శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 10

P Madhav Kumar


*🌻. గోవుల కోసం రేఖ 🌻*


అయితే తాను కాలజ్ఞాన గ్రంధం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా వుండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ”ఈ వలయం దాటి మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు” అని గోవులను ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు.


పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు.ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.


ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయల్దేరారు వీరబ్రహ్మేంద్రస్వామి.


యధాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి, కాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులు, చెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది.


తన దగ్గర గోవులకాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ.


కానీ, గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.


వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి, తెలీక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది.


”నాకు దూషణ అయినా, భూషణ అయినా ఒక్కటే. నీవయినా, తల్లి అయినా ఒక్కటే. ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే” అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ.


ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని, సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని, చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆరోజు కోసం ఎదురుచూడసాగింది అచ్చమ్మ.


వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి, అచ్చంమగారి ఇంటిలో ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat