శ్రీవారి బ్రహ్మోత్సవాలు - క‌ల్ప‌వృక్షవాహ‌నం - ఐహికఫ‌లప్రాప్తి - మోహినీ అవతారం - గరుడ వాహనం

P Madhav Kumar

 తిరుమల సర్వస్వం


Part - 19



⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️



శ్రీవారి బ్రహ్మోత్సవాలు- 

నాల్గవ రోజు

     

నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ, ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారమన్నది వేరుగా చెప్పేదేముంది! 


క‌ల్ప‌వృక్షవాహ‌నం - ఐహికఫ‌లప్రాప్తి


క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిస్తారు.


ఆరోజు సాయంత్రం, సర్వభూపాల వాహనంమీద స్వామివారి వూరేగింపు, భక్తులకు కనులవిందుగా సాగుతుంది.


⚜️⚜️⚜️⚜️


శ్రీవారి బ్రహ్మోత్సవాలు - ఐదవ రోజు


మోహినీ అవతారం


బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. 


ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. 


మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. 


ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ (గోదాదేవి) నుంచి తెచ్చినట్లుగా చెప్తారు.


గరుడ వాహనం 


స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. 


అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది.


 ఏడాదిలో అన్నిరోజులూ ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. 


అలాగే ఈరోజునే, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారు స్వీకరిస్తారు.


 గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు.


ఆరోజు ఉదయం, హనుమద్వాహనసేవ జరుగుతుంది.


 హనుమంతుడు, శ్రీరాముని నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ, ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది.


 తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే మధుర సన్నివేశమది.



పాపవినాశక గోవిందా || పాహిమురారే గోవిందా

శ్రీముద్రాంకిత గోవిందా || శ్రీవత్సాంకిత గోవిందా..


గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా.


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat