_*🚩అయ్యప్ప చరితం - 3 వ అధ్యాయం🚩*_

P Madhav Kumar


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


త్రిమూర్తులు , దేవీమాతలు అతనివైపు ప్రసన్నంగా చూశారు!

*‘‘వత్సా! ఇప్పటికి పరిస్థితులు అనుకూలమైనవని ఏమరిపాటుతో ప్రవర్తించకూడదు సుమా! మంచి , చెడులమధ్య సంఘర్షణ తల ఎత్తుతూనే వుంటుంది! అందుకు కారణం గర్వాహంకారాలే! వాటిని దరి చేరనీయకుండా మసలుకోవాలి! భూలోకంలో ఇప్పుడు ఋషి , మునులకు యజ్ఞయాగాలు సక్రమంగా జరుపుకునే అవకాశం ఏర్పడింది ! ఆ ప్రశాంత వాతావరణంలోకి వెళ్లి జీవించడానికి ఒక జంట అవతరించబోతున్నది, చూడండి!’’* అన్నాడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో చూస్తూ !

సభలో వారందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా త్రిమూర్తులనుండి తేజస్సులు వెలువడి , అవి క్రమంగా కలిసి ఒక పురుషాకృతిని దాల్చాయి !  దేవీమాతలు ముగ్గురునుండి తేజస్సులు వెలువడి కలిసిపోయి స్త్రీ ఆకృతిని పొందాయి ! వాళ్లవైపు ప్రసన్నంగా చూసారు త్రిమూర్తులు !

*‘‘ఆహా !  అసమాన సౌందర్యంతో అలరారుతున్నారు !  వీరిని ఎందుకు సృష్టించినట్లు?’’* అనుకుంటూ కుతూహలంగా చూస్తున్నారందరూ ఆ జంటవైపు !

శ్రీ మహావిష్ణువు వాళ్లవైపు చూస్తూ *‘‘సుందరదత్తుడు, లీలావతి అనబడే మీరిద్దరూ దంపతులై భూలోకంలో ధర్మమార్గాన జీవించండి ! గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేరుస్తూ ఆదర్శప్రాయంగా గడపండి!’’* అని ఆదేశించాడు.


*‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను!’’* అంటూ నమస్కరించి భూలోకాన్ని చేరుకున్నారు. మానుష్యాకృతులు పొందిన ఆ ఇద్దరూ !


సుందర దత్తుడు, లీలావతి బదరికారణ్య ప్రాంతం చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఇతర మునిగణాలతో పాటు జీవించసాగారు! అక్కడకు చేరిన కొద్దికాలంలోనే తమ సత్ప్రవర్తనతో అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు !


*‘‘ఈ జంటను చూస్తుంటే ఎంతో ముచ్చటవేస్తున్నది ! ఆ యువకుడు పేరుకు తగ్గట్లే సుందర రూపంతో మనందరికీ దత్తుడై పుత్రుడికన్నా ఎక్కువగా గౌరవాభిమానాలు చూపుతున్నాడు !  అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ,  దైవకార్యాలు ఏ కొరతా లేకుండా నెరవేరస్తున్నాడు ! లీలావతి కూడా అతనికి తగిన పత్నిగా , ఆదర్శ గృహిణిగా జీవిస్తున్నది ! పెద్దలంటే గౌరవం , అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ సహాయపడుతుంటుంది. వీళ్లిక్కడికి రావడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది కదూ?’’* అంటూ మెచ్చుకునేవాళ్లు అక్కడ నివశిస్తున్న మునిగణాలు !

ఆ ప్రశంసలు అతిశయోక్తులు కావు ! నిజంగానే దత్తుడు , లీలావతి మనసా , వాచా కర్మణా ఎన్నడూ ఎవరినీ నొప్పించకుండా మసలుకునేవారు !  కాలం వేగంగా గడిచిపోసాగింది. తమకున్నదానిలో పరులకు ఉపకారం చేస్తూ ,  ఎవరినీ నొప్పించకుండా సంతోషంగా కాలం గడుపుతున్న ఆ దంపతుల జీవితం హఠాత్తుగా అనుకోని మలుపు తిరిగింది !


ఒక రోజు...

*‘‘లీలావతి !  ఒకసారి ఇలారా !  నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి ! ’’*

లోపల పనిలో వున్న లీలావతి భర్త పిలుపు విని బయటకు వచ్చింది.

ఆశ్రమం ముందున్న అరుగుమీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దత్తుడి ఆమె రావటం చూసి *‘‘ఇట్లా కూర్చో లీలా!’’* అన్నాడు ప్రక్కకు జరుగుతూ.

*‘‘ఏమిటి చెప్పండి!’’* అంటూ ప్రక్కన కూర్చుంది, భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ.

*‘‘ఈవేళ ఉదయం నుండి ఎందుకో ఏదో ఆలోచిస్తూ గంభీరంగా వున్నారు ! ఏ విషయం గూర్చి ఆలోచిస్తున్నారు చెప్పండి ? ’’* అడిగింది లీలావతి.

*‘‘చెబుతాను. జాగ్రత్తగా విను. మనకు వయస్సుమీద పడుతున్నది. ఈ గృహస్థాశ్రమాన్ని త్యజించి సన్యసించి తపస్సులో కాలం గడపాలన్న సంకల్పం నాలో చోటుచేసుకుంది..’’*

అతని మాట పూర్తికాకుండానే *‘‘ఏమిటండీ వింతగా మాట్లాడుతున్నారు ? మనకు సంతాన భాగ్యం కూడా కలగలేదింకా ! నాకు సంసారిక సుఖాలమీద ఇంకా మోహం తీరలేదు. మీరు సన్యసించి తపస్సుకు వెళ్లడమేమిటి?’’* అన్నది ఆందోళనగా చూస్తూ!


*స్వామియే శరణం అయ్యప్ప*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat