శ్రీదేవీభాగవతము - 28

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 07*

                      

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 28*


*భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహార్షితా!*

*నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 

 

*సత్యవ్రత వృత్తాంతము*   చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*దేవీయజ్ఞ భేదాలు*

 చదువుకుందాం......


🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *దేవీయజ్ఞ భేదాలు* 💐


*శౌనకాది మహామునులారా !* వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు. దేవీయజ్ఞం ఎలా చెయ్యాలో మంత్రాలు ఏమిటో హోమద్రవ్యాలు ఏమిటో ఎందరు బ్రాహ్మణులు కావాలో ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజెయ్యమనీ, యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానం వివరించాడు.


*జనమేజయా!* దేవీ యజ్ఞ విధానం చెబుతున్నాను. తెలుసుకో. 


సాత్త్విక రాజస తామస భేదాలతో ఈ యజ్ఞం మూడు విధాలు. మునులు సాత్త్వికయజ్ఞం చెయ్యాలి. నీవంటి రాజులు రాజస యజ్ఞం చెయ్యాలి. తామసం కేవలం రాక్షసులకే. జ్ఞానులకూ విముక్తులకూ ఇవియేవీ పట్టవు. సొమగ్రీ సంబారాలతో ప్రమేయంలేని అంతర్యజ్ఞం వారిది. 


దేశమూ కాలమూ ద్రవ్యమూ మంత్రమూ బ్రాహ్మణులూ శ్రద్ధ - ఇవన్నీ సాత్త్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. 


ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి - ఇవి చాలా ముఖ్యం. పూర్ణఫలాన్ని ఇస్తాయి. లేకపోతే యజ్ఞం ఫలించదు. ఆన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మనా ఫలిస్తుంది. దీనికి నీ వంశంలోనే చక్కటి ఉదాహరణ ఉంది.


పాండవులు రాజసూయం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులు భూరి దక్షణలతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయి మూడు నెలలన్నా తిరగకుండానే పాండవులు అడవులపాలయ్యారు. జూదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమానాల పాలయ్యింది. ఇన్ని కష్టాలు వచ్చాయి. అంటే యజ్ఞఫలం ఏమయినట్టు ? మహాత్ములయ్యుండీ విరాటరాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూసింది. బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు ? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది ? సభలో జుట్టు పట్టుకుని ఈడుస్తోంటే ద్రుపద రాజకుమారిని కాపాడుకోలేకపోయారేమి ? ఈ ధర్మ విపర్యయానికి కారణం ఏమిటి ?


వ్రాసిపెట్టి ఉంది అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా ? అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్ధమవుతుంది. సర్వప్రమాణాలూ వ్యర్థమవుతాయి. సర్వ ఉపాయాలూ వ్యర్ధమవుతాయి. అందుచేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు. దైవమూ ఉపాయమూ రెండింటినీ అంగీకరించి ఆలోచించాలి.


ఒక మంచి పని చేసినప్పుడు విపరీతఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్మభేదమా ? ద్రవ్యభేదమా? మంత్రభేదమా ? ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది.


ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షసవినాశం కోరి యజ్ఞం చేశాడు.  దానికి విశ్వరూపుణ్ణి గురువుగా (బ్రహ్మ) వరించాడు. అతడు రాక్షస పక్షంవాడు. బుద్ధిపోనిచ్చుకుంటాడా ! దానవులకూ దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశానికి బదులు తల్లి పంచన చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృభేద దోషం. విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంతో యజ్ఞం విపరీతఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు.


ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపమూ లేకుండా కర్తృద్రవ్యమంత్రశుద్ధితో నిర్వహించాడు. ధృష్టద్యుమ్నుడూ ద్రౌపదీ జన్మించారు. ద్రుపదుడి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమయ్యింది. అలాగే దశరథమహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. నలుగురి కొడుకులను పొందాడు. నిర్దుష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలను ఇస్తాయి. దోషజుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగరూకులై చెయ్యాలి.


పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది. అందుకే విపరీతఫలం వచ్చి కష్టాల పాలయ్యారు. రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజుల్ని కొట్టి దోచి తెచ్చిన ధనం అందులో పడింది. అందుకని బెడిసికొట్టింది. లేదా సాభిమానులై (గర్విష్ఠులై) అధికార సంపత్ర్పదర్శనగా చేశారు కనుకనైనా విపరీతఫలం వచ్చి ఉండాలి.


సాత్త్వికయజ్ఞం అత్యంతదుర్లభం. ఇది వైఖానసమునీశ్వరులకు విహితమైన యజ్ఞం. వారు నిత్యమూ సాత్వికాహారమే తీసుకుంటుంటారు. నిరంతర తపస్వులు. న్యాయార్జితమూ అరణ్య లబ్ధమూ (వన్యం) అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యం (ఋష్యం) వాడతారు. యూపస్తంభాలతో (పశుబలి) పనిలేకుండా కేవల పురోడాశాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్లా మంత్రం పట్లా శ్రద్ధ ఇంతా అంతా కాదు. ఇలా చేస్తే అవ్వీ - సాత్త్విక మఖాలు. ఉత్తమోత్తమాలు.


రాజసయజ్ఞాలలో ద్రవ్యబాహుళ్యం ఉంటుంది. యూపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకూ వైశ్యులకూ విహితాలు. దానవులకు చెప్పిన తామస మఖాలు సక్రోధాలూ సామర్షాలూను. అవి మదవర్థకాలు. క్రూరయజ్ఞాలు.


మోక్షకాములైన మహాత్ములకూ మునులకూ విరక్తులకూ చెప్పింది మానసయజ్ఞం. ఇది పూర్ణయజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధా ద్రవ్య క్రియా బ్రాహ్మణ దేశకాలాది లోపాలు ఉండవచ్చు. మానసయజ్ఞానికి వాటితో పనిలేదు. 


మొట్టమొదట మనస్సును గుణవర్జితుగా (త్రిగుణాలు) శుద్ధి పరుచుకోవాలి. మనస్సు శుచిగా ఉంటే దేహమూ శుచిగా ఉన్నట్టే. ఇంద్రియార్థాలను విడిచి పెట్టడమే మనశ్శుద్ది. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిధ్ధిస్తుంది. విశాలమైన మండపాన్ని యజ్ఞియతరుస్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి. అందులో సమ్మతమైన కొలతలలో వేదిని నిర్మించుకోవాలి. ఋత్విగ్బ్రాహ్మణ వరణం సమర్చనం అన్నీ మనస్సులోనే, మనస్సుతోనే. ప్రాణాపానవ్యానసమానోదానాగ్నులను అయిదింటినీ యజ్ఞవేదికలో తత్తన్మంత్రాలతో స్థాపించాలి. వీటిలో ప్రాణము - గార్హపత్యాగ్ని. అపానము - ఆహవనీయాగ్ని. వ్యానము దక్షిణాగ్ని సమానము - అవసథ్యాగ్ని. ఉదానము - సభ్యాగ్ని. ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు.


త్రిగుణ వర్ణితమూ శుచిమంతమూ అయిన ద్రవ్యాన్ని మనస్సుతోనే భావించాలి. మనస్సే హోత. మనస్సే యజమానుడు. నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవత. బ్రహ్మ విద్యాస్వరూపిణి అఖిలాధార అయిన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చెయ్యాలి. తరువాత చిత్తాన్ని ప్రాణాన్ని నిరాలంబం చేసి కుండలీ ముఖమార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హననం చెయ్యాలి. స్వాత్మరూపయైన మహేశ్వరిని స్వానుభూతితో యోగసమాధితో నిరాకులుడై ధ్యానించాలి. సర్వభూతాలలో తననూ, తనలో సర్వభూతాలనూ చూడగలిగితే మహేశ్వరిని చూడగల్గుతాడు.


ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాదికమంతా దగ్ధమై నశించిపోతుంది. ప్రారబ్ధకర్మ మాత్రం శరీరం ఉన్నంతవరకూ ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు. పార్థివశరీరాన్ని విడిచి పెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలమోక్షం. ఇవి శాశ్వతం. మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకికాలౌకిక ఫలాలు అశాశ్వతాలు.


అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ మానవలోకంలో జన్మించక తప్పదు.


నాయనా, జనమేజయా ! జగదంబికను భజించినవాడు అన్నింటా కృతకృత్యుడు అవుతాడు. అందుచేత ఇన్ని ప్రయత్నాలతోనూ అన్ని విధాలుగానూ శ్రీ భువనేశ్వరిని ధ్యానించాలి, వినాలి, జపించాలి. మానసయజ్ఞం రాజులకు కాదన్నానుగా. దాన్ని అలా ఉంచు. ఇప్పటికి నువ్వు తామసయజ్ఞం చేశావు.  సర్పయాగం. తక్షకుడితో పెట్టుకుని కోటానుకోటులుగా సర్పాలను యాగాగ్నికి ఆహతిచేశావు. ఇప్పుడు దేవీ యజ్ఞం చెయ్యి. సృష్ట్యాదిలో విష్ణుమూర్తి చేశాడు. అలా ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎలా చెయ్యాలో నేను చెబుతాను. చేయించడానికి సమర్థులైన యాజ్ఞికులు ఉన్నారు.


యజమానుడవై ఈ యజ్ఞం చేసి యజ్ఞ ఫలాన్ని నీ తండ్రికి ధారపోసి అతడి దుర్గతిని తొలగించు. విప్రావమాన పాపంవల్ల నరకం తప్పదు. దీనికి తోడు శాపదోషం ఒకటి. దుర్మరణం ప్రాప్తించింది నీ తండ్రికి. ఆకాశంలో కాదు, భూమి మీదకాదు, దర్భల పైనా కాదు, సంగ్రామంలో కాదు, గంగలోకాదు, సౌధంలో స్నాన దానాదివిహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణం. చాలా రకాలుగా నరకకారణం.


*జనమేజయా!* కాలం ఆసన్నమయ్యిందని ముందుగా తెలవడం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధనా లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి. వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దీనితో నాకు ప్రమేయం ఏమిటి ? సుఖమేమిటి ? దుఃఖమేమిటి ? ఇది రాలిపోతే రాలిపోనీ. నేను నిర్గుణుడను, విముక్తుడను, నశించేవి నశిస్తాయి. అందులో బాధపడాల్సింది ఏముంది ! నేను బ్రహ్మను, సంసారిని కాను. సదా ముక్తుడను. సనాతనుడను. దేహంతో నాకు ఏ సంబంధమూ లేదు. కర్మానుబంధాలన్నీ - శుభాలు కానీ అశుభాలు కానీ - అన్నీ వదిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ అతిఘోరమైన సంసార సంకటంనుంచి త్వరగా విముక్తుణ్ణి అయ్యాను. ఇలాంటి వైరాగ్యభావం పరీక్షిత్తుకి కలిగి ఉండాల్సింది, కలగలేదు. కలిగి ఉంటే స్నానదానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు. ముక్తికారకమే అయ్యేది. అయితే, నాయనా ! ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అది అంత తేలిక పనికాదు. మహా మహా యోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు. మీ తండ్రిమాట చెప్పాలా !


ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగ ? రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా చూసుకోవడం ఎలాగ ? శాపం తప్పించి నన్ను బతికించేవాడెవడు ? మంత్రజ్ఞులా ? తంత్రజ్ఞులా ? మణులా ? మందులా? అందరినీ పిలిపించండి అంటూ సౌధాగ్రంలో కూచుని అన్ని రోజులూ ఆరాటపడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలో స్నానం సంధ్య, దానం ధర్మం అన్నీ మరిచిపోయాడు. దేవీ స్మరణం లేదు, భూమి శయనం లేదు. మోహార్ణవంలో మునిగిపోయి సౌథంలోనే మరణించాడు. ఇవన్నీ నరక హేతువులే. కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరకకూపం నుంచి తప్పించి సద్గతిని కల్పించాలి.


*కౌనకాది మహామునులారా !* వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడి అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమ గతులు కల్పించకపోయాక, ఎందుకూ, నా బతుకు దండగ - అనుకున్నాడు.


*వ్యాసమహర్ష్మీ !* నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి. అని ధృఢ నిశ్చయంతో అన్నాడు. అని, మరొక సమాచారం అడిగాడు.


*(అధ్యాయం - 12, శ్లోకాలు-77)*



               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat