Part - 20
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
శ్రీవారి బ్రహ్మోత్సవాలు-ఆరవ రోజు
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు రాత్రి గజవాహన సేవ జరుగుతుంది. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయో ఆ వైఖానస పండిుఁని "కంకణభట్టాచార్యులు" అంటారు. గజవాహనసేవలో సాక్షాత్తు కలియుగదైవమైన శ్రీమలయప్పస్వామి వారితో పాటు గజవాహనం ఎక్కి చామరం వీస్తూ అరుదైన గౌరవం అందుకుంటారు కంకణభట్టాచార్యులు
స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుల శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేననీ అలనాడు 'సిరికింజెప్పక, శంఖుచక్ర యుగమున్ చేదోయి సంధింపక' వచ్చినా, నేడు భక్తజనుల మొరల్ని వినేందుకు సర్వాలంకారభూషితుడనై వస్తున్నాననీ విశదపరిచే ఘట్టం- గజవాహనసేవ.
⚜️⚜️⚜️
శ్రీవారి బ్రహ్మోత్సవాలు- ఏడవరోజు
ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు.
సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.
అదే రోజు సాయంకాలం చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం.
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం., చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది,. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
ధరణీనాయక గోవిందా || దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా || ప్రసన్నమూర్తి గోవిందా
గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా.
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
.