శ్రీకృష్ణుడు శివుణ్ణి ఎందుకు ఆరాధించాడు?

P Madhav Kumar


శ్రీ దేవీ భాగవతంలో సూత మహర్షి శౌనకాది మునులకు శ్రీకృష్ణ చరితను చెప్పిన తర్వాత శౌనకాది మునులకు ఒక సందేహం వచ్చింది.


శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం కదా... మరి ఆయన శివుణ్ణి ఆరాధించడమేమిటి? ఆయనకు పార్వతీదేవి వరాలు ఇవ్వడమేమిటి? వీరిద్దరినీ శ్రీకృష్ణుడు ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.. 


తాను స్వయంగా సర్వేశ్వరుడు అయి వుండీ, సర్వ సిద్ధప్రదుడై వుండీ సాధారణ మానవుడిలాగా మరొక దేవుడిని ఉపాసించడమేంటి? ఘోర నియమాలతో తపస్సు చేయడమేంటి? ఇది మాకు అర్థం కాని విధంగా వుంది. దయచేసి మాకు అర్థమయ్యేలా వివరించండి అని అడిగారు.


దానికి సూత మహర్షి స్పందించారు. ఇప్పుడు శౌనకాది మునులకు వచ్చిన సందేహమే గతంలోనూ జనమేజయుడికీ వచ్చిందట.  ఆ సందేహాన్ని ఆయన ఆ సమయంలో వ్యాసుడి దగ్గర వ్యక్తం చేశాడట. అప్పుడు వ్యాసుడు ఆయనకు చెప్పిన సమాధానాన్నే సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పారు.


మునులారా.. మీరన్నది నిజమే! శ్రీకృష్ణుడు నిజంగానే జనార్దనుడే. సర్వకార్య నిర్వహణ సమర్థుడే. అకానీ, మానవరూపంలో వున్నాడు కదా. అందుకుని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు. 


పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం లాంటి గృహస్థాశ్రమ ధర్మాలను అనుసరించాడు.


అలాగే దుఃఖ పడవలసిన విషయాలలో దుఃఖపడటం, సంతోషించాల్సిన సందర్భాలలో సంతోషించడం, రకరకాల అపవాదాలకు తల ఒగ్గి బాధపడటం, స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడం, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్వర్గాలకు లోనుకావడం లాంటి గృహస్థు గుణాలకు కట్టుబడ్డాడు. 


గుణమయ శరీరాన్ని ధరించి గుణాతీతంగా వుండటం అసంభవం.

సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి తెలిసీ వీటిని తప్పించగలిగాడా? కృష్ణ పత్నులను దొంగలు దోచుకున్నారు.

 అర్జునుడు సన్నిధిలోనే వున్నాడు.


మహావీరుడైన అర్జునుడు బాణాలు వేసి దానిని ఆపగలిగాడా? అలాగే ప్రద్యుమ్నాపహరణాన్ని శ్రీకృష్ణుడు నివారించగలిగాడా? కనీసం తెలుసుకోను కూడా తెలుసుకోలేకపోయాడు. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే,  మానవ దేహం ధరించినప్పుడు మానవ లక్షణాలే వుంటాయి.


అంచేత నారాయణుడైనా, నారాయణాంశజుడైనా మానవుడు మానవుడే. మానవ రూపంలో వున్న శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం అవసరం లేదు.


ఆ శివుడు సర్వేశ్వరుడు.  విష్ణుమూర్తికి కూడా కారణ భూతుడు. సుషుప్తస్థాన నాథుడు. విష్ణువుకే శివుడు పూజనీయుడు అయినప్పుడు విష్ణ్వంశజులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏమీ లేదు. 


అలాగే ఆదిపరాశక్తి సర్వోతృష్ట. జగన్మాత అర్ధమాత్రంగా, అనుచ్చార్యగా వున్నప్పటికీ సర్వోతృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మకన్నా విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సంశయించాల్సింది, సందేహించాల్సింది ఏమీ లేదు అని వారి సందేహాలను సూత మహర్షి నివృత్తి చేశారు...స్వస్తీ...


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat