుల్తానుల పరిపాలనలో – స్వార్థపరులు ధర్మద్వేషులు సనాతన ధర్మం విధ్వంసకులైన కొందరు దుండగులు పరమ పవిత్రమైన వ్యాసనిర్మిత మందిరాన్ని, మహాలక్ష్మీ విగ్రహాన్ని, పరిసర దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ మూకలు సత్పురుషుల ధన మాన ప్రాణ నష్టం గావిస్తుండగా, శూరాగ్రేసరుడగు మక్కాజీ పటేలు. కొందరు యువకుల సహాయంతో ఆ దుండగులను తరిమివేసి శ్రీ సరస్వతీ మందిరాన్ని పునర్నిర్మించారు. జగద్గురు పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీస్వామి (సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం) పునఃప్రతిష్టించారు.🙏🌼🌿


🌿🌼🙏ఆలయ పూజా విశేషాలు🙏🌼🌿


🌿🌼🙏నిత్యం ఉదయం ఐదు గంటలకు సరస్వతీమూర్తికి వైదిక మంత్రోపేతంగా పంచామృతంతో ధూపదీపాలతో షోడశోపచార పూజ నయనానందకరంగా చేస్తారు. ఉదయం, సాయంకాలాల్లో ఆరుగంటల నుండి పూజ ప్రారంభమవుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు చదువు బాగా వంటబడుతుందని విశ్వసిస్తారు. దేవికి పలక-బలపం, కాగితం, కలం సమర్పిస్తుంటారు. కొందరు ధనికులు వెండి, బంగారంతో చేసిన వాటిని సమర్పిస్తారు. కేశఖండనం, ఉపనయనం, వివాహం, భజనలు జరుగుతుంటాయి.🙏🌼🌿


🌿🌼🙏బాసరలో విశేష ఉత్సవాలు🙏🌼🌿


🌿🌼🙏బాసరలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి పర్యంతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం, సాయంకాలం శారదా దేవికి అరవైనాలుగు (64) ఉపచారాలతో (చతుష్షష్టి పూజ) వైదిక పద్ధతిలో వైభవోపేతంగా అర్చన జరిపిస్తారు. శ్రీదేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణం, మహర్నవమి రోజున చండీవాహనం సశాస్త్రీయంగా చేస్తారు. విజయదశమి రోజున వైదిక మంత్రంతో మహాభిషేకం, సుందరమైన అలంకారం, సాయంత్రం పల్లకీసేవ, శమీ పూజ మొదలైనవి నయనానందకరంగా జరుగుతాయి.🙏🌼🌿


🌿🌼🙏సరస్వతీ జన్మదినోత్సవం – శ్రీ పంచమి🙏🌼🌿


🌿🌼🙏మాఘ శుద్ధ పంచమని వసంత పంచమి లేక శ్రీ పంచమి అంటారు. ఆరోజు శ్రీ సరస్వతీదేవి జన్మదినోత్సవం. దేవి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుతారు.🙏🌼🌿


🌿🌼🙏మహాశివరాత్రి ఉత్సవం🙏🌼🌿


🌿🌼🙏మహాశివరాత్రి పర్వం మొదలుకొని మూడురోజులపాటు గొప్ప జాతర జరుగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరిలో స్నానం చేసి పతితపావని అయిన వాగ్దేవికి ప్రదక్షిణాలు చేస్తూ పునీతులవుతారు.🙏🌼🌿


🌿🌼🙏బాసరలో దర్శనీయ ప్రదేశాలు🙏🌼🌿


🌿🌼🙏1 ప్రధాన దేవాలయానికి తూర్పున ఔదుంబర వృక్షచ్చాయలో దత్తమందిరం ఉంది. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి దివ్య విగ్రహం, దత్తపాదుకలు ఉన్నాయి.🙏🌼🌿


🌿🌼🙏2 మహాకాళీ దేవాలయం పశ్చిమ దిక్కున నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది.🙏🌼🌿


🌿🌼🙏3 శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. వ్యాస భగవానుని విగ్రహం, వ్యాసలింగం మహా మహిమాన్వితమైనవి.🙏🌼🌿


🌿🌼🙏4 బాసర గ్రామానికి వెళ్ళే దారిలో ఓ పెద్ద శిల ఉంది. దానికి ‘వేదవతి’ (ధనపుంగవుడు) అని పేరు. దాన్ని చిన్న శిలతో కొడితే విచిత్రమైన ధ్వని వస్తుంది. యాత్రికులు ఈ వేదవతీ శిలను తప్పక దర్శించుకుంటారు.🙏🌼🌿


🌿🌼🙏5 గోదావరి సమీపాన ఒక శివాలయం ఉంది. పూర్వం బాసర క్షేత్రాన అనేక దేవాలయాలు ఎనిమిది వైపులా వైభవోపేతంగా విరాజిల్లినట్లు బ్రహ్మాండ పురాణం వలన తెలుస్తోంది.🙏🌼🌿


🌿🌼🙏మధూకరం🙏🌼🌿


🌿🌼🙏మధుకర వృత్తిచే లభ్యమగు భిక్షకు మధూకరమని పేరు. తుమ్మెద పుష్పానికి ఏ విధమైన బాధ కలుగనీయక తేనె గ్రహించినట్లు దీక్షలో ఉన్నవారు భిక్షుక వృత్తి చేస్తూ గృహస్థుల నుండి గ్రహించిన భిక్షను మధూకరం అంటారు.🙏🌼🌿


🌿🌼🙏ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఈ క్షేత్రంలోనే మధూకరం లభిస్తుంది. శ్రీదేవి అనుగ్రహం పొందగోరు వారు నియమ నిష్టలతో 11-21-41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రం అనుష్టానం చేస్తూ, మధ్యాహ్నం బాసర గ్రామానికి వెళ్ళి భిక్ష స్వీకరించి శ్రీ సరస్వతీ దేవికి నమస్కరించి భుజిస్తారు. అలా చేసినవారికి అనతి కాలంలోనే స్వప్నంలో ఆ తల్లి దర్శనమిచ్చి ఇష్టకామితార్ధములను ప్రసాదిస్తుంది. అలా ఆ దివ్య మూర్తి కరుణాకటాక్షాలు ప్రసాదించగా బ్రహ్మీదత్త వరప్రసాదులై అసాథారణ ప్రతిభా పాండిత్యాలతో రాణిస్తున్న వారెందరో మన దేశంలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.🙏🌼🌿


🌿🌼🙏క్షేత్ర వసతులు🙏🌼🌿


🌿🌼🙏ఈ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారి ధర్మశాల, అతిథి గృహం, వేములవాడ దేవస్థానం ఆర్ధికసహాయంతో ఒక అతిథి గృహం ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడ యాత్రికులు బస చేయాలంటే కష్టమే. తగినన్ని కాటేజీలు లేక వసతి చాలా కష్టమౌతుంది. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయి రవాణా సౌకర్యం మెరుగుపడిన తర్వాత ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే, అలా వచ్చిన యాత్రికులు తగిన వసతి సౌకర్యాలు లేక అవస్త పడుతున్న మాట వాస్తవం.🙏🌼🌿


🌿🌼🙏ఆలయ పునర్నిర్మాణం🙏🌼🌿


🌿🌼🙏ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్వశ్రేయోనిధి నుండి పొందిన ధనంతో శ్రీ సరస్వతీ దేవాలయం, శ్రీ మహాకాళీ దేవాలయం పునర్నిర్మించారు. ఈ దేవాలయం పరిపాలన బాధ్యతలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమించిన ధర్మకర్తల సంఘం, కార్యనిర్వహణాధికారి నిర్వహిస్తున్నారు.🙏🌼🌿


🌿🌼🙏రవాణా సౌకర్యం🙏🌼🌿


🌿🌼🙏హైదరాబాద్ నుండి మన్మాడ్ షిరిడి వెళ్ళు మీటర్ గేజ్ రైలు మార్గంలో నిజామాబాద్ తర్వాత నాలుగవ స్టేషన్ “బాసర’’. హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, భైంసా నుండి ఆర్.టి.సి. బస్సులు గలవు. సుమారు నిజామాబాద్ నుండి 35 కి.మీ. దూరంలో బాసర ఉంది. హైదరాబాద్ నుంచి (బాసర 200 కి.మీ. సుమారు అయిదు గంటల ప్రయాణం) నిజామాబాద్ కు, అక్కడినుంచి బాసరకు బస్ సౌకర్యం ఎక్కువ. బాసరకు ప్రతి శనివారం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ప్రత్యేక సర్వీసు నిర్వహిస్తోంది.🙏🌼🌿


🌿🌼🙏మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.🙏🌼🌿


🌿🌼🙏అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే " మా ప్రయత్నం🙏🌼🌿 


🌿🌼🙏అందరం భక్తితో " ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత...🙏🌼🌿


ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

ఓం శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః




#బాసర #జ్ఞాన #సరస్వతీ #దేవి

#అందరూ_దర్శించేందుకు_దయచేసి_షేర్_చేయండి 

#సంభవామి_యుగే_యుగే

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat