అది పవిత్ర కార్తీకమాసం!
నైమిశారణ్యంలో ప్రశాంత వాతావరణంలో కార్తీక దీపోత్సవం జరుగుతున్నది!
ఆశ్రమాల ముందు వెలిగించిన దీపాల కాంతులలో పరిసరాలన్నీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి! ఒక ప్రక్క పరమశివునికి పంచామృత అభిషేకాలు, బిల్వపత్రాలతో పూజలు, మరోప్రక్క మహావిష్ణువుకు పద్మాలతో లక్ష పుష్పార్చనలు ; మరోవైపు శక్తిమాతకు కుంకుమార్చనలు భక్త్భిరిత హృదయాలతో జరుపుతున్నారు అక్కడి మునిబృందాలు! ఆ సమయంలో అక్కడికి సూతమహర్షి రావడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది! ఆయనను గౌరవపూర్వకంగా ఆహ్వానించి ఆసనం చూపారు!
‘‘ఆహా! ఇక్కడి భక్త్భిరిత వాతావరణం నా మనస్సుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తున్నది! శౌనకాది మునులారా! శివకేశవులకు, శక్తిమాతకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీకమాసంలో లోకకళ్యాణం కోసం మీరు చేస్తున్న ఈ ఆరాధనలు, దీపోత్సవాలు భగవంతుని అనుగ్రహాన్ని భూలోకవాసులమీద వర్షింపజేస్తూ వుంటాయి! ఈ ఉత్సవాలు చూసి తరించే భాగ్యం నాకు లభించినందుకు సంతోషంగా వుంది!’’ అన్నారు సూతమహర్షి నలుదిక్కులా కలియజూస్తూ! ‘‘మీరిలా రావడం మా భాగ్య విశేషంగా భావిస్తున్నాము మహర్షి! ఈ పవిత్ర కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తూండగా కావించాల్సిన సత్కర్మలన్నీ ఆచరిస్తున్నాము. నదీ స్నానంతో పవిత్రమైన శరీరాలతో, నిర్మల హృదయాలతో భగవదారాధన కావిస్తున్నాము! శక్త్యానుసారం దానధర్మాలు జరుపుతున్నాము! స్త్రీలు తులసీ పూజనం, గోపూజనం కావిస్తున్నారు! చుట్టుప్రక్కల బీదలకు అన్నసంతర్పణలు కావిస్తున్నాము! అందరం కలిసి కార్తీక పురాణాన్ని చదువుతూ, వచ్చినవాళ్లకు వివరిస్తున్నాము’’ అంటూ వాళ్లు చెప్పిన విషయాలు విని ప్రసన్నంగా చూస్తూ చిరునవ్వు నవ్వారు సూత మహర్షి!
*‘‘మంచి పనులు చేస్తూ జీవితాలు ధన్యం కావించుకుంటున్నారు! అంతకంటే కావలసిందేముంది? ఆ! తులారాశిలో సూర్యుడు సంచరించే కాలం పూర్తవడానికి మరో రెండు రోజుల వ్యవధి వుంది గదా! ఆపైన వృశ్చికరాశిలో ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు! శివకేశవులతోబాటు వారి పుత్రుడైన మణికంఠుడు , ధర్మశాస్త్ర విశేష ఆరాధన ప్రారంభమయ్యే పవిత్రకాలం వృశ్చిక సంక్రమణంతోనే గదా మొదలౌతుంది!’’* అంటూ కన్నులరమోడ్చి నమస్కరించారు!
*‘‘మహర్షి! హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిగా ప్రసిద్ధి చెందాడు కదా! మహిషాసురుని సోదరి మహిషిని వధించడానికి ఆ స్వామి అవతరించిన వైనం ఎంతో అసాధారణమూ, విలక్షణమూ అయినది! ఆ చరితాన్ని మీ నోట వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాము’’* అన్నారు ముని బృందాలు ముక్తకంఠాలతో! ‘‘అలాగే! తప్పకుండా వినిపిస్తాను! అన్నారు సూతమహర్షి .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏