అమ్మవారు తీసుకున్న నవదుర్గ స్వరూపములలో మొదటిది శైలపుత్రి. శైలపుత్రి అనగా పర్వతము యొక్క కుమార్తె. అమ్మవారు ఎందరికో కుమార్తెగా వచ్చింది. ఆమె ఎంత మందికైనా కుమార్తెగా వస్తుంది. ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా అది సాక్షాత్తుగా పరదేవత స్వరూపమే. ఆ తల్లి హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా వచ్చింది. అమ్మవారు మేనకాదేవి కడుపున పుట్టడానికి కారణము ఆవిడ చేసిన సువాసినీ పూజలు. వాత్సల్యముతో నా కూతురు అన్న భావనతో ఇంట్లో తిరుగుతున్న పరదేవతని గడ్డము పట్టుకుని నా తల్లి కదూ, నా కన్న కదూ, బువ్వ తిను, అంత సేపు ఆడుకోకు, బజ్జీ అంటూ హిమవంతుడు బతిమాలి అంటూ గడ్డము పట్టుకుని తండ్రిని అన్న ప్రేమ చేత పరదేవత అన్న విషయము తెలిసి ఉండి మరచిపోయి గిరులలోన నొక్క గిరినైన నా పేరు వెలయజేసితివిపుడు జలజ నయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అని పరవశించిపోయాడు. ఆవిడ ఇంట్లో తిరుగుతుంటే ఎంతో అదృష్టవంతురాలు అయిన మేనకాదేవి పరవసించిపోయింది. ఆమెలో సరస్వతి, లక్ష్మీ, దుర్గ, గంగ, మాయ, బాల, సువాసిని అందరిని చూసింది. శైలపుత్రి తత్వము చాలా విశేషమైనది. ఆమె బిడ్డలుగా భావించి లోకమునకు పాఠము చెపుతుంది. పాఠము చెప్పడము కోసము శివుడిని రుద్రుని చేస్తుంది. బిడ్డలకు ఉపకారము చేయాలి అనుకున్నప్పుడు శివుని చేస్తుంది. కోపము తగ్గించి తండ్రిగా కూర్చో పెడుతుంది. శివుని దూషించినా, నిందించినా, తక్కువ చేసినా, లోకమునకు మంగళములు, కల్యాణములు రావు. శివనింద ఎంత ప్రమాదకరమో చెప్పి ఆమె యోగాగ్ని యందు శరీరమును విడిచి పెట్టింది.🙏