శ్రీ వేంకటేశ్వర వైభవం - 12 🌻అభిషేక మహోత్సవము🌻
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ వేంకటేశ్వర వైభవం - 12 🌻అభిషేక మహోత్సవము🌻

P Madhav Kumar


*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*


*🌻అభిషేక మహోత్సవము🌻*



🍃🌹శ్రీలక్ష్మీ సమాశ్లిష్ట భుజానరుడగు శ్రీవారికి అభిషేక మహోత్సవము ప్రారంభమగును. అర్చకుడు శ్రీస్వామివారి పాదాబ్జములకు శ్రీతాయార్ల వారికిని నమస్కరించి ఉష్ణషాదులతో నియమింపబడినవాడై అభిషేకమునకు అనువగు పీఠమునందు నిలువ బడి వాజ్నియమముకలవాడై జియ్యంగార్లు అందిచ్చిన ఆకాశగంగా జలముతో పూరింపబడిన సువర్ణశంఖమును తీసుకొని “హరిఃఓమ్” సహస్రశీర్షా పురుషః అని చతుర్వేద శ్రూయమాణమగు పురుషసూక్తం పఠించుచూ శ్రీతాయార్ల వారితో ప్రకాశించు శ్రీస్వామివారి శిరోభూషణమై పరత్వ జ్ఞాపకమగు కిరీటమునందు భక్తి శ్రద్ధలతో అభి షేకము చేయుచుండును. 


🍃🌹వేదపారాయణపరులు, వేదవేత్తలు, ఆచార్య పురుషులు శ్రీవైష్ణవస్వాములు ఆ వచనము ననువదించుచూ పంచసూక్తములను పంచోపనిషత్తులను శ్రీవారి అభి షేకాన్తమువరకు అతిమనోహరముగా అతి శ్రావ్యముగా పారాయణమును చేయుచుందురు.


🍃🌹శ్రీస్వామివారికి ఫురోభాగమున కూర్చునియున్న అధికారులు, అభిషేక కైంకర్యపరులు, అభిషేకదర్శన సేవాపరాయణులైన భక్తులు, భాగవతులు అందరు శ్రీవారి తిరుముఖమండల దివ్యసౌందర్యమును బ్రహ్మత్వాదులను ఇవ్వజాలిన కటాక్ష ప్రసారముగల వికసిత పుండరీకములవంటి విశాలనేత్రముల దివ్యసౌందర్యమును, స్మితపూర్ణములగు గండస్థలముల దివ్యసౌందర్యమును, రుద్రేంద్రాదులచే స్తోత్రము చేయబడు నిరతిశయ సౌందర్య సౌకుమార్యాద్యనన్త గుణగుంభితమైన ఆ స్వయంవ్యక్త దివ్యస్వరూపమును సంసారసాగర సముత్తరణ సేతువులై ప్రపన్న జనతా శరణవరణీయములగు దివ్య శ్రీపాదారవిందములను కన్నులారకాంచి మనసారస్మరించి శ్రీస్వామివారు శ్రీవైకుంఠమును వదలివచ్చినది మనకొరకేనని తలపోయుచూ పరమానంద సముద్రములో మునుంగుచూ తేలుచూ ఆనందమునకు మేరలేక ముక్తులవలె ఆనందము ననుభవించుచూ నమస్కరించుచూ అంజలి బంధములను చేయుచూ తన్మయులై మైమరచి యుందురు.


*🌻క్షీరాభి షేకము🌻*


🍃🌹ఆ సువర్ణ శంఖాభిషేకము పూర్తికాగానే క్షీరాభిషేకము ప్రారంభమగును. అర్చకుడు జియ్యంగారు ఇచ్చేడు క్షీరములతో నిండిన శంఖములను క్షీరములతో నిండిన పాత్రములను తీసుకుని తదేక ధ్యానముతో శ్రీవారికి క్షీరాభిషేకము చేయుచుండును. వేదవేత్తలు వేదపారాయణమును చేయుచుందురు. భక్తులు శ్రీవారి అభిషేక మహోత్సవమును దర్శించుచుందురు. ఆనందము ననుభవించుచుందురు.


🍃🌹ఇటుల రెండు గంగాళముల గోక్షీరములుపై విధముగా శ్రీవారికి అభిషేకము జరుగగా అభిషేకాన్తమునందు శ్రీవారి వైకుంఠ హస్తమునుండి వచ్చు. క్షీరములను పాత్రమునకు సంగ్రహించెదరు. తరువాత భక్తులకు వినియోగము చేయబడును.


*🌻శుద్దోదకాభిషేకము🌻*


🍃🌹పిమ్మట శ్రీ స్వామివారికి శుద్దోదకాభిషేకము జరుగుచుండ పరిచారకులు శ్రీవారి బంగారు బావినుండి శుద్దోదకమును కలశములతో తెచ్చి గంగాళములనింపుచుందురు. ఇటుల కొంత సమయము జరిగిన తరువాత అభిషేకమును ఆపి వేసెదరు. వెంటనే అర్చకులు కేసరి బిళ్లలు చందనం బిళ్లలుగల పాత్రమును తీసుకుని ఆ బిళ్లలను శ్రీవారి శ్రీహస్తమందు సమర్పించి వాటిని శ్రీవారి శ్రీహస్తరేఖాంకితములు చేసి తీసుకుని తరువాత అర్చకులు జియ్యంగార్లు, అధికారులు వారల ఏర్పాటు ప్రకారం తీసుకొనెదరు.


*🌻ఉద్వర్తనము🌻*


పిమ్మట అర్చకులు పరిమళ పాత్రమును తీసుకుని ఆ పరిమళమును శ్రీస్వామివారికి ఆ పాదకిరీటమును శరీరమందంతయు పూసి నలుగిడి శుద్దోదకాభిషేకమును ప్రారంభించెదరు.


🍃🌹ఆ అభిషేకములో శ్రీస్వామివారి తిరుమేనునందలి పరిమళముతో కలసి జారుచున్న అభిషేకోదకమును అవయవములవారిగాను ఆయుధములవారిగాను అర్చకులు పాత్రములకు సంగ్రహించి అర్చకులు, జియ్యంగార్లు అధికారులు తరువాత వారల ఏర్పాటు ప్రకారం తీసుకొనెదరు.


🍃🌹మరియు పరిమళచర్చితమగు శ్రీవారి వైకుంఠహస్తమునుండి జారు అభిషేకోదకమును పాత్రములకు సంగ్రహించి పై వారలు తరువాత వారల ఏర్పాటు ప్రకారం తీసుకొనెదరు.


🍃🌹ఇంతియేకాక ప్రత్యేకముగా పరిమళ చర్చితమగు శ్రీవారి వైకుంఠ హస్తము నుండి వచ్చు అభిషేక పరిమళ తీర్థమును పాత్రమునకు సంగ్రహించి మాయావిమోచకమగు ఆ తీర్థమును తరువాత భక్తులకు వినియోగము చేయుదురు.


🙏 *ఓం నమో వేంకటేశాయ*.


  *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow