తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

P Madhav Kumar


Part -25

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

 తిరుమలకు చేరుకోవాలంటే 

అందరికీ తెలిసిన నడక దారి ఒక్కటే అదే అలిపిరి. కాని ఎంతమందికి తెలుసు తిరుమల చేరుకోవాలంటే ఇంకా కొన్ని దారులు ఉన్నాయని? మనం ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం


. తిరుమల ఆలయానికి ఏడుకొండలు నలువైపులనుండి ఏడు నడకదారులు ఉన్నాయి.


 తాళ్ళపాక అన్నమాచార్యులు  గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కాడు. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు.


మునుపటి రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడి మల్లం నీలిసాని పేట, గాజులమండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణపురం, నాగాలపురానికి మరోకదారి వుండేది. ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాహరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది. నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసిన దారులు ఉండేవి. అయితే అవి నేడు కనుమరుగైపోయాయి. మొదటినుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. అయితే ఈ దారికన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు దారి గుండా యాత్రికులు వెళ్ళలేక పోతున్నారు, కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే.  శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి. అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి. అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుడి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.


అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు. అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ, 1387లో ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. ఈ దారి గుండా బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది రెండు అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయనస్వామి ఆలయం వస్తుంది. పడి మెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్ నిర్మింపబడిన పెద్ద గోపురం వస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు వస్తాయి. ఆ పాకి వెళ్తూనే గాలిగోపురం వస్తుంది. అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ,..1628లో నిర్మించారు. గాలిగోపురం నుండి క్రిందకు చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజు స్వామి, అలిమేలు మంగమ్మ గుళ్ళు గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి.


గాలి గోపురంలోపలికి వెళ్తూనే మహంతులు పూజించే సీతారామలక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాతో ఉన్న విగ్రహం ఉంది. అటునుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ ఘంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు.  అవ్వాచారి కోననుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది. మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వతుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్లు ఉంది. ఈ దారినుంది మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది.


చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్టుంది చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటినుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat