Part -52 & 53
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు(సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు.
(సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు.
జోఅచ్యుతానంద జో జో ముకుందాఅంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు.
అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది
. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.
నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు.
ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులుచాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.
అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య
కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాడు.
సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు.
ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.
నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు.
గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు.
గుంజిళ్లు తీయించారు.కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.
నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు.
నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు.నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి - నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నంతాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.
అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం
భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమలచేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామితన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
ఓం నమో వేంకటేశాయ🙏🏻
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️